Saturday 14 June 2014

"ధరణి" సిర్ఫ్ హమారా!

చేసే ప్రతి చిన్న పని వెనక ఏదో ఆశించి పని చేయడం ఒక సంస్కృతి. తను నమ్మిన ఒక సిధ్ధాంతం గురించి, వ్యక్తి గురించి.. ఏమీ ఆశించకుండా.. యుధ్ధభూమిలో ఒక సైనికునిలా తను అనుకున్నదే చేస్తూ ముందుకు దూసుకెళ్లడం ఇంకో సంస్కృతి.

మిత్రుడు ధరణి కులకర్ణి ఈ రెండో కల్చర్‌కు చెందినవాడని నా వ్యక్తిగత నమ్మకం. నిజం కూడా అదే.

టీవీ ఛానెళ్లలో, న్యూస్‌పేపర్లలో, ఇంటర్‌నెట్‌లో తప్ప - ధరణి ఎప్పుడూ కె సి ఆర్ ని కలవలేదు. చూడలేదు. పోనీ, ధరణి టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తా అంటే అది కూడా కాదు. జస్ట్ ఒక తెలంగాణ బిడ్డ.

కె సి ఆర్ ని, అతని నాయకత్వంలో టి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమాన్నీ.. మనసా వాచా కర్మణా నమ్మాడు ధరణి. ఒక తెలంగాణ బిడ్డగా, ఉడతా భక్తిగా, తనూ ఉద్యమానికి కొంతయినా ఉపయోగపడాలనుకున్నాడు. అంతే.

హైదరాబాద్‌లోనే తనకున్న చిన్న వ్యాపారం చేసుకుంటూనే, ఫేస్‌బుక్ మీద ఓ కన్నేశాడు ధరణి.

కట్ టూ ఒక ఫ్లాష్  - 

"హైదరాబాద్ సిర్ఫ్ హమారా!" పేరుతో ఒక ఓ ఫేస్‌బుక్ గ్రూప్‌ని క్రియేట్ చేశాడు. కేవలం కొద్ది రోజుల్లోనే వేలాదిమంది సభ్య్లులు స్వఛ్ఛందంగా చేరేలా ఆ గ్రూప్‌ని యమ అగ్రెసివ్ టోన్ లో తీర్చిదిద్దాడు. వయస్సు, చదువు, ఉద్యోగం, వృత్తి, వ్యవహారాలతో సంబంధం లేకుండా ఎందరో ఆ గ్రూప్‌లో సభ్యులయ్యారు. ఈ ఒక్క గ్రూప్‌ని ప్లాట్‌ఫామ్ చేసుకొని, తర్వాత మరెన్నో లైక్‌మైండెడ్ గ్రూపుల్లో తన భయం లేని పోస్టింగులతో చొచ్చుకుపోయాడు.

కేవలం ఒక 25 వేలమంది నెట్‌వర్క్ అలా లక్షలాదిమందిని రీచ్ అయ్యింది. అయ్యేలా చేశాడు.

ఎన్ని చేసినా - ఒకే ఒక్క సింగిల్ లక్ష్యం పైనే అతని దృష్టి. ఒక్క అంశానికే అతని మద్దతు.

అది.. తెలంగాణ. దానికోసం పోరాడుతున్న కె సి ఆర్, అతని సేన.

ఎందరినుంచో ఎన్నో బెదిరింపులు. అయినా భయపడలేదు ధరణి. ఉట్టుట్టి టైమ్‌పాస్ కోసమే కాదు. ఉద్యమం కోసం కూడా ఫేస్‌బుక్ ని ఉపయోగించి లక్షలాదిమందిని ప్రభావితం చెయ్యొచ్చని నిరూపించాడు ధరణి.

ధరణి చేసిన ఆ ఆన్‌లైన్ కృషి ప్రభావం చెప్పలేనంత. ఇంకా చెప్పాలంటే - స్వయంగా అతనే ఊహించనంత!

తెలంగాణ వచ్చింది ..

వన్ ఫైన్ మార్నింగ్ కె సి ఆర్ పొలిటికల్ సెక్రెటరీ శేరి సుభాష్ రెడ్డి దగ్గర్నుంచి ధరణికి కాల్ వచ్చింది. అది కె సి ఆర్ నుంచి వచ్చిన పిలుపు!

