Monday 18 December 2023

ఇది రాయొద్దనుకున్నాను...


బాల్యంలో నాకెన్నో అద్భుత జ్ఞాపకాలనందించిన నా వరంగల్‌కు నేనెప్పుడు వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. 

నన్ను అమితంగా ప్రేమించిన మా అమ్మా నాన్న ఇప్పుడు లేరు. 

పదో తరగతితోనే చదువు మానేసి, మెషినిస్టుగా ఎక్కడో ఫాక్టరీలో పనిచేసుకుంటూ బతకాల్సిన నేను - మళ్ళీ చదువుకోడానికి, డైరెక్టుగా యూనివర్సిటీలోకే ప్రవేశించి పీజీలు, గోల్డ్ మెడల్స్ సాధించడానికీ కారణమైన ఇన్‌స్పిరేషన్‌ను తన ఒకే ఒక్క మాటతో నాకు అందించిన మా అన్న దయానంద్ ఇప్పుడు లేడు.    

నేను కనిపించగానే నవ్వుతూ పలుకరించే నాకెంతో ప్రియమైన నా చిన్న తమ్ముడు వాసు ఇప్పుడు లేడు లేడు. 

నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు. 

ఎందరికో ఆశ్రయమిచ్చి, ఊళ్ళో ఎందరి పెళ్ళిళ్ళకో వేదికై, మాకెన్నో అద్భుత జ్ఞాపకాలనిచ్చిన అప్పటి మా విశాలమైన 14 దర్వాజాల ఇల్లు ఇప్పుడు లేదు. 

కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చే ఇలాంటి జ్ఞాపకాల్ని తట్టి లేపటం ఇష్టం లేకే నేను వరంగల్ వెళ్లడానికి ఎప్పుడూ తప్పించుకొంటుంటాను.

అయినా సరే, కొన్నిసార్లు తప్పదు. ఇలా పొద్దున బయల్దేరి వెళ్లి, రాత్రికి వచ్చేస్తుంటాను.  

ఒకసారి... ఫ్రీగా ఒక వారం రోజులు... మా వరంగల్లో అడ్డా వెయ్యాలని ఉంది. 

అక్కడే ఉన్న నా ఇద్దరు తమ్ముళ్ళు శ్రీధర్, రమేశ్‌లతో కలిసి నాకిష్టమైన అప్పటి జ్ఞాపకాలన్నిటినీ కళ్ళారా చూస్తూ, మనసారా స్పృశిస్తూ తిరగాలని ఉంది. 

కొత్తగా నన్ను నేను పరిచయం చేసుకుంటూ, అప్పటి నా బంధుమిత్రులందరినీ కలిసి పలకరించాలని ఉంది.  

ఎప్పుడో ఒకసారి ఆపని తప్పక చేస్తాను. కనీసం ఒక సంవత్సరం తర్వాతైనా... ఆపని తప్పక చేస్తాను.

ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు.  

ఇక్కడితో ఈ బ్లాగ్ ముగించాలని ఎంత గట్టిగా అనుకున్నా, అలా ముగించలేకపోతున్నాను...  


నా చిన్న తమ్ముడు వాసు మమ్మల్ని వదిలి వెళ్ళి ఇవ్వాళ్టికి సరిగ్గా 5 సంవత్సరాలు. 

ఎందుకు వాసూ, ఇలా చేశావు?

నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.   

"అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

శ్రీనివాస్ చిమ్మని... నా చిన్న తమ్ముడు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? 

నీ ఫోన్ కాల్ ఏది? 
మొన్న నేను వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 
మనిద్దరం కలిసి తిరగలేదే? 
కలిసి చాయ్ మీద చాయ్ త్రాగలేదే? 
నేను తిరిగివెళ్ళేటప్పుడు, ఎప్పట్లా మనిద్దరం కలిసి బస్టాండ్ వెనకున్న చిన్న హోటల్లో టిఫిన్ చేస్తూ మాట్లాడుకోలేదే? 
కనుమరుగయ్యేదాకా నీ నవ్వు ముఖంతో ఎప్పట్లా నాకు "బాయ్ అన్నా" అంటూ చెయ్యి ఊపలేదే? 
ఎప్పుడూ శ్రీధర్, నేనే కలుస్తున్నాం తప్ప నువ్వు లేవేంటి వాసూ?
నిన్న శ్రీధర్ నాకు కాల్ చేసి "రేపు వస్తున్నావా అన్నా" అడిగినప్పుడు నా దగ్గర సమాధానం ఏది? 
తర్వాత ఫోన్లో 20 నిమిషాలపాటు మేం మాట్లాడుకున్న మాటల్లో అంతా నువ్వే కదా? నీ విషాదమే కదా?

ఎంత మెటీరియలిస్టిక్‌గా ఆలోచించినా... 
నువ్వు లేవు, ఇంక తిరిగిరావు అన్న నిజాన్ని 
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 
ఆ దుఖాన్ని ఆపుకోలేకపోతున్నాను.           

మిస్ యూ వాసూ...       

No comments:

Post a Comment