Thursday 13 June 2013

"హాట్ కేక్" అంటే ఏంటో అప్పుడు తెలిసింది! ('కల' ట్రివియా-6)

"కల"లో నేను పరిచయం చేసిన జూనియర్ నాగార్జునని మా స్టిల్స్ ఆల్బమ్‌లలో చూసి చాలా మంది రియల్ 'నాగ్' అనే అనుకున్నారు! ఈ చిత్రంలోనే నేను ఇంకొందరు కొత్తవారిని పరిచయం చేశాను. అప్పటివరకూ జూనియర్ ఆర్టిస్టులుగా చేస్తున్నవారు కొందరిని కూడా ముఖ్యమైన సపోర్టింగ్ పాత్రల్లో ఇంట్రొడ్యూస్ చేశాను.

అలా నేను పరిచయం చేసినవాళ్లలో చాలా మంది ఇప్పుడు.. అయితే  సినిమాల్లో, లేదా టీవీలో చాలా బిజీగా ఉన్నారు.

ఉదాహరణకి - అంజు అస్రాని ని సునీల్ కాంబినేషన్లో ఒక ఫుల్ ఎపిసోడ్లో పెట్టాను.  చాలా సినిమాలు చేశాక, ఇప్పుడామె సీరియల్స్‌లో యమా బిజీగా ఉంది. టీవీ చానెల్స్‌లో ప్రోగ్రాం ప్రజెంటర్‌గా చేస్తూ, పెద్ద పెద్ద స్టార్స్‌ని కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది హీరో చెల్లెలుగా నేను పరిచయం చేసిన మంజూష.  ఇక, హీరోయిన్ చెల్లెలుగా నేను పరిచయం చేసిన కరుణ, తర్వాత హీరోయిన్ కూడా అయి ఎన్నో చిత్రాలు చేసింది. "కాల్ సెంటర్", "మంత్ర" వంటి సినిమాల్లో కరుణని అంత ఈజీగా మర్చిపోలేము. టీవీలో "విహారి" ప్రోగ్రాం ప్రజెంటర్‌గా దాదాపు ప్రపంచమంతా చుట్టివచ్చింది కరుణ.

అప్పుడు హీరోయిన్ అన్నయ్యగా నేను పరిచయం చేసిన కృష్ణ కౌశిక్ ఇప్పుడు సీరియల్స్‌లో పిచ్చి బిజీ. కౌషిక్ నాన్న శంకర్‌గారిని కూడా ఇదే సినిమాలో కౌషిక్ తండ్రిగా చూపించగలగటం ఒక విశేషం. మరొక విశేషం ఏంటంటే - ఇప్పుడు టీవీలో ఒక రేంజ్‌లో ఉన్న ప్రభాకర్ అప్పుడు హీరో రాజాకి డబ్బింగ్ చెప్పాడు!

ఇలా రాసుకుంటూపోతే ఈ ట్రివియా ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. సో, ఈ పోస్టుతో ఆ జ్ఞాపకాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నాను.

కట్ టూ హాట్‌కేక్ -    

"కల" సినిమా చేసిన ప్రొడ్యూసర్ కొత్తవాడు. బ్యానర్ కొత్తది. డైరెక్టర్‌గా నేనూ కొత్తవాణ్ణే. మా సినిమాలో హీరో రాజా అప్పటికే మూడు చిత్రాలు చేసినా, ఇంకా పేరు లేని హీరోనే. హీరోయిన్ కొత్త హీరోయినే. అయినా - మార్కెటింగ్ విషయంలో ఈ చిత్రానికి చాలా రికార్డులున్నాయి.

> ప్రసాద్ ల్యాబ్‌లో ప్రివ్యూ వేసినప్పుడు, సీట్లన్నీ నిండిపోయి.. హాల్‌కు రెండుపక్కలా, వెనకా చాలా మంది కిక్కిరిసిపోయి నిల్చుండి మరీ చూశారీ సినిమాని! అలా నిల్చుని చూసిన వాళ్లలో నేనిక్కడ పేర్లు రాయకూడని సీనియర్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. జనరల్‌గా ప్రివ్యూలకి ఇలా ఎగబడి చూడటం అనేది ఉండదు. దీనికి కారణం, నాకు తెలిసి, ఆ ప్రాజెక్టుకి నేను క్రియేట్ చేసిన పబ్లిసిటీ "హైప్" అంటే అతిశయోక్తికాదు.

