Wednesday 4 December 2013

అంతా దీపిక లీల!

విమర్శకుల ప్రశంసలతోపాటు, బాక్సాఫీసు కనక వర్షం కుపిస్తున్న భన్సాలి "రామ్-లీల" చిత్రం కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ దీపిక కాదు. కరీనా కపూర్! నమ్మగలరా?

ఇంకో విచిత్రం ఏంటంటే, "గోరి తేరా ప్యార్ మే" అనే ఒక మామూలు రొటీన్ చిత్రం చేయడం కోసం రామ్-లీల చిత్రాన్ని వదులుకుంది కరీనా!

ఇది కరీనా కపూర్ తీసుకొన్న మరో అనాలోచిత నిర్ణయం. ఇంతకు ముందు కూడా - "కహోనా ప్యార్ హై", "కల్ హో న హో", "చెన్నై ఎక్స్‌ప్రెస్" వంటి సినిమాలను వదులుకున్న నేపథ్యం కరీనాకుంది. "అవును, సినిమాల ఎన్నిక విషయంలో నేను పొరపాట్లు చేశాను. నేను పిచ్చ్చిదాన్ని!" అని ఇప్పుడు రియలైజ్ అయింది కరీనా.

"ఖామోషి", "హమ్ దిల్ దే చుకే సనమ్", "బ్లాక్", "దేవదాస్" వంటి చిత్రాను రూపొందించిన భన్సాలీ వంటి అగ్రశ్రేణి దర్శకుని మరో భారీ సినిమా రామ్-లీల. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌నూ దేనికదే ఒక "ఆర్ట్" పీస్‌గా ఉపయోగించుకోవచ్చ్చు.

సబ్జెక్ట్ ఏదయినా కానీ, ప్రతి ఫ్రేమ్ కూడా ఒక విజువల్ ట్రీట్‌లా ఇవ్వటం భన్సాలీ అలవాటు. ఈ ప్యాషన్ భన్సాలీ ప్రతి చిత్రంలోనూ మనం చూడవచ్చు.

శేఖర్ కపూర్ ఈ సినిమా చూసి దీపికను ప్రశంసలతో ముంచెత్తాడు.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను 3 సార్లు చూశాట్ట! భన్సాలీకి, రణ్‌వీర్‌కు, దీపికకు తన అభినందనలు చెప్పాడు. దీపిక నటనకు మతిపోయిందన్నాడు. ఒక్క అమితాబ్ మాత్రమే కాదు, నా ఫేస్‌బుక్/ట్విట్టర్ మిత్రులు చాలామంది "మూడోసారి రామ్-లీలా చూస్తున్నాను!" అని పోస్ట్ చేశారు.

"కాక్‌టెయిల్", "రేస్ 2", "యే జవానీ హై దీవానీ", "చెన్నై ఎక్స్‌ప్రెస్" తర్వాత.. దీపికకు ఇది వరుసగా 5 వ హిట్టు!

తన మొదటి చిత్రం "ఓం శాంతి ఓం" నాటి దీపిక నటనాపరంగా ఎంతో మెచ్యూర్ అయింది. ఆమె విజయ రహస్యం ఒక్కటే. "తను చేస్తున్న పనిని 100% మనసు పెట్టి చెయ్యటం!". అంతకు మించి ఏమీ లేదంటుంది దీపిక.

భన్సాలీ రచన-సంగీతం-దర్శకత్వం, రణ్‌వీర్‌ సింగ్ పోటాపోటీ నటన, భారీ చిత్రీకరణ, అందమైన ఫ్రేమింగ్.. ఇవన్నీ ఎన్నయినా ఉండనీయండి. తన పాత్రలో పూర్తిగా లీనమయిపోయిన దీపికా పడుకొనే అత్యంత సహజమైన నటనే ఈ చిత్రానికి కేంద్ర బిందువు. ఆ పాత్రలో దీపికను తప్ప మరొకరిని ఊహించలేం. ఇంకొకరు ఎవరు ఆ పాత్రను చేసినా సినిమా ఫలితం మరోలా ఉండేది. ఒకరకంగా, కరీనా తప్పుకొని భన్సాలీని బ్రతికించింది.

ఈ రామ్-లీల.. నిజానికి దీపిక లీల! 

No comments:

Post a Comment