Thursday 6 April 2023

రాజకీయాలకు కూడా కొన్ని హద్దులుంటాయ్!


కొన్ని దేశాల్లో - చూసీ చూసీ ఏదో ఒక పీక్ స్టేజ్ వచ్చాక - అక్కడి ప్రజలు - ఒక్కసారిగా లక్షల్లో రోడ్లమీదకి వస్తారు. కదం తొక్కుతూ ముందుకు ఉరికి, ఆ దేశాధినేత భవనం మీదకు దండెత్తుతారు. గంటల్లో అతన్ని పదవీచ్యుతున్ని చేస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలెన్నో మనం కళ్ళారా వార్తల్లో చూశాము, అంతకు ముందు చదివాము. 

ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులు ఏ కోణంలో చూసినా అలాంటి పరిస్థితులకు తక్కువేం కాదు. 

ఇంత జరుగుతున్నా - మరి ఎందుకని ప్రతిపక్షాల్లో గాని, ప్రజల్లో గాని ఈ స్తబ్దత? ఈ నిశ్శబ్దం?  

గత తొమ్మిదేళ్ళలో మన దేశానికి జరిగినంత నష్టం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. పార్టీలు ఏవైనా కాని, ఎలాంటి చారిత్రక తప్పిదాలైనా చేసి ఉండనీ... దేశానికి ఇంత భారీగా నష్టం జరగాలని మాత్రం ఇంతకుముందు ఎవ్వరూ కోరుకోలేదు. నిస్సిగ్గుగా అలాంటి పనులు కూడా ఎవ్వరూ చెయ్యలేదు.      

దేశం మొత్తంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే దేశం గురించి పట్టిందా? "దేశానికి ఒక లక్ష్యం ఉండాలి" అన్నది ఆయనొక్కనికే అవసరమా? కేసీఆర్ ఒక్కడు పూనుకొని బీఆరెస్ స్థాపించకపోతే, ఇంక దేశంలో జాతీయ పార్టీలు లేవా? వాళ్లేం చేయలేరా?  

కట్ చేస్తే - 

వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపి, ఎవరినో ఏదో అన్నాడని అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేస్తే - "అది తప్పు, మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఒక్క కేసీఆరేనా గొంతెత్తి అరవాలి?

దేశంలోని మిగిలిన పార్టీలకు, నాయకులకు ఎందుకంత భయం? 

ఈ లెక్కన - గత తొమ్మిదేళ్ళుగా కేంద్రంలో రాజ్యమేలుతున్న పార్టీకి చెందిన నాయకులెందరు ఎంతమందిని ఎన్నెన్ని మాటలనలేదు? ఆ పార్టీకి చెందిన ఎంతమంది నాయకులు ఎన్నెన్ని మాటలతో హింసను ప్రేరేపించలేదు? కనీసం పండగలను కూడా వదిలిపెట్టకుండా, పండుగలనే అస్త్రాలుగా చేసుకొని, ఆ పార్టీకి చెందిన ఎంతమంది నాయకులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టలేదు? 

మరి తమ పార్టీకి చెందిన అలాంటి ఎందరో నాయకుల్లో కనీసం ఒక్కరిదయినా పార్లమెంట్, శాసనసభల సభ్యత్వాల్ని రద్దుచేశారా? 

పక్క రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన కేటీఆర్ గొంతెత్తి చెప్పినట్టుగా ఇంకే రాజకీయ పార్టీల నాయకులు చెప్పడానికి ముందుకు రాలేదెందుకని? 

ఎందుకంత భయం? సొంత లెక్కలా? ఈడీలు, సీబీఐలంటే వణుకా? మనకెందుకులే అన్న స్వార్థమా? సూడో మేధావుల మార్కు నిర్లిప్త నిరాసక్తతా?

ఏదైనా కాని... పనిచేస్తున్న నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకోవడం పౌరుల బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే మాత్రం చూస్తుండగా ఇంకో వందేళ్ళు వెనక్కిపోతాం. 

ఇదంతా చూడలేకే, ఏమాత్రం భయం లేకుండా, ఢిల్లీ వైపు కదం తొక్కుతున్న కేసీఆర్ అంటే ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుడుతోంది.

కేసీఆర్ ఆలోచనలను చెడగొట్టడానికి, తెలంగాణను అస్థిరపరచడానికి... ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ-ఏపీలకు చెందిన తెలంగాణ విద్రోహులను, జోకర్లను వాడుకొంటున్నారు. ఉసిగొల్పుతున్నారు. 

 ఏదీ ఫలించడం లేదు. పైగా ఎదురుకొడుతున్నాయి.      

తన ఉద్యమ నాయకత్వ నేపథ్యంతో, ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు దేశంలో ఎవ్వరూ సాధించని ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించిన అనుభవంతో, తనదైన మొండి పట్టుదలతో, చెదరని ఏకాగ్రత, సంకల్ప శక్తితో... "కేసీఆర్ ఏదైనా చేయగలడు" అన్న భయం... ఇప్పుడు ప్రత్యర్థి శిబిరాల ద్వారా, వారి నాయకుల ద్వారా చేయరాని ఎన్నో పనులను చేయిస్తోంది.  

లక్షలాది మంది పదో తరగతి చిన్నారుల భవిష్యత్తు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించగలిగే మానసిక పరిపక్వత లేని చిల్లర స్థాయికి కూడా దిగి, పరీక్షపేపర్లను లీక్ చేసి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నామనుకోవడం కూడా అలాంటి పనే.

అయితే - వీరి ఆటలు దేశంలోని ఎక్కడైనా సాగవచ్చు. తెలంగాణలో సాగవు. కేసీఆర్ దగ్గర అస్సలు సాగవు. 

2 comments:

  1. మీరు అన్నట్లు ఎవరి ఆటలు ఎల్ల కాలం సాగవు . ప్రజాస్వామ్యంలో అస్సలు సాగవు .ప్రజలు చూస్తున్నారు .తగిన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారు. అప్పుడే లెక్కలు సరిచూసుకొని డామిట్ కథ అడ్డం తిరిగిందే అనుకొంటారు.

    ReplyDelete