Wednesday 29 November 2023

కారు గుర్తుకే ఎందుకు వోటెయ్యాలి?


కారు గుర్తుకే ఎందుకు వోటెయ్యాలి? 
కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలి?
జస్ట్ 6 పాయింట్స్... 
******  

#1. 
మనం పుట్టిన నేలలో మనం ద్వితీయశ్రేణి పౌరులుగా చలామణి కాబడ్డాం. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మనవి కావు. మన భాష, మన సంస్కృతి, మన పండుగలు ఎగతాళి చేయబడ్డాయి. దాదాపు ఆరు దశాబ్దాలు ఇలా మన ప్రాంతంలో మనం పరాయివాళ్లం కావడానికి కారణం... కాంగ్రెస్, పాలకులకు బానిసలయిన కొందరు మన తెలంగాణ వాళ్ళు. దీనికి చెక్ పెట్టి, ఏమైనా సరే తెలంగాణను సాధించాలని 2001 లో కంకణం కట్టుకున్న వ్యక్తి కేసీఆర్. ఒక తిరుగులేని ఉద్యమ సారథిగా అందర్నీ కలుపుకొనిపోతూ, ఒక్క చుక్క రక్తం చిందకుండా అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన శక్తి కేసీఆర్. 

ఆరు దశాబ్దాల అవమానాల తర్వాత సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందామా? లేదూ... మళ్ళీ మన రాష్ట్రాన్ని వలసపాలకులకు అప్పగించే వ్యూహంలో భాగమై, నిస్సిగ్గుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తుల చేతుల్లో పెడదామా?         

#2. 
14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, తిట్లు, శాపనార్థాలు ఎదురైనా చెక్కుచెదరని సంకల్పంతో ముందుకే దూసుకెళ్ళి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్... అంతకంటే రెట్టింపు సంకల్పంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేశాడు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అనేక అంశాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ఇది నేను చెప్తున్నది కాదు... కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలు, సంస్థలు ప్రకటించిన నిజాలు. అంతర్జాతీయంగా కూడా ఎన్నో సంస్థలు ప్రకటించిన వాస్తవాలు. 

ఇలాంటి అత్యున్నతస్థాయి పాలనతో మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌ను మళ్ళీ మన ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామా? అట్ల కాదూ... తెలంగాణ భౌగోళిక-సాంఘిక-సాంస్కృతిక అంశాల గురించి మన కేసీఆర్‌కు తెలిసినదాంట్లో కనీసం 0.0001% కూడా తెలియని గుంపు మేస్త్రీలను తెచ్చుకుందామా?     

#3. 
ఇప్పుడు కేసీఆర్, బీఆరెస్ పార్టీ వద్దు... మార్పు కావాలి అని అరిచి పెడబొబ్బలు పెడుతున్నవాళ్లంతా ఎవరు? వారికేం కావాలి? వాళ్ళంతా ఇంతకు ముందు ఈ ప్రాంతాన్ని పాలించినవాళ్లేగా... మరెందుకు తెలంగాణకు గత ఆరు దశాబ్దాల్లో ఏం చెయ్యలేకపోయారు? కేసీఆర్ మాత్రమే గత పదేళ్ళలో ఇదంతా ఎలా చెయ్యగలిగాడు?  వాళ్లకు కేవలం అధికారం కావాలి. దోచుకోవడం కావాలి. వలసపాలకులకు దోచిపెట్టడం కావాలి. కేసీఆర్ ఉంటే ఇవన్నీ కుదరవు. వాళ్ళు ఫైరవీలు చేసుకోలేరు. లంచాలుండవు. దోపిడీలుండవు. కాబట్టే కేసీఆర్ వద్దు, బీఆరెస్ వద్దు. 

రేపు ఎవరికి వోటేస్తారు... కేసీఆర్ కారు గుర్తుకా? లేదంటే... వలసపాలకులను మళ్ళీ తెలంగాణలోకి స్వాగతించడానికి పూనుకొన్న తెలంగాణ ద్రోహులకా? 

#4. 
గ్లోబ్ మీదున్న అన్ని ప్రధాన బిజినెస్ సంస్థల రెండో ప్రధాన కార్యాలయాల్ని, బ్రాంచ్‌లను హైద్రాబాద్‌కు రప్పించి... వేల కోట్ల పెట్టుబడులను మన రాష్ట్రానికి తెప్పించి, మన యువత కోసం ప్రత్యక్షంగా-పరోక్షంగా లక్షల ఉద్యోగాలను క్రియేట్ చెయ్యగలిగిన కేటీఆర్ ఇప్పటిదాకా మనకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశం నలుమూలల నుంచి కూడా ఎన్నో బిజినెస్‌లను, ఇండస్ట్రీలను తెలంగాణకు వచ్చేలా చేయగలిగిన చొరవ, కృషి కేటీఆర్ సొంతం. యువతకు స్పూర్తినిచ్చే ఒక బ్రాండ్ అంబాస్సాడర్‌గా ఆయన సెమినార్లు, మీటింగ్స్, ఇంటర్వ్యూలు, మీటప్స్ లాంటివి నిజంగా ఒక అద్భుతం, ఒక మ్యాజిక్.          

కారు గుర్తుకు వోటు వేసి... మన యువతరం భవిష్యత్తు కోసం మన కేటీఆర్ సేవల్ని, ఆయన డైనమిజాన్ని కంటిన్యూ కానిద్దామా? లేదంటే... కేటీఆర్ సాధించిన లెక్కలేనన్ని విజయాల పట్ల కనీస అవగాహన కూడా లేని నిరక్షర కుక్షుల పాలనను మన నెత్తి మీదకి తెచ్చుకొని, మన యువతరం భవిష్యత్తుకు మంగళ గీతం పాడుదామా?  


#5. 
ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ బీఆరెస్సే గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు. తర్వాతి 5 ఏళ్ళలో పేదరికం లేని తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తారు. విద్య, వైద్యం, యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం మరింత ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. గత 10 ఏళ్ళలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలనిచ్చిన రాష్ట్రంగా తెలంగాణ, ఈ దిశలో మరిన్ని ఉద్యోగాలను పూరిస్తుంది. కొత్తగా మరెన్నో లక్షల ఉద్యోగ-ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.  

కారు గుర్తుకు వోటేసి మన యువతరం బంగారు భవిష్యత్తును కళ్ళారా చూసుకుందామా? వద్దు అని... మన పిల్లల్ని ఎందుకూ పనికిరాని ఉట్టి "పప్పు" సుద్దల్ని చేసుకుందామా?  

