Sunday 17 March 2013

వదిలేయాల్సింది తెల్సుకుంటే చాలు!


ఈ బ్లాగ్‌లో నేను రాసే ప్రతి టాపిక్ కూడా - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - అంతిమంగా చేరుకునే గమ్యం క్రియేటివిటీనే.

లెక్కకుమించిన టీవీ చానెళ్లు, ఇంటర్నెట్, గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీలు... ఇవన్నీ సమాచారపరంగా మన మస్తిష్కాలపైన, మన సమయంపైన, మన జీవితాలపైన చేస్తున్న దాడి అత్యంత దారుణమైన స్థాయిలో ఉంది.   దీన్ని గమనిస్తున్నవారు తక్కువ. గమనించి, ఈ ఆధునిక సమాచార విప్లవాన్ని తమకు అనుకూలంగా చేసుకుంటున్నవారు మరీ తక్కువ. వివిధ క్రియేటివ్ ఫీల్డుల్లోనే కాకుండా, వ్యాపార రంగాల్లో కూడా ఉండే అత్యంత తెలివయిన ఈ తక్కువ జనాభానే అనుకున్నది ఏదయినా చేయగలుగుతారు. చిన్నవయినా, పెద్దవయినా ... ఆయా రంగాల్లో వారు అనుకున్న సామ్రాజ్యాల్ని సృష్టించుకోగలుగుతారు.

"నేను ఏదయినా సాధించగలను" అన్న అలోచన చాలా భయంకరమైంది. ఆచరణకు దూరంగా నిలిపే ఈ అలోచన ఒక్కటి చాలు... ఒక మనిషి జీవితం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అసంతృప్తితోనే సమాధికావడానికి.

నాకు తెలుసు. పర్సనల్ డెవెలప్‌మెంట్ థియరీల ప్రకారం - మీరు చదువుతున్నది కొంతవరకు "కాంట్రడిక్టరీ"గా అనిపించవచ్చు. కానీ, క్రియేటివిటీ విషయంలో మాత్రం ప్రాక్టికల్‌గా ఇదే నిజం. మనకి మనం కొన్ని పరిమితులు పెట్టుకోవటం ద్వారానే నిజమయిన స్వతంత్రాన్ని పొందగలుగుతాం. నిజమైన లక్ష్యాల్నీ, విజయాల్నీ కొన్నిటినయినా సాధించగలుగుతాం.

ఒక పెద్ద రచయిత కావాలనుకున్న లక్ష్యం ఉన్నవాళ్లు కనీసం ఒక చిన్న కథానికనయినా ముందు రాసెయ్యాలి. కనీసం ఆ ఆలోచనను పేపర్ మీద పెట్టెయ్యాలి. ఎం ఎఫ్ హుస్సేన్ రేంజ్‌లో ఒక ఆర్టిస్టు కావాలనుకునేవాళ్లు కనీసం సింగిల్ కలర్లోనయినా ఓ చిన్న పెయింటింగ్‌ను ముందు గీసెయ్యాలి. ఇదే విధంగా - ఒక బిజినెస్‌మ్యాన్ కావాలనుకునేవాడు ముందు అసలేమీ పెట్టుబడి లేకుండానే అతి చిన్న స్థాయిలోనయినా ఒక వ్యాపారపరమయిన లావాదేవీ పూర్తి చేసెయ్యాలి.

ఈ మాత్రం చేయడానికి 'అన్నీ' ఉండనక్కర్లేదు. ఏ ఇతర సాకులతోనూ తప్పించుకోలేరు. ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఉన్న సమయం, స్థలం, మేధస్సు, మెటీరియల్స్‌తోనే ఈ స్థాయిలో మీ ప్రయాణం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఒక గైడెడ్ మిస్సైల్‌లాగా మీ  క్రియేటివ్ జర్నీ అదే కొనసాగుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.

దీనికోసం మొట్టమొదటగా ఎవరయినా చేయాల్సింది ఒక్కటే. 'ఏది కావాలి' అన్నది మీకు తెలుసు. 'ఏది సాధించాలో' మీకు తెలుసు. అది పొందకుండా, అది సాధించకుండా, ఆ దిశలో మీరు ముందుకు కదలకుండా మిమ్మల్ని ఆపుతున్నది, మీ సమయాన్ని తినేస్తున్నది ఎవరో, ఏంటో ముందు మీరు గుర్తించాలి. ఆ వ్యక్తిని లేదా ఆ విషయాన్ని వెంటనే వదిలేయ్యాలి.

పనికిరాని స్నేహాలు కావొచ్చు. అడుగు ముందుకు వేయనీయని శాడిస్టు జీవిత భాగస్వామి కావొచ్చు. వదిలేయక తప్పదు. లేదా, ఏదో ఒక రూపంలో ఒక ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు. అలాగే - టీవీ చానెళ్లు కావొచ్చు. గమ్యంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్ కావొచ్చు. ఫేస్‌బుక్‌లాంటి ఒక లక్ష్యం లేని సోషల్ నెట్‌వర్కింగ్ కూడా కావొచ్చు. "అన్నీ ఉన్నప్పుడే నేను ఏదయినా చేయగలను" అన్న ఒక అసమర్థపు ఆలోచన కూడా కావొచ్చు. ముందు వీటిని గుర్తించాలి. ఏదో రకంగా, ఆ క్షణమే వీటికి చెక్ పెట్టేసెయ్యాలి.  

అంటే - ఏది వదిలెయ్యాలో ముందు మనం తెలుసుకోవాలి. వెంటనే ఆ పని చేసెయ్యాలి. ఆ తర్వాత ఏది కావాలో అది మనకు తప్పక చేరుతుంది. ఒక అద్భుతం లాగా. ఊహించనత తక్కువ సమయంలో.

1 comment: