Monday 14 February 2022

పుల్వమా విధ్వంసం మూలాలెక్కడ?

చాలామందికి తమకిష్టమైన నాయకుల మీద ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాని అది గుడ్డి ప్రేమ కాకూడదు. 

చరిత్రను పక్కనపెట్టే ప్రేమ, నిజాల్ని పట్టించుకోలేని ప్రేమ కాకూడదు. 

కట్ చేస్తే -

అప్పుడు భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని చితక్కొడుతోంది. అడుగడుగునా గెలుస్తూ ముందుకెళ్తోంది. ఇంకొంచెం ఓపిక పడితే పని పూర్తయ్యేది. కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకొన్న పాక్ పూర్తిగా చావుదెబ్బ తిని లొంగిపోయేది. ఆక్రమించుకొన్న కాశ్మీర్ మన అధీనంలోకి వచ్చేది. 

యుధ్ధంలో స్పష్టంగా మనదే పైచేయిగా ఉంది. మరోవైపు - అప్పటి రెండు అగ్రరాజ్యాలు అమెరికా, సోవియట్ యూనియన్ కూడా మనవైపే మాట్లాడాయి, మద్దతు పలికాయి. 

మనకు స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పాక్ వైపు మాట్లాడింది. గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్‌ను అడ్డం పెట్టుకొని, అప్పటి ప్రధాని నెహ్రూ మీద ఒత్తిడి పెంచింది. మౌంట్ బాటన్ మాట కాదనలేకపోయాడు నెహ్రూ. 

కాశ్మీర్ సమస్యను తీసుకెళ్ళి ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడు...

కేవలం మౌంట్ బాటన్, బ్రిటిష్ గవర్నమెంట్, ప్రపంచం దృష్టిలో మంచి పేరు కోసం. 

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితికి పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో, ఆ రోజునుంచీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలతో భూతలస్వర్గం కాశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది.

1947 నుంచి, మొన్నటి 14 ఫిబ్రవరి '2019 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా, ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని ఒప్పుకోడానికి మనలో చాలామంది ఏమాత్రం ఇష్టపడకపోవచ్చు. కాని, కాశ్మీర్ విషయంలో అప్పటి తన నిర్ణయం తప్పు అని తర్వాత స్వయంగా నెహ్రూనే తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 

ఇది చరిత్ర చెప్తున్న నిజం. ఫిక్షన్ కాదు. 

ఈ నిజం చాలామందికి ఇష్టం ఉండదు. నెహ్రూ మీద, ఆ కుటుంబం మీదున్న అభిమానం అడ్డొస్తుంది. 

ఆ తర్వాత సుమారు అర్థ శతాబ్దం పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, అధికారంలో ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాలు, ప్రధానులు తీసుకొన్న మరిన్ని తప్పుడు నిర్ణయాలు, రూపొందించిన పాలసీలు, చట్టాలు కాశ్మీర్‌ను ఎప్పటికప్పుడు ఒక అశాంతిమయమైన రాష్ట్రంగానే మిగిల్చాయి తప్ప ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లలేకపోయాయి.

ఫలితంగా - అప్పటి నుంచీ ఇప్పటి దాకా బలయ్యింది మాత్రం సుమారు 40 వేలమంది సైనికులు, వారి కుటుంబాలు. 

సరిగ్గా మూడేళ్ళ క్రితం నాటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ కూడా అలాంటిదే. 

ఇంకో 40 మంది వీరజవాన్ల ప్రాణ త్యాగం. 

ఊ అంటే అటు చైనా, ఇటు పాకిస్తాన్ బూచిని చూపిస్తూ ఓట్లు కొల్లగొట్టుకొని, తిరుగులేని మెజారిటీతో ఢిల్లీ గద్దెనెక్కిన నరేంద్రమోదీ కూడా ఈ ఎనిమిదేళ్లలో ఈదిశలో కూడా ఏమీ సాధించి చూపించలేకపోవడం అనేది వారి మాటలకు, చేతలకు అసలు సంబంధం లేదు అన్నది స్పష్టం చేసింది. 

శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు. ఆ ధ్వంసరచన ఇప్పటికే జరిగి ఉండాల్సింది. అలాంటి అవకాశాలు మనకు ఎన్నోసార్లు వచ్చాయి. కాని కేవలం మాటలు, వాటివెనుక ఏమీ చేయలేని ఒక అసమర్థపు నిరాసక్తతే మనవాళ్ల నిర్ణయమైంది. ఇప్పటివరకు ఢిల్లీలో కూర్చొని ఏలినవారి రొటీన్ పాలసీ అయింది. 

ఈ రొటీన్‌ను మార్చగలిగే సత్తా ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి ఢిల్లీలో వచ్చినప్పుడే దశాబ్దాలుగా పట్టించుకోని ఎన్నో సమస్యలతో పాటు, ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

ఇప్పుడు దేశంలో అలాంటి లక్షణాలున్న ఏకైక రెనగేడ్ రాజకీయ నాయకుడు ఎవరు?       

No comments:

Post a Comment