Monday 28 February 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 3

"శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు"
అన్నారెవరో. 

బహుశా ఈ పోస్ట్ 99% మంది మిత్రులకు నచ్చకపోవచ్చు. కాని, నేను రాసిన ముందు రెండు పోస్టుల్లో ఎంత నిజం ఉందో దీన్లోనూ అంతే ఉంది. కాకపోతే, కొన్ని ఒప్పుకోవడానికి మనసొప్పదు. అంతే.  

ఈ పోస్టులో నేను రాస్తున్న దాదాపు ప్రతి చిన్న అంశం ఒక రిసెర్చ్ టాపిక్‌గా ఎక్కడో అక్కడ థీసిస్‌లుగా రాయబడివుంటాయి, పుస్తకాలుగా కూడా వచ్చి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అంత చరిత్ర, నేపథ్యం ఉన్న ఈ అంశం మొత్తాన్ని ఒక బ్లాగ్ పోస్టుగానో, ఒక ఫేస్‌బుక్ పోస్టుగానో రాయటం అసాధ్యం.

ఇదంతా తెలిసినవాళ్ళు సులభంగా అర్థంచేసుకుంటారు. తెలియని మిత్రులు నన్ను క్షమించాల్సిందిగా మనవి.          

ఇవి పూర్తిగా నా వ్యూస్. అందరికీ నచ్చాలని గాని, ఒప్పుకోవాలని గాని రూలేం లేదు. థాంక్స్ ఫర్ యువర్ టైమ్...   

కట్ చేస్తే -  

కొన్ని నిమిషాల క్రితం వరకు యూక్రేన్ రాజధాని కీవ్‌లో, ఇంట్లోనే ఉన్న బంకర్లో తల దాచుకున్న నా ఫ్రెండ్ చెప్పినదాని ప్రకారం త్వరలోనే రష్యా-యూక్రేన్ మధ్య చర్చలు ప్రారంభం కావచ్చు. చర్చల వేదికాస్థలంగా పుతిన్ సూచించిన బెలారస్ జెలెన్‌స్కీకి ఇష్టంలేదు. 

బెలారస్ పూర్తిగా పుతిన్‌కు అనుకూలం కాబట్టి! 

కాని, ఈ పోస్ట్ రాస్తున్న సమయానికి శాంతి చర్చలకు రష్యా బృందం ఆల్రెడీ బెలారస్ చేరుకుంది. యూక్రేన్ బృందం దారిలో ఉంది. అంటే - యూక్రేన్ చివరికి బెలారస్‌లోనే చర్చలకు ఒప్పుకుందన్నమాట!    

యూక్రేన్-బెలారస్ సరిహద్దు ప్రాంతంలో జరుగనున్న ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చేవరకు, యూక్రేన్ మీద రష్యా కొనసాగిస్తున్న బాంబింగ్స్, ట్యాంకర్ దాడుల వేగం కొంత తగ్గవచ్చు కాని, ఆగవు.   

మరోవైపు... మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల్లో ఉన్న నా రష్యన్ ఫ్రెండ్స్‌తో కూడా ఓ 40 నిమిషాలపాటు మాట్లాడాను. 

అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో పెడుతున్న అనేకానేక ఆంక్షల వల్ల గాని, ప్రపంచంలోని ప్రెస్, సోషల్ మీడియా, కోట్లాది ప్రజలంతా పుతిన్‌ను "యుధ్ధ పిపాసి... యుధ్ధోన్మాది" అని అనుకోవడం గురించి గాని వారికేం పెద్ద టెన్షన్ లేదు. 

"ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నది... ఇప్పుడు జరిగింది. అంతే." అన్నారొక ఫ్రెండ్. 

న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లోనూ, యూరోప్‌లోని ఇతర ఎన్నో నగరాల్లోనూ... పుతిన్‌కు, రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలు ఓకే. అది సహజం. 

కాని... ఈ దాడికి వ్యతిరేకంగా, దీన్ని నిరసిస్తూ రష్యాలోనే జరుగుతున్న ప్రదర్శనలగురించి నా రష్యన్ ఫ్రెండ్స్‌ను అడిగాను. 

