Tuesday 31 October 2023

సింఫనీ గురించి ఈమధ్య ఎక్కడా వినిపించడమే లేదు!

నా ప్రతి సినిమాలో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేశాను.

ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా ఇప్పుడు నేను చేస్తున్న నా తాజా సినిమా "Yo!" సంగీతం కోసం ఇంకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాను.

నవంబర్ చివర్లో రికార్డింగ్‌తో సినిమా ప్రారంభిస్తున్నాము.

ప్రసాద్ ల్యాబ్‌లో గాని, ఫిలిం సిటీలోని "సింఫనీ"లో గాని ఉంటుంది. 

రెండు వారాల తర్వాత షూటింగ్ ఉంటుంది. 

కట్ చేస్తే -

నా రెండో సినిమా "అలా" పాటల రికార్డింగ్ సింఫనీలోనే చేశాం. 

సింఫనీ గురించి ఈమధ్య ఎక్కడా వినిపించడమే లేదు. అసలుందా అది ఆరెఫ్సీలో ఇప్పుడు అన్నది బిగ్ కొశ్చన్!    

The Spiritual Casanova

1926 లో చలం "మైదానం" రాశాడు.

నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. 

ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2023 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో కదా అని నాకిప్పటికీ ఆశ్చర్యమే. 

చలం టచ్ చేసిన ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే.

అలాంటి చలం కూడా చివరికి 'స్పిరిచువాలిటీ' అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. 

Sunday 29 October 2023

ఛాయిస్ మనదే!


"సినిమాల్లో టైమ్‌పాస్ కోసం తెలంగాణ వస్తదా రాదా అని కామెడీ సీన్లు పెట్టే రోజుల నుంచి, కోటి ఎకరాల పంటతో దేశానికి తిండిగింజలు అందిస్తున్న రాష్ట్రంగా ఎదిగేలా చేసుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఏది వాపో, ఏది బలుపో? ఎవరు కావాలో, ఎవరు వద్దో?" 
- మంత్రి కేటీఆర్

"వచ్చే గవర్నమెంటు మాదే" అని అటు బీజేపి నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే ప్రగల్భాలు పలుకుతున్నారు. వచ్చిన తర్వాత మేం ఇది చేస్తాం, మేం అది చేస్తాం అని బీజేపి లిస్టు చదువుతోంది. కాంగ్రెస్ గ్యారంటీలిస్తోంది.

ఇప్పుడు ఏవేవో గ్యారంటీలిస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ అర్థ శతాబ్దం పాటు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది?

అధికారంలోకొచ్చాక ఏమేమో చేస్తాం అని చెప్తున్న ఇదే బీజేపి, తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదు?

తెలంగాణ ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. వాపుకీ బలుపుకి ఉన్న తేడా వారికి చాలా బాగా తెలుసు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎందుకు ఎన్నుకోవాలో కూడా వారికి చాలా స్పష్టంగా తెలుసు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముచ్చటగా మూడో సారి ఎన్నికలు జరుగబోతున్నాయి. తిరుగులేని వేగంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళుతున్న వేళ సాధారణంగా 10 ఏండ్ల తరువాత వస్తుంది అని చెప్పబడే సోకాల్డ్ "ప్రభుత్వ వ్యతిరేక ఓటు" టెండెన్సీ నుంచి లబ్దిపొందే కుట్రలకు ప్రతిపక్ష పార్టీలు తెరలేపాయి.

బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎన్నెన్నో హామీలు, పథకాలు గుప్పిస్తున్నాయి.

కాని, పాపం పోటీ చేయడానికే ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు లేరు, సరిపోయినంతమంది అభ్యర్థులు లేరు.

టికెట్ల అమ్మకానికి మాత్రం దుకాణాలు తెరచిపెట్టారు. 

కట్ చేస్తే - 

ఒక ఓటరుగా, రాష్ట్రాభివృద్ధిని కోరుకునే పౌరులుగా మనం కలలో కూడా మర్చిపోకూడని అంశాలు కొన్ని ఉన్నాయి...

 తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, పనులు ఉండవు, హైద్రాబాద్‌లో ఉన్న కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, నక్సలైట్లు చెలరేగుతారు, మీకసలు పాలన చేతకాదు వంటి అనేక అపహస్యాల పునాదులపై కేసీఆర్ కట్టిన పాలరాతి సౌధం మన తెలంగాణ. 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది కొత్తగా అరచేతిలో స్వర్గం చూపించే బఫూన్ క్యారెక్టర్ల హామీలో, ఊకదంపుడు ఉపన్యాసాలో కాదు. ప్రజలకు ఏం కావాలో, ఏవి ఇవ్వాలో, ఎలా చేయాలో తెలిసిన నాయకత్వం. ఒక కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో అహరహం కృషిచేస్తున్న నిలువెత్తు మానవత్వం. 

ఎకౌంట్ల లోకి డబ్బులు పంచుతామంటేనో, ఇంటింటికి వస్తువులిస్తామంటేనో గుడ్డిగా ఓట్లేసే స్థాయిని తెలంగాణ సమాజం ఎప్పుడో దాటేసింది. అభివృద్ధి అంటే ఎలావుంటుందో ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. సంక్షేమ పథకం అంటే ఏమిటో దాదాపు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంది. 

అభివృద్ధిని, సంక్షేమాన్ని సంపాళ్ళలో అందిస్తూ, తెలంగాణను దేశం గర్వించే స్థాయికి తీసుకుపోతున్న కేసీఆర్‌ను అంత ఈజీగా ఎవ్వరూ కాదనుకోలేరు, వదులుకోలేరు. 

కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ప్రపంచం నలుమూలల నుంచి వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు రప్పిస్తున్న 'తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్' కేటీఆర్‌ను ఎలా విస్మరిస్తారు? 

తమని తాము పునర్నిర్మించుకుని, కేసీఆరే ఆదర్శంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను ఎలా పక్కనపెట్టగలుగుతారు?  

60 ఏళ్ళుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్ళు, వత్తాసు పలికినవాళ్ళు ఒకవైపున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె మరొకవైపు ఉంది. 

ఛాయిస్ మనదే. 

"కట్టడం అంటే కాళేశ్వరంలా ఉండాలి, పథకం అంటే రైతుబంధులా ఉండాలి" అని ఫిక్స్ అయిపోయే స్థాయికి తెలంగాణ ప్రజల ఆలోచనను పెంచిన కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకొవడంలో ఎలాంటి తప్పులేదు. 

వచ్చే డిసెంబర్ మూడో తేదీ అదే జరగబోతోంది.  

Friday 27 October 2023

తెలంగాణను ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలి?


ఎలక్షన్ల ప్రకటన రాగానే ఎక్కడైనా రొటీన్‌గా రెండు జరుగుతుంటాయి: ఒకటి అలకలు. రెండు పార్టీ మారటాలు. 

అలకల్ని లోపల్లోపల ఎలాగో బుజ్జగించుకుంటారు. అంతా సర్దుకుంటుంది. కాని, పార్టీ మారటాలు అలాక్కాదు. నానా కథలు పడతారు. 

ఎన్నో ఏళ్ళుగా ఒక పొలిటీషియన్ గురించి "ఈ అన్న చాలా సీరియస్ పొలిటీషియన్" అని ఎవరినయితే మనం అనుకుంటామో, అదే అన్న ఒకే ఒక్క నిమిషంలో మన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తాడు.  

పార్టీలో చేరినప్పటి నుంచి నిన్న మొన్నటిదాకా "కేసీఆర్ దేవుడు... ఆయనకు సాటి అయిన ముఖ్యమంత్రి దేశంలోనే లేడు" అని నిరంతరం ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను, పార్టీలోని వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల గురించి గొప్పగా చెప్పిన వ్యక్తి, చాలా సిల్లీ రీజన్‌తో పార్టీని వదిలి వెళ్తాడు. అన్నేళ్ళుగా పార్టీలో చాలా స్నేహంగా తను కలిసిమెలిసి తిరిగిన తోటి నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిని ఎవరూ ఊహించని స్థాయిలో దుమ్మెత్తిపోస్తాడు. 

