Wednesday 16 August 2023

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహసౌరభాలు కూడా ఉంటాయి!


సినిమాఫీల్డులో నిజంగానే కొంచెం 'మెటీరియలిస్టిక్'  ఫ్రెండ్‌షిప్స్ ఎక్కువ. నాకున్న అతి స్వల్పమైన అనుభవంలోనే ఇలాంటి ఫ్రెండ్‌షిప్స్ ఎన్నో చూశాను. 

మనతో సినిమా జరుగుతున్నంత సేపు ఫ్రెండ్‌షిప్ వేరేగా ఉంటుంది. ఒకసారి పని అయిపోయిందా... ఇంక అంతే! 

> అప్పటిదాకా పొద్దునలేస్తే వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో విష్ చేసినవాళ్లు ఉన్నట్టుండి నన్ను మర్చిపోతారు. ఇప్పుడు నా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటమే వారికి చాలా కష్టంగా ఉంటుంది.
 
> అప్పటిదాకా దగ్గినా తుమ్మినా కాల్ చేసినవాళ్ళకు, పని అయిపోయాక వాళ్ల కాంటాక్ట్స్‌లో నా నంబర్ కనిపించదు. నాకు ఒక్క కాల్ రాదు. నేను కాల్ చేస్తే ఏదో సో సో... ఎప్పుడెప్పుడు పెట్టేసేద్దామా అనే!

> "నాకు అరవింద్ తెలుసు, రాజు తెలుసు, శిరీష్ తెలుసు, సురేష్‌బాబుతో మొన్నే ఒక మీటింగ్ అయింది, సో అండ్ సో నేనూ కలిసి మందు కొడతాం తెలుసా" అని నేను మొదటి చాన్స్ ఇచ్చిన తర్వాత నాతో కోతలు కోసినవాళ్లు, ఇండస్ట్రీలో పదేళ్లయినా రెండో చాన్స్ తెచ్చుకోలేదు. అదేంటో మరి!
 
> ప్యారడైజ్ రోడ్లమీద నాతో సరదాగా నడుస్తూ తిరిగి, కలిసి బీర్లు త్రాగి, బిర్యానీలు తిన్న హీరోలు ఉన్నట్టుండి ఏదీ గుర్తుకురాని గజినీలయిపోతారు. కలా, నిజమా?! 

> "వద్దురా బై, నాకది నచ్చదు" అని ఎంత మొత్తుకున్నా వినని నేను పరిచయం చేసిన ఒక విలన్... అప్పట్లో నేను కనిపించిందే ఆలస్యం... కాళ్లకి మొక్కేవాడు! రోజుకి డజన్ మెసేజెస్, అరడజన్ కాల్స్ చేసేవాడు. ఇప్పుడు కనిపించినా నేనెవరో తెలియనట్టు మరోవైపు తలతిప్పుకొని వెళ్ళిపోతాడు. అసలితను నేను పరిచయం చేసినతనేనా... అని నాకే డౌటొస్తుంది. 

> నేను సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం చేసిన ఒకరిద్దరమ్మాయిలు ఇప్పుడు యాంకర్స్‌గా మంచి స్థాయిలో ఉన్నారు. అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడైనా విష్ చేద్దామన్నా అసలు సందివ్వరు. ఏంటంత ప్రాబ్లమ్?! 

> నేను పరిచయం చేసిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అప్పట్లో నా మెసేజ్ రీచ్ అవ్వకముందే ఫాస్ట్‌గా రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు 3,4 రోజులయినా నా మెసేజ్ చూసుకోడు! అప్పుడు నేను కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. ఇప్పుడసలు రెస్పాన్స్ ఉండదు. కట్ చేస్తాడు కూడా! కలిసి పనిచేద్దామనుకుంటే అతని బేసిక్ కమ్యూనికేషన్ కోసమే నేను బెగ్గింగ్ చెయ్యాల్సి వస్తోంది!     
    
పైన నేను చెప్పిందంతా జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే. గౌరవ సీనియర్లు ఈ టాపిక్ గురించి కథలుకథలుగా మరింత బాగా చెప్తారు. 