"రష్యాలోని ప్రతి 10 మంది పౌరుల్లో 9 మందికి పుతిన్ అంటే అభిమానం, నమ్మకం. అది గుడ్డి నమ్మకం కాదు. గోర్బచేవ్, యెల్త్సిన్‌లు సోవియట్ యూనియన్‌ను ముక్కలు చేసి, రష్యాను మోకాళ్లమీద కూర్చొని అడుక్కునేలా చేసి వెళ్ళిపోతే... మళ్ళీ మేం ప్రపంచం ముందు తలెత్తుకొని బ్రతికేలా చేసింది పుతిన్. అందుకే మా అందరికీ పుతిన్ అంటే నమ్మకం, ఇష్టం" అన్నారు.  

రష్యాలో పుతిన్ దాడికి వ్యతిరేకంగా ఏవైతే ప్లకార్డుల ప్రదర్శనలు , ర్యాలీలు చూస్తున్నామో... అదంతా అతి స్వల్పం, నామ మాత్రం అన్నమాట. పుతిన్ అనుకుంటే, ఆ మాత్రం కూడా కనిపించకుండా చేసేవాడు కదా? 

అవును, రష్యాలో ఈ సమయానికి సోషల్ మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలున్నాయి. యుధ్ధ సమయంలో అవి తప్పవు. పెద్దగా అనుకోవల్సిన విషయం కాదు. 

ఎందుకంటే గత నాలుగు రోజులుగా నేను ఈ రెండు దేశాల్లోని నా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తున్నది సోషల్ మీడియా ద్వారానే. మాకెలాంటి ఇబ్బంది కలగలేదు. వాళ్ళు ఫోటోలు పంపిస్తున్నారు, మొబైల్‌లో లైవ్ వీడియో చూపిస్తున్నారు. ఫ్రీగా మాట్లాడుతున్నారు. 

సో, ఇదంతా... మీడియా, సోషల్ మీడియా చేస్తున్న 'అతి' తప్ప మరొకటి కాదు.   

కట్ చేస్తే -   

అమెరికా, సి ఐ ఏ ల శక్తివంతమైన దీర్ఘకాలిక పథకంలో పావుగా మిఖయిల్ గోర్బచేవ్‌కు 1990 లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. గోర్బచేవ్ పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్‌నస్త్ (బహిరంగత) నినాదాలు అగ్రరాజ్యంగా ఒక వెలుగు వెలిగిన సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి వేసిన పునాదులయ్యాయి. 

1991 క్రిస్టమస్ రోజు, మాస్కోలోని క్రెమ్లిన్ పైన సుత్తి-కొడవలి ఉన్న ఎర్రటి జెండా చివరిసారిగా అవనతమైంది. ఆ మర్నాడు, 26 డిసెంబర్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ పాత్ర, సోవియట్ యూనియన్ రెండూ పూర్తిగా రద్దయ్యాయి. 

ఆ తర్వాతిరోజుల్లో రష్యాలో మనం చూసిన వందలాది దృశ్యాల్లో కేవలం రెండు దృశ్యాలను ఇక్కడ గుర్తుచేస్తున్నాను:

> మహోన్నతమైన లెనిన్ విగ్రహాన్ని నేలమీద పడేసి, బూటుకాళ్లతో తన్నుతూ ఆనందించిన రష్యన్ పౌరులు.
> ప్రతినగరంలో వేలాదిమంది రష్యన్ పౌరులు ఏరోజుకారోజు తినే బ్రెడ్ కోసం గంటలకొద్ది క్యూల్లో నిల్చొని ఉండటం.      

కట్ చేస్తే -            

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. 

ముఖ్యంగా పూర్వపు సోవియట్ యూనియన్‌లో భాగంగా... ఏళ్ల తరబడి రెండు ప్రపంచయుధ్ధాల్లో పాల్గొని, సుమారు కోటిమందికి పైగా మిలిటరీ సిబ్బందిని, కోటిన్నరకు పైగా సాధారణ పౌరుల ప్రాణాలను కోల్పోయిన ఈ రెండు దేశాల్లో మన దగ్గరున్నంత సినిమా పిచ్చి లేదు. 

కాని, మన తెలుగు సినిమాల ప్రి-రిలీజ్ కారక్రమాల్లో సినిమావాళ్ళు రొటీన్‌గా మాట్లాడే మాటల్లాంటి ఆమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో దేశాల అధినేతలు ఎప్పటికప్పుడు తనతో మాట్లాడిన మాటల్ని నిజమని నమ్మాడు జెలెన్‌స్కీ. 

అదే అతను చేసిన పెద్ద తప్పు. 

