Tuesday 12 November 2013

రెండే దారులు - 1

ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా .. వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే - ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

"నా దారి రహదారి!" అని రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టు - "నాది ఈ దారి" అన్న ఎంపిక కొంతమంది విషయంలో తెలిసి జరగొచ్చు. కొంతమంది విషయంలో తెలియక జరగొచ్చు.

ఎలా జరిగినా, ఉన్న ఆ రెండే రెండు దారుల్లో ఏదో ఒకదానిలోనే ఎవరైనా వెళ్లగలిగేది. వారు ఎన్నుకున్న ఆ ఒక్క దారే .. అతడు/ఆమె "ఎవరు" అన్నది నిర్వచిస్తుంది.

ఇంతకీ ఆ రెండు దారులేంటో ఊహించగలరా?

మొదటి దారి - మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని "ఏదో అలా" అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం.

రెండో దారి - మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని జీవితంగా అనుక్షణం ఎంజాయ్ చేయడం.

కట్ టూ మొదటి దారి -

మొదటి దారిలో - మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత 'విషయం' ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము.  

"నాకు రాదు", "నాకు లేదు", "ఇలా వుంటే చేసేవాణ్ణి", "అలాగయితే సాధించేదాణ్ణి" .. వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తి వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం  .. ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట.

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

కట్ టూ రెండో దారి -

ఈ దారిలో .. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. "ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?" అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి "తలతిక్క"గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం .. ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!) ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం .. ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ఇంతకీ మనది ఏ దారి?  

1 comment:

  1. మొదటిదారి గోదారి! రెందోదారి ప్రగతికి రాదారి!

    ReplyDelete