అయితే ఇదంతా నేనసలు పట్టించుకోను. ఇప్పుడు కూడా ఇదెందుకు రాస్తున్నానంటే దానికో కారణం ఉంది.
 
కట్ చేస్తే -  

సుమారు 18 ఏళ్లక్రితం, ఒక కార్పొరేట్ అసైన్‌మెంట్ మీద నేను వైజాగ్ వెళ్లినప్పుడు, స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో అనుకోకుండా నాకొక ఆర్టిస్టుతో పరిచయం అయింది.

అప్పుడు వాళ్ల సినిమా షూటింగ్ ఆ చుట్టుపక్కల జరుగుతోంది... 

రోజూ తెల్లవారుజామున, సాయంత్రం మేమిద్దరం కనీసం ఒక రెండు గంటలపాటు బుక్స్ గురించి, క్రియేటివిటీ గురించి, సముద్రం గురించి... బోలెడంత నాన్సెన్స్ మాట్లాడుకొనేవాళ్లం.
 
నాన్సెన్స్ అని ఎందుకంటున్నా అంటే, మామధ్య టాపిక్స్ ఒకచోటినుంచి ఇంకోచోటకి క్షణంలో అలా జంప్ అయ్యేవి!
 
బాగా నవ్వుకొనేవాళ్లం. కనీసం ఒక నాలుగు కాఫీలు పక్కాగా త్రాగేవాళ్లం.

గెస్ట్ హౌజ్ చుట్టూరా ఉన్న లాన్స్, లేదా లాంజ్, లేదా ఏదో ఒక రూం... మా మీటింగ్స్‌కు వేదికలయ్యేవి.
 
ఒకవైపు వాళ్ల టీమ్, మరోవైపు నా కొలీగ్స్ మా ఇద్దరి చర్చలను చాలా విచిత్రంగా చూసేవాళ్లు. కాని, అవన్నీ పట్టించుకొనే లోకంలో మేం అసలు ఉండేవాళ్లం కాదు.

కాని - తనని పిలవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఫీలవుతూ, ఆ ఆర్టిస్టు పట్ల వారు చూపే అభిమానం, గౌరవం నాకు బాగా అర్థమయ్యేవి. 

అక్కడినుంచి ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే... 18 ఏళ్ల తర్వాత కూడా మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది.
 
"ఏం చేస్తున్నావ్... ఎలా ఉన్నావ్... యాక్సిడెంట్ తర్వాత సర్జరీ అయిన కాలు నొప్పి పూర్తిగా తగ్గిందా లేదా... పెండింగ్ సర్జరీ ఏమయింది... ఇప్పుడేం బుక్ చదువుతున్నావ్... ఏదైనా రాస్తున్నావా... ఎందుకని నువ్వు రైటింగ్‌ను సీరియస్‌గా తీసుకోవు... బ్లా బ్లా బ్లా..." 

దాదాపు 18 ఏళ్ళు దాటినా - ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా - మొన్న పొద్దుటే ఒకరికొకరం వాట్సాప్‌లో విషెస్ చెప్పుకొన్నాం. 

ఆ ఆర్టిస్టు అప్పుడూ బిజీనే, ఇప్పుడూ బిజీనే. అయినా - అంత బిజీలో కూడా - ఎక్కడో 650 కిలోమీటర్ల దూరం నుంచి ఒక స్నేహపూర్వక కాల్... ఫ్రెండ్‌షిప్‌డే విషెస్... ఓ గంటసేపు మా ట్రేడ్‌మార్క్ క్రియేటివ్ కబుర్లు... నవంబర్‌కి ఈసారి - అయితే గోవా "IFFI" లో, లేదంటే పాండిచ్చేరిలో కల్సుకోవాలన్న ప్లాన్... 

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహసౌరభాలు కూడా ఉంటాయి. 

ఇలాంటి జ్ఞాపకాలే మనతో ఉండేవి. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్.  

2 comments:

  1. Well said ... opportunistic tribe raises in the humanity! All days are not golden..🥺

    ReplyDelete