ఏది నిజం? అంత కాలం పార్టీలో ఉండి, వివిధ పదవుల్లో పార్టీ ద్వారా లబ్ది పొందుతున్న సమయంలో తను మాట్లాడింది నిజమా? లేదంటే, పార్టీ మారగానే ఒకే ఒక్క పూటలో అదే వ్యక్తులపై తను వేసే నిందలు, ఆరోపణలు నిజమా?        

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా పార్టీ మారవచ్చు. పార్టీ మారిన అంశానికి సంబంధించి తన ఆలోచనలను చాలా డిగ్నిఫైడ్‌గా చెప్పుకోవడం ద్వారా ప్రజల మనన్సులను గెల్చుకోవచ్చు. కాని, అలా చేయరు. చిల్లర రాజకీయం అంటే ఇదే. 

భూ కబ్జాల అవినీతి ఆరోపణలతో ఆమధ్య పార్టీ నుంచి సస్పెండయి బీజేపెలో చేరిన ఈటెల రాజెందర్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను "బిడ్డా... నీ అంతు చూస్తా" రేంజిలో ఎలాంటి సంకోచం లేకుండా అనగలిగాడంటే, అంతకు ముందు ముఖ్యమంత్రి మీద ఆయన చూపించిన గౌరవమంతా ఉట్టుట్టి నటనే అనుకోవాల్సివస్తుంది. దీన్నిబట్టి రాజకీయాలకు ఆయనిచ్చే విలువ, రాజకీయాల్లో ఆయన స్థాయి ఏంటో అర్థమైపోతుంది. 

బీఆరెస్‌కు సంబంధించి - అప్పటి నుంచి ప్రారంభమైన ఈ పార్టీ మార్పిడి ట్రెండు నిన్నమొన్నటి మైనంపల్లి వరకు కొనసాగింది. చోటామోటా నాయకుల పార్టీ మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇటీవలి పొన్నాల లక్ష్మయ్య ఉదంతం మన కళ్ళముందే ఉంది. మంత్రిగా, సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలం పనిచేసిన పొన్నాల, గతంలో తెలంగాణ ప్రయోజనాల కోసం వైయెస్సార్‌తో కొట్లాడిన సందర్భాలున్నాయి. అలాంటి సీనియర్ నాయకుడు తన రాజీనామా ప్రకటన సమయంలో కాని, తర్వాత గాని ఆయన స్థాయిని దిగజార్చుకొనే మాటలు మాట్లాళ్లేదు. 

విచిత్రంగా, టీడీపీ నుంచి దిగుమతి అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం, కనీసం ఆయన వయస్సుకి కూడా గౌరవం ఇవ్వకుండా పొన్నాలను చాలా దారుణంగా మాటలన్నాడు. 

ఇలాంటి రాజకీయ నాయకుల చేతికి మళ్ళీ అధికారమిస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి?     

కట్ చేస్తే -   

రాజకీయం బాగా తెలిసిన అపర చాణక్యుడు కేసీఆర్. 

పార్టీతో సంబంధం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చెందిన సీనియర్, జూనియర్ నాయకులను కూడా అత్యంత గౌరవంతో సంబోధించి మాట్లాడే అత్యుత్తమ సంస్కారం ఉన్న మనీషి కేసీఆర్. 

కేసీఆర్ రాజకీయం చేయరని కాదు, చేస్తారు. 

రాజకీయం చేయకుండా ఉండటానికి బీఆరెస్ ఏమీ ఒక చారిటీ సంస్థ కాదు. 

రాజకీయం ప్రజల హితం కోసం చేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలు కోసం చేయాలి. ఇవన్నీ చేయడం కోసం పందెంలో తను నిలదొక్కుకొని ఉండటం కోసం చేయాలి. 

ఇలాంటి పాజిటివ్ లక్ష్యాలున్న రాజకీయం రాజకీయం కాదు. రాజనీతి. 

అలాంటి రాజనీతి బాగా తెలిసిన అపర చాణుక్యుడు కేసీఆర్.

