Thursday 31 January 2019

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు! 

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట ...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో, మన ప్రొఫెషన్‌తో అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో ఉన్న ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కామన్ సెన్స్, మొట్టమొదటి రూల్ కూడా.

కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది.

ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో. 

తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. చూస్తుంటే జీవితం జస్ట్ అలా చేజారిపోతుంది.

ఫీల్డు అలాంటిది.

టోటల్ అన్‌సర్టేనిటీ!

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఒక జాబ్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా తీసుకున్నప్పుడు మాత్రమే ఏ గొడవా ఉండదు.

అవును.

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

దాని అల్టిమేట్ టార్గెట్ డబ్బు ... 

^^^
#Cinema #CineField #Movies #Creativity #Life #PassionForFilms #CinemaAsProfession  #BigMoneyInFilms #BigBusiness 

Tuesday 29 January 2019

వొకింత స్వేఛ్చ కోసం

"నా జీవితాన్ని నేను సృష్టించుకుంటాను!" ...

"జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది!" ...

ఈ రెండూ .. రెండు విభిన్న అలోచనా విధానాలు.

భూమ్యాకాశాల అంతరం ఉన్న రెండు భిన్న ధ్రువాలు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ కాలమాన పరిస్థితుల్లోనయినా ప్రధానంగా ఈ రెండు అలోచనా విధానాలే కొనసాగుతుంటాయి.

మొదటి వ్యక్తి జీవన వాహనానికి సంబంధించిన "స్టీరింగ్" అతని చేతుల్లోనే ఉంటుంది. రెండో వ్యక్తి తన స్టీరింగ్ ను గాలికి వదిలేస్తాడు. దేని ఫలితం ఎలా ఉంటుందో ఎవరయినా  ఇట్టే ఊహించవచ్చు.

ప్రస్తుతం నా స్టీరింగ్ మళ్లీ  నాచేతుల్లోకి తీసుకున్నాను.

కొంచెం ఆలస్యంగా.

కట్ చేస్తే - 

సామర్థ్యం ఉన్నప్పుడు మరింతగా ఎదగడానికి ప్రయత్నించడం, మరింత ఉన్నతమైన జీవనశైలిని కోరుకోవటం తప్పు కాదు.

అసంతృప్తితో బాధితుడుగా మిగిలిపోవటమా, సంతృప్తితో అనుకున్నస్థాయికి ఎదగడమా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం అలాంటి ఒక మలుపుకి దగ్గరలో ఉన్నాను.

ఈ ప్రస్థానంలో - నా మొత్తం 'క్రియేటివ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్‌'లో సినిమా అనేది జస్ట్ ఒక పది శాతం మాత్రమే.

ఒక అతి చిన్న భాగం మాత్రమే.

ఇంకా చెప్పాలంటే .. మంచి ఆదాయం, గొప్ప కాంటాక్ట్స్ ఇచ్చే ఒక గ్లామరస్ జాబ్.

అయితే, నా ఉద్దేశ్యంలో .. సినిమా రంగాన్ని మించిన ఫేసినేటింగ్ క్రియేటివ్ సామ్రాజ్యాలు ఇంకెన్నో ఉన్నాయి. నాకెంతో ఇష్టమయిన అలాంటి ఒక సామ్రాజ్యంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ఫ్రీడమ్‌ కోసమే నేను ఎదురుచూస్తున్నాను.

ఆ ఫ్రీడమ్‌ను సృష్టించుకొనే క్రమంలోనే ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను.

ఈరోజు కూడా అలాంటి వొక 'బిజీయెస్ట్ డే'నే ..

ఇంకో పది రోజులదాకా ఈ బిజీ ఇలాగే కొనసాగుతుందనుకుంటున్నాను. అప్పటికి నేను కోరుకొన్న స్వేఛ్చను తప్పక సాధించుకొంటానన్న నమ్మకం నాకుంది.

ఐ విష్ మైసెల్ఫ్ బెస్టాఫ్ లక్ ...   

^^^
#CinemaField #Movies #CineField #Creativity #CreativeFreedom #Mpire #Swechcha #ManoharChimmani #Nagnachitram #ManoharChimmaniBlog 

Sunday 27 January 2019

అఫ్సర్ నుంచి వొక కాల్

ఈమధ్య నేనస్సలు ఫేస్‌బుక్‌లోకి రావటంలేదు.

