Monday 26 June 2023

ఇకనుంచైనా వ్యవస్థను వాడుకో!


వ్యవస్థను వాడుకో...

ఇంగ్లిష్‌లో దీన్ని ఎలా చెప్పాలో తెలియక మా ఇంగ్లిష్ రైటర్‌ భరత్‌ను అడిగాను. మక్కీ కి మక్కీ కాకుండా - కరెక్ట్‌గా దీనికి సమానమైన ఎక్స్‌ప్రెషన్ ఇంగ్లిష్‌లో నాకు కూడా తెలియదు, ఆలోచించి చెప్తా అన్నాడు.  

ఉద్యోగం, బాధ్యతలు, బిజినెస్ ఆలోచనల మధ్య అంత టైమ్ దొరకే అవకాశం లేదు మా భరత్‌కు. ఇందాకే మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాను. 

కట్ చేస్తే -

ఈమధ్య నాకు బాగా దగ్గరగా తెలిసిన ఒక ఫ్రెండు - చాలా కష్టాల్లో ఉండి - అతనికి ఏమాత్రం తెలియని ఒక ఫీల్డులోకి ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళాడు. ఒకటికి పదిసార్లు నెలకు జీతం ఎంత, ట్రాన్‌స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా వుంటుందీ... అన్నీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే వెళ్ళాడు. 

ఆరు నెలలు గడిచాయి... 

శాలరీ లేదు, ట్రాన్స్‌పోర్ట్ లేదు. 

ఏ పని చెయ్యాలని అయితే అక్కడ ఉద్యోగానికి తీసుకున్నారో ఆ పని చేయించుకోడానికి అక్కడ ఫండ్స్ నిల్! 

అదొక గ్రూప్ ఆఫ్ అరడజన్ కంపెనీలు...

అక్కడసలు మాడర్న్ బిజినెస్ బేసిక్స్ కూడా తెలియవు. బిజినెస్ డల్‌గా ఉంది. 

వాళ్లకు తెలిసిందల్లా పనికిరాని ఈగోలు, ఎవరికివాళ్లే అవతలివాళ్ళ గురించి ఏదేదో అనుకోవడాలు, ఎదురుచూడటాలు, చివరికి గొడవలు... అదే బిజినెస్ స్టైల్ అనుకొని మురిసిపోవడం, అంతా బాగుంది అనుకోవడం... మళ్ళీ గొడవలు. 

ఇక, వాళ్ల కస్టమర్లతో వారికున్న గొడవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.    

అయినా సరే, బెట్టుగా ఉన్నారు. లెవెల్ తగ్గేదేలే అన్నట్టున్నారు.  

అప్పుడప్పుడూ ఖర్చుల కోసం సిగ్గు విడిచి పదో పరకో అడుక్కోలేక -  ఒక ఆరు నెలలు దాటిన తర్వాత విధిలేక గుచ్చీ గుచ్చీ అడిగాడు మా ఫ్రెండు. 

" అదేంటి... ఇంత పెద్ద పోస్టు... నువ్వు శాలరీ అడుగుతావేంటీ? ఎండీ స్థాయి పోస్టులకు శాలరీ ఉండదు. నువ్వే సంపాదించుకో, ఎంతయినా తీసుకో." 

అదీ షాకింగ్ సమాధానం!  

"నేనే సంపాదించుకొని తీసుకునేటట్టయితే - అదేదో నేనే చేసుకునేవాణ్ణి కదా..." మా ఫ్రెండు బాధతో అనుకోవడం. 

అసలక్కడ బిజినెస్ లేని పరిస్థితుల్లో ఇంకొకరికి ఏవేవో ప్రామిస్ చేసి తీసుకురావడం ఎందుకు? అనుకున్నది కాని పరిస్థితుల్లో ఆ విషయం నేరుగా చెప్పకుండా - నా ఫ్రెండుని రకరకాల మాటలతో ప్రతిరోజూ మానసికంగా హింసించడం ఎందుకు? 

"నిజంగా ఇలాంటి వ్యవహార శైలినే బిజినెస్ అంటారా? అదే నిజమైతే అలాంటి బిజినెస్ వాతావరణంలో ఇంకా నేను ఉండటం నన్ను నేను మోసం చేసుకోవడమే" అంటూ నా దగ్గర తన బాధంతా వెళ్లగక్కుకున్న నా ఫ్రెండ్‌కు నేనేం చెప్పగలను? 

స్నేహం, రిలేషన్‌షిప్స్ వేరు. మనవైపు జరిగిన పొరపాటు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎదుటివారి బలహీన పరిస్థితులతో మైండ్ గేమ్ ఆడుకోవడం వేరు. 

అయినా సరే - అక్కడ అన్నిరోజులు ఉన్నందుకు - వాళ్ళకు ఎంతో కొంత తనవైపు నుంచి ఉపయోగపడే సహాయం ఏదైనా చేసిరావాలని ఇంకా అక్కడే ఉన్న నా మిత్రుడికి ఏం చెప్పాలి?

అందుకే ఈ బ్లాగ్ పోస్టుకు హెడ్డింగ్ అది పెట్టాను... 

No comments:

Post a Comment