#6. 
బై మిస్టేక్, కాంగ్రెస్ గాని అధికారంలోకి వస్తే మన తెలంగాణ భవిష్యత్ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొందాం:

> ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న 24 గంటల కరెంట్ ఉండదు. 
> రైతులకు కేవలం 3 గంటలే కరెంటు ఉంటుంది.
> రైతుబంధు ఉండదు. 
> ధరణిని ఎత్తేస్తారు. మళ్ళీ అదే ఒక్క భూమిని ఎంతమందికైనా రిజిస్ట్రేషన్ చేయగలిగే అవినీతి రోజులొస్తాయి. 
> దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో ఉన్న మన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. 
> హాస్టళ్ళలో ఇప్పుడు సన్న బియ్యం తింటున్న విద్యార్థుల కంచాల్లో మళ్ళీ దొడ్డు బియ్యం, పురుగులు వచ్చేస్తాయి.
> కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలకు ఇక మీదట దిక్కు మొక్కు ఉండదు. నిస్సందేహంగా, నిస్సిగ్గుగా వాటిని రద్దు చేసేస్తారు.  
> పదేళ్ళుగా దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రశంసలు పొందుతున్న మన పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. లా అండ్ ఆర్డర్ ఛిద్రమైపోతుంది.    
> కేసీఆర్ హయాంలో మనం పూర్తిగా మర్చిపోయిన కర్ఫ్యూలు, అల్లర్లు, మతకలహాలు రాష్ట్రంలో మళ్ళీ మొదలవుతాయి. 
> ఏడాదికో ముఖ్యమంత్రిని ఢిల్లీలోని హైకమాండ్ మార్చేస్తుంటుంది. 
> అన్నిటికంటే ముఖ్యంగా... మళ్ళీ మన తెలంగాణ, మన హైద్రాబాద్‌ను అప్పనంగా వలసపాలకుల చేతుల్లో పెట్టే పనులు ఊపందుకుంటాయి.     

జస్ట్ ఇదొక టిప్ మాత్రమే. దీన్ని బట్టి మొత్తం సినిమా ఊహించుకోవచ్చు. 

కట్ చేస్తే -  

కొన్ని గంటలే...

ఎవరేం చెప్పినా వినకండి. 
ఒక్క నిమిషం ఆలోచించండి. 
మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. 
కారు గుర్తుకే వోటెయ్యండి.  

బస్... అవుర్ ఏక్ ధక్కా.
కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా.  

- మనోహర్ చిమ్మని           

సెల్యూట్!


తెలంగాణ సాధకుడు 
కేసీఆర్ గారికి,
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన
వందలాది మన అమరవీరులకీ...
ప్రభుత్వం లోపలా బయటా
నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్ టీమ్‌కి,
వివిధ స్థాయిల్లోని బీఆరెస్
రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, 
సోషల్‌మీడియా వారియర్స్‌కు,
తెలంగాణను, కేసీఆర్‌ను ప్రేమించే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న
తెలంగాణ ప్రజలందరికీ...
"దీక్షాదివస్" సందర్భంగా
నా సెల్యూట్! 
 
- మనోహర్ చిమ్మని   

#DeekshaDivas #KCROnceAgain #VoteForCar 

Tuesday 28 November 2023

కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా ఒక్కడే!


కావడి మోసేవాడికి తెలుస్తుంది దాని బరువెంతో. 

బండి నడిపేవాడికి తెలుస్తుంది గమ్యం చేరే దాకా అనుక్షణం ఎంత అలర్ట్‌గా ఉండాలో.

ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించి, అనేక అంశాల్లో ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళగలిగిన ప్రభుత్వాధినేతకు తెలుస్తుంది ఎప్పుడేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో.   

కట్ చేస్తే -

థియరీకి, ప్రాక్టికల్‌కు భూమ్యాకాశాల తేడా ఉంటుంది. 

14 ఏళ్ళ సుధీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవటం ఒకటి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అన్ని నిరంతరం కుక్కల్లా కాచుకుని ఉండే మందల్ని గమనిస్తూ ఉండటం ఇంకొకటి. ఇలాంటి నేపథ్యంలో అలుపులేకుండా కాపలా కాస్తూనే, రాష్ట్ర అభివృద్ధి-సంక్షేమం కోసం 24/7 కృషి చేయటం మరొకటి. 

ఎన్ని చేసినా, ఎంత చేస్తున్నా... ఇంకా ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు అని నాలుగు గోడల మధ్య కూర్చొని ఏదో ఒకటి సూడో-మేధావి రాతలు రాయడం చాలా ఈజీ. 

యస్... కొన్ని హెచ్చుతగ్గులు, కొన్ని ఆలస్యాలు ఉండొచ్చు. కాని... ఒక క్రమం ప్రకారం, ఒక ప్రయారిటీ ప్రకారం ప్రతి అంశానికీ సమయం తప్పక వస్తుంది.  

కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా ఒక్కడే. నిజంగా మీకు అంత సామర్థ్యమే ఉంటే, ప్రజాస్వామ్యంలో మీకూ అన్ని అవకాశాలున్నాయి. తెలంగాణ కోసం మీరు ఏం చేయగలరో చెప్పండి. చేసి చూపించండి. 

అప్పటిదాకా, 24 గంటలు నాన్-స్టాప్ కరెంట్ వాడుతున్నందుకైనా రేపు 30 నవంబర్ నాడు కారు గుర్తు మీద వోటేయండి.  

గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే.  

బస్... అవుర్ ఏక్ ధక్కా.
కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా. 

నేను చెయ్యాలనుకున్నది చేస్తున్న మై డియర్!


"నీ పోస్టులు వృధా పోవు మిత్రమా!"
- నా యూనివర్సిటీ మిత్రుల్లో ఒకరు

కట్ చేస్తే - 

నేను చెయ్యాలనుకున్నది చేస్తున్న మై డియర్. 

కేసీఆర్ నా చుట్టం కాదు, నేను అటు నుంచి ఏం ఆశించటం లేదు. 

తెలంగాణ కోసం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యనంత మంచి కేసీఆర్ చేశాడు. అదంతా కళ్ళముందు కనిపిస్తోంది. ఇంకేం చెయ్యాలన్నదానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇంకెంతో చెయ్యాలన్న తపన ఉంది. అనుకున్నది చేస్తాడు.    

పోటీగా ఉన్నవాళ్ళతో ఒకే ఒక్క నిముషం పోల్చుకుంటే చాలు. ఎవరికి ఓటెయ్యాలన్నది మనకే తెలిసిపోతుంది. 

బస్... అవుర్ ఏక్ ధక్కా. 
కేసీఆర్ హాట్రిక్ పక్కా.   

Saturday 25 November 2023

జస్ట్ ఒక 4 రోజులే ఏం చేసినా, ఎంత కష్టపడ్డా!


బీజేపీ విషయం మర్చిపోదాం. అంత సీన్ లేదు. ఇప్పుడసలు అది లెక్కలోకి రాదు. 

కాంగ్రెస్, కాంగ్రెస్ అంటున్నారు కొందరు... అదంతా ఒక అతి చిన్న కేసీఆర్ వ్యతిరేక శత్రువర్గం క్రియేట్ చేస్తున్న మాస్ హిస్టీరియా. సామాన్య ప్రజల వీక్‌నెస్ మీద ఆడుతున్న గోబెల్స్ ప్రచారం. అంతకన్న ఏం లేదు.    

ఒక లేయర్ కిందకు చొచ్చుకుపోతే అంతా గులాబిమయమే. అంతా కేసీఆర్ అభిమానగణమే. అంతా నిజమైన తెలంగాణ బిడ్డలే.

చిన్న చిన్న అభిప్రాయభేదాలు, అలుగుళ్ళు ఏమున్నా... అవన్నీ పక్కనపెట్టి ముందు కారు గుర్తు మీద గుద్దుడే. మరో ఆలోచన లేదు. ఉండదు.  

అందరికీ తెలుసు... తెలంగాణ గురించి నిజంగా ఆలోచించేవాడు, స్పష్టమైన అవగాహన ఉన్నవాడు, ఏదైనా సరే తెలంగాణ కోసం ఎదిరించి పోరాడి సాధించే సత్తా ఉన్నవాడు కేసీఆర్‌ను మించి అవతల పార్టీల్లో ఒక్కడు కూడా లేడని. 

అధికారం కోసం, దోచుకోవడం కోసం, వలసపాలకులకు దోచిపెట్టడం కోసం, వాళ్లకు మళ్ళీ బానిసలు కావడం కోసం తప్ప... వీళ్ళందరికీ మరొక ఎజెండా లేదు. అది స్పష్టం.   

ఖర్మకాలి వాళ్లంటూ వస్తే, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ గతి అధోగతే. అలాంటి తప్పు నికార్సయిన తెలంగాణ ప్రజలు అసలు చెయ్యరు. చెయ్యలేరు. 

అయినా కూడా... ఉడతాభక్తిగా మనకు సాధ్యమైనంత ప్రచారం, ప్రమోషన్, ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దాం. 

ఈ 4 రోజుల్లో కనీసం ఇంకో పదింతలు చేద్దాం. 

మన కోసం. మన తెలంగాణ కోసం. మన కేసీఆర్ కోసం. 

బస్... అవుర్ ఏక్ ధక్కా. 
కేసీఆర్ హాట్రిక్ పక్కా.      

Friday 17 November 2023

రేవంత్ రెడ్డికి సపోర్ట్ అంటే వలస పాలకులకు సపోర్టే!

పూర్వాశ్రమంలో అతని వృత్తి ఏంటన్నది మనకు అనవసరం. సున్నాలేశాడో, వేయించాడో, రియల్ ఎస్టేతో, కబ్జాలో, సెటిల్‌మెంట్లో... ఏదైనా కావచ్చు. ఇప్పుడది మనకు అనవసరం.  

రేవంత్ రెడ్డి బాగా చదువుకోలేదు. అర్థవంతమైన ఒక పూర్తి వాక్యం మాట్లాడలేడు. నోరు తెరిస్తే అసభ్య పదజాలం. సీయం చెయిర్‌కయినా గౌరవం ఇవ్వలేని అజ్ఞాని. 

కట్ చేస్తే - 

> తెలంగాణలో అప్పటి టీఆరెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్‌గా దొరికిపోయి జైలుకెళ్ళాడు రేవంత్ రెడ్డి. ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎవరిది?  

> ఒకప్పుడు సోనియా గాంధీని "బలి దేవత" అని, రాహుల్ గాంధీని "పప్పు" అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఇదే రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీవాళ్లే బయట బాహాటంగా చెప్తున్న మాటల ప్రకారం, 50 కోట్లు ఢిల్లీలో చెల్లించి ఇక్కడ తెలంగాణలో పిసిసి పీఠం ఎక్కాడు. ఇంత డబ్బు అతనికెక్కడిది?

> అంతకు ముందున్న టీడీపీలో వలస పాలకుల అడుగులకు మడుగులొత్తటం తప్ప, రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా మంత్రిగా చెయ్యలేదు. అంత పరపతి లేదు. అంబానీ, అదానీ లెవెల్లో వ్యాపార వేత్త కూడా కాదు. ఎలక్షన్స్ కోసం ఇన్ని భారీ సభల్ని పెట్టేంత డబ్బు అతనికెవరిస్తున్నారు? 

సింపుల్ ఆన్సర్... 

చంద్రబాబు తెలంగాణలో మేం పోటీ చెయ్యం అన్నాడు. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలన్నాడు. డబ్బు ఎక్కడిది అని ఇప్పుడు ఆలోచించండి. 

సో... రేవంత్ రెడ్డి అంటే బయటికి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు. లోపల మాత్రం చంద్రబాబు పెంపుడు కొడుకే. మీరు బై మిస్టేక్ కాంగ్రెస్‌కో, రేవంత్ రెడ్డికో ఓటేస్తున్నారంటే అది వారికి వేస్తున్న ఓటు కాదు. డైరెక్ట్‌గా చంద్రబాబుకు వేస్తున్న ఓటు! 

కాంగ్రెస్‌కు ఓటేసి మళ్ళీ తెలంగాణలోకి వలస పాలకులను తెచ్చుకుందామా? బీఆరెస్‌కు ఓటేసి, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న మన కేసీఆర్‌ను కాపాడుకుందామా? 

నిర్ణయం మీదే... 

Thursday 16 November 2023

కేసీఆర్ ఎప్పుడూ ఒక్కడే!ఆమధ్య ఉన్నట్టుండి వై యస్ షర్మిళ, "నేను తెలంగాణలోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, తెలంగాణ కోడల్ని కూడా" అంటూ సొంత (ఎ)జెండాతో ఒక పార్టీ పెట్టారు. అమాయకులు, అల్ప సంతోషులు కొందరు ఆమె వెంట చేరారు. మొత్తం 119 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుందని కూడా ఈమధ్యనే అన్నారామె. అప్పు సప్పు చేసి, ఆస్తులమ్మి ఈ అల్ప సంతోషులంతా బాగా డబ్బు ఖర్చుపెట్టుకున్నారు. 

మళ్ళీ ఉన్నట్టుండి షర్మిళ, వాళ్ళ అన్న జైలుపాలు కావడానికి కారణమైన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె మీద ఆశలు పెట్టుకున్న అమాయకులంతా దుమ్మెత్తిపోశారు. ఒకరిద్దరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. 

ఎవరేమైపోతేనేం... ఇప్పుడు షర్మిళ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆమె కూడా ప్రచారం చేస్తారట.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను పిలిచి, ఈమధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, "మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తున్నాం" అని చెప్పాట్ట. 

అప్పటిదాకా ఓ వంద కోట్ల దాకా ఖర్చుపెట్టుకున్న జ్ఞానేశ్వర్‌కు ఒక్క దెబ్బతో జ్ఞానోదయం అయింది. రాత్రికి రాత్రే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, చివరికి తాను చేరాల్సిన గమ్యం చేరుకున్నారు. 

తెలంగాణలో ఇంకా అడుగు బొడుగు మిగిలిన టీడీపీ శ్రేణులు మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నది వెన్నుపోటు బాబుకు గుర్తుండని ఒక చెదలు పట్టిన చరిత్ర. 