కనీసం నాలుగు నెలలవుతోంది.

వొక మిత్రుని కాంటాక్ట్ కోసం వెదుకుతూ, మొన్న ఎందుకో అనుకోకుండా ఫేస్‌బుక్‌లోకి తొంగిచూశాను.

మెసేజ్‌ల అంకె 334 చూపిస్తోంది.

వాటిల్లో ఎక్కువగా మొన్న నవంబర్‌లో నా పుట్టినరోజు సందర్భంగా వచ్చుంటాయి.

అయితే ఇక్కడ పాయింట్ అది కాదు.

పైనుంచి కనిపిస్తున్న నాలుగు మెసేజ్‌లలో ..
కవి, రచయిత, విమర్శకుడు, ఇంకా బోల్డన్ని కూడా అయిన క్యాంపస్ రోజులనాటి వొక గొప్ప ఆత్మీయ మిత్రుని మెసేజ్ కూడా ఉంది. 

అఫ్సర్!

వెంటనే రిప్లై ఇచ్చాను.

ఆన్‌లైన్‌లోనే ఉన్నాడనుకుంటాను .. వెంటనే ఎఫ్‌బీ కాల్ రింగయ్యింది అఫ్సర్ నుంచి.

స్పిరిచువల్ కనెక్షన్!

ఆనందంగా రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం.

బహుశా వొక రెండు దశాబ్దాల తర్వాత అనుకుంటాను అఫ్సర్ గొంతు నేను విన్నాను.

కొన్ని ఆనందాలకు కొలతలుండవ్.

జస్ట్ వొక అద్భుతం.

అంతే.

ఆ అద్భుతాన్ని అనుభవించాను అఫ్సర్‌తో మాట్లాడిన ఆ కొన్ని క్షణాలు ...

నా ఓయూ క్యాంపస్ రోజులతర్వాత .. నాకు గుర్తున్నంతవరకూ, చివరిసారి నేను అఫ్సర్‌తో కలిసి మాట్లాడింది వారాసిగూడాలోని వొక ఇరానీ హోటల్‌లో. తర్వాతెప్పుడు కలిసినా అతని రచనల్లో, లేదంటే ఎప్పుడైనా వొక మెరుపులాంటి చాటింగ్‌లో.

కట్ టూ "సాహిల్ వస్తాడు" - 

ఇండియా వచ్చానన్నాడు అఫ్సర్. రేపు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో బుక్ రిలీజ్ ఉందని చెప్పాడు.

తప్పకుండా వస్తానని చెప్పాను.

తప్పకుండా వెళ్లాలని డిసైడ్ అయ్యాను .. ఇప్పుడు నేనున్న అస్తవ్యస్త హడావిడి పరిస్థితుల నుంచి వొక చిన్న బ్రేక్ కోసం, అక్కడ కలిసే ఎందరో పాతమిత్రుల పలకరింపులకోసం. 

ఆ తర్వాత వెంటనే కాల్ చేసి వొకరిద్దరికి చెప్పాను కూడా .. "మనం ఫలానా ప్రోగ్రామ్‌కు వెళ్తున్నాం రేపు" అని.

అయితే - దురదృష్టవశాత్తూ, నా అస్తవ్యస్తపు హడావిడే హైదరాబాద్ స్టడీ సర్కిల్‌ వెళ్లే నాదారిని హైజాక్ చేసింది.

నిన్న సాయంత్రం ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లలేకపోయాను. అఫ్సర్‌ను కలవలేకపోయాను.

ఇదిగో ఇలాంటి స్థితినుంచే .. నన్ను నేను బయటేసుకొనే ప్రయత్నంలోనే .. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను.

ఈ బిజీ అంతా కూడా నేను కోరుకొనే, నాకిష్టమైన వొక క్రియేటివ్ ఫ్రీడం కోసం ..

^^^
#Afsar #SahilVastadu #HyderabadStudyCircle #Creativity #Life #CreativeFreedom #ManoharChimmani #Nagnachitram #ManoharChimmaniBlog 

Sunday 13 January 2019

జీవితం ఎవ్వరినీ వదలదు!

అవును ..

జీవితం ఎవ్వరినీ వదలదు.

ఊహించనివిధంగా ఏదో ఒక దశలో ఒక చూపు చూస్తుంది.

అప్పుడు తెలుస్తుంది, అసలు జీవితం ఏమిటో.

