Tuesday 4 October 2022

కేసీఆర్... ఒక చారిత్రక అవసరం!


"ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్‌డేట్‌గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటేనే సమాజం పెద్ద దెబ్బ తింటుంది" అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఈ మాటలు ఏదో పొద్దుబోక చెప్పిన మాటలు కావు. ఒక పెనుప్రమాదపు అంచున ఉన్న దేశాన్ని, దేశ సంపదను, సంస్కృతిని కాపాడుకొనే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం.    

అసలెందుకు ఇప్పుడీయనకు కొత్తగా ఈ తలనొప్పి? తెలంగాణ సాధించింది చాలదా? ముఖ్యమంత్రిగా సంచలనాత్మక స్థాయిలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నది చాలదా? తెలంగాణ ఉన్నన్నాళ్ళు ఆయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది కదా - ఇంకెందుకు ఈ ఆరాటం?... అని కొందరికి సహజంగానే అనిపిస్తుంది.

ముఖ్యమంత్రి పదవి సరిపోలేదు, ఇప్పుడిక ప్రధానమంత్రి పదవి మీద ఆశ పుట్టింది అని ఇంకొందరు అల్పజీవులు అనుకుంటారు.

కాని, నిజం వేరు. 

పని అయిపోయింది కదా అని చేతులు ముడుచుకొని కూర్చుండే వ్యక్తి కాదు కేసీఆర్. నా రాష్ట్రం బాగుంది చాలు, దేశం ఏమైపోతే నాకెందుకు అనుకునే వ్యక్తిత్వం కాదు కేసీఆర్. 60 ఏళ్ళుగా తెలంగాణలో ఎవ్వరూ చేయలేని పనుల్ని కేవలం ఎనిమిదేళ్ళలో ప్రపంచస్థాయి వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు మెచ్చుకునేంతగా సాధించిన తన అనుభవం, కృషి జాతీయస్థాయిలో దేశం కోసం కూడా ఉపయోగించాలన్నది ఆయన తపన.

ఈ తపనను తప్పుపట్టేవాళ్ళు 75 ఏళ్ళుగా అంతకుముందూ ఏం చెయ్యలేకపోయారు, ఇప్పుడూ ఇక ముందూ కూడా ఏమీ సాధించలేరన్నది నగ్నసత్యం.

లోకం అంతగా తెలియని యువత ఒక్కటే కాదు, విద్యావంతులు మేధావులు అనుకున్నవారు కూడా ఒకరకమైన ఎడిక్షన్‌కు లోనవుతున్నారు. అది త్రాగుడో, మత్తుమందులో కాదు... దైనందిన జీవితంలో బ్రతకడానికి బుక్కెడు బువ్వ పెట్టని అతి సున్నితమైన వ్యక్తిగత నమ్మకాలతో ఆడుకునే విషసంస్కృతికి బానిసలవుతున్నారు.

ఎనిమిదేళ్ళుగా దేశంలో జరిగిన అభివృద్ధిని గురించి గాని, సాధించిన విజయాలను గాని నిర్దిష్టమైన అంకెల్లో చూపించలేరు, చెప్పలేరు. "ప్రపంచంలో భారతదేశం వెలిగిపోయేలా చేశాం ఇంకేం కావాలి" అంటారు. వెలిగిపోవడం కాదు, పరువు పోతోందన్నది కనిపిస్తున్న సత్యం. ఇది నమ్మటం ఇష్టం ఉండదు.

బాహాటంగా నేషనల్ మీడియాలో కేసీఆర్ లాంటి నాయకుడు స్టాటిస్టిక్స్‌తో కలిపి సంధించే ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం ఉండదు. అర్థంలేని అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో మరింత విషాన్ని కక్కడం ఒక్కటే వారు చేయగలిగింది. అదే చేస్తున్నారు.

సమాజశ్రేయస్సుకు ఏరకంగానూ ఉపయోగపడని ఈ విషసంస్కృతిని విస్తరింపజేయడమే పనిగా పెట్టుకొని రాజకీయంగా ఎదిగే ఈ శక్తులు విచ్చలవిడిగా బుసలుకొడుతున్నాయి.   

ఇలాంటి ప్రమాదకరమైన ధోరణి నుంచి దేశాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఇప్పుడు ప్రజలందరి ముందున్న ప్రథమ కర్తవ్యం.

ఎన్నిక చేసుకున్న ఒకరిద్దరు బడా కార్పొరేట్లకే దేశంలోని ప్రభుత్వ సంస్థలను, సంపదను కట్టబెడుతూ రైతులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ శాడిస్టిక్ ధోరణికి ఇప్పటికిప్పుడు చెక్ పెట్టాలి. దీనికోసం సమర్థుడైన ఒక నాయకుడు కావాలి.

