Friday 1 November 2013

స్మార్ట్ ఫోనే సర్వస్వం!

ఇప్పుడంతా ఫేస్‌బుక్కులూ ట్విట్టర్ల యుగం. అది కూడా, షార్ట్‌కట్‌లో రెండు వాక్యాలు. కుదిరితే ఒక బొమ్మ. అంతకు మించి ఎవరికీ ఏదీ పోస్ట్ చేసే ఓపికల్లేవు. చదివే ఓపికలు అసల్లేవ్!

ప్రాణ స్నేహితులయినా సరే, అతి దగ్గరి ఆత్మీయులయినా సరే.. వ్యక్తిగతంగా కలవటాలు, ఫోన్ చేసుకోవటాలు పూర్తిగా తగ్గిపోయాయి. అంత టైమ్ అసలు ఉండట్లేదు ఎవ్వరికీ! ఫేస్‌బుక్కుల్లో లైక్ చేసి, కామెంట్లు చేయడానికి మాత్రం మస్త్ టైమ్ ఉంటోంది ..

ఈ మధ్యే ఓ హిందీ సినిమా చూశాను. బ్యాచ్‌లర్ రూమ్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఇలా ఉంది:

"నా అండర్‌వేర్ ఎక్కడయినా కనిపించిందిరా?"
"గూగుల్ సెర్చ్ చెయ్ .. దొరుకుద్ది!"

అదీ పరిస్థితి!

గూగుల్ సెర్చ్ అనగానే సుమారు రెండేళ్లకిందటి ఇంకో సంఘటన కూడా నాకిప్పుడు గుర్తొస్తోంది..

కట్ టూ హైద్రాబాద్‌లోని చిలకలగూడాలో ఓ సందు -

అతనొక ఛోటా పొలిటికల్ గల్లీ లీడర్. ఏదో పనిమీద నేను కొన్ని నిమిషాలు అక్కడ ముళ్లమీద కూర్చున్నట్టుగా వెయిట్ చేయాల్సి వచ్చింది.

అప్పుడు వాళ్లేదో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. సడెన్‌గా ఉన్నట్టుండి వాళ్ల చర్చల్లో తమిళనాడులోని ఏదో ఒక ఏరియా పేరు ముందుకొచ్చింది.

అనుచరులు "అక్కడ .. ఇక్కడ" అని చెప్తున్నారు. వినీ వినీ, ఆ లీడర్ ఒక్కటే మాట అన్నాడు:

"అరే .. ఆ "గొల్ల" కొట్రా బై.. ఒక్క సెకన్ల తెలుస్తది!"

ముందు ఈ "గొల్ల" కొట్టడమేంటో నాకర్థం కాలేదు. తర్వాత తెలిసింది. ఆ లీడర్ ఉద్దేశ్యం: "గూగుల్లో కొట్టు" అని!

కట్ టూ స్మార్ట్ ఫోన్ -

ఏది లేకపోయినా బ్రతకొచ్చుగానీ, స్మార్ట్ ఫోన్ లేని బ్రతుకు అసలు బ్రతుకు కాకుండా పోయింది.

డెస్క్‌టాప్‌లూ, ల్యాప్‌టాప్‌లు వాడ్డం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇవే ఫోన్లు! ఈమెయిళ్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్.. అన్నీ దాన్లోనే చూసుకుంటున్నారు. అన్నీ దాన్లోనే చేసేసుకుంటున్నారు. 'అంతా' దాంట్లోనే అయిపోతోంది. ఇంతకు మించి విడమర్చి చెప్పాల్సిన అవసరముందంటారా?

నామటుకు నాకు.. సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఇంటర్‌నెట్ లేకుండా - కేవలం ఒక్కటంటే ఒక్క రోజు చాలా ప్రశాంతంగా ఎక్కడయినా గడపాలని ఉంది.

కానీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 

1 comment: