Monday 18 March 2019

వొక ఆధ్యాత్మిక క్షణమ్

"ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి..
ఎలాగు పోయేవాళ్ళమే ..
కాస్త.... వెనుక ముందూ..
ఈ లోగానే
విద్వేషాలు..విషం చిమ్ముకోవడాలు అవసరమా?"

ఆమధ్య, అనుకోకుండా ఒకసారి, సీనియర్ జర్నలిస్టు కె ఎన్ మూర్తి గారి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఇది చదివాక చాలా ఆలోచించాను.

బాగా డిస్టర్బ్ అయ్యాను.

మొన్నీమధ్యే నా చిన్న తమ్మున్ని కోల్పోయాను. అంతకు రెండేళ్లక్రితం మా అమ్మ మాకు దూరమైపోయింది.

చావు, పుట్టుకలు మనచేతిలో ఉండకపోవచ్చు. మనం అస్సలు ఊహించనివిధంగా జరగొచ్చు. కానీ, ఇవి జరిగిన సమయంలో నేను నేనుగా లేను. అది నన్ను ఇంకా ఇంకా బాధిస్తుంది.

ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం,  అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.

కానీ, అన్నీ జరిగాయి.

అదే జీవితం.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అదే జీవితం. అదే ఆధ్యాత్మికమ్.

ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ ఆనందం వేరు.

ఆ నిశ్చలత్వం .. ఆ నిశ్శబ్దం .. అసలా కిక్కే వేరు.

అందుకే, 1920 ల్లోనే మహా అగ్రెసివ్ రచయిత అయిన చలం లాంటివాడు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు.

అలాగని ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయటం కూడా కాదు.

కాకూడదు.

2 comments:

  1. ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయమని ఎక్కడా లేదు. అలా ఎవరైనా చెప్తున్నారూ అంటే మీరు వదిలేస్తే వాళ్ళు పట్టుకోడానికి రడీగా ఉన్నారని అర్థం.

    ReplyDelete
  2. ఈ గమనిక మన జీవనయానాన్ని సంతోషాలతో సాగనిస్తుంది

    ReplyDelete