ఇప్పుడు టీడీపి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుంది అన్నది మాత్రం ఒక ఓపెన్ సీక్రెట్.       

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్న బాధతో పదకొండు రోజులు అన్నం మానేసిన పవన్ కళ్యాణ్‌కు, ఊసరవెల్లికి పోటీ పెడితే ఖచ్చితంగా పవర్‌స్టారే గెలుస్తాడు. అప్పుడప్పుడు అవసరం కోసం తెలంగాణకు అనుకూలంగా సినిమాటిక్ డైలాగులు చెప్తాడు కాని, ఈయన అంతరంగం పూర్తిగా చంద్రబాబుకు అనుకూలం. అటు బీజేపీ అంటాడు, ఇటు బాబు అంటాడు. 

అసలు ఈయన పార్టీ పెట్టింది ఎందుకో అర్థం కాక ఈయన పార్టీకి చెందిన జన సైనిక్స్ అందరూ తికమక పడీ పడీ, అసలు ఆలోచించడం మానేశారు. 

అక్కడ బాబుతో ప్రేమ. ఇక్కడ బీజేపీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్. వెరసి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోయి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. 

బీజేపీకి ఇక్కడ తెలంగాణలో రెండు మూడు సీట్లు వస్తే ఎక్కువే అన్న నిజం తెలిసి కూడా, ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ సహా, కేంద్ర మంత్రులు, ఇతర అతిరథ మహారథులంతా ఇటే దృష్టి పెట్టారు. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల్ని రకరకాల కుట్రలతో, కొనుగోళ్లతో కూలగొట్టి అధికారం సంపాదించుకొనే వారి కల్చర్ ఇక్కడ కూడా కొనసాగించడానికి ఏ క్షణమైనా ఏదో ఒక అవకాశం దొరుకుతుందన్న అత్యాశ వారిది.  

"పక్కనే ఉన్న తార్నాకలో బీర్లు తాగి, బిర్యాని తినేవాళ్ళు" అని, "అడ్దామీద కూలోళ్ళు" అని ఈమధ్యే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అనడం ద్వారా తన స్థాయి ఏంటో మరొక్కసారి తానే రుజువు చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పైన కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. 

ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పైకి రివాల్వర్‌తో కాల్చడానికి వెళ్ళిన ఘనచరిత్ర ఇతనికుంది. తెలంగాణ వచ్చాక, బాబుతో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం చేసిన కుట్రలో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్ళిన నేరస్థుడు కూడా. 

రైతు బంధు వేస్ట్ అంటాడు. రైతుకు 3 గంటలు కరెంటు చాలు అంటాడు. నిరుద్యోగ యువకులతో కూరగాయలు అమ్మిస్తానంటాడు. అట్టర్ ఫ్లాప్ అయిన అమరావతిని ఉదాహరణగా చూపిస్తూ, అదే విధంగా రాచకొండ పరిసరాల్లో వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని కొత్త నగరం ఏదో నిర్మిస్తానంటాడు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతి, ప్రజలు, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం గురించి కేసీఆర్‌తో పోలిస్తే అ ఆలు కూడా రాని రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన పోటీ చేస్తున్నాడు. రేపు నేనే ముఖ్యమంత్రిని అని కలలు కంటున్నాడు. 

అయిదు గ్యారంటీలతో పక్కన కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు అక్కడ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్న కొట్లాటతోనే సరిపోతోంది. కనీసం ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చే పరిస్థితి, సమర్థత అక్కడ లేదు. రోజుకు 5 గంటల కరెంటు ఇవ్వడానికే చచ్చిపోతున్నాం అంటూ అక్కడి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. 

మరి అలాంటప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలను ఎలా నెరవేర్చగలుగుతారు? 

ఇలాంటి అవగాహనారాహిత్యం, అసమర్థత నేపథ్యంతో తగుదునమ్మా అంటూ కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, ఇంకొందరు ధనిక వర్గ నాయకులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చెయ్యడానికి కట్టకట్టుకొని వచ్చారని సమాచారం. వీళ్ళంతా ఎలక్షన్ ప్రచారం పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న జుగుప్సాకరమైన రచ్చకు తోడుంటారు. ఇంకేం ప్లాన్లు వేస్తున్నారో తెలియదు. 

భారాస నాయకుల మీద ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య భౌతిక దాడులు జరుగుతుండటం వెనుక ఉన్న కుట్రదారులెవరన్నది కూడా ఈ నేపథ్యంలో అధ్యయనం చేయాల్సి ఉంది. 


కష్ట సమయంలో భారతదేశపు ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చిన పీవీ నరంసింహారావు లాంటి మేధావి రాజకీయ నాయకున్ని అహంకారపూరిత కుట్రలతో పక్కనపెట్టిన ఢిల్లీవాళ్ళకు ఇప్పుడు దేశంలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలన్న ఉద్దేశ్యంతో దేనికైనా సరే అన్నట్టుగా ఉన్నారు ఆ పార్టీ బై డిఫాల్ట్ అధినేత్రి సోనియా గాంధీ. 

తెలంగాణకు సంబంధించి ఏదైనా పేపర్ మీద రాసిస్తే తప్ప ఒక్క వాక్యం కూడా మాట్లాడలేని రాహుల్, ప్రియాంక ఎలక్షన్లు అయ్యేదాకా ఇక్కడే తెలంగాణలోనే ఉంటామంటున్నారు.     
       
మరోవైపు, కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఉన్నారనుకున్న చోట బీజేపీ, బీజేపీకి బలమైన అభ్యర్థి ఉన్నారనుకున్న చోట కాంగ్రెస్ తమవైపు నుంచి బలహీనమైన అభ్యర్థులను ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా నిలబెట్టారని కూడా పేపర్లు రాస్తున్నాయి, చానెల్స్‌లో చెప్తున్నారు. స్వయంగా ఆయా పార్టీల వాళ్లే చెప్తున్నారు. 

కట్ చేస్తే -

అష్ట దిక్కుల నుంచి ఇలా ఎన్ని వ్యతిరేక శక్తులు ఏకమై వచ్చి, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఇక్కడ ఏం ఫరక్ పడదు. కేసీఆర్ రాజనీతి ముందు, ఇలాంటి సమయాల్లో ఆయన కదిపే పావుల ముందు, పెట్టే చెక్‌ల ముందు వీళ్లంతా ఉట్టి పిపీలికామాత్రులు.

"తెలంగాణ రాష్ట్రం కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను" అని చెప్పిన కేసీఆర్, ఉద్యమ సమయంలో తప్ప ఎన్నడూ ఇలాంటి పనికిమాలిన పొత్తుల కోసం అసలు ఆలోచించలేదు. 

