Tuesday 13 July 2021

ఎంతైనా వైజాగ్ అందమే వేరు!

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. 

ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. 

దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను. 

ఈ పని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటున్నాను. ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద కూడా వైజాగ్‌కే ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. లేటెస్ట్‌గా మొన్న ఏప్రిల్‌లో కూడా వెళ్ళాను.  

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.  

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. పోర్ట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మా టీమ్‌తో నేనున్న నాలుగు రోజులూ .. ఆర్కే బీచ్, అక్కడి కాఫీడే .. రిషికొండ బీచ్, అక్కడి రిసార్ట్స్ .. రియోబీచ్, నొవాటెల్ హోటళ్ళూ .. ఎయిర్‌పోర్టూ, బస్‌స్టాండూ .. లలితా జ్యువెల్లరీస్ దగ్గర్లో ఫుట్‌పాత్ మీద బొకేలమ్మే చిన్న షాపూ .. కొంచెం దూరంలో గాజువాకలోని సినిమా హాళ్ళూ .. గ్రీన్ యాపిల్ హోటల్ .. వైజాగ్ సిటీలోనూ, స్టీల్‌ప్లాంట్ చుట్టుపక్కలా వున్న నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులూ .. ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, మా ఎమ్మే క్లాస్‌మేట్స్‌తో నేను మొట్టమొదటిసారిగా వైజాగ్ వెళ్ళాను. అదికూడా, ఒరిస్సాలోని కోణార్క్, భువనేశ్వర్‌ల నుంచి మా తిరుగు ప్రయాణంలో.  

సుమారు పదేళ్ళ క్రితం... నా మొదటి సినిమా షూటింగ్ కోసం కూడా, నా టీమ్‌తో ఓ నాలుగయిదు రోజులున్నాను వైజాగ్‌లో. కేవలం ఒక మంచి లొకేషన్‌గా తప్ప అప్పుడు కూడా వైజాగ్ అంటే మరీ అంత ప్రత్యేకమైన ఫీలింగేమీ లేదు నాకు. తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లాను గానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు. 

గత మూడు నాలుగేళ్ళుగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా వైజాగ్ నాకు అత్యంత ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అయింది... 

పాండిచ్చేరి, గోవాలు వైజాగ్ తర్వాతే కదా అనిపించసాగింది. వాటి ప్రత్యేకతలు వాటికున్నా, 'వైజాగ్ అందమే వేరు' అని నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయాను. 

గొప్ప గొప్ప రచయితలు, కవులకు, వారి రచనలకూ పుట్టిల్లుగా వైజాగ్ సాహితీ సాంస్కృతిక నేపథ్యం నాకు ముందే తెలుసు. అయితే - వైజాగ్ నన్ను ఇంత బాగా ఆకర్షించడానికి ఇదొక్కటే కారణం ఎంత మాత్రం కాదు. 

కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయంతే. 

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్‌లా అనిపిస్తుంది నాకు.

అసలేంటీ... ఒక ప్రదేశంపైన అంత ఈజీగా నిర్వచించలేని ఈ ప్రేమ .. కాదల్ .. ఇష్క్ .. మొహబ్బత్ .. ల్యుబోఫ్ .. లవ్... ?!  

లవ్ అనగానే కూడా నాకు ముందు గుర్తొచ్చేది వైజాగే. బాలచందర్ అపూర్వ సృష్టి 'మరోచరిత్ర' .. బాలు-స్వప్న-భీమిలి .. కమలహాసన్-సరిత-'పదహారేళ్ళకూ' పాట... 

ఐ థింక్... 

నా లవ్ కూడా అక్కడే ఉంది, వైజాగ్‌లో. 

వైజాగ్‌లో ఉన్న నా లవ్, నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

'కాని సముద్రం ఇంకా చాలా చోట్ల ఉంది కదా' అంటే, ఉండొచ్చు. ఇది వేరే. 

'అదెలా' అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు. 

ఏదో స్పిరిచువల్ కనెక్షన్. అంతే.  

It's not a question of 
being in love with 
some one or something. 
It's a question of being love. 

No comments:

Post a Comment