Thursday 12 December 2013

రెస్ట్ ఇన్ పీస్!

మొన్న శ్రీహరి, నిన్న ఏవీయస్, ఇవాళ ధర్మవరపు సుబ్రహ్మణ్యం...

ముగ్గురూ దాదాపు ఒకే విధమైన అనారోగ్యంతో, ఒకటి రెండు నెలల వ్యవధిలోనే స్వర్గస్తులయ్యారు. అదీ విచిత్రం!

శ్రీహరి గారితో కలిసి పని చేసే అవకాశం నాకు రాలేదు. కానీ చాలా సార్లు ఆయనతో మాట్లాడాను.

నా మొదటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రసాద్ ల్యాబ్‌లో జరుగుతున్నప్పుడు, శ్రీహరి గారి సినిమా ఒకటి కూడా అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది అప్పుడు. రెండూ పక్క పక్క ఎడిట్ సూట్లే. మధ్య మధ్య టీ బ్రేక్ కోసం బయటకు వచ్చినపుడల్లా బాగా మాట్లాడుకొనేవాళ్లం. "ఇంక చెప్పు బ్రదర్.." అంటూ, అప్పుడు ఆయన ఒకటి తర్వాత ఒకటి నోట్లో వేసుకొనే పొట్లాలు గుట్కాలు అన్న విషయం అప్పుడు నాకు తెలియదు!

కట్ టూ ఏవీయస్ -

ఏవీయస్ గారితో నా తొలి చిత్రంలో కలిసి పనిచేశాను. ఇటీవలి చిత్రం "వెల్‌కమ్"లో కూడా ఆయన నటించారు. ("వెల్‌కమ్" నిజానికి కథ, దర్శకత్వం నాది కాదు. ఆ సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయినా, నా పేరుతోనే ఆ సినిమా పూర్తయ్యింది, మార్కెట్ అయ్యింది. అది వేరే విషయం.)

ఏవీయస్ గారు ఎర్రమంజిల్లో ఉన్నప్పుడు.. మా అన్న గారి ఫ్లాట్, ఆయన ఫ్లాట్ పక్క పక్కనే ఉండేవి. నాకు అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా స్క్రిప్ట్ పుస్తకం కూడా ఒక పది కాపీలు అడిగి మరీ తీసుకున్నరాయన. పుస్తకాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడు ఎదురైనా, "మనోహర్ గారూ!" అని ఎంతో బాగా పలకరించేవారు. నేను ఎప్పుడూ జేబులో చేయిపెట్టుకొని ఉండటాన్ని, ఒక్కోసారి ఒక్కో రకంగా, సరదాగా జోక్ చేసేవారు. ఆ జోకులు నాకు ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంటాయి.

కట్ టూ ధర్మవరపు -

నా తొలి చిత్రం కోసం నానక్‌రామ్‌గూడ లోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నాము. నైట్ షూట్. ఒక ఇన్స్‌పెక్టర్ రోల్ కోసం ధర్మవరపు గారిని తీసుకున్నాము.

ఒక్కటే కాల్ షీట్. రావటం రావటమే నేరుగా నా దగ్గరికి వచ్చారు ధర్మవరపు. "డైరెక్టర్ గారూ! నేను నైట్ షిఫ్ట్‌లు చేయటం లేదు. చక చక లాగించేసి. నన్ను 9, 9 న్నరకల్లా పంపించేయండి. అంతకంటే మించి నేను ఉండలేను. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో.. చూసుకోండి" అని చెప్పేసి మేకప్ వేసుకోడానికి వెళ్లారు.

ఇక మా మేనేజర్, కోడైరెక్టర్ నన్ను తెగ టెన్షన్ పెట్టేయటం మొదలెట్టారు. నాకు ధర్మవరపు గారు చెప్పినదానికంటే ముందు వీళ్ల టెన్షన్ ఎక్కువైపోయింది!

మా కెమెరామన్ శంకర్ గారు, నేను మాట్లాడుకున్నాం. అంత పెద్ద సీన్‌ని ఎంత తొందరగా, ఎలా చేయాలా అన్నది మా చర్చ. ఏదో ప్లాన్ చేసేసుకున్నాం. కానీ, మా డౌట్లు మావి..

మేకప్ పూర్తి చేసుకొని రాగానే - ధర్మవరపు గారికి సీన్ వివరించాను. పూర్తిగా సీన్లోకి వెళ్లిపోయారాయన. సీన్‌ని యమ యెంజాయ్ చేయసాగారు. (పైన వర్కింగ్ స్టిల్ అదే!)

ఆయన రోల్ ఇన్స్‌పెక్టర్ రోలే అయినా - అది, బాలకృష్ణ "లక్ష్మీనరసిం హ" కు పేరడీలా ఉంటుంది.. డైలాగులూ అవీ, రీ రికార్డింగుతో సహా!

అంతే.. "9 గంటలకి వెళ్లిపోతాను" అన్నవాడల్లా.. ఆ రోల్‌ని పిచ్చ యెంజాయ్ చేస్తూ, తెల్లవారుజామున 2 గంటలవరకూ కూల్‌గా చేసేసి, హాప్పీగా వెళ్లారు. వెళ్తూ వెళ్తూ, "డైరెక్టర్ గారూ! బాగుందయ్యా, భలే డిజైన్ చేశారు కారెక్టర్ని! అసలెలా వచ్చింది ఈ ఐడియా మీకు?.." అంటూ బాగా నవ్వుకుంటూ వెళ్లారు.

ఇప్పుడు ఈ ముగ్గురూ "ఇక లేరు".. అంటే నమ్మటం కొంచెం కష్టంగా ఉంది. నిజం కాదు అనిపిస్తోంది. కానీ, నిజం. ఆ నిజమే జీవితం. 

1 comment:

  1. Have been watching this for some years. I think December is the month of death. Sometimes I think when death lags behind the yearly schedule, it rushes to accomplish that in December like our police over do their jobs at the month ends.

    ReplyDelete