రాజకీయాల్లో ఆయన స్థాయి అది కాబట్టే, అరవై ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేని తెలంగాణను సాధించగలిగాడు. అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని చాలా అంశాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లగలిగాడు. 

అలాంటి కేసీఆర్ సారధిగా ఏళ్లతరబడిగా ఉద్యమాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలన్న విషయంలో తెలంగాణ ఓటరుకు చాలా క్లారిటీ ఉంది. 

డిసెంబర్ 3 నాడు తెలంగాణ దమ్మేంటో చూపించి, కేసీఆర్ సాధించబోయే హాట్రిక్‌ను సెలబ్రేట్ చేసుకోవాలన్న తపన ఉంది. 

కేసీఆర్ హ్యాట్రిక్ !!!


ఎలక్షన్ సీజన్... 

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద, నా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద, నా బ్లాగ్‌లో ఈరోజు నుంచి పొలిటికల్ బజ్ ఉంటుంది. 

కేసీఆర్‌కు, బీఆరెస్ పార్టీకి నేను పూర్తిస్థాయి సపోర్టర్‌ను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నానో నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"లో చాలా స్పష్టంగా వివరించాను. 

ఈ ఎలెక్షన్స్‌లో బీఆరెస్ మరొక్కసారి మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు. ఈ దిశలో నాకు సాధ్యమైనంతమందిని నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను.      

కట్ చేస్తే -

తెలంగాణ వ్యతిరేకులు కొందరు... మొదటి ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాటన్నారు. రెండోసారి కూడా ఇదే మాటన్నారు:
 
"కేసీఆర్ గెలవడు. అది చేశాడు, ఇది చేశాడు, లోపలికి పంపిస్తాం..." వగైరా వగైరా. 

మూడోసారి కూడా వారిది సేమ్ టెంప్లేట్. అదేమాట అంటున్నారు. కొంచెం కూడా మార్పు లేదు. 

ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు. 

జస్ట్ చూస్తూ ఉండండి. అంతే. 

Monday 16 October 2023

81 ఏళ్ల యువకుడు మా ప్రొఫెసర్


అమితాబ్ బచ్చన్, మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్ ఇద్దరూ దాదాపు సమ వయస్కులు. అమితాబ్ బచ్చన్ కంటే 28 రోజులు పెద్దవారు మా ప్రొఫెసర్. 

ఇద్దరూ 81 వ బర్త్‌డే ఈ మధ్యే చేసుకున్నారు. 

ఇద్దరూ ఈరోజుకీ యమ యాక్టివ్. 

బచ్చన్ గారి యాక్టివ్‌నెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నొకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ని చూశాను. అమిత్‌జీ నడుస్తున్న స్పీడ్‌లో ఆయన బాడీగార్డ్స్ నడవలేక ఉరుకుతున్నారు... లిటరల్లీ! 

కట్ చేస్తే -   

గత 37 ఏళ్ళుగా మా ప్రొఫెసర్‌కు, ఆయన లైఫ్ స్టైల్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. 

ఒకటి రెండు ముఖ్యమైన విషయాల్లో తప్ప - చాలా విషయాల్లో - అనుకోకుండా నా లైఫ్ కూడా ఆయన లైఫ్‌ తరహాలోనే గడిచింది. 

బహుశా నాకు తెలీకుండానే నేను ఆయన లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవుతున్నా కావచ్చు. 

చాలా రోజుల తర్వాత, అనుకోకుండా నిన్న మధ్యాహ్నం - ఢిల్లీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్‌తో నేను చాలా బిజీగా ఉన్న సమయంలో - మా ప్రొఫెసర్ నాకు కాల్ చేశారు.  

ఓ పది నిమిషాలు మాట్లాడుకున్నాం. 

ఈవారంలో మేం కలుస్తున్నాం.

ఇకనుంచి సర్‌ని నేను రెగ్యులర్‌గా కలవాలనుకుంటున్నా. 

నా లాస్ట్ (హారర్) సినిమా "స్విమ్మింగ్‌పూల్"లో మా సార్‌కు ఒక మంచి పవర్‌ఫుల్ రోల్ ఇచ్చి - ఆయన్ను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన ఆనందం నాకుంది. ఇప్పుడు చేయబోయే సినిమాల్లో కూడా - ఆయన్ను ఒప్పించి మంచి స్పెషల్ అపియరెన్స్ రోల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను రాసిన పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" కాపీ కూడా మా సర్‌కు నేనింకా ఇవ్వాల్సి ఉంది. ఆయనకు తెలుగు రాయడం, చదవడం రాదు. కాని, అడగ్గానే నా బుక్ కోసం కేసీఆర్ మీద తన అభిప్రాయాన్ని ఇంగ్లిష్‌లో రాసి పంపించారు.  

మా ప్రొఫెసర్ మురుంకర్ విషయంలో "Age is just number.".


ఆమధ్య - వంట బాగా వచ్చిన మహిళలతో పోటీపడి, స్నేహ చికెన్ వంట కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ కొట్టారు మా ప్రొఫెసర్. అంతే కాదు, ఆయన భారీ ఫ్లెక్సీని (40 x 30) సిటీ సెంటర్లో డిస్‌ప్లే చేశారు. 

మా సర్ ఇప్పటికీ అంతే యాక్టివ్‌గా ఉన్నారు...

తరచూ పార్టీలు, ఫంక్షన్స్ అటెండవుతుంటారు. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొన్న తన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకోడానికి ఎలాంటి హిపోక్రసీ ఫీల్ కారు. రెండేళ్ల క్రితం తన బయోగ్రఫికల్ పుస్తకాన్ని మహేశ్ భగవత్ IPSతో మర్రి చెన్నారెడ్డి హెచ్చార్‌డి సెంటర్ ఆడిటోరియంలో  రిలీజ్ చేశారు... నిన్నటి కాల్‌లో కూడా ఎప్పట్లాగే నాకు నాలుగు మంచి ఇన్‌స్పయిరింగ్ మాటలు చెప్పారు...     

కట్ చేస్తే - 

నా టీమ్‌లో అందరూ నాకంటే చాలా తక్కువ వయస్సు వాళ్ళు.

వీళ్లలో ఏ ఒక్కరిలోనూ మా 81 ఏళ్ళ ప్రొఫెసర్‌లో ఉన్న యాక్టివ్‌నెస్‌లో కనీసం 10 శాతం కూడా లేకపోవడం విచారకరం. 😇  

Friday 6 October 2023

నటుడు కావల్సినవాడు నాయకుడైతే...


రోనాల్డ్ రీగన్, వ్లాదిమిర్ జెలెన్‌స్కీ లాంటి నటులు దేశాధినేతలయ్యారు. ఎమ్‌జీఆర్, ఎన్‌టీఆర్, జయలలిత లాంటి వాళ్ళు రాష్ట్రాల ముఖ్యమంత్రులయ్యారు.

వీరంతా సినిమాల్లో నటులుగా వాళ్ళు చేయాలనుకున్నదంతా చేసేసి, రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తమదైన శైలిలో ప్రజల కోసం ఎంతో కొంత చేయాలన్న తపనతో కృషి చేసి ప్రజల మెప్పు పొందారు.

యూక్రేన్ అధినేత జెలెన్‌స్కీ అయితే ఈరోజుకి కూడా యుద్ధభూమిలో తిరుగుతూ దేశం కోసం పోరాడుతున్నాడు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా కొన్ని చారిత్రక వింతలు, విడ్డూరాలు కూడా జరుగుతుంటాయి...

ఉదాహరణకు - ఒక వ్యక్తిలో తానొక మంచి నటుడు కావాలన్న తపన, తన డైలాగ్ డెలివరీతో క్లాస్-మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవాలన్న తపన, అంతర్లీనంగా అతనిలో ఎక్కడో ఏ మూలో విపరీతంగా ఉంటుంది. కాని, విధి వక్రించి, అనుకోకుండా ఆ వ్యక్తి ఒక నాయకుడవుతాడు.

ఫలితంగా - అటు నాయకుడుగా ప్రజలకు ఎలాంటి సేవ చెయ్యలేడు. ఇటు తనలోని నటవైదుష్యాన్ని ప్రదర్శించుకోలేడు. నటునిగా అతని ప్రతిభంతా అప్పుడప్పుడు కొన్ని స్పీచ్‌లు, ఫోటోషూట్‌లు, వీడియో కవరేజ్‌లకే పరిమితమైపోతుంది.

ఇలాంటి దయనీయమైన మానసిక స్థితిలో నాయకుడుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం ఎవరికైనా అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతూ, అసలు తాను ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కాని స్థితిలో ఉంటాడు.          

మొన్న నిజామాబాద్‌లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం అంతా విన్న తర్వాత, నాకెందుకో ఆయన కూడా అలాంటి ఏదైనా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా అన్న సందేహం కలిగింది. 

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఇక ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయంటే రాజకీయపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇది కూడా సహజమే.

కాని, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చేసే ఆరోపణలు కాని, విమర్శలు కాని హుందాగా ఉండాలి. ఎదుటివారు సమాధానం ఇవ్వలేని స్థాయిలో వాస్తవాలై ఉండాలి. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కావాలని ఏదైనా అబద్ధం చెప్పినా అది లాజిక్‌కు నిలబడాలి.

దురదృష్టవశాత్తు, మొన్న మన ప్రధాని ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన మాటలు అలా లేవు. అర్థం పర్థం లేని ఒక డ్రామా డైలాగుల్లా ఉన్నాయి.  

భారత స్వతంత్ర సమరయోధుడు, నెహ్రూకు సరిసమానుడైన దేశ నాయకుడు, ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌ స్థాయిని తగ్గించేలా మాట్లాడ్డం అవమానకరం. అప్పటి హైద్రాబాద్ స్టేట్ ప్రజల పోరాటాన్ని గుర్తించి, భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు, హైద్రబాద్‌ను విముక్తం చేసే విషయంలో పటేల్ ఒక కేంద్ర హోం మంత్రి హోదాలో తన బాధ్యత నిర్వర్తించారు తప్ప, ఒక గుజరాతి బిడ్డగా కాదు.  

తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు, ఈ పదేళ్ళలో తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ స్థాయి హోదా ఇవ్వలేదు, ఒక కొత్త ప్రాజెక్టునివ్వలేదు, ఒక ఇండస్ట్రీనివ్వలేదు, ఒక మెడికల్ కాలేజి లేదు, ఒక నవోదయ విద్యాలయ లేదు.

గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ ఆవిర్భావం మీద విషం కక్కడం తప్ప ఆయన తెలంగాణకు చేసిందేమీ లేదు. అలాంటి వ్యక్తి "మరో గుజరాతి బిడ్డగా నేను తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా" అనడం హాస్యాస్పదం, అవమానకరం.

పైగా, ప్రధానమంత్రి అంటే దేశం మొత్తానికి చెందినవాడు అవుతాడు కాని, "నేను గుజరాతి బిడ్డగా" ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని తన స్థాయిని తగ్గించుకోడు.       

కేసీఆర్ ఎన్‌డీఏలో చేరతాం అంటే మోడీ ఒప్పుకోలేదట! జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశారట!!

న్యూస్‌లో ఎప్పుడైనా విన్నప్పుడు తప్ప, అసలు అస్థిత్వమే లేని ఎన్‌డీఏలో కేసీఆర్ చేరాలనుకుంటారనుకోవడం అవివేకం.

అంతేకాదు, లోకల్‌గా ఒక మేయర్ పదవి కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలుస్తారనుకోవడం ఎవరూ నమ్మలేని మరొక పచ్చి అబద్ధం. 


పధ్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, వచ్చే ఎన్నికల తర్వాత ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్‌ను నరేంద్రమోడీ తిరస్కరించడమేంటి?       

