Saturday 4 February 2023

సంప్రదాయ సరియలిజమ్!


"ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు!" 

తాను నిమ్న కులానికి చెందినదాన్ని, ఈ బ్రాహ్మణుల ఇంట తాను వంట చేయొచ్చునో లేదో అన్న భావనతో తులసి పాత్రలో మంజుభార్గవి సందేహిస్తుంటే, శంకర శాస్త్రి పాత్రలో జె వి సోమయాజులు ఆమెతో  చెప్పే డైలాగ్ ఇది. 

బ్రాహ్మణవాది అని, సాంప్రదాయవాది అని అక్కడక్కడా వినిపించే మాటలకు ఆయన చిత్రంలోనే ఒక పాత్ర ద్వారా అంత సరళంగా, క్లుప్తంగా, సూటిగా జవాబిచ్చిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.

తెలుగు సినిమా చరిత్రలో "శంకరాభరణం" చిత్రంతో ఒక కొత్త మలుపుని తీసుకువచ్చి, భారతీయ సంగీత నాట్య సంస్కృతీ సాంప్రదాయాలను తన వరుస చిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన పయొనీర్ దర్శకులు విశ్వనాథ్ గారు. భారత ప్రభుత్వం తరపున ఆస్కార్ ఎంట్రీకి 1986 లోనే పంపించబడిన తొలి తెలుగు సినిమా "శంకరాభరణం" అన్న విషయం చాలామంది మర్చిపోయివుంటారు.

విశ్వనాథ్ శంకరాభరణం సినిమా చూసిన తర్వాతే మన ఇళ్ళల్లోని వీణలు, ఫిడేళ్ళు, ఫ్లూట్లు అటకల మీద నుంచి మళ్ళీ కిందకు దిగాయి. ఇష్టమైన వాయిద్యాలను కొత్తగా కొనుక్కొని సంగీతం క్లాసులకు వెళ్ళటం మళ్ళీ ఊపందుకొంది. 

అప్పటివరకూ ఆకాశవాణి, దూరదర్శణ్‌లకు మాత్రమే పరిమితమైపోయి, "నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు" అని బయటకు చెప్పుకోడానికి కూడా ఇబ్బందిపడినవాళ్లంతా, శంకరాభరణం తర్వాత సెలబ్రిటీలయిపోయారు. ప్రపంచమంతా ప్రదర్శనలిస్తూ పాపులర్ అయిపోయారు. సామాజికంగా ఇంత పెనుమార్పుకు ఒక్క సినిమా కారణమయ్యిందంటే అంత సులభంగా నమ్మలేం. శంకరాభరణం రూపంలో మన కళ్లముందే జరిగింది. దాని సృష్టికర్త కె విశ్వనాథ్.  

ఆ శాస్త్రీయ సంగీతం పాటల్ని నేను పాడను మొర్రో అని ఎంత తప్పించుకున్నా, తన పట్టువదలకుండా పాడించుకొని, "యస్ పి బాలు మాత్రమే అంత బాగా పాడగలడు, బాలు పాడారు కాబట్టే శంకరాభరణంలోని ఆ పాటలు అంత ఎఫెక్టుని ఇవ్వగలిగాయి" అని అంతకుముందు బాలుతో వద్దు అన్నవారితోనే శహభాష్ అనిపించగలిగిన గట్స్ కూడా విశ్వనాథ్ గారికే ఉన్నాయి. సిరిసిరిమువ్వ సినిమాతో వేటూరి సుందరరామమూర్తి రూపంలో, సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి రూపంలో ఇద్దరు అద్భుత సినీ గేయరచయితలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్ గారికే దక్కుతుంది.        


బియస్సీ తర్వాత - మద్రాసులోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగంలో ప్రవేశించిన విశ్వనాథ్ గారు, "పాతాళభైరవి" సినిమా ద్వారా 1951లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదటిసారిగా దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. 1965లో దర్శకుడిగా తన తొలి సినిమా "ఆత్మగౌరవం"కు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించిపెట్టారు. తర్వాత వారు తీసిన చెల్లెలికాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి వంటి సినిమాలన్నీ అంతర్లీనంగా ఆధునిక స్త్రీవాదానికి ఆ కాలపు ప్రతీకలుగా చెప్పవచ్చు. సిరిసిరిమువ్వ నుంచి విశ్వనాథ్ సినిమాలకు సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి కళల నేపథ్యం ఆత్మగా నిలిచింది.   

సాంప్రదాయికవాది అని కొందరు అనుకొనే విశ్వనాథ్ గారే అత్యధికమైన సంఖ్యలో సామాజిక స్పృహవున్న సినిమాల్ని తీశారన్న వాస్తవం బహుశా చాలామందికి తెలియదు. సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి సినిమాలన్నీ సామాజిక సమస్యల నేపథ్యం ఉన్నవే.

