Saturday 8 June 2013

విలన్ అమిత్ కుమార్ ఎలా పరిచయమయ్యాడు? ('కల' ట్రివియా-3)

ఇంకో రెండు లేదా మూడు పోస్ట్‌లతో ఈ "కల ట్రివియా"ని ముగిస్తాను. లారెన్స్ సహృదయం గురించీ, నేను పరిచయం చేసిన ఇంకొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించీ, దాదాపు అంతా కొత్తవాళ్లతో చిత్రం రూపొందించిన ఒక కొత్త డైరెక్టర్ తొమ్మిదేళ్ల క్రితమే సినిమాకు మంచి బిజినెస్‌ని ఎలా అట్రాక్ట్ చేయగలిగాడు.. ఇవన్నీ తర్వాతి రెండు, మూడు పోస్టుల్లో మీతో షేర్ చేసుకుంటాను.

ఆ తర్వాత మాత్రం, చాలావరకు, నా బ్లాగ్ పోస్టులన్నీ షార్ట్ కట్ గా ఉండేట్టుగా, ఇంకా చెప్పాలంటే, టిట్‌బిట్స్ సైజులోనే రాస్తాను.

ప్రస్తుతం నేను చేస్తున్న 3 మైక్రో బడ్జెట్ సినిమాలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. ఈ బిజీలో టైమ్ అసలు ఉండట్లేదు. అలాగే, మీ టైమ్ విలువ కూడా నాకు తెలుసు.

కట్ టూ విలన్ అమిత్ కుమార్ -  

"కల" చిత్రం కోసం కొత్త నటీనటులు కావాలంటూ అప్పుడు "సూపర్ హిట్", "సంతోషం", "టైమ్‌స్ ఆఫ్ ఇండియా"ల్లో ఇచ్చిన మా ప్రకటనలకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఉన్న మా ఆఫీసుకి సగటున రోజుకి ఓ వందమందికి పైనే ఆర్టిస్టులు వచ్చేవారు, ఆడిషన్‌కి. అలా ఎంటరయిన వాడే మన విలన్ అమిత్ కుమార్.

ముంబైలో పుట్టి పెరిగిన అమిత్ కుమార్ తెలుగువాడే. ఒకరోజు ఉదయం అతని ఫోటోల్ని చూశాను. వాటిల్లో ఒక ఫోటో చూడగానే ఇంక అతనే "కల విలన్" అని డిసైడయిపోయాను. వెంటనే పిలిపించాను. ఆడిషన్, సెలక్షన్, అగ్రిమెంట్లు చకచకా జరిగిపోయాయి.  

అమిత్‌లో అద్భుతమైన నటుడున్నాడు. అంతకు మించి "ఇంకా..ఇంకా..ఇంకా నేను బాగా చెయ్యాలి" అన్న తపన ఉంది. ఆ తపనే అతన్ని నటుడిగా నిలబెట్టింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు - అమిత్ యాక్టింగ్‌ను నేను, మా కెమెరామన్ శంకర్, టీమ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.

అమిత్ నటనను చూసే, సినిమాలో అతని విలన్ రోల్‌కి క్లయిమాక్స్‌లో కొత్తగా చిన్న ట్విస్ట్ ఇచ్చాము. అతను నటించిన విలన్ పాత్రను "శుభం"తో క్లోజ్ చేయకుండా, హాస్పిటల్లోంచి పారిపోయినట్టు చూపించాము.  

అయితే ఇలా ఒక సీన్‌ని కొత్తగా క్రియేట్ చేయడం, విలన్‌గా అమిత్ బాగా యాక్ట్ చేయడం వంటివి సినిమాలో అతని ప్రజెన్స్ కొట్టొచ్చినట్టుగా కంపించడానికి పరోక్షంగా కారణమయ్యాయనుకుంటాను. టీమ్‌లోని కొందరు దీన్ని నేనేదో అమిత్‌కి "స్పెషల్ ట్రీట్‌మెంట్" ఇస్తున్నట్టుగా భావించారు. కొందరయితే అమిత్ నాకు 'డబ్బు ఇచ్చాడు' అని కూడా నిర్మొహమాటంగా అనేశారు! కానీ, అది నిజం కాదు.

టు బి ఫ్రాంక్, తనని తెరకు పరిచయం చేసినందుకు డబ్బు కాదుకదా.. కనీసం ఒక 'యూజ్ అండ్ త్రో' పెన్ను కూడా నేను గిఫ్టుగా అందుకోలేదు.

అప్పుడు నేను పరిచయం చేసిన అమిత్ కుమార్ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో  ఇప్పటికి కనీసం ఓ రెండొందలకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. తెలుగులో, మళయాళంలో హీరోగా కూడా చేశాడు. ఎక్కువగా మాత్రం, విలన్ లేదా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్నే చేశాడు.

ఇదంతా ఎలా ఉన్నా.. ఒక్కటి మాత్రం నిజం. తన తొలి చిత్రం లోనే, ఒక ఫుల్ రేంజ్ విలన్‌గా "కల"లో అద్భుతంగా నటించాడు అమిత్. అలా అతని నుంచి నటనని నేను రాబట్టుకోగలిగాను. చెప్పాలంటే, ఆ కేరెక్టర్లో అతను జీవించాడు!

నాకు తెలిసి, 'కల' లోని "శంకర్ భాయ్"ని మించిన కేరెక్టర్‌ను అమిత్ మరో సినిమాలో ఇప్పటికీ చేయలేకపోయాడు. నటనాపరంగా కూడా అమిత్ కెరీర్లో "ది బెస్ట్" అదే!

ఈ నిజాన్ని బహుశా అమిత్ కూడా ఒప్పుకుంటాడు ..  

2 comments:

  1. అమిత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మంచి నటుడిని వెండితెరకు పరిచయం చేశాననే సంతృప్తి మీకు చాలు!నటుడు కృష్ణ ప్రగతిని చూసి ఆదుర్తి ఎంత సంతోషించి ఉంటాడో అంతా మీరూ ఆనందించ వచ్చు!కొత్త నటీనటులను సాంకేతిక నిపుణులనూ పరిచయం చేసిన దర్శక నిర్మాతల దమ్మును నేను మెచ్చుకుంటాను.ఈనాటి పాతవాళ్ళంతా ఒకప్పుడు కొత్త రక్తమే కదా!!

    ReplyDelete
    Replies
    1. Thank you so much for your encouraging comments, Surya Prakash ji. :)

      Delete