గత 60 ఏళ్ళుగా ఈ ప్రాంతం కోసం ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తూ, ప్రపంచస్థాయి నాయకులు, సంస్థలతో శభాష్ అనిపించుకుంటున్న కేసీఆర్ అవినీతిపరుడెలా అవుతాడు?

కేంద్రంలో ఉన్నది మీరే కదా, మరి ఎందుకని ఆయన అవినీతిని బయటపెట్టడం లేదు?

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారమిస్తేనే ఆయన అవినీతిని బయటపెడతామనడం ఎంత ఎడాలిసెంట్ మాట?

నిజానికి ఎక్కడ అవినీతి పొంగిపొర్లుతోందన్నది కట్టిన కొన్నిరోజులకే కూలిపోతున్న బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లే చెప్తున్నాయి. ఆ స్థాయి అవినీతి ఉన్న తమ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతి గురించి మోడీ ముందు ఆలోచించాలి.   

దేశప్రజలు సంపూర్ణ మెజారిటీతో రెండుసార్లు బంగారుపళ్లెంలో పెట్టి అధికారం చేతికి అందించినప్పుడు, పదేళ్ళలో ఒక దేశాన్ని అభివృద్ధిపథంలో ప్రపంచం నివ్వెరపోయే స్థాయికి తీసుకెళ్లవచ్చు.

దురదృష్టవశాత్తు, నరేంద్రమోడీ ప్రభుత్వం అలా చేయలేకపోయింది.

పవర్ ఉపయోగించి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం, సున్నిత విషయాల్లో ప్రజలను రెచ్చగొట్టి ఎప్పటికప్పుడు ఎన్నికల్లో గెలవాలనుకోవడం వంటి 'అధికారం' ప్రధాన లక్ష్యంగానే వారు ఏదైనా చేయగలిగారు తప్ప, 'అభివృద్ధి' గురించి ఆలోచించలేకపోయారు. 

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దాదాపు ఒకే సమయంలో పదవుల్లోకి వచ్చారు. రాష్ట్రస్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన ఎన్నెన్నో అద్భుత విజయాల్లో కనీసం పది శాతం విజయాలను కూడా కేంద్రస్థాయిలో ప్రధాని మోడీ సాధించారా అన్నది జవాబు దొరకని ప్రశ్న. 

కట్ చేస్తే -

సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థం లేదు. అలాగే, సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు.

కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడవచ్చు. కాని, ఆ తర్వాతంతా కేటీఆర్ స్వయంకృషే అన్నది పార్టీలకతీతంగా ఎవరైనా సరే ఒప్పుకొనితీరాల్సిన నిజం.

స్వయంగా ఎందరో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచస్థాయి కంపెనీల సీఈఓలే ఎన్నోసార్లు కేటీఆర్ సామర్థ్యం గురించి వివిధ వేదికలపై ఎంతగానో మెచ్చుకొంటూ చెప్పారు. 

"ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే" అన్నట్టు, కేటీఆర్ ఏ స్థాయికి ఎదిగినా కేసీఆర్ తనయుడే.

కాని, కేటీఆర్ అంటే ఇప్పుడొక బ్రాండ్.

భారత రాజకీయాల్లో ఒక రాక్ స్టార్.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చెయ్యాలనుకుంటే రెండే రెండు నిమిషాలు చాలు. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న బీఅర్ఎస్ ఎల్పీ సింగిల్ లైన్ ప్రపోజల్‌తో చేసుకోగలుగుతుంది.

భవిష్యత్తులో అది తప్పకుండా జరుగుతుంది.

కాని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం కేసీఆర్ నరేంద్రమోడీ ఆశీస్సులు కోరారనటం ఈ శతాబ్దపు పెద్ద జోక్. కేవలం వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే ఇలాంటి జోకుల్ని ఎంజాయ్ చేయగలుగుతారు. 

సభకు వచ్చిన ప్రజల చప్పట్ల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వేరు. మనం చీప్ అయిపోవడం వేరు. రెండోది అత్యంత విషాదం. మొన్నటి నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్‌లో కనిపించింది ఆ విషాదమే. 
***
("మోదీ నోట శతాబ్దపు జోక్" పేరుతో ఈరోజు "నమస్తే తెలంగాణ" ఎడిటోరియల్ పేజిలో వచ్చిన నా ఆర్టికిల్... )

Wednesday 4 October 2023

జై గురువుగారు!


