Thursday 16 November 2023

కేసీఆర్ ఎప్పుడూ ఒక్కడే!



ఆమధ్య ఉన్నట్టుండి వై యస్ షర్మిళ, "నేను తెలంగాణలోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, తెలంగాణ కోడల్ని కూడా" అంటూ సొంత (ఎ)జెండాతో ఒక పార్టీ పెట్టారు. అమాయకులు, అల్ప సంతోషులు కొందరు ఆమె వెంట చేరారు. మొత్తం 119 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుందని కూడా ఈమధ్యనే అన్నారామె. అప్పు సప్పు చేసి, ఆస్తులమ్మి ఈ అల్ప సంతోషులంతా బాగా డబ్బు ఖర్చుపెట్టుకున్నారు. 

మళ్ళీ ఉన్నట్టుండి షర్మిళ, వాళ్ళ అన్న జైలుపాలు కావడానికి కారణమైన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె మీద ఆశలు పెట్టుకున్న అమాయకులంతా దుమ్మెత్తిపోశారు. ఒకరిద్దరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. 

ఎవరేమైపోతేనేం... ఇప్పుడు షర్మిళ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆమె కూడా ప్రచారం చేస్తారట.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను పిలిచి, ఈమధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, "మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తున్నాం" అని చెప్పాట్ట. 

అప్పటిదాకా ఓ వంద కోట్ల దాకా ఖర్చుపెట్టుకున్న జ్ఞానేశ్వర్‌కు ఒక్క దెబ్బతో జ్ఞానోదయం అయింది. రాత్రికి రాత్రే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, చివరికి తాను చేరాల్సిన గమ్యం చేరుకున్నారు. 

తెలంగాణలో ఇంకా అడుగు బొడుగు మిగిలిన టీడీపీ శ్రేణులు మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నది వెన్నుపోటు బాబుకు గుర్తుండని ఒక చెదలు పట్టిన చరిత్ర. 

ఇప్పుడు టీడీపి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుంది అన్నది మాత్రం ఒక ఓపెన్ సీక్రెట్.       

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్న బాధతో పదకొండు రోజులు అన్నం మానేసిన పవన్ కళ్యాణ్‌కు, ఊసరవెల్లికి పోటీ పెడితే ఖచ్చితంగా పవర్‌స్టారే గెలుస్తాడు. అప్పుడప్పుడు అవసరం కోసం తెలంగాణకు అనుకూలంగా సినిమాటిక్ డైలాగులు చెప్తాడు కాని, ఈయన అంతరంగం పూర్తిగా చంద్రబాబుకు అనుకూలం. అటు బీజేపీ అంటాడు, ఇటు బాబు అంటాడు. 

అసలు ఈయన పార్టీ పెట్టింది ఎందుకో అర్థం కాక ఈయన పార్టీకి చెందిన జన సైనిక్స్ అందరూ తికమక పడీ పడీ, అసలు ఆలోచించడం మానేశారు. 

అక్కడ బాబుతో ప్రేమ. ఇక్కడ బీజేపీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్. వెరసి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోయి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. 

బీజేపీకి ఇక్కడ తెలంగాణలో రెండు మూడు సీట్లు వస్తే ఎక్కువే అన్న నిజం తెలిసి కూడా, ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ సహా, కేంద్ర మంత్రులు, ఇతర అతిరథ మహారథులంతా ఇటే దృష్టి పెట్టారు. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల్ని రకరకాల కుట్రలతో, కొనుగోళ్లతో కూలగొట్టి అధికారం సంపాదించుకొనే వారి కల్చర్ ఇక్కడ కూడా కొనసాగించడానికి ఏ క్షణమైనా ఏదో ఒక అవకాశం దొరుకుతుందన్న అత్యాశ వారిది.  

"పక్కనే ఉన్న తార్నాకలో బీర్లు తాగి, బిర్యాని తినేవాళ్ళు" అని, "అడ్దామీద కూలోళ్ళు" అని ఈమధ్యే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అనడం ద్వారా తన స్థాయి ఏంటో మరొక్కసారి తానే రుజువు చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పైన కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. 

ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పైకి రివాల్వర్‌తో కాల్చడానికి వెళ్ళిన ఘనచరిత్ర ఇతనికుంది. తెలంగాణ వచ్చాక, బాబుతో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం చేసిన కుట్రలో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్ళిన నేరస్థుడు కూడా. 