దేశంలోని రైతులందరూ ఇప్పుడు కేసీఆర్‌లో అలాంటి నాయకున్ని చూస్తుండటం ఒక శుభపరిణామం. క్రమంగా దేశంలోని యువత, ఎంట్రప్రెన్యూర్స్, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలవారందరు కూడా కేసీఆర్ వైపే చూస్తున్నారన్నది ఇప్పుడు మనం చూస్తున్న ఇంకో అద్భుత పరిణామం.   

ఇప్పటిదాకా తెలంగాణలోని అణువణువు గూర్చి ఆశువుగా గణాంకాలతో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు యావత్ దేశం గురించి కూడా అంతే లోతైన అధ్యయనంతో ప్రతి ఒక్క అంశం పైన స్పష్టంగా, ఆశువుగా వివరిస్తుంటే నేషనల్ మీడియాతో పాటు యావత్ దేశం సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది.

తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ విసురుతున్న సవాల్‌కు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు. వారి ఫాలోయర్స్ దగ్గర కూడా - మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప ఇంకేం లేదు.  

ఎంతసేపూ రాజకీయాలే కాదు. ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువకాకుండా అన్నిరకాల వనరులుండి కూడా, సిగ్గుచేటైన విధంగా 75 ఏళ్ళుగా ఇంకా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం"గానే ఉన్న మన దేశాన్ని ఒక ధనికదేశంగా అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసన చేర్చగల సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు మన దేశంలో ఉన్నది కేసీఆర్ ఒక్కరే.   

ఇది డిజిటల్-సోషల్ యుగం. మనిషి జీవితంలోని అన్ని కోణాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు మన దేశంలోని రాజకీయాల్లో కూడా రావాల్సిన సమయం వచ్చేసింది. ఆ మార్పు కోసం మరోసారి మరొక మహోజ్వల ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్న నాయకుడు మన కేసీఆర్ కావడం మనం గర్వించాల్సిన విషయం.

కేసీఆర్‌కు అవసరమైన స్థాయిలో మెదళ్లను ఉపయోగించి, ఈ మహాయుద్ధం విషయంలో ఆయనకు అవసరమైన తోడ్పాటుని అందించగల విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆయన పిలుపు కోసం యుద్ధక్షేత్రంలో సైనికుల్లా సర్వదా సిధ్ధంగా ఉన్నారు.         

జాతీయ పార్టీ ప్రకటనతో ఈ విజయదశమికి సమరశంఖం పూరిస్తూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మన కేసీఆర్‌కు శుభస్వాగతం పలుకుదాం. ఈ ఉద్యమం కూడా దిగ్విజయం అయ్యేలా వారికి అన్నివిధాలా తోడ్పడుదాం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణతో పాటు, ఇప్పుడు మన దేశం కూడా సంచలనాత్మక అభివృద్ధి-సంక్షేమ పథకాల మేళవింపుతో ఒక ధనిక దేశంగా ఎదగటం మన కళ్లారా చూద్దాం. 
^^^
(నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈరోజు నా వ్యాసం) 

2 comments:

 1. మీరు రెండుపడవలలో ఒకేసారి కాళ్ళుపెడుతున్నారేమో! మీరు సినీరంగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు రాజకీయరంగంలో కూడా చురుకుగా పనిచేయాలని చూస్తున్నారని అనిపిస్తోంది. ఇలా ఉభయరంగాలలోనూ రాణించాలని ఆలోచించటం తప్పుకాదు కాని బహుకష్టం. Wish you best of luck.

  ReplyDelete
  Replies
  1. మీకీ సందేహం కలగటంలో అర్థం ఉంది. కాని, నేను ఏ పడవ మీదా లేను. రెండూ తాత్కాలికమైనవే. నా ప్రధాన లక్ష్యం, అంతిమ లక్ష్యం వేరు.

   పొలిటికల్ పోస్టులు పూర్తిగా మానేశాను. ఎప్పుడైనా దినపత్రికలో వచ్చే వ్యాసాల్ని మాత్రం ఇలా బ్లాగ్‌లో భద్రపరచుకొంటున్నాను. అంతే. ఇవి కూడా ఇక ముందు పెద్దగా ఉండవు. మాగ్జిమం ఇంకో అయిదారు...లేదా ఓ పది లోపే ఉండొచ్చు. తర్వాత అసలుండవ్!

   మీకు ధన్యవాదాలు.

   Delete