Monday 13 March 2023

ఒక ‘డిజిటల్ నోమాడ్’ జీవనశైలి


సుమారు 7 ఏళ్ల క్రితం, ఒక డెహ్రాడూన్ అమ్మాయి… సింగపూర్ టూరిజమ్ బోర్డులో తన ఉద్యోగాన్నీ, ఇంటినీ వదిలిపెట్టి, ప్రపంచాన్ని చుట్టివచ్చే ‘నోమాడ్’ జీవితాన్ని ఎంచుకుంది.

అప్పుడు ఆమె వయస్సు 23.

ఇప్పటివరకు చాలా దేశాలు తిరిగింది. ఎక్కువ భాగం ఒంటరిగా… సోలో ట్రావెలర్‌గానే.

మొదట్లో తను అనుకున్న దేశాలకు వెళ్లడానికి ఫ్లయిట్ జర్నీ చేసేది. ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు – దేశాల మధ్య కూడా రోడ్డు ప్రయాణమే ఎంచుకుంటోంది.

ఒకసారి దేశంలోకి ప్రవేశించాక, అంతా అతి మామూలు జీవనవిధానమే ఆమెది.

కాలినడకన నడవగలిగినంత దూరం నడవటం, అవసరాన్నిబట్టి అతి తక్కువ ఖర్చుతో కూడిన లోకల్ ప్రయాణ సౌకర్యాలను వాడటం, శుభ్రమైన శాఖాహారం ఎక్కడ ఏది దొరికితే అది తినడం, లోకల్‌గా ఎవరి ఇంట్లోనైనా ఉండటం, లేదంటే – ఎయిర్ బి ఎన్ బి నివాసాల్లో ఉండటం, నిర్ణీత సమయాల్లో పుస్తక పఠనం, లాపీలో తన పర్యటనలకు సంబంధించిన బ్లాగింగ్, ఇతర కమ్యూనికేషన్ చూసుకోవటం… ఇదీ ఆమె జీవనశైలి.

ఈ జీవనశైలి నుంచే ఆమెకు ఆదాయం, ఆనందం రెండూ లభిస్తాయి.

బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, నేషనల్ జాగ్రఫిక్, టెడెక్స్, రెస్పాన్సిబుల్ ట్రావెల్, హఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి మీడియా ఆమె ప్రయాణాలను, జీవనశైలిని ఎప్పటికప్పుడు కవర్ చేస్తాయి.

The Shooting Star పేరుతో ఆ అమ్మాయి రాసిన పుస్తకం ప్రఖ్యాత పెంగ్విన్ బుక్స్ సంస్థ పబ్లిష్ చేసింది. అది బెస్ట్ సెల్లర్ కూడా.

ట్రావెల్ బ్లాగర్, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఫ్రీలాన్స్ ట్రావెల్ రైటర్‌గా – వివిధరకాల అసైన్‌మెంట్స్ ఎప్పటికప్పుడు ఆమెను వెతుక్కుంటూ వస్తుంటాయి. వివిధ దేశాల టూరిజమ్ శాఖలు, ఎయిల్ లైన్స్, కార్పొరేట్ కంపెనీలు ప్రమోషన్ కోసం ఆమెతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

ఇవన్నీ ఆమెకు ఆదాయం తెచ్చేవే.

ఈ ఆదాయమంతా ఆమెకెంతో ఇష్టమైన ‘జీవనశైలి’ ప్రయాణంలో, ఆమెతోపాటు వెంటపడి వచ్చేదే.

తనకిష్టమైన ఇదే జీవనశైలితో నిరంతరం ప్రయాణం చేస్తూ, భూగోళం చుట్టేస్తున్న ఈ యువతి వేసుకొనే దుస్తులు, బుక్స్, లాపీ, పెన్నూ, పేపర్లూ అంతా కలిపి, ఆమె లగేజ్ మొత్తం… జస్ట్ వీపుకు తగిలించుకొనే ఒకే ఒక్క బ్యాక్ ప్యాక్.

అంతే.

నమ్మశక్యం కాని ఈ మినిమలిస్ట్ డిజిటల్ నోమాడ్,  ట్రావెల్ బ్లాగర్ పేరు - శివ్య నాథ్.

Just a girl who travels.

కట్ చేస్తే –

2019 లో ఒకసారి తను సౌతాఫ్రికాలో ట్రెక్కింగ్ చేస్తూ, ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు – తన శరీరానికి, శరీరాకృతికి సంబంధించిన ఒక వాస్తవాన్ని గురించి, మొట్టమొదటిసారిగా, తనను తనే ప్రశ్నించుకొంది. అర్థంచేసుకొంది. అర్థమయ్యాక ఆ అనుభూతిని ఆలింగనం చేసుకొంది. అక్షరాల్లో ఆవిష్కరించింది.

