Tuesday 25 October 2022

ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అంటే నష్టం వస్తే రిఫండ్ అడగటమా?!


ఒక సినిమాను దాని మార్కెట్ వాల్యూను బట్టి, అది క్రియేట్ చేస్తున్న హల్‌చల్‌ను బట్టి డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ఒక అంచనాతో ప్రొడ్యూసర్ నుంచి ఒక రేటుకు, ఒక ఏరియాకు కొనుక్కుంటారు. 

ఆ సినిమా డిమాండ్‌ను బట్టి - డిస్ట్రిబ్యూటర్స్‌లో కూడా పోటీ ఉంటుంది. ఒక్కోసారి దాదాపు "ఆక్షన్" లాగా ఎగబడి కొనుక్కుంటారు. 

ఇక్కడ ఎవరి బలవంతం లేదు. ఎలాంటి హామీలుండవు. 

ఎంతో కొంత లాభంతోనే అమ్మేస్తారు కాబట్టి ప్రొడ్యూసర్స్ హ్యాప్పీ. 

ఇక్కడివరకు ఓకే. 

కట్ చేస్తే - 

సినిమాకు బ్రేక్ ఈవెన్ కూడా రాకుండా భారీ నష్టం వచ్చినపుడు - కొందరు హీరోలు, నిర్మాతలు, దర్శకులు నైతికంగా ఒక బాధ్యత ఫీలై - వారికివారే ఆయా డిస్ట్రిబ్యూటర్స్‌ను పిలిచి ఎంతో కొంత వారికి రిఫండ్ ఇస్తున్నారు. కొందరు తర్వాతి సినిమాల్లో అడ్జస్ట్ చేసుకునేలా మాట్లాడుకుంటున్నారు. 

అయితే - ఇది తప్పనిసరి కాదు. 

కాకపోతే - ఏ వైపు అయినా మళ్ళీ చూసుకోవాల్సింది అవ్వే డజన్ ముఖాలు కాబట్టి ఇలాంటి నైతికమైన ఆనవాయితీ ఒకటి అలవాటయిపోయింది. 

ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే - అదే సేమ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు వచ్చినప్పుడు - ఆ లాభాల్లోంచి ఒక్క పైసా నిర్మాతలకివ్వరు! 

పైన మనం చెప్పుకున్న నైతికత ఇక్కడెందుకు ఉండదు అంటే - ఉండదంతే.     

కట్ చేస్తే - 

రేపు 27 వ తేదీ నాడు, 83 మంది డిస్ట్రిబ్యూటర్స్ "లైగర్" నష్టాల విషయంలో పూరి జగన్నాధ్ ఇంటికి ధర్నా చెయ్యడానికి వెళ్తున్నట్టు ఆన్‌లైన్‌లో వార్తలు చూస్తున్నాం. 

డిస్ట్రిబ్యూటర్స్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసుకున్న మెసేజ్ ఒకటి కూడా క్లియర్‌గా ఈ విషయం గురించి చెప్తోంది. 

"ఎంతో కొంత నేను ఇస్తానని చెప్పాను. కాని మీరిట్లా నా పరువుతీసేలా ధర్నాలు పెడితే ఒక్క పైసా ఇవ్వను" అని పూరి చెప్తున్నట్టు తెలిసింది. 

నిజమే కదా? 

అసలు పూరి ఎందుకివ్వాలి? 

బలవంతంగా అతనేం నా సినిమా కొనుక్కోండని చెప్పలేదే? 

"నాకు పోకిరి నుంచి మొన్నటి ఇస్మార్ట్ శంకర్ దాకా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బకాయిలు ఇంకా రావాలి. అవన్నీ వసూలు చేసుకురండి. మొత్తం మీకే ఇచ్చేస్తాను" అంటున్నారు పూరి.

ప్రేక్షకున్ని కాలర్ పట్టుకొని నువ్వు సినిమా చూడు అని ఎవ్వడూ అడగడు.

డిస్ట్రిబ్యూటర్‌ను ఇన్నిరెట్లు రేట్ పెంచేసి ఎగబడి కొనుక్కో అని ఎవ్వడూ అడగడు. 

అంతా అనుకున్నట్టు జరిగితే - ఆల్ హాపీస్. 

కొంచెం కిందా మీదా అయిందా... ఖతమ్! ప్రేక్షకులు వెయ్యి రివ్యూలు రాస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు వెనక్కిమ్మంటారు.

ఎవరో ఒకరిద్దరు తప్ప, ఈ విషయంలో హీరోలకి పెద్దగా సంబంధం ఉండదు. ఎటొచ్చీ నిర్మాతలు, డైరెక్టర్సే చచ్చేది.  

సినిమా ఎంత పెద్ద కార్పొరేట్ బిజినెస్‌గా ఎదిగినా... తన పాతకాలపు గాంబ్లింగ్ వాసనల్ని ఇంకా వదిలించుకోలేకపోతోందని ఇలాంటి సంఘటనల వల్ల మనకు ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. 

సమస్య ఏదైనా కావచ్చు... సినిమా అనేది ఎప్పుడూ ఒక యుద్ధభూమి లాంటిదే! 

1 comment:

  1. లాభాల్లో నిర్మాతకు వాటా కొంచెం కూడా ఎన్నడూ ఇవ్వని డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో మాత్రం నిర్మాత భాగం పంచుకోవాలని అడగటమే అనైతికం నాదృష్టిలో. దీనికి అడ్డుకట్ట పడాలి.

    ReplyDelete