నిజానికి ఒక దశలో యూక్రేన్ రష్యాకంటే చాలా శక్తివంతమైన దేశం. పూర్వపు సోవియట్ యూనియన్‌కు సంబంధించిన కనీసం ఒక 5000 న్యూక్లియర్ ఆయుధాల్లు యూక్రేన్‌లోనే ఉండేవి. 1994లో వాటిని నిర్వీర్యం చేయడానికి బిలియన్ల డాలర్లు చెల్లించింది రష్యా. కాని, ఆ డబ్బంతా అప్పటి ప్రెసిడెంట్ యూక్రేన్ అవినీతితో అదృశ్యమైపోయింది తప్ప, యూక్రేన్ అభివృధ్ధికి ఏమాత్రం తోడ్పడలేదు. 

ఈనేపథ్యమంతా జెలెన్‌స్కీకి తెలుసు. చరిత్రంతా జెలెన్‌స్కీకి తెలుసు. ప్రస్తుతం యూక్రేన్ ఆర్థిక పరిస్థితి కూడా జెలెన్‌స్కీకి బాగా తెలుసు. కాని, అతను వీరందరి మాయలో పడిపోయాడు. ఆ మాయలోనే - ఇటీవలివరకూ కూడా జెలెన్‌స్కీ చాలా సందర్భాల్లో రష్యాను, పుతిన్‌ను చాలెంజ్ చేశాడు. తన వెనుక వీళ్లంతా ఉన్నారనుకున్నాడు.

కాని, అదంతా ఒక తెలుగు సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ లాంటి వ్యవహారం అని తెలుసుకోలేకపోయాడు.    

వ్యూహాత్మకంగా యూక్రేన్ రష్యాకు చాలా ముఖ్యమైన దేశం. యూరోప్ నుంచి ఎవరు రష్యామీద దాడి చేయాలన్నా ముందు యూక్రేన్‌ను దాటుకొనే రావాల్సి ఉంటుంది.  

ఈ నేపథ్యంలో... రష్యా ఎప్పుడూ యూక్రేన్ తనకు మిత్ర దేశంగా ఉండాలని భావించింది. కాని, దురదృష్టవశాత్తూ... భారత్‌కు పాకిస్తాన్ ఎలాగో, రష్యాకు యూక్రేన్ అలా తయారయ్యింది. 

యూక్రేన్ తూర్పు ప్రాంతమైన దాన్‌బాస్‌లోని దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో రష్యన్ జాతీయులున్నారు. అప్పటివరకూ యూక్రేన్‌తో పాటు అధికార భాషగా ఉన్న రష్యన్ భాషను లిస్టులోంచి తీసేశారు. వారిమీద రెండవస్థాయి పౌరులుగా ట్రీట్‌మెంట్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వారు రెండు ప్రత్యేక దేశాలుగా విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. 

ఆ రెండు ప్రాంతాలమీద యూక్రేన్ బలగాలు కాల్పులు జరపని రోజు దాదాపు లేదంటే అతిశయోక్తి కాదు. 

ఈ నేపథ్యంలో 2014లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఒప్పందం జరిగింది. ఇంతవరకు ఆ ఒప్పందం అమలు కాలేదు. అక్కడ కాల్పులు, ఇతర రకాల విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది. 

రష్యా మాట ఇస్తే వెనక్కి పోదు. మనకు ఎన్నోసార్లు ఈ విషయంలో తనేంటో ప్రూవ్ చేసుకుంది రష్యా. యూక్రేన్‌లోని ఈ రెండు ప్రాంతాలకు కూడా అవసరమైన కీలక సహాయం కోసం మాట ఇచ్చింది రష్యా. చివరికి సమయం వచ్చింది... యూక్రేన్ మీద ఈ దాడికి ముందు, ఇప్పుడా రెండు ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ ప్రకటించించింది రష్యా.  

రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత ఏర్పడిన నాటో (NATO), దాన్లోని సభ్య దేశాలన్నింటి భద్రతకు ఒక సిండికేట్ లాంటిది. తెరవెనుక దాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేది మాత్రం అమెరికా. 

దాని ప్రధాన లక్ష్యాల్లో మొట్టమొదటిది - రష్యాని ఏకాకిని చేయటం. మళ్ళీ అగ్రరాజ్యంగా ఎదగకుండా చేయడం.

తమ దేశ భద్రతకు విఘాతం కల్పించేలా సభ్యత్వాలను ఇంక పెంచవద్దని ఎన్ని సార్లు రష్యా నాటోతో చర్చలు జరిపినా ఎప్పుడూ కాదనలేదు నాటో.

కాని, ఎప్పుడూ తన ప్రధాన లక్ష్యం మర్చిపోలేదు. 

