Thursday 14 November 2013

రెండే దారులు - 2

టు డూ ఆర్ నాట్ టు డూ, చెయ్యటమా వద్దా.. ఏదయినా సాధిద్దామా, అలా వదిలేద్దామా.. జీవితాన్ని అనుక్షణం అనుభవించడమా, లేదంటే.. "ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది" అనుకొని చేతులెత్తెయ్యడమా?

రెండూ వేర్వేరు దారులు. ఏది బెటర్?

జీవితం ఎప్పుడూ మనల్ని నడిపించే అవకాశం ఇవ్వకూడదు. మనమే మన అభిరుచికి, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మన జీవితాన్ని నడిపించాలి. ఒకటి అన్నీ గాలికి వదిలేసే మొదటి దారి. ఇంకోటి స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకొన్న రెండో దారి. ఏది బెటర్? 

ఓకే. రెండో దారిని ఎంచుకోడానికి మీకేదయినా అడ్డు తగులుతోందా? మరేదయినా సమస్య ఉందా? అంత వర్రీ కావల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు తక్కువలో తక్కువ ఒక నాలుగు పరిష్కారాలుంటాయి. కావల్సిందల్లా.. సమస్యను భూతద్దంలో చూడకుండా, దాని పరిష్కారం గురించి కొన్ని క్షణాలు ఆలోచించడం.

సంస్యలకు భయపడకూడదు. వాటిని మించి మనం ఎదగాలి.    

ఉదాహరణకు - 1 నుంచి 10 వరకు ఉన్న "స్కేలు"లో మీ మీ సామర్థ్య స్థాయి 2 దగ్గర ఉందనుకుందాం. అదే స్కేలులో మీకు ఎదురయిన సమస్య 5 దగ్గర ఉంది. అంటే మీ సమస్య మీ కంటే కొంచెం పెద్దది. మీరు ఇంకొంచెం కష్టపడి మీ వ్యక్తిగత విలువను, సామర్థ్య స్థాయిని 10 వరకు తెచ్చుకున్నారనుకోండి. ఇందాక మనం చెప్పుకున్న లెవెల్ 5 సమస్య ఇప్పుడు మీ ముందు చాలా చిన్నదయిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. మీ ముందు అదసలు సమస్య కానే కాదు.   

 ఎప్పుడయినా, మీకేదయినా "అతి పెద్ద సమస్య ఎదురయింది" అన్న ఫీలింగ్ వచ్చిందనుకోండి. అలాంటి పరిస్థితిలో కుంగిపోకూడదు. "నేనీ సమస్యని ఎదుర్కోగలను. సమస్యలెప్పుడూ నా ముందు చిన్నవే" అని కాన్‌ఫిడెంట్‌గా అనుకోవాలి. ఆలోచించాలి. పరిష్కారమార్గాల్ని అన్వేషించి ముందుకు కదలాలి.

ఎందుకంటే - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - చాలావరకు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యల అసలు క్రియేటర్స్ మనమే!   

మనలోని క్రియేటివిటీ మన సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపయోగపడాలి.  ఉపయోగపడేలా చేసుకోవాలి. ఇది నా వ్యక్తిగత అనుభవంతో నేర్చుకున్నది. నేర్చుకుంటూ ఆచరిస్తున్నదీ.

1 comment:

  1. పెను సమస్యలు ఎదురైనప్పుడు అదరక బెదరక ప్రశాంతంగా సృజనాత్మకంగా ఆలోచించి సంయమనంతో సరైన పరిష్కారాలు పరిశీలించి ఒకటి ఎంపిక చేసుకొని అమలు చేస్తే సఫలమనోరధులం అవుతాం!!!

    ReplyDelete