కట్ టూ ఆ 10 నిమిషాలు - 

ఒక ముఖ్యమంత్రి, అంతకు ముందు ఒక ఉద్యమ నాయకుడయిన కె సి ఆర్ ని కలవడానికి ఆయన ఆఫీసులో ఎమ్మెల్లేలు, ఎమ్‌పీలు, పార్టీ లీడర్లు, పారిశ్రామికవేత్తలు మొదలైన వి ఐ పి లు ఎందరితోనో అక్కడ ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే - అక్కడ కె సి ఆర్ గడిపే ప్రతి నిమిషానికీ ఎంతో విలువ ఉంటుందన్న విషయం కూడా ఎవరయినా ఇట్టే ఊహించవచ్చు.

అలాంటి పరిస్థితుల్లోనూ, ధరణి ఒక్కడితోనే, పది నిమిషాలకి పైగా .. అన్ డివైడెడ్ అటెన్షన్‌తో గడిపాడు కె సి ఆర్.

"ధరణీ, యువర్ పోస్ట్స్ ఆర్ వెరీ గుడ్! ఫేస్‌బుక్ ద్వారా మీరు చేసిన, చేస్తున్న శ్రమ నేను మర్చిపోలేను. చాలా బాగా చేసిన్రు! అయాం విత్ యూ బ్రదర్!! మీ ఫేస్‌బుక్ గ్రూప్ మిత్రులందరితోనూ ఒకరోజు డిన్నర్ ప్లాన్ చేస్తాను. మనమందరం తప్పక కలుద్దాం!"

ధరణితో గడిపిన ఆ పది నిమిషాల్లో కె సి ఆర్ మాటల సారాంశం అది.

కె సి ఆర్ నుంచి తనకి వచ్చిన ఆ రెడ్ కార్పెట్ వెల్‌కమ్ కే ఇంకా తేరుకోని ధరణి, కె సి ఆరే స్వయంగా ఫేస్ టూ ఫేస్ ఈ మాటల్తో మెచ్చుకోనేటప్పటికి అసలు కలా నిజమా తేల్చుకోలేకపోయాడు.

ఇప్పటికి కూడా, అప్పుడప్పుడూ.. ఆ రోజు జరిగింది, తను కె సి ఆర్ ని కలిసింది.. అసలు కలా, నిజమా అనిపిస్తుంది మిత్రుడు ధరణికి.

నిజమే అని తెలిసినా - ఆనాటి ఆ మధురసృతిని అలాగే పదిలంగా నిలుపుకోవాలనుకుంటున్నాడు ధరణి. అవకాశం ఉన్నా.. మళ్లీ వచ్చినా.. కె సి ఆర్ ని మళ్లీ మళ్లీ కలవాలనుకోవడం లేదు ధరణి.

కె సి ఆర్ తో ఆ ఆత్మీయ ఆలింగనంలో అంత శక్తి ఉంది. ఇప్పటివరకూ, కె సి ఆర్ కూడా బహుశా అంత అభిమానంతో ఎవరితోనూ ఫోటోలు తీసుకోలేదు.

"అందరూ ఆడిపోసుకుంటున్నట్లుగా - కె సి ఆర్ నిజంగా ఒక "దొర ఫీలింగ్" ఉన్నవాడయినట్లయితే - ఓ అతి మామూలు పౌరుడినయిన నన్ను గుర్తించి, పిలిపించి ఇంత ప్రేమ చూపించేవాడా?" అంటాడు ధరణి.

కె సి ఆర్ ని ఉద్దేశించి "దొరల పాలన" అనే మాటని పదే పదే ఉపయోగించేవాళ్లే చెప్పాలి దీనికి సమాధానం.

కట్ టూ వాట్ నెక్స్‌ట్? - 

"తెలంగాణ రన్" పేరుతో మన కళలు, మన సంప్రదాయాలే ప్రధాన టాపిక్‌గా మరో గ్రూపుని ఇటీవలే ప్రారంభించాడు మిత్రుడు ధరణి.  రేపు (15 జూన్) గన్ పార్క్ దగ్గర "కె సి ఆర్ అభిమాన సంఘం" కూడా ప్రారంభిస్తున్నాడు. తన నమ్మకమే తన ఇష్టంగా ఇవన్నీ చేసుకుపోతున్న ధరణిని.. వ్యక్తిగత స్వార్థంతో, ఏదో ఆశించి చేస్తున్నాడని ఎవరయినా అనగలమా?  

కట్ టూ మన జకెర్‌బర్గ్ ఫేస్‌బుక్ - 

తోచిన ప్రతి చెత్తా పోస్ట్ చేస్తూ, జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయడమొక్కటేకాదు. "ఉద్యమాలకు మద్దతుగా కూడా ఫేస్‌బుక్‌ని అత్యంత విజయవంతంగా ఉపయోగించవచ్చు" అని నిరూపించిన మన హైదరాబాద్  ధరణి కులకర్ణి ని అభినందించకుండా ఎలా ఉండగలం?   

No comments:

Post a Comment