Sunday 13 February 2022

ఆకాశవాణి, కర్నూలు ఎఫ్ ఎం...

చిన్నప్పటినుంచే నాకు బాగా చదివే అలవాటుండేది. అదొక్కటే అప్పట్లో నాకున్న ఇష్టం, ఎడిక్షన్.

తర్వాత ఇంకో రెండు మూడు ఇలాంటి ఇష్టాలు, ఎడిక్షన్లు యాడ్ అయ్యాయి...  

చందమామ, బాలమిత్ర, సోవియట్ ల్యాండ్, స్పుత్నిక్, సాక్షి వ్యాసాలు, విశ్వనాథ, బుచ్చిబాబు, చలం, లత సాహిత్యం, యధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొమ్మూరి వేణుగోపాలరావు, ఆర్కే నారాయణ్, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య వంటివారి రచనలు ఎంత బాగా చదివేవాన్నో... విశ్వప్రసాద్, మధుబాబుల డిటెక్టివ్‌లు కూడా అంతే బాగా చదివేవాన్ని. 

రమణి, రసికప్రియ, కాగడా, విజయచిత్ర, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్క్రీన్ పత్రికలు కూడా వదల్లేదు.    

వీటన్నిటికి పూర్తి వ్యతిరేక ధృవం అయిన కమ్యూనిస్ట్ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, అరుణతార, సృజన పత్రికలు కూడా రెగ్యులర్‌గా చదివేవాణ్ణి. దీని ప్రభావమే నా మీద ఎక్కువగా ఉండి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరినప్పుడు నేను ఆర్ యస్ యు (రాడికల్ స్టుడెంట్స్ యూనియన్) వైపు ఉండటానికి కారణమైంది. 

ఓయూలో పీజీలో చేరడానికి ముందు నేను ఒక మూడేళ్ళపాటు హెచ్ ఎం టి లో మెషినిస్ట్‌గా పని చేశాను. అప్పుడు - సీతాఫల్ మండి నుంచి హెచ్ ఎం టి దాకా కంపెనీ బస్‌లో వెళ్లే ఆ 45 నిమిషాల సమయంలో, బస్ ఎక్కగానే నిద్రపోకుండా, ఇంగ్లిష్ నవలలు చదవడం నాకు బాగా అలవాటయ్యింది.  

అప్పట్లో సీతాఫల్ మండి, తార్నాకాల్లో ఇంగ్లిష్ నవలలు అద్దెకిచ్చే షాపులుండేవి. రోజూ ఒకే సమయానికి వెళ్ళి, అద్దెకు నవల్స్ తెచ్చుకొని చదవటం అప్పట్లో అదొక క్రేజ్.    

సిడ్నీ షెల్డాన్, హెరాల్డ్ రాబిన్స్, ఫ్రెడ్రిక్ ఫోర్సైత్, జెఫ్రీ ఆర్చర్‌ల ఫిక్షన్ బుక్స్ దాదాపు అన్నీ నేను చదివాను అన్న విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. 

తర్వాత ఒక రెండేళ్ళు... నా ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం... నవోదయ విద్యాలయ (గుంటూరు) లో పనిచేశాను. కాని, అది రెసిడెన్షియల్ సెటప్ కాబట్టి ఎక్కువగా చదివే అవకాశం అక్కడ నాకు ఉండేది కాదు. 

అక్కడి కొలీగ్స్, స్టుడెంట్స్, పరిచయాలు, పని, సాయంత్రం మద్దిరాల వాగులో ఫిషింగ్... అదంతా వేరే ఇంకో అద్భుత జ్ఞాపకం.   

కట్ చేస్తే - 

వీటన్నిటికి దూరంగా... అప్పటివరకు నాకు తెలియని-లేదా- నేను పట్టించుకోని ప్రపంచ సాహిత్యంతో, ప్రపంచస్థాయి నో-హిపోక్రసీ సాహిత్యంతో, సీరియస్ సాహిత్యంతో నాకు బాగా పరిచయమైంది... ఆలిండియారేడియో లైబ్రరీలో!

ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో నేను దాదాపు ఒక పదేళ్ళు పనిచేశాను. ఆ టెన్-టూ-ఫైవ్ ఉద్యోగంలో, నాకు జస్ట్ ఒక రెండు మూడు గంటలకంటే అసలు పని ఉండేది కాదు. మిగిలిన టైమంతా లైబ్రరీలోని పుస్తకాలతో గడిపేవాణ్ణి. 

షేక్స్‌పియర్, విక్టర్ హ్యూగో, దస్తయేవ్‌స్కీ, మిల్టన్, జేన్ ఆస్టిన్, జేమ్స్ జాయ్స్, జార్జ్ ఆర్వేల్, నీషే, మిలన్ కుందేరా, కుశ్వంత్ సింగ్, సాల్మన్ రష్దీ, అగాథా క్రిస్టీ, అరుంధతీ రాయ్, నాన్సీ ఫ్రైడే, శోభా డే, డానియెల్ స్టీల్, మారియో పుజో, పావ్‌లో కోయిల్యూ, గోర్కీ, పవుస్తోవ్‌స్కీ, మార్క్ ట్వేన్, బెర్నార్డ్ షా, ఆల్బర్ట్ కామస్, ఐన్ రాండ్, రారా, కొకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, డాక్టర్ సినారె, తాపీ ధర్మారావు వంటి ఎంతో మంది రచనల్ని నేను కర్నూల్లోనే చదివాను.