> అంతకు ముందే.. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను "సుప్రీమ్" కంపెనీ మంచి రేటిచ్చి కొనుక్కుంది. ఇప్పుడసలు చిన్న సినిమాలకి ఆడియో రైట్స్ అనేవే లేవు!

> పోస్టర్ రైట్స్ కూడా ఒక చిన్న సినిమాకి ఊహించని రేంజ్‌లో అమ్మటం జరిగింది.

> మా సినిమా "శాటిలైట్ రైట్స్" కొనడం కోసం థర్డ్ పార్టీ మీడియేటర్లు పోటీపడ్డారు.

> ప్రివ్యూ వేసిన ఆ రాత్రికి రాత్రే మా సినిమాకు మంచి అవుట్‌రైట్  బిజినెస్ ఆఫర్లు వచ్చాయి.

> సౌత్‌లో హిందీ సినిమాలను రిలీజ్ చేసే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా సినిమా నైజాం ఏరియా హక్కులకోసం, మా ఆఫీసు చుట్టూ కనీసం నాలుగుసార్లు తిరిగాడు. అప్పుడు - ప్రొడ్యూసర్, బయ్యర్ 80:20 రేషియోలో  నైజామ్‌కి ఆయన ఆఫర్ 20 లక్షలు! తొమ్మిదేళ్లక్రితం ఒక చిన్న సినిమాకి.. ఒక్క నైజాం ఏరియాకే 20 లక్షల ఆఫర్ వచ్చిందంటే మీరు గెస్ చేయొచ్చు మిగిలిన ఏరియాల్లో ఆ సినిమాకి అయ్యే బిజినెస్‌ని! అదీ 80/20 రేషియోలో! ఇప్పటికీ ఆ హిందీ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ అక్కడే క్లాక్ టవర్ దగ్గరి నవకేతన్ బిల్డింగులో ఉంది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అతి చిన్న బడ్జెట్లో నిర్మించిన "కల" సినిమాకు ఎలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ నేను అప్లై చేసానో. ఎంత మంచి బిజినెస్‌ని తేగలిగానో. స్వయంగా నేనొక ఆర్టిస్టును (పెయింటింగ్) కావటం, పోస్టర్ డిజైనింగ్, యాడ్స్ పట్ల నాకొక స్పష్టమైన అవగాహన ఉండటం, ఫొటోగ్రఫీ నా హాబీ కావటం, ప్రెస్ నోట్స్, ప్రెస్ మీట్స్.. ఇలా ప్రమోషన్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్నీ నేను యమ సీరియస్‌గా తీసుకోవడం బాగా పనిచేసింది.

అప్పట్లో కొత్తవాళ్లతో తీసిన సినిమాలకి అసలు బిజినెస్ అనేదే లేదు. అయినా, నేను ప్లాన్ చేసుకున్నట్టుగానే - భారీ రేంజ్‌లో బిజినెస్ తేగలిగాను. దీన్ని, ఖచ్చితంగా, నేను సాధించిన తొలి విజయంగా ఇప్పటికీ భావిస్తాను.

ఇక, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలోనే, నాకు ఒక ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమాకి అవకాశం వచ్చింది. మా ప్రొడ్యూసర్ మిత్రుడు, టీమ్‌లోని ఇంకో ఇద్దరు సీనియర్లు నన్ను ఆ అవకాశాన్ని వదులుకునేలా ఉచిత సలహాలిచ్చి అందులో సక్సెస్ అయ్యారు!  ఇప్పుడు అది గుర్తుకు వస్తే, నన్నునేనే తిట్టుకుంటాను. నవ్వుకుంటాను. ఇవన్నీ నగ్నచిత్రాలు.. నూరు శాతం నిజాలు ..

ఒక చిన్న ఫినిషింగ్ టచ్‌తో ఈ ట్రివియా ముగిస్తాను..