సినిమాల్లో బాయ్‌గా, సెట్ బాయ్‌గా పనిచేసిన ఎందరో తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ అయ్యారని చరిత్ర చెప్తోంది. 

"నాకు అనుభవముంది, నేను హిట్స్ ఇచ్చాను" అని కొందరు డైరెక్టర్స్ తమ తర్వాతి సినిమా కోసం ఏళ్ళ తరబడి ప్రొడ్యూసర్‌ను వెతుక్కొంటూనే ఉంటారు... మరోవైపు, ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త కుర్రాడు నెల రోజుల్లో ఒక 5 కోట్ల ప్రొడ్యూసర్‌ను ఓకే చేసుకొని, గోవాలో స్టోరీ సిట్టింగ్స్ పెడతాడు. 

మైండ్‌సెట్. లేజర్ ఫోకస్. ఈ రెండే పనిచేస్తాయి. 

"నాకు అంతా తెలుసు" అన్న ఆలోచనలు, ఎనాలిసిస్‌లు ఉన్నచోటే ఉంచుతాయి. ఇంకా ఇంకా వెనక్కి తీసుకెళ్తాయి. 

కట్ చేస్తే - 

"నేను చెయ్యగలను" అన్న మైండ్‌సెట్ లేకుండా గురువుగారు ఒక్కటే సంవత్సరంలో 15 సినిమాలు చేసి రిలీజ్ చేసేవారు కాదు. వాటిలో 70% పైగా హిట్స్, సూపర్ హిట్స్, సిల్వర్ జుబ్లీలు ఇవ్వగలిగేవారు కాదు.    

Tuesday 3 October 2023

4058 రోజుల ఆత్మీయ స్నేహం!


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

కట్ చేస్తే -   

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో, హిపోక్రసీ లేకుండా రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. 

అందుకే, ఈ బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ... ఎప్పుడో తోచినప్పుడు మాత్రం... "ఏదో రాయాలి కాబట్టి రాస్తాను" అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో ఒక విడదీయరాని భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

అందరూ, అన్నీ... ఇక్కడే... నా ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మీదే నాకు కనెక్ట్ కావడం ప్రారంభమైంది.   

21 ఆగస్టు 2012 నాడు, నేను అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు చూస్తుండగానే 11 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 4058 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఎందరో అద్భుతమైన మిత్రులు నాకు ఇక్కడే పరిచయమయ్యారు. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన మలుపులకు, ఆలోచనలకు ఈ బ్లాగే కారణమయ్యింది. 

నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం.     

కట్ చేస్తే - 

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను వరుసగా ఓ రెండు మూడు సినిమాలు చెయ్యాలనుకొని సీరియస్‌గా పూనుకోడానికి కూడా ఈ బ్లాగే కారణం.  

గురువుగారు దాసరి నారాయణరావు గారిని గుర్తుకు తెచ్చుకొంటూ అప్పట్లో నేను రాసిన ఒక బ్లాగ్ పోస్టును అనుకోకుండా ఆమధ్య చదివిన తర్వాతే నాకీ ఆలోచన వచ్చింది.  

నవంబర్ దాకా నా కొత్త సినిమా ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి, బ్లాగ్‌ను కొద్దిరోజులు మర్చిపోదామనుకొన్నాను. ఆల్రెడీ నెల దాటింది నేనీ వైపు చూడక! 

కాని, ఏదో కోల్పోయినట్టుగా ఉంది. 

నాకెంతో ఇష్టమైన బ్లాగింగ్ కోసం ఒక 15, 20 నిమిషాలు వెచ్చించలేనంత బిజీగా మాత్రం ఏం లేను అన్న విషయం నాకు బాగా తెలుసు. 

మరింకేంటి?  

సో, హియర్ అయామ్. 

బ్యాక్ టు బ్లాగింగ్. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." 
~Kate Christensen