Tuesday 13 September 2016

ఎవరా ఇద్దరు టెక్నీషియన్‌లు?

కొన్ని చాలా విచిత్రంగా జరుగుతుంటాయి.

"ఈసారి అలా జరగదులే" అనుకుంటాం. కాని, ఊహించని విధంగా అది అలాగే మళ్ళీ జరిగితీరుతుంది!

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదెప్పుడూ ఉండేదే.

సినిమా అనుకున్నప్పటినుంచి, షూటింగ్ పూర్తయ్యి, కాపీ వచ్చేవరకు .. ప్రొడ్యూసర్ డైరెక్టర్ నుంచి, అఫీస్ బాయ్ వరకు అంతా చాలా కష్టపడతారు.

"ఇది మన ప్రాజెక్టు .. ఏదో సాధించబోతున్నాం" అన్న పాజిటివ్ ట్రాన్స్‌లో పనిచేసుకుంటూ పోతుంటారు.

కాపీ వచ్చేసిందా .. ఖతమ్.

ఎంటర్ ది డ్రాగన్!

ఉన్నట్టుండి ఎంటరవుతాయి కొన్ని కొత్త ముఖాలు, కొత్త క్యారెక్టర్‌లు.

అలా చివర్లో, రిలీజ్‌కు ముందు ఎంటరైన ఆ ఒకరిద్దరివల్ల, వారి క్రెడెన్షియల్స్ ఏంటో తెల్సుకోకుండా, వారి ఉచిత సలహాలను వినడంవల్ల .. మొత్తం సీనే మారిపోతుంది.    

జరక్కూడని నష్టానికి అప్పుడే, అక్కడే పునాదులు పడిపోతాయి. ప్లానింగ్‌లో ఊహించని మార్పులొచ్చేస్తాయి.

అంతా నిస్తబ్దత. నిరాసక్తత.

ఏం జరగబోతోందో టీమ్ మొత్తానికి ముందే తెలిసిపోతుంది.


కట్ టూ  ఆ ఇద్దరు టెక్నీషియన్‌లు -  

నెలలకొద్దీ ఒక ప్రాజెక్టును ప్రాణంగా తీసుకొని పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లంతా ఒక్కసారిగా హతాశులైపోతారు.

ప్రాజెక్ట్ సక్సెస్ అయితే  ప్రొడ్యూసర్ ఒక్కడికే కాదు .. అందరికీ బాగుంటుందని, డైరెక్టర్‌తో సహా మరొకరిద్దరు చీఫ్ టెక్నీషియన్‌లు కూడా తమ జేబుల్లోంచి ఖర్చుపెట్టుకొంటూ, అప్పులు చేసుకొంటూ పనిచేస్తుంటారు

ఇంతచేసినా ఫలితం మళ్లీ అదే.

చివరికి చేతులెత్తేసే పరిస్థితి రావడం.  

ఎంత పనికిరాని ప్రాజెక్టునయినా నిలబెట్టి హిట్ చేసే సత్తా ప్రమోషన్‌కుంటుంది. చెప్పాలంటే, కేవలం మంచి ప్రమోషన్ వల్లనే హిట్టయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.

కానీ అదే మాకు లేదు.

"ఇంక చాలు" అనుకున్నాన్నేను. "అవును. ఇంక చాలు సర్" అన్నాడు నా టీమ్‌లోని ఇంకో చీఫ్ టెక్నీషియన్.


కట్ చేస్తే -

ప్రమోషన్, రిలీజ్, మార్కెటింగ్ లకు విధిగా బడ్జెట్‌లో తగినంత ఉండాలనుకొన్నాం. ఉండితీరాలనుకొన్నాం.

మేమనుకున్న సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేసి, అనుకున్న రేంజ్‌లో ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చెయ్యాలనుకొన్నాం.

రిజల్ట్ హిట్టా, ఫట్టా అన్నది కానేకాదు విషయం.

సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మైక్రోబడ్జెట్‌లో చేసిన సినిమాలకు ఎలాంటి నష్టం ఉండదు.

కాకపోతే, అనుకున్న రేంజ్‌లో ఫిలిమ్‌ను ప్రమోట్ చేసుకొని, ఒక స్ట్రాటజీ ప్రకారం బిజినెస్ చేసుకొని రిలీజ్ చేయడం అన్నది చాలా చాలా అవసరం.     

అలా చేసినప్పుడే ఎవరికయినా ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ అవుతుంది. సినిమా హిట్ అయితే, అదే బ్రాండ్ ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది.

ఒక ఆర్టిస్టుకయినా, టెక్నీషియన్‌కయినా కావల్సింది అదే.

నేనూ, నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు "ఓకే" అనుకున్నాం. కష్టపడాలనుకొన్నాం. గత కొద్ది నెలలుగా కష్టపడుతూనే ఉన్నాం.

ఆ ఇద్దరు టెక్నీషియన్స్‌లో ఒకరు నేనే అనేది సుస్పష్టం.

ఇంకొకరెవరు అన్నది మాత్రం ఇప్పుడంత ముఖ్యం కాదు. రెండ్రోజుల్లో మీకే తెలుస్తుంది. ఇప్పటికే మీలో చాలామంది గెస్ చేసుంటారు కూడా.

ఏమయితేనేం .. మా ఇద్దరి ఆ కష్ట ఫలితమే ఇది:

"365 రోజుల మహాయజ్ఞం. ఇద్దరు టెక్నీషియన్లు. ఒక ప్రొడక్షన్ కంపనీ. సీరీస్ ఆఫ్ సినిమాలు. తెలుగు. హిందీ. సెప్టెంబర్లోనే ప్రకటన."

No comments:

Post a Comment