Friday 25 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 1

ఒకప్పుడు అమెరికానే వణికించిన రష్యన్ గూఢచర్య వ్యవస్థ 'కె జి బి' లో 16 ఏళ్లపాటు అత్యంత కీలకమైన అసైన్‌మెంట్స్‌లో ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేసిన చరిత్ర ఇప్పటి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు ఉంది.    

అలాగే, 'కె జి బి' లో ల్యూటినెంట్ కల్నల్ ర్యాంక్ దాకా చేరుకున్న కొద్దిమందిలో పుతిన్ ఒకరు. 

తర్వాత రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్విసెస్‌లో, ఆ తర్వాత రష్యన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కలిపి ఇంకో దశాబ్దం పాటు పనిచేశాడు. ఆ తర్వాతే, తన ఉద్యోగానికి రిజైన్ చేసి పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు పుతిన్.   

అప్పుడు అన్నేళ్లపాటు పుతిన్ 'కె జి బి'లో పనిచేసినా, ఇతర ఉన్నత స్థాయి రష్యన్ భద్రతా వ్యవస్థల్లో పనిచేసినా,  రష్యాకు ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పుడు ఆ పదవిలో కదలకుండా పాతుకుపోయినా కారణం ఒక్కటే - అతనిలో దేశభక్తి. 

పుతిన్ గురించి బయట ప్రొజెక్ట్ అవుతున్నది వేరు. లోపల రష్యాలో ఆ దేశ పౌరులకు తెలిసింది, అతనిపట్ల వారికున్న అభిప్రాయం వేరు.    

ఇప్పుడు పుతిన్ వయస్సు 69.

కట్ చేస్తే - 

మరోవైపు... యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ ముందు నటుడు, డాన్సర్, కమెడియన్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా!  

ఆ తర్వాతే పొలిటీషియన్.

కనీసం ఒక డజన్ రొమాంటిక్ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాడు జెలెన్స్‌కీ.  


లవ్ ఇన్ ద బిగ్ సిటీ, లవ్ ఇన్ వేగాస్, 8 ఫస్ట్ డేట్స్ మొదలైనవి జెలెన్స్‌కీ హీరోగా నటించిన యూక్రేన్ సినిమాలు. 

డాన్సింగ్ విత్ ద స్టార్స్ అనే టీవీ డాన్స్ షోలో డాన్సర్‌గా పోటీలో పాల్గొన్నాడు. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే టీవీ కామెడీ షోలో కమెడియన్‌గా కూడా నటించాడు జెలెన్స్‌కీ. 

తనకున్న ఈ నేపథ్యంతోనే యూక్రేన్‌లో ఒక పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు జెలెన్స్‌కీ. 

అన్నట్టు... జెలెన్స్‌కీ భార్య ఒలెనా కియాష్కో ఆర్కిటెక్ట్, స్క్రీన్ రైటర్ కూడా!   

ఇంకో గొప్ప విషయమేంటంటే - తను నటించిన కామెడీ సీరియల్ "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" పేరుతోనే 2018 లో పార్టీ స్థాపించి, కేవలం 3 నుంచి 4 నెలల్లోనే అప్పటివరకు ఉన్న ప్రెసిడెంట్ పిత్రో పరషెంకోను చిత్తుగా ఓడించి యూక్రేన్‌కు 6 వ ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్‌కీ! 

పాలిటిక్స్‌లో, "తక్కువ సమయం ఉంది .. ఇది సాధ్యం కాదు" అనుకోడానికి వీళ్లేదని చెప్పే మరొక గొప్ప ఉదాహరణ ఇది.  

ఇప్పుడు జెలెన్స్‌కీ వయస్సు 44.

కట్ చేస్తే - 

ఒకప్పటి సోవియట్ యూనియన్ ముక్కలవకముందే రష్యన్ భాషలో డిగ్రీతో సమానమైన మూడేళ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమాను ఓయూలో యూనివర్సిటీ టాపర్‌గా చదివినవాణ్ణి నేను. రష్యన్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం నాకు. 

అంత ఇష్టం ఆ భాష మీద, వాళ్ళ సాహిత్యం, సంస్కృతుల మీద నాకు కలగడానికి కారణం - నేను చిన్నప్పటినుంచీ రెగ్యులర్‌గా చదివిన సోవియట్ లాండ్, స్పుత్నిక్ పత్రికలు.

మంచి తెలుగులోకి అనువదించి, అద్భుతంగా ప్రచురితమైన ఆ మ్యాగజైన్స్, వారి కథల పుస్తకాలు, నవలలు నన్ను చిన్నప్పుడే సోవియట్ యూనియన్‌కు తిరుగులేని అభిమానిని చేశాయి. దస్తయేవ్‌స్కీ, పవుస్తోవ్‌స్కీ, గోర్కీ, పుష్కిన్, చెఖోవ్ మొదలైనవారందరి రచనలు ఎన్నో కొన్ని చదివాను.

రష్యన్ భాష నేర్చుకున్నాక నేరుగా రష్యన్‌లోనే చాలా సినిమాలు చూశాను, రష్యన్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ నాకిష్టమైనవి కొన్ని చదివాను. కొన్ని షార్ట్ స్టోరీస్ నేరుగా రష్యన్ నుంచి తెలుగులోకి అనువదించాను. అవన్నీ విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఉజ్వల వంటి పత్రికల్లో పబ్లిష్ అయ్యాయప్పుడు. 

1987-88 లో ఇండియాలో సోవియట్ ఫెస్టివల్ జరిగినప్పుడు వచ్చిన వందలాది నేటివ్ రష్యన్ డెలిగేట్స్ ముందు, కోఠి వుమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో ఒక రష్యన్ నాటిక రాసి, అందులో నటించిన బృందంలో నేనూ ఒకణ్ణి. 

ఆ సందర్భంగానే ఇండియా వచ్చిన రష్యన్ పాప్ సింగర్ అల్లా పుగచేవాను కలిసి గంట సేపు మాట్లాడాను. పుగచేవా తన ఆటోగ్రాఫ్‌తో గిఫ్ట్‌గా ఇచ్చిన తన పాప్ సాంగ్స్ క్యాసెట్టు, గ్రాంఫోన్ రికార్డ్ ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉన్నాయి.  

నేను ఓయూలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే, తార్నాకలోని నేషనల్ జియో ఫిజిక్స్ రిసెర్చ్ సెంటర్ (NGRI) కి మిఖెయిల్ లెర్మెంతోవ్ అని రష్యన్ సైంటిస్ట్ ఒకరు వచ్చినప్పుడు అతనికి 4 రోజులపాటు ఇంటర్‌ప్రీటర్‌గా పనిచేశాను. అప్పుడు NGRI నాకిచ్చిన రోజుకి 100 రూపాయల రెమ్యూనరేషన్, సర్టిఫికేట్ నాకింకా గుర్తుంది.         

ఇప్పటికీ రష్యాలో నాకు ఆ దేశపు మిత్రులున్నారు. ఆ మధ్య నేను డైరెక్ట్ చేసిన ఒక హారర్ సినిమాలో ఒక పాట కోసం యూక్రేన్ మోడల్, డాన్సర్, నా ఫ్రెండ్ కాత్యా ఐవజోవా నటించింది.      

నా తర్వాతి సినిమాల్లో ఎలాగైనా వీలు చేసుకొని... రష్యాలో, యూక్రేన్‌లో కనీసం ఒకటి రెండు సీన్స్ అయినా షూట్ చెయ్యాలన్న లాంగ్ పెండింగ్ కోరిక కూడా ఉంది.    

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... రష్యా, యూక్రేన్ ఒకప్పుడు కలిసే ప్రపంచ యుధ్ధాల్లో పోరాటం చేశాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఈ రెండూ సోదర రాష్ట్రాలే. ఇప్పుడు దేశాలుగా మారినా... ఇక్కడా అక్కడా, రెండు దేశాల్లో, దాదాపు అందరికీ మిత్రులూ, బంధువులూ ఉన్నారు. 

దురదృష్టవశాత్తు ఇప్పుడు, ఈ రెండు దేశాలూ  శత్రు దేశాలుగా మారి, ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఉండటం అనేది అత్యంత బాధాకరం. 

ఒకప్పటి సూపర్ పవర్ 'అగ్ర రాజ్యం' సోవియట్ యూనియన్ అభిమానిగా నా ఫీలింగ్ కూడా అదే. 

ఇదే ఫీలింగ్‌తో, ఈరోజు ఉదయం నుంచీ... మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల్లో ఉన్న నా ఫ్రెండ్స్‌తో కనీసం ఓ రెండు గంటల పాటు మాట్లాడాను. యూక్రేన్‌ను ఆనుకునే ఉన్న సరిహద్దు దేశం రుమేనియాలో ఉన్న నా ఇంకో ఫ్రెండ్‌తో కూడా మాట్లాడాను.         

అయితే - మీకు బాగా బోర్ కొట్టించిన ఈ నేపథ్యంలో... అసలు యూక్రేన్ పైన పుతిన్ చేసిన ఈ దాడి ఎంతవరకు కరెక్టు అన్నది రేపు నా ఇంకో బ్లాగ్ పోస్టులో రాస్తాను. 

No comments:

Post a Comment