Friday 6 October 2023

నటుడు కావల్సినవాడు నాయకుడైతే...


రోనాల్డ్ రీగన్, వ్లాదిమిర్ జెలెన్‌స్కీ లాంటి నటులు దేశాధినేతలయ్యారు. ఎమ్‌జీఆర్, ఎన్‌టీఆర్, జయలలిత లాంటి వాళ్ళు రాష్ట్రాల ముఖ్యమంత్రులయ్యారు.

వీరంతా సినిమాల్లో నటులుగా వాళ్ళు చేయాలనుకున్నదంతా చేసేసి, రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తమదైన శైలిలో ప్రజల కోసం ఎంతో కొంత చేయాలన్న తపనతో కృషి చేసి ప్రజల మెప్పు పొందారు.

యూక్రేన్ అధినేత జెలెన్‌స్కీ అయితే ఈరోజుకి కూడా యుద్ధభూమిలో తిరుగుతూ దేశం కోసం పోరాడుతున్నాడు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా కొన్ని చారిత్రక వింతలు, విడ్డూరాలు కూడా జరుగుతుంటాయి...

ఉదాహరణకు - ఒక వ్యక్తిలో తానొక మంచి నటుడు కావాలన్న తపన, తన డైలాగ్ డెలివరీతో క్లాస్-మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవాలన్న తపన, అంతర్లీనంగా అతనిలో ఎక్కడో ఏ మూలో విపరీతంగా ఉంటుంది. కాని, విధి వక్రించి, అనుకోకుండా ఆ వ్యక్తి ఒక నాయకుడవుతాడు.

ఫలితంగా - అటు నాయకుడుగా ప్రజలకు ఎలాంటి సేవ చెయ్యలేడు. ఇటు తనలోని నటవైదుష్యాన్ని ప్రదర్శించుకోలేడు. నటునిగా అతని ప్రతిభంతా అప్పుడప్పుడు కొన్ని స్పీచ్‌లు, ఫోటోషూట్‌లు, వీడియో కవరేజ్‌లకే పరిమితమైపోతుంది.

ఇలాంటి దయనీయమైన మానసిక స్థితిలో నాయకుడుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం ఎవరికైనా అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతూ, అసలు తాను ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కాని స్థితిలో ఉంటాడు.          

మొన్న నిజామాబాద్‌లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం అంతా విన్న తర్వాత, నాకెందుకో ఆయన కూడా అలాంటి ఏదైనా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా అన్న సందేహం కలిగింది. 

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఇక ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయంటే రాజకీయపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇది కూడా సహజమే.

కాని, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చేసే ఆరోపణలు కాని, విమర్శలు కాని హుందాగా ఉండాలి. ఎదుటివారు సమాధానం ఇవ్వలేని స్థాయిలో వాస్తవాలై ఉండాలి. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కావాలని ఏదైనా అబద్ధం చెప్పినా అది లాజిక్‌కు నిలబడాలి.

దురదృష్టవశాత్తు, మొన్న మన ప్రధాని ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన మాటలు అలా లేవు. అర్థం పర్థం లేని ఒక డ్రామా డైలాగుల్లా ఉన్నాయి.  

భారత స్వతంత్ర సమరయోధుడు, నెహ్రూకు సరిసమానుడైన దేశ నాయకుడు, ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌ స్థాయిని తగ్గించేలా మాట్లాడ్డం అవమానకరం. అప్పటి హైద్రాబాద్ స్టేట్ ప్రజల పోరాటాన్ని గుర్తించి, భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు, హైద్రబాద్‌ను విముక్తం చేసే విషయంలో పటేల్ ఒక కేంద్ర హోం మంత్రి హోదాలో తన బాధ్యత నిర్వర్తించారు తప్ప, ఒక గుజరాతి బిడ్డగా కాదు.  

తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు, ఈ పదేళ్ళలో తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ స్థాయి హోదా ఇవ్వలేదు, ఒక కొత్త ప్రాజెక్టునివ్వలేదు, ఒక ఇండస్ట్రీనివ్వలేదు, ఒక మెడికల్ కాలేజి లేదు, ఒక నవోదయ విద్యాలయ లేదు.

గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ ఆవిర్భావం మీద విషం కక్కడం తప్ప ఆయన తెలంగాణకు చేసిందేమీ లేదు. అలాంటి వ్యక్తి "మరో గుజరాతి బిడ్డగా నేను తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా" అనడం హాస్యాస్పదం, అవమానకరం.

పైగా, ప్రధానమంత్రి అంటే దేశం మొత్తానికి చెందినవాడు అవుతాడు కాని, "నేను గుజరాతి బిడ్డగా" ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని తన స్థాయిని తగ్గించుకోడు.       

కేసీఆర్ ఎన్‌డీఏలో చేరతాం అంటే మోడీ ఒప్పుకోలేదట! జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశారట!!

న్యూస్‌లో ఎప్పుడైనా విన్నప్పుడు తప్ప, అసలు అస్థిత్వమే లేని ఎన్‌డీఏలో కేసీఆర్ చేరాలనుకుంటారనుకోవడం అవివేకం.

అంతేకాదు, లోకల్‌గా ఒక మేయర్ పదవి కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలుస్తారనుకోవడం ఎవరూ నమ్మలేని మరొక పచ్చి అబద్ధం. 


పధ్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, వచ్చే ఎన్నికల తర్వాత ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్‌ను నరేంద్రమోడీ తిరస్కరించడమేంటి?       

గత 60 ఏళ్ళుగా ఈ ప్రాంతం కోసం ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తూ, ప్రపంచస్థాయి నాయకులు, సంస్థలతో శభాష్ అనిపించుకుంటున్న కేసీఆర్ అవినీతిపరుడెలా అవుతాడు?

కేంద్రంలో ఉన్నది మీరే కదా, మరి ఎందుకని ఆయన అవినీతిని బయటపెట్టడం లేదు?

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారమిస్తేనే ఆయన అవినీతిని బయటపెడతామనడం ఎంత ఎడాలిసెంట్ మాట?

నిజానికి ఎక్కడ అవినీతి పొంగిపొర్లుతోందన్నది కట్టిన కొన్నిరోజులకే కూలిపోతున్న బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లే చెప్తున్నాయి. ఆ స్థాయి అవినీతి ఉన్న తమ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతి గురించి మోడీ ముందు ఆలోచించాలి.   

దేశప్రజలు సంపూర్ణ మెజారిటీతో రెండుసార్లు బంగారుపళ్లెంలో పెట్టి అధికారం చేతికి అందించినప్పుడు, పదేళ్ళలో ఒక దేశాన్ని అభివృద్ధిపథంలో ప్రపంచం నివ్వెరపోయే స్థాయికి తీసుకెళ్లవచ్చు.

దురదృష్టవశాత్తు, నరేంద్రమోడీ ప్రభుత్వం అలా చేయలేకపోయింది.

పవర్ ఉపయోగించి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం, సున్నిత విషయాల్లో ప్రజలను రెచ్చగొట్టి ఎప్పటికప్పుడు ఎన్నికల్లో గెలవాలనుకోవడం వంటి 'అధికారం' ప్రధాన లక్ష్యంగానే వారు ఏదైనా చేయగలిగారు తప్ప, 'అభివృద్ధి' గురించి ఆలోచించలేకపోయారు. 

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దాదాపు ఒకే సమయంలో పదవుల్లోకి వచ్చారు. రాష్ట్రస్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన ఎన్నెన్నో అద్భుత విజయాల్లో కనీసం పది శాతం విజయాలను కూడా కేంద్రస్థాయిలో ప్రధాని మోడీ సాధించారా అన్నది జవాబు దొరకని ప్రశ్న. 

కట్ చేస్తే -

సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థం లేదు. అలాగే, సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు.

కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడవచ్చు. కాని, ఆ తర్వాతంతా కేటీఆర్ స్వయంకృషే అన్నది పార్టీలకతీతంగా ఎవరైనా సరే ఒప్పుకొనితీరాల్సిన నిజం.

స్వయంగా ఎందరో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచస్థాయి కంపెనీల సీఈఓలే ఎన్నోసార్లు కేటీఆర్ సామర్థ్యం గురించి వివిధ వేదికలపై ఎంతగానో మెచ్చుకొంటూ చెప్పారు. 

"ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే" అన్నట్టు, కేటీఆర్ ఏ స్థాయికి ఎదిగినా కేసీఆర్ తనయుడే.

కాని, కేటీఆర్ అంటే ఇప్పుడొక బ్రాండ్.

భారత రాజకీయాల్లో ఒక రాక్ స్టార్.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చెయ్యాలనుకుంటే రెండే రెండు నిమిషాలు చాలు. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న బీఅర్ఎస్ ఎల్పీ సింగిల్ లైన్ ప్రపోజల్‌తో చేసుకోగలుగుతుంది.

భవిష్యత్తులో అది తప్పకుండా జరుగుతుంది.

కాని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం కేసీఆర్ నరేంద్రమోడీ ఆశీస్సులు కోరారనటం ఈ శతాబ్దపు పెద్ద జోక్. కేవలం వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే ఇలాంటి జోకుల్ని ఎంజాయ్ చేయగలుగుతారు. 

సభకు వచ్చిన ప్రజల చప్పట్ల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వేరు. మనం చీప్ అయిపోవడం వేరు. రెండోది అత్యంత విషాదం. మొన్నటి నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్‌లో కనిపించింది ఆ విషాదమే. 
***
("మోదీ నోట శతాబ్దపు జోక్" పేరుతో ఈరోజు "నమస్తే తెలంగాణ" ఎడిటోరియల్ పేజిలో వచ్చిన నా ఆర్టికిల్... )

No comments:

Post a Comment