ఒకరకంగా చెప్పాలంటే - కేవలం ప్యారలల్ సినిమాల్లో మాత్రమే చెప్పగలిగే సీరియస్ సబ్జక్టులకు - భారతదేశపు కళలు, సంస్కృతీ సంప్రదాయాల వన్నెలు అద్ది, అద్భుత సినిమాలుగా రూపొందించి మెప్పించిన సరియలిస్టిక్ సాంప్రదాయవాది దర్శకులు విశ్వనాథ్. 

విశ్వనాథ్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే - ఆయన అద్భుత కళాఖండం "సాగర సంగమం" ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా మీదనే వివిధకోణాల్లో థీసిస్‌లే రాయవచ్చు. అన్ని సినిమాల్లో జయప్రద ఒక ఎత్తు అయితే - ఈ ఒక్క సినిమాలో జయప్రద వేరు. ఇదే కమలహాసన్‌కు కూడా వర్తిస్తుంది. "సాగర సంగమం సినిమాకు ముందు కమలహాసన్, సాగరసంగం తర్వాత కమలహాసన్" అని చెప్పవచ్చు.  

సుమారు ఆరు దశాబ్దాల తన చలనచిత్ర జీవితంలో - విశ్వనాథ్ గారు సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా, వీటిలో 9 సినిమాలు హిందీలో కూడా చేయడం విశేషం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు పుష్కళంగా అందుకున్న విశ్వనాథ్ గారు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని కూడా అందుకున్నారు. దర్శకుడుగా విరామం తీసుకున్న తర్వాత నటుడిగా కూడా చాలా సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు.  

సినిమా ప్రధానంగా ఒక వినోదాత్మక మాధ్యమం. అంతర్లీనంగా ఏవైనా సందేశాలుండొచ్చు కాని, సందేశాల కోసమే సినిమాలు తీయడానికి పదులు, వందల కోట్లు ఎవ్వరూ ఖర్చుపెట్టలేరు. ఆర్ట్ సినిమా-లేదా-ప్యారలల్ సినిమా వేరు. ఈ సినిమాల్లో సందేశం ఉండొచ్చు, సామాజిక స్పృహ ఉండొచ్చు. ఈ సినిమాలకు లాభనష్టాల లెక్కలు పెద్దగా ఉండవు. వీటి నిర్మాణ బడ్జెట్లు కూడా చాలా తక్కువే. ప్రేక్షకులూ తక్కువే. 

ఈ కోణంలో చూస్తే - ఎన్నో సీరియస్ సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకొని, వాటికి నేపథ్యంగా భారతీయ సాంప్రదాయిక కళల్ని ఒక షుగర్‌కోటింగ్‌లా సదుపయోగం చేసుకొని, కమర్షియల్ వయబిలిటీతో అద్భుత సినీకళాఖండాలను అందించిన విశ్వనాథ్ గారే నిజమైన రెనగేడ్ డైరెక్టర్.  

బహుశా అందుకేనేమో... రామ్‌గోపాల్‌వర్మ లాంటి విశృంఖలవాది దర్శకుడు కూడా ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా తన మీద కూడా చాలా విధాలుగా ప్రభావం చూపింది అని స్వయంగా ఒప్పుకొన్నాడు. శంకరాభరణం క్లయిమాక్స్‌లో శంకరశాస్త్రి చెప్పిన ఒక పూర్తి డైలాగ్‌ను అప్పటికప్పుడు తడుముకోకుండా చెప్పాడు.

అలాంటి శంకరాభరణం సినిమా 43 ఏళ్ల క్రితం రిలీజైన రోజు ఫిబ్రవరి 2 నాడే విశ్వనాథ్ గారు నిష్క్రమించడం విశేషం. 

***

(ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన నా వ్యాసం.) 

4 comments:

  1. వ్యాసం అద్భుతం గా వ్రాశారు మనోహర్ గారు. సరియలిస్టిక్ సాంప్రదాయవాది - 👌👌

    ReplyDelete
  2. బాలూ పాడినట్లు తాను (శాస్త్రీయసంగీతం?) పాడలేనని బాలమురళీకృష్ణ గారని ఒకాయన సభాముఖంగానే అన్నారండీ. నిజంగా మంచికంఠమూ విద్వత్తూ ఉన్న శాస్త్రీయసంగీతకారుడు ఎవరన్నా పాడి ఉంటే శంకరాభరణం సినిమా పాటలు బాగా వచ్ఛేవి కావేమో అంటే కాబోలును అనుకోవాలి. అంతే.

    ReplyDelete