1997 నుంచి ఇప్పటివరకు సుమారు ఇంకో 14 దేశాలను తన కూటమిలో చేర్చుకొంది. వాటిలో పూర్వపు సోవియట్ యూనియన్‌లోని దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ రష్యా సరిహద్దు వెంబడే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో యూక్రేన్ రష్యాతో మిత్ర దేశంగా ఉండటం వ్యూహాత్మకంగా తప్పనిసరి కాబట్టి, రష్యా దిగివచ్చి కనీసం రెండుసార్లు యూక్రేన్‌తో ఈ విషయంలో ఒప్పందాలు చేసుకొంది. 

ఒకటి - నాటోలో చేరకూడదు.  
రెండు - తూర్పు ప్రాంతంలోని దొనేత్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లోని రష్యన్ జాతీయుల మీద నిరంతర ఊచకోతలు మానాలని. 

ఈ రెండూ పెడచెవిని పెట్టింది యూక్రేన్. అసలు ఖాతరు చేయలేదు.

జెలెన్‌స్కీ వచ్చాక ఈ విషయంలో డ్రామా మరింత ఎక్కువైంది.  

2014 నుంచీ ఓపిక పట్టిన రష్యా, ఇప్పుడు దోన్బాస్ ప్రాంతంలోని ఆ రెండు ప్రాంతాల్లో రష్యా జాతీయులమీద నిరంతరం జరుగుతున్న ఊచకోతను సాకుగా తీసుకొంటూ, వారికిచ్చిన మాటనుంచి వెనక్కి పోలేమంటూ... ఎలాగూ తమ దేశ భద్రతకు ఏదో ఒకరోజు ఈ చర్య తప్పదు కాబట్టి నాలుగురోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొంది. 

ఈ దాడి వెనకున్న ఇంకెన్నో కారణాల్లో ఈ రెండు మాత్రం అతి ప్రధానమైనవి. 

యుధ్ధం ఎప్పుడూ విధ్వంసమే... 

అయితే, ఇప్పుడు రష్యా ఈ చర్య తీసుకోకపోతే, ఇంకొన్నేళ్ల తర్వాత ఇదే రకమైన దాడిని అమెరికా, నాటోల ప్రోత్సాహంతో  యూక్రేన్ రష్యామీద తప్పక చేసేది.

ప్రపంచమంతా ఇప్పుడు యూక్రేన్‌ను ఎలాగైతే అయ్యో పాపం అంటోందో, అప్పుడు రష్యా గురించి అనేది. అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్.   

గోర్బచేవ్, యెల్త్సిన్ రోజులనాటి బ్రెడ్ కోసం రోడ్డెక్కిన రష్యా తన పూర్వ వైభవం తెచ్చుకొనే దిశలో అభివృధ్ధిచెందాలంటే, పుతిన్ లాంటి నాయకులవల్లనే సాధ్యమవుతుంది. అది చేసి చూపించాడు పుతిన్. ఇంకెంతో చేయాల్సి ఉంది.   

పుతిన్‌ది రాజ్య కాంక్ష కాదు. చచ్చేవరకూ ప్రెసిడెంట్‌గానే ఉండటం ద్వారా, 69 ఏళ్ళ పుతిన్, కొత్తగా ఏదో సంపాదించుకొని అనుభవించడానికి అతనికి నిజంగా సమయం లేదు. 

రష్యాకు త్వరలో తాను ప్రెసిడెంట్ కాబోతున్న విషయం తన భార్యకే చెప్పలేదు. తన కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా సరైన వ్యక్తిని డెలిగేట్ చేసి పంపించి, తను మాత్రమే ఆ సమయంలో అటెండ్ కావల్సిన ఒక ముఖ్యమైన సమావేశానికి వెళ్ళిపోయాడు. 

ఒక ప్రెసిడెంట్‌గా పుతిన్ రాజనీతి నేపథ్యంలో ఎన్నో ఆరోపణలున్నాయి. పనిచేసేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. ఏమీ చేయలేనివాళ్ళు ఇలాంటివి మాత్రమే సృష్టించే పనిలో బిజీగా ఉంటారు.

అతని జీవితం, అతని ప్రాణం కూడా అనేక కోణాల్లో అనుక్షణం అభద్రతామయమే. ఇలాంటి అనుక్షణం ప్రాణభయంతో బ్రతికే జీవితం కోసం జీవితాంతం ప్రెసిడెంట్‌గా ఉండాలనుకోరెవ్వరూ. 

హాయిగా అతనికున్న ఆస్తులు అనుభవిస్తూ, మిగిలిన కొన్నేళ్ళు అతనిమీద ఆల్రెడీ ముద్రపడిన ఒక ప్లేబాయ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యవచ్చు.    

కాని అతని లక్ష్యం, అతని ఎడిక్షన్ వేరు... 

రష్యా. రష్యన్ ప్రజలు.  

యూక్రేన్ మీద ఈ దాడి నేపథ్యంలో పుతిన్‌కు తన దేశ భద్రత ముఖ్యం. కాని, తాను అనుకున్నట్టు జరగకపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది అందరికంటే పుతిన్‌కే బాగా తెలుసు.   

అందుకే... బెలారస్‌కు తన బృందాన్ని శాంతి చర్చలకు పంపించడానికి కొద్దిసేపటిముందు, రష్యా న్యూక్లియర్ ఆయుధాల వ్యవస్థల్లో పనిచేస్తున్న ఫోర్స్‌ను పూర్తిస్థాయిలో ఎలర్ట్‌గా ఉండాలంటూ ఆదేశాలిచ్చాడు! 

యుధ్ధం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు. కాని, ఒకసారి యుధ్ధంలోకి దిగాక ఏదైనా సాధ్యమే. ఏది ఎక్కడికైనా దారితీయొచ్చు.   

19 comments:

 1. మీ బ్లాగ్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది, మనోహర్ గారు.

  ఊపిరి సలుపుకోలేనంత పనుల్లో (సినిమాలకు సంబంధించి) తలమునకలై ఉన్నాను అంటుంటారు తరచూ. అయినా పలు అంశాల మీద పోస్టులు వ్రాస్తూనే ఉంటారు. అన్నింటిలోకి (ప్రస్తుతానికి) తలమాణిక్యం రష్యా - ఉక్రెయిన్ గొడవ మీద మీరు వ్రాస్తున్న ఈ పోస్టు(లు). ఇంత విశ్లేషణాత్మకంగా, ఆలోచనాత్మకంగా వ్రాయాలంటే ముందు అవసరమైన విషయసేకరణ చెయ్యాలి కదా. అదీ టైమ్ పట్టే పనే.

  చాలా బిజీగా ఉండే కొందరు ప్రముఖ వ్యక్తులు రచనావ్యాసంగం కూడా చెయ్యడం అంత అరుదేమీ కాదు. దానికి సరైన టైమ్ మేనేజ్-మెంట్ స్కిల్ ముఖ్యం. ఆ స్కిల్ మీలో బాగా ఉన్నట్లు అనిపిస్తోంది.

  నిజంగా మీ బహుముఖప్రజ్ఞ మెచ్చుకోదగినది 👌.

  ReplyDelete
  Replies
  1. నరసింహా రావు గారూ, మీకు నా ధన్యవాదాలు! 🙏

   Delete
  2. Creative people are multi talented.

   Delete
  3. విన్నకోట నరసింహా రావు గారూ! చేస్తున్నపనిలో అలిసిపోతే.. వేరే పనిలో విశ్రాంతి వెతుక్కుంటారు విజ్ఞులు.

   Delete
  4. చాలా పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు మీరు.😊 కుదిరినప్పుడు మనకిష్టమైన పనులకు కొంచెం ఎక్కువ సమయం కెటాయిస్తాం కదా... అంతే.

   ఎలాగూ నా అవసరం కోసం సినిమాలకు సంబంధించిన ఏదో ఒక స్టఫ్ రాస్తూనే ఉంటాను. కాని, ఇది రాయడంలో మాత్రం నాకు ఎలాంటి అవసరం లేదు. రాయాలనిపించి రాయడం.

   Thank you for your kind comments Chiru Dreams గారు!

   Delete
 2. @విన్నకోట నరసింహారావు గారు,
  సరిగ్గా నాది ఇదే అభిప్రాయం. ఆయన స్క్రిప్ట్ రైటర్ కూడా కదా...ఆయన ఏం వ్రాసారా అని చూడడం అలవాటయింది. బాగా వ్రాస్తున్నారు.

  అయితే భారత్, పాకిస్థాన్ యుద్ధం అంటూ జరిగితే పాపం "చిన్న దేశం" అని పాకిస్థాన్ మీద జాలిపడతారా అని సందేహం కలుగుతుంది. ఉక్రయిన్ కోసం మన ప్రధాని శాంతి ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారట కదా...వేచి చూద్దాం.

