Monday 24 July 2023

"భారత రాజకీయాల్లో రాక్ స్టార్!"


మొన్నీ మధ్యే యూయస్, యూకె దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలగాణకు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా సాధించారాయన.

ఇది జస్ట్ ఒక ఉదాహరణ... 

దావోస్‌లో ఆయన నాయకత్వంలో మన తెలంగాణ స్టాల్ అంటే ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలకు, వాటి సీ ఈ వో లకు, అక్కడ కవర్ చేసే జర్నలిస్టులకు పిచ్చి క్రేజ్. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులెవ్వరూ సాధించలేని వాణిజ్య ఒప్పందాల్ని రికార్డు స్థాయిలో సాధించి అక్కడనుంచి వెనక్కి రావడం ఆయనకు ఒక హాబీ.

ఒక్కోసారి - వరుసగా ప్రతి రోజూ ఏదో ఒక భారీ జాతీయ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అనేది తెలంగాణలో ఒక సర్వసాధారణ విషయం అనిపించేలా చేశారాయన. 

టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టీ-శాట్, టాస్క్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైద్రాబాద్, తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్... దేశంలో ఎవ్వరూ ఇంతవరకు తలపెట్టని, ఊహించని ఇలాంటి ఇంకో డజన్ కాన్‌సెప్టులు, ఆలోచనలు, ఆవిష్కరణలు... ఆయన విధాన నిర్ణయాలే, ఆయన ముందుచూపే.    


ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల నుంచి ఈ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ కోసం సాధించాలంటే ఎంతో పోటీ ఉంటుంది. ఆ పోటీ మన దేశంలోని రాష్ట్రాలతోనే అనుకుంటే పొరపాటే. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ పోటీలో ఉంటాయి. 

"హైద్రాబాద్‌ను ఒక అత్యుత్తమ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విషయంలో కూడా మా ఆలోచన, మా పోటీ ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయి నగరాలతోనే తప్ప దేశంలోని నగరాలతో కాదు" అంటారాయన. 

అదీ ఆయన ఆలోచనల స్థాయి.         

విదేశాల్లో ఆయన పర్యటనలప్పుడు - వివిధ సమావేశాల్లో ఆయనతో మాట్లాడిన అక్కడి దిగ్గజ కంపెనీల అధినేతలు, సీ ఈ వోలు ఒక సందేహం వ్యక్తం చేస్తారు... "భారత దేశంలోని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల్లోని మంత్రులు ఈయనలా ఎందుకుండరు" అని.  

మామూలుగా కేంద్రమంత్రుల స్థాయిలోనే ఆహ్వానించే అనేక ప్రపంచస్థాయి చర్చాగోష్టులకు భారతదేశం నుంచి ఎవరినైనా పిలవాలనుకున్నప్పుడు అందరికీ మొట్టమొదట స్పురించే పేరు ఇప్పుడు ఆయనదే అయింది.  

అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని "ఇంత భావ వ్యక్తీకరణ, ఇంత స్పష్టత ఉన్న యువరాజకీయనాయకున్ని నేను ఎప్పుడూ చూళ్ళేదు. 20 ఏళ్ళ తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి" అని ట్వీట్ చేశారు. ఎలాంటి అతిశయోక్తి లేని ఆ ట్వీట్ సృష్టించిన సంచలనం ఇంకా తాజాగానే ఉంది. 

ఆయన కనుసన్నల్లో పనిచేసే వివిధ రంగాల్లో నిష్ణాతులైన అత్యంత సమర్థవంతమైన అధికారుల బృందం బహుశా దేశంలోని ఏ మంత్రి దగ్గరా లేకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు. అధికారుల సామర్థ్యాన్ని గుర్తించి, తదనుగుణంగా వారి సేవలను అత్యుత్తమస్థాయి ఫలితాల రూపంలో, అమిత వేగంతో రాబట్టుకోగలగటం ఆయనొక్కడికే సాధ్యం. Thanks to his dynamic Team and his unparalleled vision... ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో - గత తొమ్మిదేళ్ళలో మంత్రిగా ఆయనొక్కడి చొరవ, కృషి వల్లనే ఇప్పటివరకు మన రాష్ట్రానికి ఒక 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కనీసం ఒక 22.50 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయి.       

