Saturday 1 August 2015

స్టడీకామ్ సురేష్ @ స్విమ్మింగ్‌పూల్

అసలు తెలుగులో స్టడీకామ్ టెక్నిక్‌ను బాగా ఉపయోగించి, దానికి బాగా పాపులారిటీ తెచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. తర్వాత అందరూ అవసరమున్నా, లేకపోయినా .. అయినదానికీ, కానిదానికీ .. ఎడా పెడా .. ఈ టెక్నిక్‌నే ఉపయోగిస్తున్నారనుకోండి. అది వేరే విషయం.

కట్ టూ సురేష్ - 

తెలుగు ఇండస్ట్రీలో - సురేష్‌తో కలిపి, మంచి స్టడీకామ్ ఆపరేటర్‌లు ఒక ఆరుగురికంటే ఎక్కువ ఉండే అవకాశం లేదనుకుంటున్నాన్నేను.

తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ ఇండస్ట్రీల్లోని దాదాపు అందరు ప్రముఖ హీరోలు, డైరెక్టర్లతో కలిసి పనిచేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది. హిందీలో కూడా వాంటెడ్, బద్మాష్ కంపనీ సినిమాలకు పనిచేశాడు సురేష్.

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్ గా పనిచేసిన సురేష్, ఇప్పుడు నా లేటెస్ట్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" కు కూడా పనిచేశాడు. కాకపోతే, ఇప్పుడు స్టడీకామ్ ఆపరేటర్‌గా.

కట్ టూ సురేష్ ఫిలిం ఎంట్రీ - 

సురేష్ పుట్టింది కడపలో.

డిగ్రీ అయిపోయాక, వెబ్ డిజైనింగ్ పేరుతో హైద్రాబాడ్‌లో అడుగుపెట్టాడు సురేష్. ఒకటి రెండు ట్విస్టుల తర్వాత - వెబ్ డిజైనింగ్ కాస్తా పబ్లిసిటీ డిజైనింగ్ వైపు రూటు మార్చింది. పబ్లిసిటీ డిజైనర్ కళాభాస్కర్ "నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు. ఏదయినా టెక్నికల్ సైడ్ వెళితే బాగుంటుంది" అని సలహా ఇచ్చారు.

కట్ చేస్తే -

స్టడీకామ్ శ్రీధర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిలో చేరిపోయాడు సురేష్. ఆ తర్వాత - స్టడీకామ్ పార్తీపన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. పార్తీపన్‌కు మొదటి శిష్యుడు, చివరి శిష్యుడూ కూడా సురేషే కావడం విశేషం.

స్టడీకామ్ షాట్స్ తెరపైన చూడ్డానికి చాలా బాగుంటాయి. అయితే ఆ షాట్స్ అంత బాగా రావడం వెనుక స్టడీకామ్ ఆపరేటర్ కష్టం చాలా ఉంటుంది.

యావరేజ్‌న సుమారు 40 కిలోలకు తక్కువకాని కెమెరా ఇక్విప్‌మెంట్ బరువునంతా తన శరీరం పైన మోస్తూ - డైరెక్టర్ చెప్పిన ఎఫెక్ట్ రావడం కోసం - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ షాట్స్ తీయాల్సి ఉంటుంది.

షాట్‌ను, లొకేషన్‌ను బట్టి - ఏ చిన్న పొరపాటు జరిగినా లైఫ్ రిస్క్ కాచుకొని ఉంటుంది. అలాంటి ఒక రిస్కీ షాట్ తీసిన అనుభవం కూడా సురేష్‌కు ఉంది.

మళయాళంలో మోహన్‌లాల్ సినిమా షికార్ కోసం కొడైకెనాల్ లోని గుణ కేవ్స్ లో ప్రాణాలకు తెగించి షూట్ చేశాడు సురేష్.

మొన్నటి బాహుబలి కోసం కూడా మహారాష్ట్రలోని పంచ్‌గనిలో - బురదలో కూడా కష్టపడి షూట్ చేశాడు సురేష్.

అంతేకాదు. తమిళంలో సిరుత్తై సినిమాలో ఒక మొత్తం ఫైట్ ను సింగిల్ షాట్‌లో స్టడీకామ్‌లో షూట్ చేశాడు సురేష్. అలాగే - టార్గెట్ సినిమా కోసం, శివబాలాజీ, శ్రధ్ధాదాస్‌ల మీద పూర్తి పాటను స్టడీకామ్‌లో షూట్ చేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది.

ఎన్ని చేసినా - తెలుగులో రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి కి పనిచేయడం మాత్రం ఒక మర్చిపోలేని గొప్ప అనుభవంగా చెప్తాడు సురేష్.

ఇదంతా సురేష్‌కు స్టడీకామ్‌ ఆపరేషన్ పట్ల, సినిమాటోగ్రఫీ పట్ల ఉన్న అమితమైన ప్యాషన్‌ను తెలుపుతుంది.

కట్ టూ మా స్నేహం - 

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్‌గా పనిచేసినప్పుడు ఎలా ఉన్నాడో, సురేష్ ఇప్పుడూ అలాగే ఉన్నాడు.

అదే చిరునవ్వు. అదే పలకరింపు. అదే ఫ్రెండ్లీ నేచర్. అదే ప్యాషన్.

ఈ ప్యాషన్‌తోనే - స్టడీకామ్ ఆపరేటర్ స్థాయి నుంచి, ఇన్‌డిపెండెంట్‌గా డి ఓ పి (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) స్థాయికి త్వరలోనే వెళ్లనున్నాడు సురేష్. నా అంచనా ప్రకారం అది ఈ 2015 లోనే జరగొచ్చు!

సురేష్, యూ రాక్ ..  

No comments:

Post a Comment