Thursday 3 February 2022

ఒక్క కేసీఆర్, వంద వ్యూహాలు!

అమెరికాలోని సి ఐ ఏ వంటి సంస్థల దగ్గర 5, 10, 20, 25... ఆఖరికి 100 సంవత్సరాల ప్లాన్స్ కూడా ఉంటాయట! 

అమెరికాలో పార్టీలు, ప్రభుత్వాలు మారతాయి. కాని, ఈ ప్లాన్స్ మారవు. పార్టీలకతీతంగా - దేశం, దేశ భద్రత, దేశాభివృద్ధి వారికి అన్నిటికన్నా ప్రధానం. 

అంతే కాదు. ప్రపంచ రాజకీయపటం పైన ఒక పెద్దన్నగా, ఒక గాడ్‌ఫాదర్‌గా అమెరికా పవర్ ఏ స్థాయిలో ఉంటుందో, ఏ స్థాయిలో ఉండాలో కూడా సి ఐ ఏ రూపొందించే ఈ ప్లాన్స్ నిర్దేశిస్తాయి. 
   
ఒకనాటి సూపర్ పవర్స్‌లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవ్వటానికి కారణం ఆ దేశ అంతర్గత సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచం అంతా అనుకుంటారు. కాని, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్లాన్ చేసి వెనుక నుంచి ఆ ప్లాన్‌ను పక్కాగా నడిపించింది అమెరికా. 

అలాగే, యూరప్‌లోని ఈస్టర్న్ (కమ్యూనిస్ట్) బ్లాక్ అంతా ఒక్కసారిగా మాయమైపోయి, ఆ దేశాలన్నీ డెమొక్రాటిక్ కంట్రీలుగా మారడానికి, రెండు జర్మనీల మధ్య గోడ కూలడానికి కూడా కారణమైన సీక్రెట్ బ్లూప్రింట్స్ అమెరికాలోని సి ఐ ఏ రహస్య సమావేశాల్లో రూపొందినవే. 

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఎవరు దేశాధినేత కావాలో కూడా పరోక్షంగా నిర్ణయించేది అమెరికా, సి ఐ ఏ వంటి ఆ దేశపు అత్యంత శక్తివంతమైన వ్యవస్థలు అంటే నమ్మశక్యం కాదు. కాని, నిజం.

దీనికోసం ప్రపంచ రాజకీయాలు, అమెరికన్ పాలిటిక్స్ చదవాల్సిన అవసరం లేదు. సిడ్నీ షెల్డాన్ "విండ్‌మిల్స్ ఆఫ్ ది గాడ్స్" వంటి మామూలు పల్ప్ ఫిక్షన్ చదివినా ఇది నిజం అన్న విషయం అర్థమైపోతుంది. 

కట్ చేస్తే - 

తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఇలాంటి ఎన్నో శక్తివంతమైన బ్లూప్రింట్స్‌ను అనేక రకాల కార్యక్రమాలు, పథకాల రూపంలో రూపొందిస్తున్నారు... మన తెలంగాణ ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కేసీఆర్. 

కేసీఆర్ ప్లాన్ చేసి రూపొందిస్తున్న ఈ బ్లూప్రింట్స్‌ను ఇంకో పదేళ్ల తర్వాతో, పాతికేళ్ల తర్వాతో మరే ఇతర రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చలేదు. మార్చడానికి వీలుకాదు. వాటికి అంత శక్తి ఉంది. 

కాదు, కూడదు అని ఎవరైనా మార్చాలనుకుంటే, తెలంగాణ ప్రజలు వారిని మార్చేస్తారు. అంత పటిష్టమయిన పద్ధతిలో ప్రతి ఒక్కటీ పక్కాగా సెట్ చేస్తున్నారు కేసీఆర్.  

24 గంటల నాణ్యమైన కరెంటు, రైతులకు ఉచిత కరెంటు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, కళ్యాణ లక్ష్మి, షి టీమ్స్, పేకాట క్లబ్బుల నిషేధం, కేసీఆర్ కిట్, కంటివెలుగు, డిగ్నిటీ హౌజింగ్ స్కీమ్, రైతు బంధు, దళిత బంధు వంటి 101+ కార్యక్రమాలు, పథకాలు ఈ బ్లూప్రింట్‌లో భాగమే. 

రాజనీతికి సంబంధించిన తెలియని ప్లాన్లు, వ్యూహాలు ఇంకెన్నో ఉంటాయి. అది పూర్తిగా వేరే విషయం.  

తెలంగాణ కోసం, తెలంగాణ శ్రేయస్సు కోసం ఏదైనా చేయటానికి సిద్ధం అని టీఆరెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాకా, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేదాకా... ఒక్కో దశలో ఒక్కో స్థాయిలో తన పవరేంటో నిరూపించుకొన్నాడు కేసీఆర్. 

ఇది అర్థం కావాలంటే - తెలంగాణ మీద స్వచ్చమైన ప్రేమ ఉండాలి. తెలంగాణలోని అణువణువు తెలిసిన కేసీఆర్ ఆలోచనలను ఆవగింజంతయినా అర్థం చేసుకోగల మనసుండాలి. మానవీయ కోణం ఉండాలి. 
     
తెలంగాణ విషయంలో కేసీఆర్ అంటే - ఒక వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా. ఒక వ్యవస్థ. ఒక వారియర్. ఒక లోడెడ్ గన్, ఒక గైడెడ్ మిసైల్. 

తెలంగాణకు ఎవరితోనయినా ఏదైనా సమస్య ఉంది, ఉంటుంది అనుకుంటే... కేసీఆర్ వేయగల ఎత్తులను ఎవ్వరూ అసలు ఊహించలేరు. 