రైతు బంధు వేస్ట్ అంటాడు. రైతుకు 3 గంటలు కరెంటు చాలు అంటాడు. నిరుద్యోగ యువకులతో కూరగాయలు అమ్మిస్తానంటాడు. అట్టర్ ఫ్లాప్ అయిన అమరావతిని ఉదాహరణగా చూపిస్తూ, అదే విధంగా రాచకొండ పరిసరాల్లో వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని కొత్త నగరం ఏదో నిర్మిస్తానంటాడు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతి, ప్రజలు, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం గురించి కేసీఆర్‌తో పోలిస్తే అ ఆలు కూడా రాని రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన పోటీ చేస్తున్నాడు. రేపు నేనే ముఖ్యమంత్రిని అని కలలు కంటున్నాడు. 

అయిదు గ్యారంటీలతో పక్కన కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు అక్కడ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్న కొట్లాటతోనే సరిపోతోంది. కనీసం ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చే పరిస్థితి, సమర్థత అక్కడ లేదు. రోజుకు 5 గంటల కరెంటు ఇవ్వడానికే చచ్చిపోతున్నాం అంటూ అక్కడి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. 

మరి అలాంటప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలను ఎలా నెరవేర్చగలుగుతారు? 

ఇలాంటి అవగాహనారాహిత్యం, అసమర్థత నేపథ్యంతో తగుదునమ్మా అంటూ కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, ఇంకొందరు ధనిక వర్గ నాయకులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చెయ్యడానికి కట్టకట్టుకొని వచ్చారని సమాచారం. వీళ్ళంతా ఎలక్షన్ ప్రచారం పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న జుగుప్సాకరమైన రచ్చకు తోడుంటారు. ఇంకేం ప్లాన్లు వేస్తున్నారో తెలియదు. 

భారాస నాయకుల మీద ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య భౌతిక దాడులు జరుగుతుండటం వెనుక ఉన్న కుట్రదారులెవరన్నది కూడా ఈ నేపథ్యంలో అధ్యయనం చేయాల్సి ఉంది. 


కష్ట సమయంలో భారతదేశపు ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చిన పీవీ నరంసింహారావు లాంటి మేధావి రాజకీయ నాయకున్ని అహంకారపూరిత కుట్రలతో పక్కనపెట్టిన ఢిల్లీవాళ్ళకు ఇప్పుడు దేశంలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలన్న ఉద్దేశ్యంతో దేనికైనా సరే అన్నట్టుగా ఉన్నారు ఆ పార్టీ బై డిఫాల్ట్ అధినేత్రి సోనియా గాంధీ. 

తెలంగాణకు సంబంధించి ఏదైనా పేపర్ మీద రాసిస్తే తప్ప ఒక్క వాక్యం కూడా మాట్లాడలేని రాహుల్, ప్రియాంక ఎలక్షన్లు అయ్యేదాకా ఇక్కడే తెలంగాణలోనే ఉంటామంటున్నారు.     
       
మరోవైపు, కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఉన్నారనుకున్న చోట బీజేపీ, బీజేపీకి బలమైన అభ్యర్థి ఉన్నారనుకున్న చోట కాంగ్రెస్ తమవైపు నుంచి బలహీనమైన అభ్యర్థులను ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా నిలబెట్టారని కూడా పేపర్లు రాస్తున్నాయి, చానెల్స్‌లో చెప్తున్నారు. స్వయంగా ఆయా పార్టీల వాళ్లే చెప్తున్నారు. 

కట్ చేస్తే -

అష్ట దిక్కుల నుంచి ఇలా ఎన్ని వ్యతిరేక శక్తులు ఏకమై వచ్చి, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఇక్కడ ఏం ఫరక్ పడదు. కేసీఆర్ రాజనీతి ముందు, ఇలాంటి సమయాల్లో ఆయన కదిపే పావుల ముందు, పెట్టే చెక్‌ల ముందు వీళ్లంతా ఉట్టి పిపీలికామాత్రులు.

"తెలంగాణ రాష్ట్రం కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను" అని చెప్పిన కేసీఆర్, ఉద్యమ సమయంలో తప్ప ఎన్నడూ ఇలాంటి పనికిమాలిన పొత్తుల కోసం అసలు ఆలోచించలేదు. 

తెలంగాణ సమాజం అంతా తనవైపు ఉందన్న విషయం ఆయనకు తెలుసు. తెలంగాణ సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ఇప్పుడు కాపాడుకోవడం ఎంత చారిత్రక అవసరమో తెలంగాణ ప్రజలకు తెలుసు. 

ఇంతమంది ఒక వైపు. కేసీఆర్ ఒక్కడు ఒక వైపు. 

ఎవరు గెలుస్తారన్నది ఇంతకు ముందే చరిత్రలో రికార్డ్ అయి ఉంది.

జస్ట్ అవుర్ ఏక్ ధక్కా. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా.    

No comments:

Post a Comment