Friday 18 February 2022

తప్పిపోయిన థంబ్‌నెయిల్ బ్యాచ్!

ఈమధ్య ఒక ట్రెండ్ బాగా నడుస్తోంది... 

ఒక పెద్ద డిజిటల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే. దానిలో ఏదో ఒక న్యూస్‌పేపర్ పేజీలు చూపిస్తూ, వాటిలో కొన్ని వార్తలు చూపిస్తూ, వాటిని (చదవటం సరిగ్గా రాకపోయినా) చదువుతూ విమర్శించటం. లేదా విషం కక్కటం. 

లేదంటే - ఏదో అర్థం కాని, అర్థం లేని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తూ, దాన్ని ప్రెజెంట్ చేస్తున్నామనుకొని శునకానందపడటం. నిజానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఆర్ట్. దాని బేసిక్స్ కూడా తెలియకుండా ఏదో చేస్తున్నాం, కొలంబస్‌లా ఏదో కొత్త విషయం కనుక్కున్నాం, అదే జరగబోతోంది అని అంకెల గారడీ చూపించడం. 

ఈ రెండిటి ట్రెండు ఇప్పుడు బాగా నడుస్తోంది. 

ఈ రెండూ కాకుండా - హోదాలతో సంబంధం లేకుండా, వ్యక్తులను కూడా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలం వాడుతూ, ఏవేవో ఆరోపణలలతో ప్రతిరోజూ వీడియోలను అప్‌లోడ్ చెయ్యటం అనే ఇంకో చెత్త ట్రెండ్ కూడా నడుస్తోంది. కాని, ఆ స్థాయికి కూడా వెళ్లి, దాని గురించి రాయడం నాకిష్టం లేదు. 

ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమయ్యేదేంటంటే - వీళ్లందరినీ జాగ్రత్తగా గమనిస్తే, ఒక కామన్ లక్షణం కనిపిస్తుంది. 

అదేంటంటే... ఏదో ఒక పొడవాటి పేరున్న మానసిక వ్యాధి. వీళ్లందరినీ వేధిస్తోంది! 

ఇలాంటివారితో మాత్రమే అలాంటి వీడియోలు, వార్తలు, థంబ్‌నెయిల్స్ తయారవుతాయి. సో... ఈ పాయింటాఫ్ వ్యూలో, వీరిని ఎన్నికచేసుకొన్న 'బిహైండ్ ద సీన్స్' మేధస్సును అభినందించాల్సిందే! 

కట్ చేస్తే - 

వీరి థంబ్‌నెయిల్స్, బ్రేకింగ్ న్యూసుల్లో ఒక చిన్న ఉదాహరణ. ఇది నిన్ననే చూశాను...

"కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నీళ్ళు ఎవరికోసం... కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కోసం!" 

దీన్ని బట్టే మొత్తం అర్థం చేసుకోవచ్చు... వాళ్ల తెలివి, గిలివీ, వెనుక ఎవరు సపోర్ట్... ఏంది కథ. 

240 టిఎంసి నీటి లక్ష్యంతో, వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు "కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కు నీళ్ల కోసం" అని చెప్పే వ్యక్తికి ఏదైనా మానసిక రుగ్మత ఉంటే ఉండొచ్చు.

కాని, అలాంటి చెత్తను విని లైకులు కొట్టి, కామెంట్ చేసి, వాట్సాపుల్లో షేర్ చేసే విద్యాధికులకు కూడా అంతకంటే ఎక్కువ మానసిక రుగ్మతలు ఉండితీరాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, 60 ఏళ్లలో, తెలంగాణలో ఇప్పటివరకు నీటి తడి చూడని ప్రాంతాలకు నీరు వచ్చింది, మంచి నీళ్లకు నోచుకోని గ్రామాల్లో ఇంటింటికీ త్రాగే మంచినీళ్ళు వచ్చాయి వంటి ఎన్నో నిజాల్ని అలా పక్కనపెడదాం.

అవన్నీ వీరికి కనిపించవు. 

కాని... 

రాష్ట్రంలోని, దేశంలోని ఎన్నో మంత్రిత్వ శాఖలకు, క్లియరింగ్ వ్యవస్థలకు, ఆడిటింగ్ వ్యవస్థలకు ఈ ప్రభుత్వం ఎన్నో దశల్లో జవాబుదారి అన్నది కామన్ సెన్స్. 

ఏదో ఒక్క ఫార్మ్ హౌజ్‌కు నీళ్ల కోసం, వేల కోట్లు ఖర్చుపెడుతుంటే అవన్నీ చూస్తూ ఊరుకోవు. అవి ఎవ్వరికీ చుట్టాలు కాదు అన్నది మరింత బేసిక్ కామన్ సెన్స్. 

ఈమాత్రం కామన్ సెన్స్ లేకుండా - భారీ డిజిటల్ డిస్‌ప్లేలతో అంత భీభత్సమైన బిల్డప్పులు! 

యస్... ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా విమర్శలు చెయ్యాల్సిందే. అయితే, అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. కొంచెమైనా అర్థం ఉండాలి.   

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో 90 శాతం ఇలాంటి అర్థంలేని చెత్తనే ఉంటుంది. మిగిలిన 10 శాతంలోనే ఎంతో కొంత పనికొచ్చే విషయం ఉంటుంది. 

వ్యక్తిగతంగాను, సామాజికంగాను, వినోదపరంగాను... పనికొచ్చే ఆ 10 శాతం స్టఫ్‌ను పట్టించుకుందామా? ఇలాంటి ఏ ఎర్రగడ్డ నుంచో తప్పిపోయిన థంబ్‌నెయిల్ బ్యాచ్ ఎక్కించే 90 శాతం స్టఫ్‌ను పట్టించుకుందామా?  

No comments:

Post a Comment