కేవలం ఒక్క నెల తేడాతో రూపొందిన రాజా ఇంకో సినిమా అసలు ఎన్ని ప్రివ్యూలు వేసినా బిజినెస్ కాలేదు! వాళ్లు పడ్డ కష్టాలు ఇండస్ట్రీ అంతా తెలుసు. చివరికి ఆ సినిమా ఎలాగో విడుదలయింది. మంచి ప్రమోషన్ చేశారు. హిట్టయింది. మా సినిమాకు ఎంతో మంచి రేంజ్ బిజినెస్ వచ్చినా మా ప్రొడ్యూసర్ దాన్ని సరైన సమయంలో, సరైన విధంగా క్యాష్ చేసుకోలేకపోయాడు. సినిమాని సొంతంగా విడుదల చేశాడు. అసలు ప్రమోషన్ చేయలేదు. ఫ్లాపయింది. అదీ విచిత్రం ..

ఒక సినిమా తీయటంలో ఉన్న కష్టనష్టాలూ, ఇప్పటిదాకా చెప్పుకున్న నిజాలన్నీ తెలియని మనవాళ్లు ఒడ్డున కూర్చుని "అది బాగా లేదు, ఇది బాగా లేదు" అని ఎన్నయినా అనొచ్చు. అలా అనే హక్కు వారికుంది. వెన్నెల్లో విహరిస్తూ ఏదో సోది రాసే కొందరు సినిమా రివ్యూయర్స్‌లాగా వాళ్లు చేయగలిగింది కూడా అదొక్కటే.

అయితే, అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా, వొళ్లు దగ్గర పెట్టుకుని ముందుకు పయనించాల్సింది మాత్రం ప్రొడ్యూసర్లూ, డైరెక్టర్లే!        

4 comments:

 1. మీ ట్రివియా లు అన్ని చాలా బాగున్నాయి .
  అంత మంచి హైప్ ఇచ్చినా , ప్రొడ్యూసర్ కాష్ చేసుకోలేకపోవడం అతని దురదృష్టం .
  ఇంతకు ముందు పోస్ట్ లు లో నటులని పరిచయం చేసారు .
  ఇంకా లోతు గా టచ్ చేస్తారనుకుంటే చివరి పోస్ట్ ని పై పై నే రాసేసారేమో అని అనుమానం . anyhow its your story .
  ఇగో ప్రొబ్లెమ్స్ ఎలా ఉంటాయో వచ్చే పోస్ట్ లో చెప్తానన్నారు ?
  ఇంతకి ఈ పోస్టర్ రైట్స్ అంటే ఎంటండి ?
  శాటిలైట్ రైట్స్ తెలుసు కాని ఈ పోస్టర్ రైట్స్ ని ఇప్పుడే వినడం .

  ReplyDelete
  Replies
  1. పోస్టర్లని ప్రింట్ చేసే కంపెనీలు నిర్మాతకి డబ్బులిచ్చి, సినిమాల పోస్టర్ల మీద హక్కుల్ని కొనుక్కుంటాయి. ఆ తర్వాత ఆ సినిమాని రిలీజ్ చేసేవాళ్లు ఎవ్వరయినా, పోస్టర్స్ కోసం ఆ కంపెనీ దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. నిర్మాత అయినా సరే. ప్రస్తుతం ఈ రైట్స్ లేవు. పబ్లిసిటీ ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి కదా!

   ఈ బ్లాగ్ పాజిటివ్ బ్లాగ్. కొన్ని పరిమితులకి లోబడి, నొప్పించకుండా నిజాల్ని రాయటమే నాకిష్టం. పైగా, నన్ను నేను విమర్శించుకోడానికి కూడా ఇదొక మంచి ప్లాట్‌ఫాం నాకు. :)

   ఈగోల గురించి కూడా రాస్తాను. ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను. చూస్తూ ఉండండి.

   Delete
 2. వేడివేడిపకోడీల్లా ఒక చిత్రం వెంటనే అమ్ముడుపోయినా పోకపోయినా ఒక చాలనచిత్రానికి దర్శకత్వం వహించడం ఒక థ్రిల్లింగ్ అనుభవం!మీరు తొలిఆవకాశం ఇచ్చినవారు తారలయి షికారానికి చేరుకొని ఆనక మిమ్మల్ని ఖాతరు చేయకపోవచ్చును!కాని కొత్తరక్తాన్ని ప్రవేశపెట్టినప్పడి సంతోషం ఎల్లలు లేనిది,అనిర్వచనీయం ,అవర్ణనీయం,అనుభవయిక్యవేద్యం!ఈ అంశం మీదే మంచిచలనచిత్రాలు లోగడ వచ్చాయి!

  ReplyDelete