ఒక టి ఎం సి అంటే ఏమిటి, ఒక మెగావాట్ అంటే ఎంత, తెలంగాణలో ఏ చెరువులు ఎక్కడున్నాయి, ఏ కాలువలు ఎటుపోతున్నాయి, ఏ నది ఏవైపు పారుతోంది, ఎన్ని ఎకరాల్లో పంట పండుతోంది, ఏ పంట దిగుబడి ఎంతుంది, దేశంలో దాని స్థానం ఎక్కడ... ఇలాంటి మైక్రో ఇన్‌ఫర్మేషన్‌ను అలవోకగా ఆశుకవిత్వం చెప్పినట్టు, డెసిమల్ నంబర్స్‌లో, కేసీఆర్ చెప్పగలిగినట్టుగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఇంకో నాయకుడెవరైనా చెప్పగలడని నేననుకోను.  

ఇలా చెప్పాలంటే తెలంగాణను అమితంగా ప్రేమించగలగాలి. తెలంగాణే శ్వాసగా బ్రతకడం రావాలి. తెలంగాణ పదమే ఒక జీవనవిధానంగా జీవించగలగాలి. మొత్తంగా తన ఉనికే తెలంగాణకు ఒక పర్యాయపదం కావాలి. 

మూడంటే మూడు అక్షరాల్లో ఈ శక్తి ఉంది... 

కే. సీ. ఆర్. 

జలదృశ్యంలో పార్టీ స్థాపన నుంచి, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా... తెలంగాణ ముఖ్యమంత్రి అయి, ఏదేది మనవల్ల కాదు అని ఎగతాళి చేశారో వాటి జేజమ్మల్ని కూడా చాలెంజ్ చేస్తూ చేసి చూపించేదాకా... గత ఇరవై ఏళ్ళ నా జీవిత కాలంలో నా కళ్ళారా నేను చూసిన ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ అయిన కేసీఆర్‌కు నేను ఫ్యాన్‌ను అని చెప్పుకోడానికి నేనేమాత్రం వెనుకాడను.    
 
ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్లాల్సిన అవసరం లేదు. కాని, మన జీవితంలోని ప్రతి చిన్న పార్శ్వాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయాలను మనం పట్టించుకోవడం ఇప్పుడు చాలా అవసరం. అలా పట్టించుకోకుండా నిరాసక్తంగా ఉండిపోవడమంటే, మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేస్తున్నట్టే అనుకోవచ్చు. 

కట్ చేస్తే - 

చెదలుపట్టిన చెత్తగా మారిన సోషల్ మీడియాలోని కొంత భాగం, కనిష్ట స్థాయి ప్రామాణికత పాటించలేని కొన్ని యూట్యూబ్ చానల్స్... కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న అత్యంత ఘోరమైన ప్రాపగాండాలో వాడుతున్న భాష, పెడుతున్న థంబ్‌నెయిల్స్ కేసీఆర్‌ను గాని, టీఆరెస్ పార్టీని గాని, తెలంగాణను కాని ఏమీ చేయలేవు. 

ఈ ప్రాపగాండా వెనకున్న కుట్రల సారాంశం మొత్తాన్ని కేవలం రెండే రెండు పదాల్లో చెప్పవచ్చు... కేసీఆర్‌ను దించాలి!   

మొన్నటి రెండున్నర గంటల ప్రెస్‌మీట్‌ ద్వారా కేసీఆర్ మెరిపించిన మెరుపులకి దిమ్మతిరిగిన ఈ నెగెటివ్ ప్రాపగాండా శక్తులు ఏం చేయలేక మరింతగా రెచ్చిపోతాయి. అంటే, వారి అధమాధమ స్థాయినే కొనసాగిస్తూ, మరింత పాతాళంలోకి వెళ్తాయన్నమాట!    
 
అంతే తప్ప, ఆ రెండున్నర గంటల ప్రెస్‌మీట్‌లో - కేంద్ర బడ్జెటా్‌ను ఉతికి ఆరేస్తూ, కేసీఆర్ లేవనెత్తిన నూటొక్క పాయింట్స్‌లో ఏ ఒక్క పాయింట్‌కైనా వీళ్ళు సరైన సమాధానం ఇవ్వగలరా? 

వారివల్ల కాదు. వారికేం తెలియదు.  

ఇంకేం చేయగలరు? షరా మామూలే. (మమ్మల్ని) కుక్కలు అన్నాడు, ఊర కుక్కలన్నాడు, పిచ్చి కుక్కలన్నాడు. దిమాక్ లేదన్నాడు. ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు సబ్జెక్టు మాత్రం శూన్యం. 

కేసీఆర్ అభిమానులు, నిఖార్సయిన తెలంగాణవాదులు, తెలంగాణ బిడ్దలు, తెలంగాణ ప్రేమికులు... రాష్ట్రంలోని రాజకీయాలతో పాటు, దేశంలోని రాజకీయాలను కూడా కొంతయినా పట్టించుకోవల్సిన సమయం వచ్చేసింది. 

ముఖ్యంగా ఒక భారీ లక్ష్యంతో, ఢిల్లీలో జెండా ఎగురవేసే దిశగా, మన కేసీఆర్ అడుగులు ముందుకు కదులుతున్న ఈ తరుణంలో - నిరాసక్తంగా ఉన్న తెలంగాణ ప్రేమికుల కలాలు, గళాలు అన్నీ మేల్కొని, ఏకమై, జూలు విదిలించాల్సిన అవసరం చాలా ఉంది.  

When politics decides your future, decide what your politics should be. 

జాగో తెలంగాణ!

***

(Published in Namasthe Telangana on 4th Feb 2022)

No comments:

Post a Comment