Saturday 26 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 2

ఈ పోస్ట్ రాస్తున్న సమయానికి ఒక 45 నిమిషాల ముందు, యూక్రేన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ ఒక ట్వీట్ పెట్టాడు.

తనకు కాల్స్ రావడం ప్రారంభమైందనీ... సిట్జర్లాండ్ ప్రసిడెంట్, గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇప్పుడే కాల్స్ వచ్చాయనీ... నైతికమైన సపోర్టే కాకుండా, అవసరమైన ఆయుధ సహాయం కూడా చేయడానికి ముందుకువచ్చారని ఆ ట్వీట్‌లో చెప్పాడు. 

ఎంత ఘోరమైన పరిస్థితి అంటే - యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని దేశాల అధినేతలకు, అమెరికాకు, నాటో అధికారులకు గత రెండురోజుల్లో లెక్కలేనన్ని కాల్స్ చేశాడు జెలెన్‌స్కీ.

కనీసం ఒక్కరి నుంచి కూడా అతను ఆశించిన సపోర్ట్ రాలేదు.  

ఈ ఉదయం తన దేశ ప్రజలకు జెలెన్‌స్కీ పెట్టిన రెండు మూడు చిన్న వీడియో సందేశాలను చూస్తే ఎవ్వరికైనా బాధకలుగక మానదు.

వాటి సారాంశం క్లుప్తంగా ఇది:

"యూరోపియన్ యూనియన్, అమెరికా, నాటో లకు కనీసం ఒక 30 కాల్స్ చేశాను. వారికి చెప్పాను, సజీవంగా ఇదే మీకు నా చివరి కాల్ అని!"

"యూక్రేన్ లోని చాలా ప్రాంతాలను రష్యా తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు వారి బలగాలు రాజధానిలోకి ప్రవేశించాయి. కీవ్‌ను స్వాధీనం చేసుకోడం అంత సులభం కాదు. అందుకే, ఇప్పుడు వారి సర్వశక్తుల్నీ కేంద్రీకరిస్తారు. ఈ రాత్రి మనందరికీ చాలా పెద్ద పరీక్షా సమయం."

"పుతిన్  టార్గెట్ నంబర్ వన్ యూక్రేన్ దేశాధ్యకుడినయిన నేను. రెండవ టార్గెట్ నా కుటుంబం. నేనెక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నాను. నా పక్కనే యూక్రేన్ ప్రైమ్ మినిస్టర్, ఇతర మంత్రులున్నారు!" 

చివరి సందేశం అతనే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో బైట్ కావడం విశేషం.

కేవలం మూడు నాలుగేళ్ల క్రితం వరకు, 2019లో కూడా... యూక్రేన్‌లో అతనొక పాపులర్ సినీ హీరో, టీవీ హీరో, కమెడియన్, డాన్సర్, స్క్రీన్ రైటర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్.  

ఒక నాలుగేళ్ల తర్వాత... యూక్రేన్ ప్రెసిడెంట్‌గా... తన పరిస్థితి ఒకరోజు ఇలా ఉంటుందని బహుశా అతను కలలో కూడా ఊహించి ఉండడు. 

దీన్ని ఫేట్ అందామా? 

కానే కాదు. 

అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో చెప్పిన కల్లబొల్లి మాటలు విని అతను తీసుకొన్న అత్యంత దారుణమైన తప్పుడు నిర్ణయాల ఫలితం ఇది. 

పుతిన్‌కు అనుకూలంగా, పుతిన్ చెప్పినట్టు వినే తోలుబొమ్మ లాంటి అంతకు ముందటి యూక్రేన్ ప్రెసిడెంట్‌ను తుక్కుగా ఓడించించిన తన విజయం వెనుక... అమెరికా, సి ఐ ఏ ల వ్యూహం, కృషి చాలా ఉందని... బహుశా జెలెన్‌స్కీకి కూడా ముందు తెలిసే అవకాశం ఉండదు.

కట్ చేస్తే -   

యూక్రేన్ మీద రష్యా దాడి ప్రారంభమై ఇది మూడవ రోజు.

యూక్రేన్‌లో ఉన్న నా ఫ్రెండ్ ఒకరు... యుధ్ధం జరుగుతున్న ఈరోజు, ఈ సమయంలో కూడా... ఒక బాధ్యతాయుతమైన యూక్రేన్ సిటిజెన్‌గా, వాలంటరీగా... యూక్రేన్ రాజధాని కీవ్‌లోని ఒక హాస్పిటల్లో తన డ్యూటీ నిర్వహిస్తూ (అది తన వృత్తి కాదు!), నాతో చెప్పిందేంటంటే - 

"ఇంకో 48 గంటల్లో అంతా అయిపోవచ్చు. రష్యా కీవ్‌ను ఆక్రమించుకుందంటే అంతా అయిపోయినట్టే. అయితే, ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని ప్రాణాలతో పట్టుకోరు. ప్రాణాలతో వదిలిపెట్టరు. ఆయనకు ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు." 

అవును, ఇది యుధ్ధం. ఏదైనా జరగవచ్చు. 

శాటిలైట్స్ వచ్చాయి. యాండ్రాయిడ్‌లొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, మెటావర్స్ వచ్చింది... ఇంకేవేవో వచ్చాయి, వస్తున్నాయి. మనిషి జీవితం, జీవనశైలి ఆధునికంగా ఎంతో ఎంతో మారిపోయింది అని మనం అనుకుంటున్నాం. 

కాని, అదంతా వుట్టిదే. పచ్చి అబధ్ధం. 

వందల, వేల ఏళ్ళక్రింద రాజులు రాజ్యాలు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడూ అంతే. ప్రజాస్వామ్యం, ఎన్నికలు వంటివి అదనంగా వచ్చిన కొన్ని కొత్త అలంకరణలు, అంతే.  

ఏ దేశాధినేతకైనా, ఏ దేశానికైనా... ముందు అధికారం, ఆ తర్వాత - ఆ దేశ సంక్షేమం, అభివృధ్ధి, భద్రత ముఖ్యం. దానికోసం ఎవరైనా ఎక్కడిదాకైనా వెళ్తారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి హద్దులు ఉండవని మనం రాసుకున్న చరిత్రే చెబుతోంది.  

యూక్రేన్‌లో ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని ఊహించి అమెరికా జెలెన్‌స్కీకి నిన్ననే సమాచారం పంపింది: "మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని ముందు కీవ్ నుంచి లిఫ్ట్ చేస్తాము. రెడీగా ఉండండి" అని. 

కాని, "దేశ ప్రజలతోపాటే నేను" అని అమెరికా అందించిన సహాయాన్ని తిరస్కరించాడు జెలెన్‌స్కీ. 

ఈ ఒక్క మాటతో... నిజమైన వార్ హీరోగా, వార్ టైమ్ ప్రెసిడెంట్‌గా... చరిత్రపుటల్లో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు జెలెన్‌స్కీ. 

అసలు పుతిన్ ఎందుకు ఇంత విధ్వంసానికి పూనుకున్నాడు? 

రేపు నా ఇంకో బ్లాగ్ పోస్టులో...  

No comments:

Post a Comment