తెలంగాణ సమాజం అంతా తనవైపు ఉందన్న విషయం ఆయనకు తెలుసు. తెలంగాణ సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ఇప్పుడు కాపాడుకోవడం ఎంత చారిత్రక అవసరమో తెలంగాణ ప్రజలకు తెలుసు. 

ఇంతమంది ఒక వైపు. కేసీఆర్ ఒక్కడు ఒక వైపు. 

ఎవరు గెలుస్తారన్నది ఇంతకు ముందే చరిత్రలో రికార్డ్ అయి ఉంది.

జస్ట్ అవుర్ ఏక్ ధక్కా. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా.    

Tuesday 14 November 2023

రాధాకృష్ణ మనసుతో మాట్లాడిన వేళ!


నిన్న ఏబియన్ చానెల్ "బిగ్ డిబేట్‌"లో రాధాకృష్ణ, కేటీఆర్‌ల మధ్య దాదాపు 2 గంటల చర్చలో నేను గమనించిన కొన్ని కొత్త అంశాల్లో 3 ముఖ్యమైనవి ఇవి: 

> దశాబ్దాలుగా మిత్రులైన కేసీఆర్-రాధాకృష్ణల మధ్య ఏదో చెడింది. రాధాకృష్ణ చేసిన ఏదో తప్పుని వ్యక్తిగతంగా కేసీఆర్ మనసులో పెట్టుకున్నారు. "అది కరెక్టు కాదు, మీ డాడీ అలా మనసులో పెట్టుకోవద్దు" అని అన్యాపదేశంగా పదే పదే కేటీఆర్‌తో చెప్పడం.

> ఇదే రాధాకృష్ణ కేసీఆర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కనీస సభా మర్యాద కూడా లెక్కచేయకుండా, ఇంటర్వ్యూ అంతా "నువ్వు నువ్వు" అనే కేసీఆర్‌తో మాట్లాడటం నాకు గుర్తుంది. కాని - నిన్నటి కేటీఆర్‌తో చర్చలో మాత్రం, ఏదో రెండు మూడు సార్లు తప్ప, డిబేట్ అయినంత సేపూ కేటీఆర్‌ను "మీరు మీరు" అనే సంబోధించడం విశేషం. 

> ప్రోగ్రాం ప్రారంభం నుంచి చివరివరకు కూడా, ఎవరితోనైనా సరే పిచ్చి వెటకారంగా మాట్లాడే రాధాకృష్ణ తన సహజ శైలిని పక్కనపెట్టి, కేటీఆర్‌తో సంభాషించడాన్ని మాత్రం చాలా ఆనందంగా ఫీలవ్వటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తను మాట్లాడే ప్రతి మాటకూ తనను కేటీఆర్ ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని, కేటీఆర్ ఎక్కడ ఫీలవుతాడోనని రాధాకృష్ణ తెగ ఫీలైపోయాడు. కేటీఆర్ పట్ల ఆయనకున్న ఇష్టం, ప్రేమ బాగా ప్రదర్శించుకోగలిగాడు. నిజంగా అదేనా... లేదంటే... వీళ్ళ డాడీని ఇంక నేను పడెయ్యలేను... రేపు కొన్నాళ్ళ తర్వాత ఎలాగూ సీయం కేటీఆరే అవుతాడు అని ఇప్పటినుంచే కాకా పట్టడమా అన్నది ఒక డౌట్! 


కట్ చేస్తే -

ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్... "హ్యాట్రిక్ కొడతారు!" 

డిసెంబర్ 3 నాటి రిజల్ట్ గురించి అందరికంటే  ముందే చెప్పేశాడు రాధాకృష్ణ.   

దటీజ్ కేటీఆర్. 

Saturday 11 November 2023

గులాబి ఉప్పెన దెబ్బ!

"ఏందన్న... మల్ల ఫోనే లేదు?"

"ఫోనెందుకు, నేనే వచ్చిన గద తమ్మి"

"నిన్న మొన్న మొత్తానికే గయాబ్ అయినట్టున్నవ్?"

"అవ్ తమ్మి, పని మీద గా బొంబై దాకా పొయ్యొచ్చిన."

"పొయిన పని అయిందానె?!" 

"అయింది తమ్మి... కని... నిజంగ చెప్తున్న... గంత దూరం పొయినా నా మనసంత గీన్నే ఉన్నది. ఎక్కడెక్కడ మన పెద్ద సార్ సభలైతున్నై... ఎక్కడ ఏం మాట్లాడుతున్నడు సారు... నువ్వు నమ్ముతవో నమ్మవో గని, నా మైండ్ అంత గిదే ముచ్చట."

"ఏ... నువ్వు గమ్మత్ జేత్తవ్ అన్న... ఎందుకు నమ్మనే? కేసీఆర్ ఆత్మ తెలంగాణ అయితె, నీ ఆత్మ కేసీఆర్! నాకు తెల్వదానే."

"ఎలక్షన్స్ అయిపోయి, సార్ హ్యాట్రిక్ కొట్టి, మూడోసారి ప్రమాణ స్వీకారం చేసింది చూసెదాక... ఇంగ నేను ఎక్కడికి పోను తమ్మి. డిసైడ్ అయిన." 

"నిన్న చూసినవా తమ్మి... మన కేటీఆర్‌కు ఎంత డేంజర్ తప్పింది. జెర్రంతల ప్రమాదం తప్పింది. దేవుడున్నడు తమ్మి."

"ఏ... ఉన్నడన్న. మన కేటీఆర్ ఎట్ల పనిజేస్తడు తెల్సు గద. క్లాసుల క్లాస్, మాస్‌ల మాస్. వెయ్యిల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు! డేశంల ఏ రాష్ట్రంల నన్న గింత గనం పనిచేసే మంత్రి ఏది ఒక్కలన్న ఉన్నరా? గసొంటి మనిషికి దేవుడు గింత దెబ్బ తగలనియ్యడు." 


"కొడంగల్‌ల గులాబి సముద్రం చూసినవా తమ్మి, ఎట్లున్నది ఎట్లున్నది... అదిరిపోలె?"

"కేటీఆర్ స్పీచ్ మరి? ఏం మాట్లాడిండన్న! గా బస్సు మీద గంత డేంజర్ కథయినా గుడ, గింతన్న రెస్టు తీస్కోకుండ కొడంగల్ పోయిండు. దుమ్ము దులిపిండు!"

"నిన్న కొడంగల్‌ల గిదంత చూసినంక... గా రేటెంత రెడ్డి ఫీలింగ్స్ ఎట్లుండెనో తమ్మి...?!"

"ఫీలింగ్సా తొక్కా?... కొడంగల్‌ల, కామారెడ్డిల గులాబి ఉప్పెన దెబ్బకి రేటెంత రెడ్డి ఎక్కడిదాక కొట్టుకపోతడంటె అన్నా... మల్ల మనకు కనిపించనంత దూరం కొట్టుకపోతడు!"     

Wednesday 8 November 2023

చలో దేఖ్‌లేంగే!

"హలో... జై తెలంగాణ అన్న"

"జై తెలంగాణ అన్న... బాగున్నావే?"

"ఏంది గంత మెల్లగ అడుగుతవ్... ఉత్తుత్త బాగుండుడు కాదు, మస్త్ ఊపుల ఉన్ననే" 

"నువ్వు గింతపొద్దుగాల లేవంగనే నాకు ఫోన్ కొట్టినవంటెనే నాకర్థమైందన్న!"

"గులాబీల జెండలే రామక్క పాట ఎట్ల ఊపుడు ఊపుతున్నది చూస్తున్నవా అన్న?"

"గిగ్గిరగిర గిగ్గిరగిర ఔర్ ఏక్ ధక్కా - కేసీఆర్ పక్కా... గీ పాట కూడ దుమ్ములేపుతుందన్న"   

"రామక్క పాటకైతే ప్రపంచమంత రీల్స్ చేసి పెడుతున్నరు"

"గిగ్గిరగిర ఔరేక్ ధక్కా పాటకైతే మన రామన్న లేచి ఏం స్టెప్పులు ఏశిండన్న?!" 

"రామన్న క్లాసే కాదు... అవసరమైతే పక్కా మాస్ గుడ అయితడు" 

"ఉత్తుత్త మాస్ కాదు... ఊర మాస్!"  

"ఇగ మన పెద్ద సారైతే హెలికాప్టరెక్కి గిర్ర గిర్ర తిరుగుతున్నడు... రోజు సభలే!" 

"సూత్తె గంత బక్కగున్నడు గని, గా ఎనర్జీ సూడు... నీకు లేదు, నాకు లేదు!" 

"గా సభలల్ల సూడు... ఏం జనం ఏం జనం!"

"సీన్మ యాక్టర్లను సూడటానిగ్గుడ రారు గంత గనం జనం... మన పెద్ద సార్ కోసం వస్తరు!"

"కిందా మీదా, ఆ పక్కా ఈ పక్కా... ఎటు దిక్కు ఎంత దూరం చూసినా గులాబి రంగే గులాబి రంగు!" 

"అవున్నన్న... ఎటు సూడు గులాబి గులాబి గులాబి" 


"నాకు తెల్వక అడుగుత... గివ్వన్ని సూశినంక గుడ ఏమన్న డౌటుంటాదే?" 

"అడుగు బొడుగు ఇంకెవులకన్న ఏమన్న డౌటుంటె... చలో దేఖ్‌లేంగే!" 

"అన్నా... మరి గా గజ్వేల్ల రాజెందర్, కామారెడ్డిల గా రేవంత్ రెడ్డి... గాల్ల సంగతేంది? ఏమైతదంటవ్??"

"ఏమైతది... పోశమ్మ గుడి ముంగట కట్టేశిన పొట్టేళ్ల గతే గాల్ల గతి గుడ!"

"బస్... ఔర్ ఏక్ ధక్కా"

"కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా!"  

Tuesday 7 November 2023

ఒక సంవత్సరంలో 3 సినిమాలు తీయలేమా?

దర్శకరత్న దాసరి గారు 1980 లో అనుకుంటాను, ఒక్క సంవత్సరంలోనే 15 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో 70 శాతం హిట్స్, సూపర్ హిట్స్, సిల్వర్ జుబ్లీస్.

ఉదా: సర్దార్ పాపారాయుడు, బుచ్చిబాబు, స్వప్న, ఏడంతస్తుల మేడ, సీతారాములు, సర్కస్ రాముడు. ఎట్సెట్రా.

ఈ 15 సినిమాల్లో తమిళం, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.  

అప్పుడు సినిమాను ఫిలిం నెగెటివ్‌లో తీసేవారు. పని చాలా ఎక్కువ. పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది. అయినా, దాసరి గారు ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు చేసి, రిలీజ్ చేశారు. 

అంటే యావరేజ్‌న నెలకి ఒక సినిమా కంటే ఎక్కువ!

కట్ చేస్తే - 

ఇప్పుడు మొత్తం డిజిటల్ ఫిలిం మేకింగ్. షూటింగ్ నుంచి ఫైనల్ కాపీ వరకు మొత్తం ఒక ఐ-ఫోన్లో పూర్తిచేస్తున్న రోజులివి. 

గ్రాఫిక్స్ లాంటివి బాగా ఉన్న సినిమాల్ని పక్కనపెడితే, కనీసం కాన్సెప్ట్ బేస్డ్ జోనర్స్‌లోనైనా సంవత్సరానికి కనీసం ఒక 3 సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది బిగ్ కొశ్చన్!  

Saturday 4 November 2023

ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ జీవనశైలి

ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్‌కు ఉండే సమయంలో 80 శాతం సమయం క్రియేటివిటీతో, సినిమాలతో, సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేనివారితో జస్ట్ అలా వృధా అయిపోతుంటుంది.  

అలా వృధా చేసుకోడానికి ముందుకెళ్ళకపోతే, మనక్కావల్సిన వ్యక్తులు కనెక్ట్ కారు, పనులు కావు. 

మొత్తం మీద క్రియేటివిటీ కోసం మనకు మిగిలే సమయం 20 శాతమే. 

ఇలాంటి కండిషన్స్‌ను దాటి, తన ఇష్టప్రకారం సినిమా చేయగలిగిన పరిస్థితులను క్రియేట్ చేసుకోగలిగినప్పుడే ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినా హిట్ కొట్టగలుగుతాడు. 

అది ఇక్కడ నేను బ్లాగ్ రాసినంత ఈజీ కాదు. 

పైన చెప్పిన 80ని 20 చేసుకోగలగాలి. 20ని 80కి పెంచుకోగలగాలి. 

కట్ చేస్తే -  

ఇదంతా తెలియని మిత్రుల సలహాలు బయటినుంచి మనకు రోజుకి కనీసం ఒక డజన్ అందుతుంటాయి. 

సినిమా ఎలా తీయాలని. టీమ్‌లో ఎలాంటివాళ్లను పెట్టుకోవాలని. హిట్ ఎలా చెయ్యాలని. స్క్రిప్ట్ నేను వాళ్లకి పంపిస్తే కరెక్షన్స్ చేస్తామని. పంచ్‌లు యాడ్ చేస్తామని. అవసరమైతే ఒక బ్లాక్ బస్టర్ కథ మేమే ఇస్తామని. ఎట్సెట్రా ఎట్సెట్రా.   

ఇది మనం సినిమాల్లో ఉన్నంత కాలం మనతో పాటు, పైన చెప్పిన మన 80/20 తో పాటు సమాంతరంగా నడిచే మరొక స్పెషల్ ట్రాక్. 

దీన్ని ఎవాయిడ్ చెయ్యటం అంత ఈజీ కాదు. 

ఏమంటావ్, ప్రదీప్?     

Thursday 2 November 2023

కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు!


"దున్నపోతుకు సున్నమేస్తే ఆవు అయితదా" అని మన తెలంగాణలో ఒక సామెతుంది.

కాంగ్రెస్ కూడా అంతే. 

సమైక్య రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉంది. అసలు దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇందిరా గాంధి స్వయంగా మెదక్ నుంచి పోటీ చేశారు. 

అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు "ఒక్క ఛాన్స్" ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఒకప్పటిలా అమాయకులు కారు. 

ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడటానికి ఇదేం సినిమా కాదు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. తెలంగాణ ప్రజల జీవితం.    

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్తున్న ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్క గ్యారంటీ అమలు చేయడానికి అవసరమైన కనీస అవగాహన, గణాంకాలు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికైనా తెలుసా అన్నది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. 

కనీసం ఒక్క గ్యారంటీ గురించి అయినా కేసీఆర్, కేటీఆర్‌లా తడుముకోకుండా సంపూర్ణ అవగాహనతో చకచకా అవసరమైన గణాంకాలను ఆశువుగా అందిస్తూ చెప్పగల ఆత్మవిశ్వాసం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఏ ఒక్కరికైనా ఉందా అన్నది కూడా ఒక జవాబు దొరకని ప్రశ్నే.  

అసలా ఆరు గ్యారంటీల ఆలోచన కాంగ్రెస్‌కు రావడానికి కారణం కేసీఆర్ కాదా? 

ఆయన ఆలోచనల్లోంచి పుట్టి, రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు కాదా? 

ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆరే గెలుస్తే ఇంక మాకు పుట్టగతులుండవు అన్న భయం కాదా? 

ఎప్పుడైనా దున్నపోతు దున్నపోతే, ఆవు ఆవే అన్న నిజం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.    

పోనీ, గతాన్ని పక్కన పెడదాం... 

ప్రస్తుతం దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గ్యారంటీలను ఇప్పటివరకు ఎక్కడయినా వీళ్ళు ఎందుకు అమలు చేయడం లేదు? 

జవాబుందా? 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత జిల్లాలోనే నీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆయన వచ్చి ఇక్కడ ఏ అర్హతతో ప్రచారం చేస్తారు?  

"రైతులకు 24 గంటలు కరెంటు ఎందుకు, 3 గంటలు సరిపోదా" అని రైతు విలువ తెలియని అహంకారంతో మాట్లాడిన మనిషే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి "మేం కూడా రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తాం" అంటున్నాడు. 

"బస్ రెడీగా ఉంది, మా పార్టీ పాలిస్తున్న కర్ణాటకలో చూపిస్తా పద" అని రేవంత్ రెడ్డి అన్న కొన్ని గంటల్లోనే కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీయం డి కె శివకుమార్ "మేం రైతులకు కరెంట్ 5 గంటలే ఇస్తున్నాం" అని ఆ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే నిజం చెప్పి, వాళ్ల పార్టీ ఇజ్జత్ తీసిన విషయం నిజం కాదా?     

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని అక్కడి రైతులే స్వయంగా తెలంగాణ సరిహద్దుల్లోని నారాయణ ఖేడ్, వికారాబాద్‌ లాంటి ప్రాంతాల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తూ ర్యాలీలు తీయడం అనేది బహుశా ఇటీవలి రాజకీయాల్లో ఒక ప్రత్యేక సంఘటన. ఒక చారిత్రక విశేషం. కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారా అక్కడి రైతులు ఎంత నష్టపోయుంటారు? 

వారికి ఎంత కడుపు మండివుంటే పక్కరాష్ట్రంలోకి వెళ్ళి మరీ అక్కడి ప్రజలు తొందరపాటులో తప్పుచేయకుండా ఉండటం కోసం ఇలాంటి ర్యాలీలు తీయాలనుకుంటారు?      


కేసీఆర్ నేతృత్వంలో భారాసా ఎప్పుడో మొత్తం అభ్యర్థులను ప్రకటించింది. సుడిగాలి పర్యటనలతో కేసీఆర్ దాదాపు ప్రతిరోజూ వివిధ నియోజకవర్గాల బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో భారాసా అభ్యర్థులు ఇప్పటికే రెండు రౌండ్ల ప్రచారం పూర్తిచేశారు. 

మరోవైపు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థుల రెండో లిస్టు వరకు మాత్రమే ప్రకటించింది. అసంతృప్తుల కోపానికి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌తో పాటు, అభ్యర్థులను ప్రకటించిన అన్ని చోట్లా పార్టీ కార్యాలయాల్లో తిరుగుబాట్లు, విధ్వంసాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. 

అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొంటూ రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌ను షాపింగ్ మాల్ చేశాడని ఆయన ఫ్లెక్సీలను చించేశారు. కార్యాలయాలను ధ్వంసం చేశారు. వాటికి తాళాల్ని కూడా వేశారు. 

నిజంగా అర్హులైనవారికి పార్టీ టికెట్లు ఇవ్వలేదని, ఇదంతా ఢిల్లీలో ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్ ఆశీస్సులు లేకుండా రేవంత్ రెడ్డి ఒక్కడే చేయలేడని నిర్ధారించుకున్న కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీలో తమ ఉనికి గురించి పునరాలోచించుకుంటున్నారు. 

ధనబలం ఉన్నవారికే కాంగ్రెస్ టికెట్స్ ఇస్తుండటంతో ప్రజాబలం ఉన్న నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇలాంటి నాయకులందరికీ బీఆరెస్ ఒక భరోసానిచ్చే పార్టీగా కళ్ళముందు కనిపిస్తోంది. 

నాగం జనార్ధన్ రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. 

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలంతా రెండుమూడు గ్రూపులుగా విడిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. 

పైన ఆదిలాబాద్ నుంచి కింద ఖమ్మం దాకా, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆసంతృప్త జ్వాలలు ఇంకా ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. 

ఫలితంగా ఏం జరగబోతోందో ఇట్టే ఊహించవచ్చు. 

ఇలాంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనుకోవడం ఒక పిచ్చి భ్రమ.    

1969 లో తెలంగాణ మహోద్యమాన్ని అత్యంత పాశవికంగా అణచివేసి, ఎందరో విద్యార్థులు, యువకుల చావుకు కారణమైంది కాంగ్రెస్సే.  2009 లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ముందు ప్రకటించి, తర్వాత ఆంధ్ర లాబీల ఒత్తిడికి తలొగ్గి మళ్ళీ వెనక్కిపోయింది కాంగ్రెస్సే. దరిమిలా మరొక్కసారి వందలాది విద్యార్థుల ఆత్మాహుతి బలిదానాలకు కారణమైంది కూడా కాంగ్రెస్సే. 

"కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చింది" అంటూ ఇప్పుడు మైకుల్లో మొత్తుకుంటున్న కాంగ్రెస్ వాళ్లందరికీ నిజమేంటో బాగా తెలుసు. 

కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వలేదు, కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ఉద్యమ తీవ్రతకు తలొగ్గి మరొక దారిలేక ఇవాల్సి వచ్చింది.   

కట్ చేస్తే -      

గెలవలేక, గెలిచే అభ్యర్థులు లేక చివరికి బీఆరెస్ అభ్యర్థులపై భౌతిక దాడులకు కూడా పాల్పడే స్థాయికి దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోడానికి డిసెంబర్ 3 వరకు ఆగాల్సిన అవసరం లేదు.     

ఏదో ఓ రెండు మూడు సీట్లు ఎక్కువగా గెలవడం వేరు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో భారీగా సీట్లు గెలవడం వేరు. ఈ రెండిటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఈ ఫరక్‌ని గుర్తించే స్థాయిలో కాంగ్రెస్‌వాళ్లు లేరు. 

వాళ్ల ఆలోచనంతా ఒక్కటే... 

ఎలాగైనా సరే కేసీఆర్‌ను దించాలి. సీయం అయి గద్దెనెక్కాలి. 

ఎలక్షన్స్ వస్తే చాలు, డజన్ మంది సీయం క్యాండిడేట్స్ ఎప్పుడూ కొట్టుకొంటూ తిట్టుకొంటూ సొంత కుంపట్లతో సిద్ధంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో, వాళ్లకి వాళ్ళు వాపుని చూసి బలుపు అనుకుంటే ఎవరికీ నష్టం లేదు. 

తెలంగాణ ప్రజలు అలా అనుకోరు. ఏది వాపో ఏది బలుపో వారికి బాగా తెలుసు. 

ఒక తిరుగులేని ఉద్యమనాయకునిగా కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అంత సీన్ ఇప్పుడప్పుడే లేదు. 

దేశంలో అంతకుముందున్న అన్ని రికార్డులను చెరిపేస్తూ, ఇంతకుముందు ఎవ్వరూ కనీసం ఆలోచించని అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆరెస్ ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. 

ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.    

కాంగ్రెస్, ఆ పార్టీ గ్యారంటీల గురించి కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే "నా అంత సిపాయి లేడని తుపాకి రాముడు చెప్పే కథలు" అవన్నీ. 

కాంగ్రెస్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక ఒడిశిన కథ. 

Wednesday 1 November 2023

మీ ఓటెవరికి? అధికార లాలసకా... అభివృద్ధి-సంక్షేమ పిపాసికా?


"ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డ మీదనే!" 

"హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా, నాలుగేళ్ళలో నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టితీరుతా. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు పారిస్తా."

"సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో నేనే ఎన్నోసార్లు వాదించాను. గోదావరి నీళ్ళు వేస్ట్‌గా ఊరికెనే పోతున్నై, మాకు ఇస్తే ఏం పాయె అని. వాళ్ళు ఇయ్యలే. మేం ఇయ్యాల తెచ్చి చూపిచ్చినం!"  

"మనిషి ఎప్పుడూ పుట్టిన తర్వాతనే నేర్చుకుంటడు తప్ప, పుట్టక ముందే అన్నీ నేర్చుకొని మనం ఎవ్వరం భూమ్మీదకు రాం. టైం మనకోసం ఆగదు. ఆ ఉండిన టైంను ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నాం, దాన్ని ఎంత బాగా ఆస్వాదించినం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా... ఇవన్నీ ఆలోచించుకోవాలి. సమస్య నుంచి పారిపోవద్దు. వి షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం!"

ఇవన్నీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు.

ఆయన చెప్పే మాటలు, చేసే పనులు ఏవైనా ఆ స్థాయిలో ఉంటాయి.

ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రమే కాదు, ఇవ్వని హామీలను కూడా అప్పటివరకూ కనీవినీ ఎరుగని అద్భుత పథకాల రూపంలో ప్రజలకు అందిస్తారు కేసీఆర్.  

కట్ చేస్తే -

రాహుల్ గాంధీ: "కేసీఆర్‌ది కుటుంబ పాలన. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నాడు." 
(మోతీలాల్, జవహర్లాల్, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్, ప్రియాంక... ఇంక ఈయనే చెప్పాలి కుటుంబపాలన గురించి! 80 వేల కోట్ల ప్రాజెక్టు నుంచి లక్ష కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమో రాహుల్‌కే తెలియాలి. లెక్కల్లో మరీ ఇంత పూర్ అనుకోలేదు!) 

రేవంత రెడ్డి: సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కు తినెటోళ్ళు!" 
(భారీ పారితోషికం తీసుకొని ఆ పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోతే ఈయన పరిస్థితి ఖచ్చితంగా అదే అయ్యుండేది!)

కిషన్ రెడ్డి: "ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్." 
(కేసీఆర్ హామీల లిస్టు, గత పదేళ్లలో రాష్ట్రంలో అమలైన అభివృద్ధి పనులు-సంక్షేమ పథకాల లిస్టు ముందేసుకుని, "కుర్‌కురే" తినుకుంటూ ఒక్క లుక్కేయండి. అలాగే కేంద్రంలో ప్రధాని మోదీ లిస్టులు కూడా చూడండి. మోసం ఎవరిదో మీకే తెలుస్తుంది.)     

ఈటెల రాజేందర్: "బీఆరెస్ కండువాలు కప్పుకుంటేనే పథకాలు ఇస్తామంటూ దుర్మార్గం చేస్తున్నారు. అర్హులకు వచ్చే పథకాలను ఆపేందుకు మీరెవర్రా?" 
(కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి, ఆయన పనితీరు గురించి మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటి మీ భాష చూడండి. అదే మీ స్థాయిని చెప్తోంది.)     

ఇవన్నీ మన సోకాల్డ్ "రేపు తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే" అని పోటీపడి చెప్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు.

వీరి మాటలకు, కేసీఆర్ మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది.

కేసీఆర్ మాటల్లో తెలంగాణ ప్రజల అభివృద్ధి-సంక్షేమం గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దటం గురించిన తపన ఉంటుంది. ఆ అంశాల గురించే స్పష్టంగా మాట్లాడుతారు. ఆ మాటల్లో చెప్పింది చేసి చూపిస్తారు.  

మరోవైపు, ప్రతిపక్ష నాయకుల మాటల్లో ఎంతసేపూ "కేసీఅర్‌ను దించుతాం... కేసీఆర్‌ది అవినీతి పాలన... కేసీఆర్‌ది కుటుంబ పాలన" వంటి అతి రొటీన్ డైలాగులే ఉంటాయి తప్ప - "తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కంటే గొప్పగా మేం ఇదిగో ఇది సాధించి చూపిస్తాం" అని చెప్పలేరు. అంత అవగాహన వారికి లేదు. అసలావైపు వారి ఆలోచనే లేదు.

"కేసీఆర్‌ను దించి ఆ పీఠం మేం ఎక్కాలి" అన్న అధికార లాలసతో కూడిన సింగిల్ పాయింట్ ఎజెండానే తప్ప మరొకటి వారికి తెలీదు. 

మీ ఓటెవరికి? అధికార లాలసకా... అభివృద్ధి-సంక్షేమ పిపాసికా?