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ పాలిటిక్స్‌ను ఇష్టపడే పౌరులంతా "మాకూ ఆయనలాంటి ఒక మినిస్టర్ ఉంటే బాగుండు" అనుకుంటారు. అదే కోరికను ఆర్టికిల్స్‌లో రాశారు, ఉపన్యాసాల్లో మాట్లాడారు, ట్వీట్లు చేశారు, ఇతర సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. "ఈయన్ని క్లోనింగ్ చేసి, రాష్ట్రానికొకర్ని ఈయనలాంటి మంత్రిని  తెచ్చుకుంటే బాగుండు" అని కూడా సరదాగా ఆశపడ్డారు.

కట్ చేస్తే - 

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో ఆయన ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ నాన్-తెలుగు సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే - అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే - తన మార్క్ చెణుకులు ఒకటో-రెండో అలా అలవోగ్గా పడాల్సిందే! 


మొన్నీ మధ్యే ఒక పాపులర్ టీవీ చానెల్లో గంట-నలభై నిమిషాలపాటు ఎలాంటి తడబాటు లేకుండా, ఏకధాటిగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతి అంశానికి గణాంకాలనిస్తూ ఆ ప్రోగ్రాం ప్రజెంటర్‌ను ఒక ఆట ఆడుకున్నారాయన.

ట్విట్టర్‌ను కేవలం రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని దేశంలోనే మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి ఆయన. ఈలన్ మస్క్ కూడా ఆశ్చర్యపోయేలా, ఆయనలోని మానవీయ కోణాన్ని తెలిపే ఒక నిరంతర మహాయజ్ఞానికి వేదిక అయింది ట్విట్టర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా, నిత్యం తన దైనందిన రాజకీయ, ప్రభుత్వ, సాంఘిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే - ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలకు స్పందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారాయన. ఎందరి చదువులకో, జీవితాలకో ఎన్నో రకాలుగా క్షణాల్లో ఆపన్న హస్తం అందించారాయన. 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. కాని, కేవలం తన రాజకీయ లక్ష్యాల కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని ఎవరైనా అనుకుంటున్నారంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. తెలంగాణమీద మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, ఈ స్థాయి కృషి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ మమకారం ఆయనలోని అణువణువులో అనంతంగా ఉంది కాబట్టే ఇదంతా చేయగలుగుతున్నారాయన. 

ఎప్పటికప్పుడు ఎవ్వరు ఊహించని స్థాయిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, నిరంతరం "ఇంకేదో చెయ్యాలి మనం" అని తపించే ఒక డైనమిక్ మంత్రిగా, తన సామర్థ్యమే కొలమానంగా, ఈ రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది చాలా చిన్న విషయం. ఈ దేశంలోని యువతరం, పాజిటివ్ పాలిటిక్స్‌ను ప్రేమించే ఇంటలెక్చువల్స్, ఎంట్రప్రెన్యూర్స్, విద్యావంతులు ఆయన్నుంచి అంతకు మించింది ఇంకేదో ఈ దేశం కోసం ఆశిస్తున్నారు.   

ఆయన... మాస్, క్లాస్ కలిసిన మ్యాజిక్. పాలిటిక్స్‌లో ఒక మంత్రి పనితీరు ఇంత స్టయిలిస్టిక్‌గా కూడా ఉండొచ్చు అని నిరూపించిన పయొనీర్.  బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి... కేటీఆర్. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 

- మనోహర్ చిమ్మని
(వ్యాసకర్త రచయిత, ఫిల్మ్ డైరెక్టర్) 
^^^
ఈరోజు "నమస్తే తెలంగాణ" దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం. 

2 comments:

  1. Well written article.

    KTR garu is a young dynamic leader. He is one of the most talented leaders in India.

    In future he should become CM of Telangana.

    BRS should have maintained good relations with central government. Due to the strained relations with centre, Telangana has suffered

    ReplyDelete