Friday 1 September 2023

జ్ఞాపకాలే బాగుంటాయ్!


మా అమ్మానాన్నలకు మేం అందరం అబ్బాయిలమే. నాకు కూడా ఇద్దరూ అబ్బాయిలే.  

ఇది ఒక లోటు అని మా పేరెంట్స్ ఇద్దరూ బాగా ఫీలవుతుంటే నేను లైట్ తీసుకునేవాణ్ణి. కాని, ఇంట్లో ఒక అమ్మాయైనా లేకపోవడం నిజంగా లోటేనని కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల్లోపలే బాగా ఫీలయ్యేవాణ్ణి.

కొన్ని షేర్ చేసుకోడానికో, కొన్ని దాచుకోడానికో, కొన్ని సహాయాలు అడగడానికో... ఒక అక్కో చెల్లో నిజంగా అవసరం. 

నా జీవితంలోని ఒకటి రెండు అతి ముఖ్యమైన సందర్భాల్లో నేను ఇది బాగా ఫీలయ్యాను. కాని, ఎప్పుడూ ఎవ్వరిదగ్గరా బయటపడలేదు.
 
కట్ చేస్తే - 

మా చిన్నప్పుడు (వరంగల్లో) మా చిన్నమ్మల కూతుళ్ళు - ఇందిర, మంజుల - ఇద్దరూ ప్రతి రాఖీ పండుగకు టంచన్‌గా టైమ్‌కు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఏ మాడల్ రాఖీలు తెస్తారా అని గెస్ చేస్తుండేవాళ్లం. చాలా ఆనందంగా గడిచేది. 

ఇలాంటిదే - ప్రతి మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఒకసారి "కుడుకలు ఇవ్వటం" అనే పండుగ లేదా సీజన్ ఒకటి వచ్చేది. ఇందిర, మంజుల వచ్చి మాకు కుడుకలు ఇచ్చి, నోటి నిండా చక్కెర పోసేవారు. ఈ పండుగ సమయంలో కూడా ఇందిర, మంజుల ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్లం మేము. 

కట్ చేస్తే - 

1983లో నేను వరంగల్ వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చాను...

హైద్రాబాద్‌లో నేను హెచ్ ఎం టి లో పనిచేస్తున్నప్పుడు నా రూమ్‌కు పోస్ట్ ద్వారా వచ్చేవి రాఖీలు. తర్వాత యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు ఓయూలో నా హాస్టల్‌కు కూడా పోస్ట్‌లో వచ్చేవి రాఖీలు. తర్వాత నేను నవోదయ విద్యాలయ, గుంటూరులో పనిచేస్తున్నప్పుడు, ఆలిండియా రేడియో ఎఫ్ ఎం కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా ఇందిర, మంజుల రాఖీలను పోస్టులో కనీసం ఒకరోజు ముందుగానే చేరేలా పంపేవాళ్ళు. నా పెళ్లయిన కొత్తలో కూడా ఒకటి రెండేళ్ళు రాఖీలు హైద్రాబాద్‌కు పోస్టులో వచ్చాయి. 
 
అంతే గుర్తుంది.

క్రమంగా రాఖీలు పోస్టులో రావడం ఆగిపోయింది. కుడుకలు ఇచ్చే పండుగ గురించి పూర్తిగా మర్చిపోయాను. 

తర్వాత్తర్వాత మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువసార్లే. 

వరంగల్‌లోని మా బంధువులందరితో దాదాపు నా కనెక్షన్ కట్ అయిపోయింది. ఏ స్థాయిలో కట్ అయిపోయిందంటే - అక్కడ వరంగల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి కూడా నేను గుర్తుకురానంతగా! 

ఒకవేళ గుర్తుకొచ్చినా - ఏ వాట్సాప్‌లోనో ఒక మెసేజ్ (కాల్ కూడా కాదు!) పెట్టేసి వదిలేసేటంతగా!!
 
ఎవరో థర్డ్ పర్సన్ ఒక ఆరు నెలల తర్వాత చెప్తే గాని నాకు తెలవటం లేదు... కొన్ని ఫంక్షన్స్ జరిగాయని, వాటికి కనీసం నన్ను పిలవలేదని! 

అసలు అలాంటి బంధుత్వాలు అవసరమా అన్నది నా హంబుల్ కొశ్చన్... 

అయితే - ఇది ఎవ్వరి మీదా నా కంప్లైంట్ కాదు.
 
జస్ట్... మన ఆలోచనల్లో, మన జీవనశైలిలో వచ్చిన మార్పు గురించి ఒక అవలోకనం చేసుకోవడం. 

అంతే. 

మానవసంబంధాలను అమితంగా ప్రభావితం చేసిన ఈ మార్పు గురించి నేనిప్పుడసలు ఏమాత్రం బాధపడటం లేదు. 

ఎందుకంటే - ఎవరు ఎలా మారినా, ఏవి ఎలా మారినా - అవన్నీ చిన్నప్పటి నా జ్ఞాపకాలను ఏ మాత్రం మార్చలేవు.

ఆ జ్ఞాపకాలు చాలు నాకు.    

4 comments:

  1. మనం ఎంత బిజీగా ఉన్నా, మానవ సంబంధాలను పెంచి పోషించుకోవడం, వాటికోసం కొంత సమయం వెచ్చించడం, చాలా అవసరం. ఇప్పటికీ మించిపోయింది లేదనిపిస్తుంది.

    ReplyDelete
  2. ఒక్కమాట. జీవనం యాంత్రికంగా మారటం వలన సంబంధబాంధవ్యాలు కనుమరు గౌతున్నాయి. ఈవిషయం బాగా వివరించారు. పచ్చినిజం ఇది. ఈవిషయమై మీరు బాధపడటం మానివేసారు. మంచిదే.కాని యువతరాల్లో సంబంధబాంధవ్యాలు లోపింఛనటం వలన వచ్చే పరిణామాలు అంత మంచిని కావని మాత్రం అఃదరూళబాధపడవలసి ఉంది.

    ReplyDelete