మొన్నటి నవంబర్ 25 సాయంత్రం నుంచి, ఈ రాత్రివరకు నా జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో ..

నాకత్యంత ప్రియమైన నా చిన్నతమ్ముడి ఆకస్మిక మరణం అందులో ఒకటి.

మనిషి వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మన దేశంలో ఇంకా వికృతాట్ఠాసం చేస్తున్న నాకు నచ్చని వొకానొక సామాజిక వ్యవస్థ .. ఆ సో కాల్డ్ వ్యవస్థ ఉన్న మన ఈ సమాజం పట్ల మన మైండ్‌సెట్ .. నా తమ్ముడిని, వాడి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో మానసిక వ్యధకు గురిచేశాయి.

వాడు నాకు మళ్లీ కనిపించనంత దూరం చేశాయి.

డిసెంబర్ 27, 2016 .. సరిగ్గా 2 సంవత్సరాలక్రితం, మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది.

జీవితం చాలా చిన్నది అని చెప్తూ, మొన్న డిసెంబర్ 16 నాడు, నా చిన్నతమ్ముడు శ్రీనివాస్ కూడా, చాలా చిన్నవయసులో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు.

కట్ చేస్తే - 

ఎంతోమంది గురించి నా బ్లాగ్ లో, ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో ఎంతో రాశాను, పోస్ట్ చేశాను.

కానీ, నాకెంతో ప్రియమైన నా చిన్నతమ్ముడి గురించి మాత్రం ఏం రాయలేకపోతున్నాను.

వాసూ, నిన్ను కాపాడుకోలేకపోయాను .. కానీ, నువ్విలా చేసివుండాల్సిందికాదు, బతికున్నంతకాలం నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడేలా .. వలవల ఏడ్చేలా .. 

Saturday 12 January 2019

రెండు తప్పుల సాగరసంగమం

తెలిసో తెలియకో ..  తొందరపాటుతోనో .. మరింకేదైనా ప్రభావంవల్లో ..  ప్రతి ఒక్కరూ వారి జీవితంలోని ఏదో ఒక దశలో, ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకొంటారు.

అది సహజం.

అంతవరకు తప్పు కాదు.

కానీ, ఆ నిర్ణయం తప్పు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పే అవుతుంది.

మొదటి తప్పు ఫలితంగా కొంత నష్టం జరగొచ్చు. కానీ, 'చేసిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం' అనే రెండో తప్పు వల్ల మాత్రం చాలా అనర్థాలు జరుగుతాయి.

ఎన్నడూ కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎన్నిటినో  ఎదుర్కోవాల్సివస్తుంది.

అలాంటి తప్పు నిర్ణయం నా జీవితంలో ఒక్కసారి కాదు, రెండుసార్లు తీసుకొన్నాను. అంతా తెలుస్తున్నా, ఆ తప్పుల్ని సరిదిద్దుకోలేకపోయాను.

అదే విధి విచిత్రం అంటారు చాలామంది.

మైండ్‌సెట్ అంటాను నేను.

చాలా ఏళ్ల తర్వాత .. ఇప్పుడు .. ఆ రెండిట్లో ఒక తప్పు నిర్ణయాన్ని సమూలంగా తుడిచేశాను.

ఆ ఆనందాన్ని మనసారా అనుభవిస్తున్నాను.

కానీ, ఇంకో తప్పు నిర్ణయాన్ని మాత్రం తుడిచేయలేకపోతున్నాను. అది .. నా జీవితంలో నేను తీసుకొన్న మొట్టమొదటి అతి పెద్ద తప్పు నిర్ణయం. అదే, నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు.

ఆ తప్పుని మొదట్లోనే సరిద్దుకోవాల్సింది. అప్పుడా పని చేసుంటే, ఆ తర్వాత నేను చేసిన రెండో తప్పు అసలు జరిగేదేకాదు. జరిగినా అది తప్పు అయ్యేదికాదు.

ఒకటి వ్యక్తిగతం, మరొకటి వృత్తిగతం.

కట్ చేస్తే - 

సుమారు పాతికేళ్లక్రితం ఒకటి, పదిహేనేళ్లక్రితం ఇంకొకటి ..

నేను చేసిన ఆ రెండు తప్పుల సాగరసంగమం ఖరీదు .. ఒక జీవితం.