  ReplyDelete
  Replies
  1. నీహారిక గారు, మీకు ధన్యవాదాలు.

   పాకిస్తాన్ మీద నేను జాలి చూపను. ఇక, మన ప్రధాన మంత్రి ఏం చేసినా పుతిన్ చెయ్యాల్సింది చెయ్యక ఊరుకోడు.

   Delete
 3. మీ ఉద్దేశ్యం ప్రకారం, పూర్వపు USSR లో ఉన్న దేశాలన్నింటినీ మళ్ళి కలిపేసుకోవాలంటారు ? అంతేనా ?

  ReplyDelete
  Replies
  1. అది అసాధ్యం Venkat గారూ.

   కాని, యూక్రేన్ మాత్రం తనకు అనుకూలంగా ఉండాలన్నది భద్రతరీత్యా రష్యాకు మాత్రం అవసరం.

   Thank you for your comment.

   Delete
 4. రష్యా యుక్రేయిన్ ల మధ్య ఉన్న చారిత్రాత్మక విషయాలు, వివాదాలు చాలా బాగా వివరించారు మనోహర్ గారు.

  రష్యా కోణం నుంచి మీరు వ్రాసిన విషయాలు MSM చెప్పదు ఎందుకంటే అది వారి అజెండా కు అనుకూలం కాదు కాబట్టి. Indian leftist media is not giving the impartial coverage.

  Ukraine, in its desire for keeping its identity, collaborated with USA /EU/ NATO and antagonised Russia.
  Russia doesn't want a NATO country in its doorstep.

  Ukraine may have made some wrong choices and paying the price now.

  As per analyst Brahma Chellaney, Democrats are still in the Coldwar mindset and view Russia as enemy whereas China is the real competitor as superpower for USA.

  Wish early solace for the people of Ukraine.


  ReplyDelete
  Replies
  1. Agree with you totally, బుచికి గారు!

   Thank you so much for your comments.

   Delete
 5. ఉక్రెయిన్ హిందూదేశం లాగానే స్వతంత్ర దేశమని మర్చేపోతున్నారా మీరు ?

  ReplyDelete
  Replies
  1. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, లిబియా, వియత్నాం, పనామా, సోమాలియా, బోస్నియా, బీరుట్, గ్రెనెడా, కొసవో... ఇవన్నీ కూడా స్వతంత్ర దేశాలే అండి!

   Delete
  2. పాపం హిట్లర్ కూడా అల్లాగే అనుకున్నాడు. చివరికి గతి ఏమయిందో తెలుసుకదా !

   Delete
  3. హిట్లర్ పుతిన్‌లా అనుకున్నాడని నాకు తెలియదు!

   🙏🙂

   Delete
 6. మా ఇంటి పక్క వాళ్ళు నా మాట వినటల్లేదు అని వాళ్ళ ఇంట్లో చొరబడి వెళ్ళకొడతారా ?

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ వీళ్ళు ఇంటిపక్కవాళ్ళు కాదు సర్... విడిపోయిన అన్నదమ్ములు!

   కాని, కుటుంబ శత్రువులతో కలిసి అన్న ప్రాణాలకే హాని తలపెట్టే పనులు చేస్తున్నప్పుడు... సామ దాన బేధ దండోపాయాలతో తమ్మున్ని దారికి తెచ్చుకోక తప్పదు. అలాగని యుధ్ధాన్ని, విధ్వంసాన్ని నేను సమర్థించడం లేదు. జరుగుతున్నదాని వెనుక చారిత్రక నేపథ్యం చెప్తున్నానంతే.

   బ్లాగ్‌లో ముందే ఈ విషయం స్పష్టం చేశాను: "ఇవి పూర్తిగా నా వ్యూస్. అందరికీ నచ్చాలని గాని, ఒప్పుకోవాలని గాని రూలేం లేదు..." అని.

   Thank you for your comments, Rao garu!

   Delete
  2. హిందూ దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ నుండి విడిపోయింది. అందుకని బ్రిటీష్ వాళ్ళ మాట వినాలని ఉన్నదా ! మీరు చెప్పిన "విడిపోయిన అన్నదమ్ములు" శత్రువులుగా మారటం హిందూ దేశంలో సామాన్యం లాగా ఉంది.

   Delete
  3. బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందటం = సోవియట్ యూనియన్ నుంచి ప్రత్యేక దేశాలుగా విడిపోవడం !!
   I respect your perspective...

   🙏🙂

   Delete