Friday 6 June 2014

కథ చెప్పడానికే 6 నెలలా?

నాకు బాగా దగ్గరగా తెలిసిన ఓ వర్ధమాన దర్శకుడు తన తొలి చిత్రాన్ని పేరున్న హీరోతోనే చేయాలని డిసైడ్ అయ్యాడు. తప్పేం లేదు.

తొలిచిత్రంతో కాస్తంతయినా గుర్తింపు వస్తేనే ఏ దర్శకుడయినా ఇండస్ట్రీలో బ్రతకగలుగుతాడు. తర్వాత అవకాశాలకి పెద్ద సమస్య ఉండదు. సో, మనవాడి నిర్ణయం మంచిదే.

తొలిచిత్రం సూపర్ డూపర్ హిట్ ఇచ్చి, మరికొన్ని చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఖాతాలో ఉండి, ఇటీవలికాలంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న ఓ కుర్ర హీరోని కలిసి కథ చెప్పడానికి..చాలా కష్టపడి.. ఎలాగో "రూట్" సంపాదించాడు మన దర్శకుడు.

అదీ ప్రారంభం ..  

గత 6 నెలలుగా ఆ హీరో, హీరో తాలూకు మనుషులు, వందిమాగధులు వగైరా.. వరుసగా కథ వింటూనే ఉన్నారు. మనవాడు చెప్తూనే ఉన్నాడు. అది ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ఎలా ముగుస్తుందో కూడా తెలీదు. ఇంకో ఆర్నెల్లు ఇలాగే తిప్పి, చివరికి, "నో" అన్నా ఆశ్చర్యం లేదు.

నాకు తెలిసి, 99% చివరికి జరగబోయేది అదే!

అసలు కథ "చెప్పడమేంటి?"

అదికూడా.. సంబంధం లేని ఇంతమందికి ఇన్నేసి నెలలుగా చెప్పడమేంటి? ఈ చెత్త సంస్కృతి ఇంకెన్నాళ్లు?

కట్ టూ మన దర్శకుడు - 

చాలా ఏళ్ల క్రితం.. గుంటూరులోని ఓ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో (నవోదయ విద్యాలయ) నేను పని చేసినప్పుడు, ఈ వర్ధమాన దర్శకుడు అక్కడ నాకు స్టూడెంటు.

టాలెంట్ ఉంది. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి టెక్నికల్‌గా చాలా తెలుసు. కెమెరామెన్‌గా కూడా చేశాడు. బోల్డన్ని యాడ్స్ చేశాడు. ఊరికే "కథ చెప్పడం" కాదు.. బౌండెడ్ స్క్రిప్టులు, స్టొరీ బోర్డులు పూర్తిచేసుకొని మరీ తిరుగుతాడు.
అయినా ఏమీ కదలట్లేదు. కదలదు అంత తొందరగా. దానికి కొన్ని లెక్కలుంటాయి.

అంతా పెద్ద మేనిప్యులేషన్. మాయ.  

ఇప్పటికే, ఇంకా దర్శకుడు అవకముందే.. ఇండస్ట్రీ ఏంటో 90 శాతం అర్థం చేసుకోగలిగాడు మన దర్శకుడు. మిగిలిన 10 శాతం మాత్రం చచ్చినా అర్థం కాదు. కానీయరు. అదే మన ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఓ చెత్త సంస్కృతి.

ఏమైనా, ఐ విష్ అవర్ డెబ్యూ డైరెక్టర్ ఆల్ సక్సెస్.. వెరీ సూన్!

***

(ఎడిట్, 22 ఆగస్ట్ 2014: నా బెస్ట్ విషెస్ ఫలించలేదు. ఇంకా పెళ్లికూడా చేసుకోని ఈ యువ దర్శకుడు, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆకస్మికంగా నిన్నరాత్రి మరణించాడు.)   

1 comment: