Sunday 29 October 2023

ఛాయిస్ మనదే!


"సినిమాల్లో టైమ్‌పాస్ కోసం తెలంగాణ వస్తదా రాదా అని కామెడీ సీన్లు పెట్టే రోజుల నుంచి, కోటి ఎకరాల పంటతో దేశానికి తిండిగింజలు అందిస్తున్న రాష్ట్రంగా ఎదిగేలా చేసుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఏది వాపో, ఏది బలుపో? ఎవరు కావాలో, ఎవరు వద్దో?" 
- మంత్రి కేటీఆర్

"వచ్చే గవర్నమెంటు మాదే" అని అటు బీజేపి నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే ప్రగల్భాలు పలుకుతున్నారు. వచ్చిన తర్వాత మేం ఇది చేస్తాం, మేం అది చేస్తాం అని బీజేపి లిస్టు చదువుతోంది. కాంగ్రెస్ గ్యారంటీలిస్తోంది.

ఇప్పుడు ఏవేవో గ్యారంటీలిస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ అర్థ శతాబ్దం పాటు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది?

అధికారంలోకొచ్చాక ఏమేమో చేస్తాం అని చెప్తున్న ఇదే బీజేపి, తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదు?

తెలంగాణ ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. వాపుకీ బలుపుకి ఉన్న తేడా వారికి చాలా బాగా తెలుసు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎందుకు ఎన్నుకోవాలో కూడా వారికి చాలా స్పష్టంగా తెలుసు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముచ్చటగా మూడో సారి ఎన్నికలు జరుగబోతున్నాయి. తిరుగులేని వేగంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళుతున్న వేళ సాధారణంగా 10 ఏండ్ల తరువాత వస్తుంది అని చెప్పబడే సోకాల్డ్ "ప్రభుత్వ వ్యతిరేక ఓటు" టెండెన్సీ నుంచి లబ్దిపొందే కుట్రలకు ప్రతిపక్ష పార్టీలు తెరలేపాయి.

బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎన్నెన్నో హామీలు, పథకాలు గుప్పిస్తున్నాయి.

కాని, పాపం పోటీ చేయడానికే ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు లేరు, సరిపోయినంతమంది అభ్యర్థులు లేరు.

టికెట్ల అమ్మకానికి మాత్రం దుకాణాలు తెరచిపెట్టారు. 

కట్ చేస్తే - 

ఒక ఓటరుగా, రాష్ట్రాభివృద్ధిని కోరుకునే పౌరులుగా మనం కలలో కూడా మర్చిపోకూడని అంశాలు కొన్ని ఉన్నాయి...

 తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, పనులు ఉండవు, హైద్రాబాద్‌లో ఉన్న కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, నక్సలైట్లు చెలరేగుతారు, మీకసలు పాలన చేతకాదు వంటి అనేక అపహస్యాల పునాదులపై కేసీఆర్ కట్టిన పాలరాతి సౌధం మన తెలంగాణ. 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది కొత్తగా అరచేతిలో స్వర్గం చూపించే బఫూన్ క్యారెక్టర్ల హామీలో, ఊకదంపుడు ఉపన్యాసాలో కాదు. ప్రజలకు ఏం కావాలో, ఏవి ఇవ్వాలో, ఎలా చేయాలో తెలిసిన నాయకత్వం. ఒక కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో అహరహం కృషిచేస్తున్న నిలువెత్తు మానవత్వం. 

ఎకౌంట్ల లోకి డబ్బులు పంచుతామంటేనో, ఇంటింటికి వస్తువులిస్తామంటేనో గుడ్డిగా ఓట్లేసే స్థాయిని తెలంగాణ సమాజం ఎప్పుడో దాటేసింది. అభివృద్ధి అంటే ఎలావుంటుందో ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. సంక్షేమ పథకం అంటే ఏమిటో దాదాపు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంది. 

అభివృద్ధిని, సంక్షేమాన్ని సంపాళ్ళలో అందిస్తూ, తెలంగాణను దేశం గర్వించే స్థాయికి తీసుకుపోతున్న కేసీఆర్‌ను అంత ఈజీగా ఎవ్వరూ కాదనుకోలేరు, వదులుకోలేరు. 

కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ప్రపంచం నలుమూలల నుంచి వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు రప్పిస్తున్న 'తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్' కేటీఆర్‌ను ఎలా విస్మరిస్తారు? 

తమని తాము పునర్నిర్మించుకుని, కేసీఆరే ఆదర్శంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను ఎలా పక్కనపెట్టగలుగుతారు?  

60 ఏళ్ళుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్ళు, వత్తాసు పలికినవాళ్ళు ఒకవైపున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె మరొకవైపు ఉంది. 

ఛాయిస్ మనదే. 

"కట్టడం అంటే కాళేశ్వరంలా ఉండాలి, పథకం అంటే రైతుబంధులా ఉండాలి" అని ఫిక్స్ అయిపోయే స్థాయికి తెలంగాణ ప్రజల ఆలోచనను పెంచిన కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకొవడంలో ఎలాంటి తప్పులేదు. 

వచ్చే డిసెంబర్ మూడో తేదీ అదే జరగబోతోంది.  

No comments:

Post a Comment