Wednesday 3 January 2024

బ్లాక్‌బస్టర్ కథ


"నా దగ్గర మంచి బ్లాక్‌బస్టర్ హిట్ స్టోరీ ఉంది సర్. మహేశ్‌బాబుకైనా, జూనియర్ ఎన్టీఆర్‌కైనా, అల్లు అర్జున్, రామ్‌చరణ్... ఎవరికైనా సూట్ అవుతుంది. మీరు తీస్తా అంటే స్టోరీ ఫ్రీగా ఇస్తా!" 

కొంచెం అటూఇటూగా ఇలాంటి డైలాగ్ గత కొన్నేళ్ళుగా వింటున్నాను. 

ఇలా చెప్పేవాళ్లంతా కొత్తగా రైటర్ కావాలనుకునేవాళ్ళు. లేదంటే అసలు సినిమాఫీల్డుతో సంబంధం లేనివాళ్ళు. 

రెండో కేటగిరీవాళ్ళను మనం పట్టించుకోనవసరం లేదు...

వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, సినిమాకు ఎవడైనా కథ రాయొచ్చు. అసలు రాసే అవసరం కూడా లేదు. నోటితో ఒక 5 నిమిషాలు చెప్తే సరిపోతుంది అని! 

వీళ్ళ ఫీల్డ్స్ వేరు, వీళ్ళు వేరు. ఎదుటివాడు సినిమావాడైతే చాలు... నానా ఉచిత సలహాలిస్తుంటారు. ఫేస్‌బుక్‌లో సినిమా కథ గురించి పోస్టులమీద పోస్టులు పెడుతుంటారు.  

ఇదంతా ఒక కేటగిరీ. వీళ్ళకు ప్రతి ఫీల్డులో ప్రతి విషయం తెలుసు అని ఫీలింగ్. క్వింటాళ్ళ కొద్దీ ఈగో. నిజంగా ఫీల్డు ఎలా ఉంటుందో, ప్రాక్టికాలిటీ ఏంటో వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు అనుకున్నదే ఫీల్డు. వాళ్ళు అనుకున్నదే కథ. వాళ్ళు చెప్పేలాగే సినిమా ఉండాలి.  

వీళ్ళని మనం పట్టించుకోనవసరం లేదు. ఇదొక సైకలాజికల్ డిజార్డర్. అంతకంటే ఏం లేదు. 

కట్ చేస్తే -

ఫిలిం రైటర్ కావాలనుకొని వచ్చేవాళ్ళ గురించే నా బాధంతా. 

ఫిలిం రైటర్ ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్. ఒక మంచి స్క్రిప్టు సక్సెస్ అయితే చాలు. డిమాండులో ఉంటారు. ఒక పెద్ద హీరోకి స్క్రిప్ట్ ఇవ్వగలిగిన రైటర్ పారితోషికం బ్రహ్మాండంగా ఉంటుంది. 

ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ కథారచయిత విజయేంద్రప్రసాద్ పారితోషికం నా దగ్గరున్న సమాచారం ప్రకారం సుమారు 3 నుంచి 5 కోట్లు. ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని నిజం. ఒక సినిమాను వందల కోట్లలో నిర్మిస్తున్నప్పుడు, ఆ సినిమాకు మూలమైన కథను సృష్టించిన రైటర్‌కు ఒక 5 కోట్ల పారితోషికం ఇవ్వటం గొప్ప విషయమేం కాదు. అలా ఇవ్వటం న్యాయం కూడా.  

ఇంత పవర్ ఉన్న ఫిలిం రైటింగ్ ప్రొఫెషన్‌లోకి రావాలకునే కొత్త రచయితలు ఎంత సీరియస్‌గా ఆ స్కిల్‌ను నేర్చుకోవాలి? అందులో సక్సెస్ కావడానికి ఎంత ప్లాన్ ఉండాలి? ఎంత కష్టపడాలి? 

కాని, ఇదంతా వద్దు. రైటర్ అయిపోవాలి. ఎలా సాధ్యం? 

"బ్లాక్‌బస్టర్ కథ ఉంది, చెప్తా" అంటారు. చెప్పలేరు. 

ఒక పూర్తి స్క్రిప్టు రాసింది ఏదైనా ఉందా... అంటే నో. 

సంవత్సరమైనా, రెండేళ్ళయినా మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఇదే పాట... "బ్లాక్‌బస్టర్ కథ ఉంది". ఫుల్ స్క్రిప్ట్ ఏదైనా రాశావా అంటే నో. 

మంచి రైటింగ్ స్కిల్స్ ఉండి, అంతకు ముందు పెద్ద పెద్ద రైటర్స్ దగ్గర అసిస్టెంట్స్‌గా కొన్నేళ్ళు పనిచేసి, సంవత్సరంలో 365 రోజులూ ఒక తపస్సులా పూర్తి స్క్రిప్టులు రాస్తూ తిరుగుతున్నవాళ్లకే అవకాశాలు అంత ఈజీగా దొరకటం లేదు. 

అలాంటిది...    

ఊరికే రొటీన్‌గా "కథ చెప్తా" అంటూ తిరుగుతూ, వాళ్ళ జీవితంలో ఎంత విలువైన సమయం వృధా చేసుకుంటున్నారో ఈ ఔత్సాహిక రచయితలు తెలుసుకోగలిగితే బాగుండు...

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment