Friday 27 October 2023

తెలంగాణను ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలి?


ఎలక్షన్ల ప్రకటన రాగానే ఎక్కడైనా రొటీన్‌గా రెండు జరుగుతుంటాయి: ఒకటి అలకలు. రెండు పార్టీ మారటాలు. 

అలకల్ని లోపల్లోపల ఎలాగో బుజ్జగించుకుంటారు. అంతా సర్దుకుంటుంది. కాని, పార్టీ మారటాలు అలాక్కాదు. నానా కథలు పడతారు. 

ఎన్నో ఏళ్ళుగా ఒక పొలిటీషియన్ గురించి "ఈ అన్న చాలా సీరియస్ పొలిటీషియన్" అని ఎవరినయితే మనం అనుకుంటామో, అదే అన్న ఒకే ఒక్క నిమిషంలో మన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తాడు.  

పార్టీలో చేరినప్పటి నుంచి నిన్న మొన్నటిదాకా "కేసీఆర్ దేవుడు... ఆయనకు సాటి అయిన ముఖ్యమంత్రి దేశంలోనే లేడు" అని నిరంతరం ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను, పార్టీలోని వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల గురించి గొప్పగా చెప్పిన వ్యక్తి, చాలా సిల్లీ రీజన్‌తో పార్టీని వదిలి వెళ్తాడు. అన్నేళ్ళుగా పార్టీలో చాలా స్నేహంగా తను కలిసిమెలిసి తిరిగిన తోటి నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిని ఎవరూ ఊహించని స్థాయిలో దుమ్మెత్తిపోస్తాడు. 

ఏది నిజం? అంత కాలం పార్టీలో ఉండి, వివిధ పదవుల్లో పార్టీ ద్వారా లబ్ది పొందుతున్న సమయంలో తను మాట్లాడింది నిజమా? లేదంటే, పార్టీ మారగానే ఒకే ఒక్క పూటలో అదే వ్యక్తులపై తను వేసే నిందలు, ఆరోపణలు నిజమా?        

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా పార్టీ మారవచ్చు. పార్టీ మారిన అంశానికి సంబంధించి తన ఆలోచనలను చాలా డిగ్నిఫైడ్‌గా చెప్పుకోవడం ద్వారా ప్రజల మనన్సులను గెల్చుకోవచ్చు. కాని, అలా చేయరు. చిల్లర రాజకీయం అంటే ఇదే. 

భూ కబ్జాల అవినీతి ఆరోపణలతో ఆమధ్య పార్టీ నుంచి సస్పెండయి బీజేపెలో చేరిన ఈటెల రాజెందర్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను "బిడ్డా... నీ అంతు చూస్తా" రేంజిలో ఎలాంటి సంకోచం లేకుండా అనగలిగాడంటే, అంతకు ముందు ముఖ్యమంత్రి మీద ఆయన చూపించిన గౌరవమంతా ఉట్టుట్టి నటనే అనుకోవాల్సివస్తుంది. దీన్నిబట్టి రాజకీయాలకు ఆయనిచ్చే విలువ, రాజకీయాల్లో ఆయన స్థాయి ఏంటో అర్థమైపోతుంది. 

బీఆరెస్‌కు సంబంధించి - అప్పటి నుంచి ప్రారంభమైన ఈ పార్టీ మార్పిడి ట్రెండు నిన్నమొన్నటి మైనంపల్లి వరకు కొనసాగింది. చోటామోటా నాయకుల పార్టీ మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇటీవలి పొన్నాల లక్ష్మయ్య ఉదంతం మన కళ్ళముందే ఉంది. మంత్రిగా, సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలం పనిచేసిన పొన్నాల, గతంలో తెలంగాణ ప్రయోజనాల కోసం వైయెస్సార్‌తో కొట్లాడిన సందర్భాలున్నాయి. అలాంటి సీనియర్ నాయకుడు తన రాజీనామా ప్రకటన సమయంలో కాని, తర్వాత గాని ఆయన స్థాయిని దిగజార్చుకొనే మాటలు మాట్లాళ్లేదు. 

విచిత్రంగా, టీడీపీ నుంచి దిగుమతి అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం, కనీసం ఆయన వయస్సుకి కూడా గౌరవం ఇవ్వకుండా పొన్నాలను చాలా దారుణంగా మాటలన్నాడు. 

ఇలాంటి రాజకీయ నాయకుల చేతికి మళ్ళీ అధికారమిస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి?     

కట్ చేస్తే -   

రాజకీయం బాగా తెలిసిన అపర చాణక్యుడు కేసీఆర్. 

పార్టీతో సంబంధం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చెందిన సీనియర్, జూనియర్ నాయకులను కూడా అత్యంత గౌరవంతో సంబోధించి మాట్లాడే అత్యుత్తమ సంస్కారం ఉన్న మనీషి కేసీఆర్. 

కేసీఆర్ రాజకీయం చేయరని కాదు, చేస్తారు. 

రాజకీయం చేయకుండా ఉండటానికి బీఆరెస్ ఏమీ ఒక చారిటీ సంస్థ కాదు. 

రాజకీయం ప్రజల హితం కోసం చేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలు కోసం చేయాలి. ఇవన్నీ చేయడం కోసం పందెంలో తను నిలదొక్కుకొని ఉండటం కోసం చేయాలి. 

ఇలాంటి పాజిటివ్ లక్ష్యాలున్న రాజకీయం రాజకీయం కాదు. రాజనీతి. 

అలాంటి రాజనీతి బాగా తెలిసిన అపర చాణుక్యుడు కేసీఆర్.

రాజకీయాల్లో ఆయన స్థాయి అది కాబట్టే, అరవై ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేని తెలంగాణను సాధించగలిగాడు. అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని చాలా అంశాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లగలిగాడు. 

అలాంటి కేసీఆర్ సారధిగా ఏళ్లతరబడిగా ఉద్యమాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలన్న విషయంలో తెలంగాణ ఓటరుకు చాలా క్లారిటీ ఉంది. 

డిసెంబర్ 3 నాడు తెలంగాణ దమ్మేంటో చూపించి, కేసీఆర్ సాధించబోయే హాట్రిక్‌ను సెలబ్రేట్ చేసుకోవాలన్న తపన ఉంది. 

No comments:

Post a Comment