Wednesday 28 July 2021

నేను ప్రయత్నించని నా ఒక్క ఛాన్స్!

అది 1997 అనుకుంటాను. 

అప్పుడు నేను ఆలిండియా రేడియో (ఎఫ్ ఎమ్), కర్నూలులో పనిచేస్తున్నాను. 

చిన్నప్పటి నుంచీ చదివే అలవాటు ఉన్నా కూడా, ఆలిండియా రేడియోలో పనిచేసినప్పుడే నేను బాగా చదవడానికి ఎడిక్టయ్యాను. తెలుగు సాహిత్యంతో పాటు, ప్రపంచ సాహిత్యానికి కూడా బాగా కనెక్ట్ అయ్యాను. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్. దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు. 

మిలన్ కుందేరా, నీషే, ఐన్ రాండ్, కుష్వంత్ సింగ్, శోభా డే, విక్రమ్ సేఠ్, సాల్మన్ రష్దీ, జెఫ్రీ ఆర్చర్, మారియో పుజో, డేనియల్ స్టీల్, రాబర్ట్ లడ్‌లమ్, ఫ్రెడ్రిక్ ఫోర్సిత్, జాకీ కాలిన్స్, అరుంధతి రాయ్, జేన్ ఆస్టిన్, నాన్సీ ఫ్రైడే... ఇలా రాసుకుంటూ పోతే - ఆలిండియా రేడియోలో ఉండగా -  నేను చదివిన కనీసం ఇంకో 100 మంది రచయితల పేర్లు ఈజీగా రాయగలను.   

తెలుగులో కూడా సినారె పుస్తకాలు, ఆరుద్ర సాహిత్య సంపుటాలు, తిలక్, వీరేంద్రనాథ్, మల్లాది, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సులోచన, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, రావిశాస్త్రి, రారా, కొకు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, చలం... ఇలా ఎందరివో బుక్స్ ప్రతి రెండో నెలలో ఆర్డర్ పెట్టేవారు.  

సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా స్టేషన్ డైరెక్టర్ గారు నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. 

స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను. 

మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మిరెడ్డి గారు, మా స్టెనోగ్రాఫర్ లక్ష్మి, ఎనౌన్సర్ శాస్త్రి కూడా బాగా చదివేవారని నాకిప్పటికీ గుర్తుంది.     

ఇలాంటి సమయంలోనే - అసలు ఈ పుస్తకాల స్థాయికీ, అక్కడ పనిచేస్తున్న నా నేపథ్యానికీ సంబంధం లేకుండా - ఒకరోజు ఆంధ్రభూమి వీక్లీలో "హారర్ స్టోరీస్ పోటీ" ఒకటి ఆ పత్రిక ఎడిటర్ సికరాజు గారు ప్రకటించింది చూశాను.   

ఒక ప్రైజ్ నాకు పక్కా అనుకొంటూ, మాంచి జోష్‌లో ఒక హారర్ కథ రాసి పంపించాను. దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా ఫోటో వేసి, నా గురించి చిన్న ఇంట్రో బాక్స్ వేసి ప్రచురించారు. 2,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా చెక్కు ద్వారా వచ్చింది. 

పత్రికలకు కథలు రాయడం ద్వారా నేను అందుకున్న అతి తక్కువ పారితోషికం 150 రూపాయలు కాగా, అత్యధిక పారితోషికం మాత్రం ఇదే. 

నాకు ప్రైజ్ తెచ్చిపెట్టిన ఆ  కథ పేరు - "ఆమె". 

ప్రస్తుతం "ఆమె" నా దగ్గర ఫైల్స్‌లో అటకమీద కార్టన్ డబ్బాల్లో ఉంది. 

కట్ చేస్తే -   

ఒకరోజు ఉదయం మా స్టేషన్ డైరెక్టర్ ఇంటర్‌కమ్‌లో పిలిచారు - "మనోహర్, నీకోసం ఎవరో చెన్నై నుంచి కాల్..." అంటూ. 

పైకి వెళ్లాను. కాల్ మాట్లాడాను. 

నాతో మాట్లాడింది... అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌లిస్తున్న ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్న సీనియర్ కో-డైరెక్టర్. 

అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఇంకా పాపులర్ కాలేదు. నాకు కూడా అప్పటికి ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోనేం లేదు. సో, ఆ డీటెయిల్స్ వీక్లీలో లేవు కాబట్టి, డైరెక్టుగా ఆంధ్రభూమి ఆఫీస్‌కే ఫోన్ చేసి నా వివరాలు తీసుకొని, ఆలిండియా రేడియోకి ఫోన్ చేసినట్టు తర్వాత ఆ కో-డైరెక్టర్ చెప్పారు. 

ఒక వారం గ్యాప్‌లోనే - ఇంకో కో-డైరెక్టర్ నుంచి పోస్టులో ఇంకో లెటర్ వచ్చింది. ఆయన రైటింగ్ అందంగా, అద్భుతంగా ఉంటుంది. 

కట్ చేస్తే - 

ఒక నాలుగు రోజుల తర్వాత బస్‌లో చెన్నై బయల్దేరాను. 

అదీ ప్రారంభం. 

కథా చర్చలు. ట్రీట్‌మెంట్స్ రాయడం, వెర్షన్స్ రాయడం. చెన్నై వెళ్ళినప్పుడల్లా - ఆలిండియా రేడియోలో నా నెల జీతాన్ని మించిన పారితోషికం తీసుకోవడం...

నాకు బాగా పరిచయమైన, నాకిష్టమైన ఒకరిద్దరు కో-డైరెక్టర్స్‌తో కలిసి చెన్నై వీధులు, మెరీనా బీచ్ తిరగటం, వర్షంలో ఓ రెండు సాయంత్రాలు కారులోనే కూర్చొని సరదాగా మందు సిప్ చేయడం... అలా అలా ప్రారంభంలో ఆలిండియా రేడియోలో నా జాబ్ నేను చేసుకొంటూనే సినిమాకు కనెక్టయ్యాను. 

తర్వాత - నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వచ్చాక కూడా కొన్ని అవకాశాలు నన్ను వెతుక్కొంటూ వచ్చాయి. ఆ సమయంలోనే నాకు కొందరు మంచి మిత్రులు ఇండస్ట్రీలో పరిచయమయ్యారు. వారితో స్నేహం నాకిప్పటికీ ఉంది.  

ఈ నేపథ్యమే తర్వాత ఒక రచయితగా నేను నంది అవార్డు సాధించడానికీ, ఆ తర్వాత ఫైనల్‌గా నేనొక రైటర్-డైరెక్టర్ అవడానికీ దారితీసింది. అయితే ఆ దారిలో వెళ్ళాల్సిన పధ్ధతిలో నేనిప్పటికీ వెళ్లలేకపోయాను. వెళ్లలేను కూడా. అది పూర్తిగా వేరే విషయం.

నా ఉద్యోగం, నాకున్న ఎన్నో ఇతర పరిమితుల కారణంగా అలా మొదట్లో నన్ను వెతుక్కొంటూ వచ్చిన ఛాన్స్‌ను, ఆ తర్వాత వచ్చిన ఇంకొన్ని మంచి అవకాశాలను కూడా అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు అనేది ఇక్కడ నేను కన్‌ఫెస్ కావల్సిన బాటమ్‌లైన్. 

కట్ టు కోవిడ్ లాక్‌డౌన్ అండ్ ఆఫ్టర్ - 

కరోనా లాక్‌డౌన్‌లో వచ్చిన సంపూర్ణ జ్ఞానోదయం తర్వాత - ఒక్క దెబ్బకు అన్ని మత్తులు, ముసుగులు, పరిమితులు ఎగిరిపోయాయి. 

కరోనాకు ముందు సినిమాలు వేరు, కరోనా తర్వాత సినిమాలు వేరు. 

Content is the king. Money is the ultimate goal.

నేనూ, నా మిత్రుడు వీరేంద్ర లలిత్ (DOP, Mumbai), నేను ఇంట్రొడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కోంబోలో - ఓటీటీ కోసం మేం ప్లాన్ చేస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి. 

"Cinema can fill in the empty spaces of your life and your loneliness."
- Pedro Almodovar 

No comments:

Post a Comment