నా జీవితం మొత్తంలో నేను ఎక్కువగా పుస్తకాలను చదివింది కూడా కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్! దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు.

గోవర్ధన్ గారు నాకు ఎప్పుడూ "ఇది చదువు, అది చదువు" అని అసలేం సజెస్ట్ చేసేవాడు కాదు. కాని, ఆయన పెట్టే పుస్తకాల ఆర్డర్‌లో మాత్రం నా టేస్టును బట్టి కూడా బుక్స్ బాగానే కనిపించేవి. 

అప్పట్లో సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా సర్ నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. ఇంకేముంది... పండగే!  

స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను.   

అప్పటి మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మి రెడ్డి గారు, మా ఎనౌన్సర్ శాస్త్రి, స్టెనోగ్రాఫర్ లక్ష్మి కూడా... అప్పుడప్పుడూ, వారి ఫ్రీ టైమ్‌లో, ఏదో ఒక పుస్తకం చదువుతుండేవారు. 

ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిత్రుడు అపోలిన్ డిసౌజా మాతృభాష కొంకణి. మంగళూరు నేటివ్ కాబట్టి సహజంగానే అతనికి కన్నడ కూడా తెలుసు. కన్నడ లిపి, తెలుగు లిపి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగు లిపికి సంబంధించి డిసౌజాకు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాను. అంతే. తన మాతృభాష తెలుగు కాకపోయినా, తెలుగు నేర్చుకొని, దాదాపు లైబ్రరీలో ఉన్న పాపులర్ తెలుగు నవల్స్ అన్నీ చదివేశాడు!

ఇక రాయడం విషయానికొస్తే - 

యూనివర్సిటీలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే నేను రాయడం ప్రారంభించాను. బాగా అలవాటయ్యింది కూడా క్యాంపస్‌లోనే. నేను రాసినవి న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్స్‌లో అచ్చయ్యేవి. 150, 200, 250... పారితోషికం మనీయార్డర్స్ రూపంలో వచ్చేది.

అయితే - కథలు రాయడం సీరియస్‌గా ప్రారంభించిందీ, ఎక్కువగా రాసిందీ కూడా నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే!   

ఆ సమయంలోనే నేను రాసిన ఒక కథ పబ్లిష్ అయినప్పుడు, అది అన్నలకు కోపం తెప్పించి, ఒక విరసం రచయిత ద్వారా నాకు మైల్డ్‌గా వార్నింగ్ పంపించేదాకా వచ్చింది. 

పబ్లిష్ అయిన నా ఇంకో కథ... నాకు మద్రాస్ నుంచి కాల్ చేయించి, సినిమారంగానికి కనెక్ట్ చేసింది. 

కర్నూల్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే నేను "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తం రాశాను. దానికి నంది అవార్డు ప్రకటించింది కూడా నేను అక్కడ ఉన్నప్పుడే.      

కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు నేను కొన్ని ఫీచర్స్, నాటికలు కూడా రాశాను. ప్రసారం అయ్యాయి.  బహుశా ఆ స్పూల్ టేప్స్ ఇంకా అక్కడి టేప్స్ లైబ్రరీలో ఉండే ఉంటాయి. 

మొన్న డిసెంబర్‌లో బెంగుళూరు నుంచి హైద్రాబాద్‌కు కార్లో వస్తున్నప్పుడు కొన్ని గంటలు కర్నూల్లో ఆగాను. అప్పుడు నేనున్న క్రిష్ణారెడ్డి నగర్‌కు వెళ్ళి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి మా నైబర్స్‌ను కలిశాను. అదొక గొప్ప అనుభూతి. 

మా రేడియో స్టేషన్‌కు కూడా వెళ్లాలనుకున్నాను కాని, కుదర్లేదు. కేవలం కర్నూలు ఆలిండియా రేడియో స్టేషన్‌ను మళ్ళీ ఒకసారి తనివితీరా చూడ్డం కోసమే, ఈసారి స్పెషల్‌గా, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. 

మర్చిపోయాను... నేను కర్నూలు రేడియోలో పనిచేస్తున్నప్పుడే మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రితో కలిసి, ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్‌ను మా స్టుడియోలో ఇంటర్వ్యూ చేశాను. బహుశా ఆ స్పూల్ టేప్ కూడా ఇప్పటికీ ఉండే ఉంటుందక్కడ. 

ఇలాంటి ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చిన కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎం లో నేను పనిచేసిన రోజులను గుర్తుచేసుకోడానికి కారణమైన ఇవాళ్టి "వరల్డ్ రేడియో డే" కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

అప్పటి నా రేడియో కొలీగ్స్‌కు, ఇప్పుడు రేడియోలో పనిచేస్తున్నవారందరికీ... వరల్డ్ రేడియో డే సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!        

2 comments: