Sunday 1 December 2013

"వర్ణ"నాతీతం .. అనుష్క!

ఒక నంది అవార్డు, రెండు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, మరో రెండు సినీ'మా' అవార్డులు అందుకొన్న ఈ 5 అడుగుల 6 అంగుళాల 'మంగుళూరు సైరెన్' అనుష్క, 2013 ఆరంభం నుంచి కొత్తగా ఏ సినిమాలకు సైన్ చేయలేదంటే నమ్మలేం. కానీ నిజం.
 
అయితే ఇలా సైన్ చేయకపోవటం హీరోయిన్ ఆఫర్లు లేక, రాక కాదు. ప్రస్తుతం అనుష్క దగ్గర డేట్లు లేవు! రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో యమ బిజీగా ఉంది. అవి పూర్తయ్యేవరకూ డేట్స్ ఇవ్వటం కుదరదు ..

కట్ టూ సూపర్ ఎంట్రీ -

2005 లో పూరి జగన్నాథ్ "సూపర్" తో నాగార్జున సరసన సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయమైన ఈ నిలువెత్తు అందం, 2006 లో "విక్రమార్కుడు" హిట్‌తో ఒక్కసారిగా టాప్ రేంజ్ హీరోయిన్ అయిపోయింది. అదే, హీరోయిన్‌గా అనుష్కకు తొలి కమర్షియల్ సక్సెస్. ఈ సక్సెస్.. అదే సంవత్సరం అనుష్క తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ కావడానికి తోడ్పడింది.

ఆ మధ్య జరిగిన "వర్ణ" ఆడియో ఫంక్షన్‌లో అనుష్కని పొగడ్తలతో ముంచెత్తారు అందరూ. ఆ పొగడ్తల్లోకల్లా ముఖ్యమైన పొగడ్త ఏంటంటే.. అనుష్కతో ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని. ప్రొడ్యూసర్-ఫ్రెండ్లీ అని. హీరోయిన్‌గా తన పని పట్ల అంకిత భావం, కమిట్‌మెంట్ తప్ప వేరే తలనొప్పులు ఆమెతో ఉండవు అన్నది ఆ ఫంక్షన్ వేదికపై నుంచి దాదాపు అంతా చెప్పారు.

ఒక టాప్ రేంజ్ హీరోయిన్ కావడానికి ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు. అందం, అభినయం అనేవి ఏ హీరోయిన్‌కయినా మామూలుగా ఉండేవే. కాని, తను చేస్తున్న పని పట్ల "ఇంకా ఏదో చెయ్యాలి.. ఇంకా బాగా నటించాలి" అన్న తపన అనుష్కలో ఎక్కువ అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చెబుతారు.

ఆ తపనే ఓ "అరుంధతి" నీ, ఓ "వేదం" నీ ఆమెకు అందించాయి. అయితే, అరుంధతి తర్వాత అనుష్కకి ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే వచ్చాయి. లేదా, అనుష్క అలా సినిమాలను ఎన్నుకోవడం జరిగింది.

అది పెద్ద పొరపాటు అని అనుష్క ఈ మధ్యే గ్రహించినట్టుంది. ఇక మీదట తను ఎక్కువగా గ్లామర్ రోల్స్‌నే చేయాలనుకుంటున్నట్టు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. హీరోయిన్-సెంట్రిక్ మూసలో చిక్కుకుపోయిన ఏ హీరోయిన్ అయినా రిస్కులో పడిపోయిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చేద్దామన్నా, అంతకు ముందులా గ్లామర్ రోల్స్ రావు గాక రావు!       

ప్రభాస్ సరసన నటించిన "బిల్లా"లో ఎలాంటి అరమరికలు లేకుండా అందాలని ఆరబోసిన అనుష్క, తమిళంలో కూడా "సింగం" వన్, టూ లతో అక్కడ కూడా టాప్ రేంజ్ పేరు తెచ్చుకుంది.

కట్ టూ "వర్ణ" -

"7 జి బృందావన్ కాలనీ", "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి హిట్ సినిమాలనిచ్చిన దర్శకుడు శ్రీ రాఘవ "వర్ణ" మాత్రం అనుష్క కెరీర్‌కు చాలా పెద్ద దెబ్బ అనక తప్పదు. అయితే, ఒక్క "వర్ణ" ఫెయిల్యూర్ వల్ల అనుష్కకు వచ్చే నష్టమేమీ లేదు పెద్దగా.  

లక్కీగా ఇప్పటికే పీరియడ్ డ్రామా "రుద్రమదేవి", 100 కోట్ల ద్విభాషా చిత్రం "బాహుబలి" చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది అనుష్క. ఇవి పూర్తయ్యేవరకూ డేట్స్ లేకే కొత్త సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. ఏ కోణంలో చూసినా, ఈ రెండు చిత్రాలూ హీరోయిన్‌గా అనుష్క ఇమేజ్‌ని మరింతగా పెంచేవే.

ఇప్పుడు తాజాగా 16 వ శతాబ్దం నేపథ్యంగా సాగే చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం "భాగమతి" లో కూడా నటించడానికి అనుష్క ఒప్పుకున్నట్టు తెలిసింది. అదే నిజమైతే, ఒక విధంగా చెప్పాలంటే, ఈ భాగమతి పాత్రకూడా అనుష్కకు బాగా పేరు తెచ్చేదే.

అయితే, వీటి తర్వాత మాత్రం,  ఈ 32 సంవత్సరాల అందాలరాశి  అనుష్క .. ఖచ్చితంగా రెగ్యులర్ గ్లామర్ చిత్రాలే ఎక్కువగా చేస్తుంది. చేయక తప్పదు. ఎందుకో మీకు బాగా తెలుసు. 

No comments:

Post a Comment