Sunday 1 August 2021

కొటేషన్స్ వేరు, జీవితం వేరు!

కొన్ని అనుభవం మీదే అర్థమవుతాయి...

చాలామంది "ఇదే నా లాస్ట్....", "ఇంక నేను సినిమాలు చేయను..." వంటి నిర్ణయాలను కొన్నిటిని చాలా ఖచ్చితంగా, కాన్‌ఫిడెంట్‌గా చెప్పిన తర్వాత కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండరు. 

ఎందుకిలా చేస్తారు... అసలా నిర్ణయం ఎందుకు... అని చాలాసార్లు అనిపించేది నాకు. 

ఎందుకో ఇప్పుడర్థమయింది నాకు.

అది వ్యక్తిగతం కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు... మనం తీసుకున్న ఒక నిర్ణయం తప్పు అని, ఇంక కుదరదు అని తెలియగానే - ఆ నిర్ణయాన్ని కరెక్ట్ చేసుకొంటూ మరొక నిర్ణయం వెంటనే తీసుకోవాలి.  

'ఈగో'తోనో, ఎవరేమనుకుంటారనో అనో... అనుకుంటే మాత్రం తర్వాత బాధపడక తప్పదు. 

చాలామంది జీవితాల్లో విషాదం ఇదే.

ఎమోషన్‌తో తీసుకొనే నిర్ణయాలు తప్పక మారతాయి. 

ఆలోచించి తీసుకొనే నిర్ణయాలు కూడా చాలా సందర్భాల్లో బ్రేక్ అవుతాయి. ఊహించని స్థాయిలో ఫెయిలవుతాయి.  

రకరకాల నేపథ్యాల్లో... ఎప్పటికప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, మన ఆనందాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చే అనేక కష్టనష్టాలను బట్టి...  మనం తీసుకొన్న అన్ని నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండలేం. ఇది సహజం.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక నిజమైన ఫ్రెండ్ అవసరం తెలుస్తుంది. 

అందుకే - ఎలాంటి హిపోక్రసీ లేకుండా, భయం లేకుండా - మనసు విప్పి మాట్లాడుకోడానికి ప్రతి ఒక్కరికీ జీవితంలో కనీసం ఒక ఫ్రెండ్ అయినా ఉండాలి. ఉండితీరాలి. 

కట్ చేస్తే -

ఎంత అద్భుతమైన స్నేహాలయినా, ఎన్ని దశాబ్దాల స్నేహాలయినా, ఏ స్థాయికి చేరుకున్న స్నేహాలయినా... ఏదో ఒక సమయంలో... రెండే రెండు కారణాల వల్ల బ్రేకప్ అవుతాయి. 

ఒకటి ఈగో, రెండు డబ్బు. 

స్నేహంలో డబ్బు ప్రసక్తి ఎంటరయిందంటే చాలు. అప్పటివరకూ వినని మాటలు వినాల్సి వస్తుంది. అప్పటివరకూ ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఒకే ఒక్క నిమిషంలో నెగెటివ్‌గా మారిపోతాయి. అప్పటివరకూ లేనివిధంగా - ప్రతి కదలికా, ప్రతి మాటా తప్పుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి.

అప్పటివే కాదు... వారి స్నేహం తొలిరోజులనుంచీ మాట్లాడిన ప్రతిమాటా, వేసిన ప్రతి అడుగులోనూ ఇప్పుడు వంద తప్పులు కనిపిస్తాయి.  

డబ్బుకు అంత శక్తి ఉంది. 

ఈగో కూడా అంతే. ఎక్కువగా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుంది. మరీ ఎక్కువగా ఇది ఆడ-మగ స్నేహాల్లో వస్తుంది. 

ఒకసారి ఈగో హర్ట్ అయ్యిందా... ప్రపంచంలో ఏ ఫెవికాల్, ఏ కెమికల్ కూడా విరిగిన ఆ మనసు ముక్కల్ని మళ్ళీ అతికించలేదు. 

స్నేహం బాగున్నప్పుడే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి. కాని, అలా జరగదు.  అలా సాధ్యం కాదు. 

కట్ టు ఫినిషింగ్ టచ్ - 

ఒక  ప్రోగ్రామ్ వేదిక పైనుంచి - వందలాదిమంది ఆహూతుల సమక్షంలో - యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు స్నేహం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు.

'సక్సెస్ సైన్స్' నేపథ్యంలో - ఒక "రాగ్స్ టు రిచెస్ స్టోరీ"గా రామోజీరావు గారు ఒక ఐకాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒకసారి స్నేహం విషయంలో బాలు గారితో ఒక మాట చెప్పారట:

"మీరు ఎవరైతోనైనా స్నేహం చేసేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక, ఆ వ్యక్తిలో మీకు చాలా తప్పులు కనిపించొచ్చు. వీలైతే సరిదిద్దండి. లేదంటే జన్మాంతం భరించండి" అని! 

ఇట్లా నేను ఒకరిని భరిస్తున్నాను. నన్ను ఒక నలుగురు భరిస్తున్నారు... 

హాపీ ఫ్రెండ్‌షిప్ డే!💐 

2 comments:

  1. బాగా రాసారు. ఇది మీ నుండి పాఠకులకు ఒక ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ✍️.

    ReplyDelete