అదేంటో, క్లుప్తంగా శివ్య మాటల్లోనే –


“బాడీ పాజిటివిటీకి సంబంధించి నా మైండ్‌సెట్‌ను ప్రశ్నించడానికి, అర్థంచేసుకోడానికి నాకు చాలా సమయమే పట్టింది…

మనం ఎదుగుతున్న దశలో, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మన పెంపకాన్ని బట్టి – అందానికి సంబంధించి మన మనసుల్లో, ఆలోచనల్లో కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ అయిపోతాయి.

మ్యాగజైన్స్‌లో కనిపించే మోడల్స్… హాలీవుడ్, బాలీవుడ్‌లో కనిపించే హీరోయిన్స్… అందరూ ఎలాంటి మచ్చలేని తెల్లటి చర్మంతో, పర్‌ఫెక్ట్ హెయిర్‌తో, సన్నగా, నాజూగ్గా, ఒక లెక్కతో కూడిన ఎత్తుపల్లాల అవయవాకృతితో కనిపిస్తారు.

రకరకాల డైట్స్ గురించి, బ్యూటీ ట్రీట్‌మెంట్స్ గురించి, శరీరంలో అక్కడక్కడా ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్స్ తొలగించుకొనే పద్ధతుల గురించీ, ఎవరెవరు ఎలా ఉన్నారో జడ్జ్ చేయటం గురించీ… మనచుట్టూ ఉన్న స్త్రీల మాటలు కూడా ఎప్పుడూ వింటుంటాం.

వీటన్నిటితో వచ్చిన ఒక అవగాహన ఆధారంగా, మన శరీరాల్ని మనమే “ఇలా వుంది” అని నిర్ధారించుకుంటాం. విశ్లేషించుకుంటాం. చాలాసార్లు అసహ్యించుకుంటాం కూడా.

మన మానసిక, శారీరక ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా – మనముందున్న అద్దం చూపిస్తున్నదే నిజమని నమ్ముతాం.

చాలా కాలంగా ఈ విషయంలో నా ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి.

నా థండర్ థైస్ అంటే నాకు చాలా కోపం. నేను ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, ఎంత తక్కువ తిన్నా అవి ఎంతకూ సన్నబడవు. నా భుజాల్లో ఉన్న కొవ్వుని నా డ్రెస్ స్లీవ్స్ కింద దాచిపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఫ్రీగా ఉండి, హాయిగా ఊపిరి పీల్చుకోనీయకుండా నా నడుముభాగాన్ని ఎప్పుడూ టక్ చేస్తుంటాను. ఎవరైనా చూస్తారేమో అని, నా పిరుదుల్ని తొందర తొందరగా నా వన్ పీస్ స్విమ్‌సూట్‌లోకి తోసేసి కవరప్ చేసేస్తుంటాను.

ఒకసారి, 2019 లో సౌతాఫ్రికా వెళ్ళినప్పుడు – అక్కడ ట్రెక్కింగ్, వైల్డర్ స్విమ్మింగ్ కోసం వెళ్లే సమయంలో చూసుకున్నాను… 

నా స్విమ్‌సూట్ రిపేర్ చెయ్యడానికి వీల్లేనంతగా చినిగిపోయింది. వెంటనే అప్పటికప్పుడు ఇంకో స్విమ్‌సూట్ తీసుకోవాల్సివచ్చింది.

కాని, అక్కడ దగ్గర్లో ఉన్న స్టోర్‌లో బికినీలు మాత్రమే ఉండటంతో, ఇక తప్పనిసరై ఒక బికినీ తీసుకున్నాను.

ఇండియాలో – మనం స్విమ్ చేస్తున్నప్పుడు… స్విమ్‌సూటో, బికినీనో వేసుకున్నాసరే – ఒడ్డున ఉన్నవారికి ఏదీ కనిపించకుండా నీళ్లల్లోనే మన శరీరంలోని కొంతభాగాన్ని ఎప్పుడూ దాచి ఉంచుతాం. అలాంటప్పుడు ఇంక బికినీ ఎందుకో నాకర్థమయ్యేది కాదు!

కాని, నా 31వ యేట, సౌతాఫ్రికాలోని ఆ అద్భుత వాటర్ ఫాల్స్‌లో చల్లటి నీరు నా శరీరంలోని ప్రతిభాగాన్నీ స్పృశిస్తూ ఆలింగనం చేసుకుంటున్నప్పుడు – మొట్టమొదటిసారిగా అంతా మారిపోయింది.

ఉన్నట్టుండి… బికినీ వేసుకోవడంలో ఉన్న ఆ ఫ్రీడమ్‌తో ప్రేమలోపడిపోయాను. దానికంటే ముందు, అసలు నా బాడీ విషయంలో నేను ఎందుకని ఎప్పుడూ అంత నెగెటివ్‌గా ఫీలయ్యేదాన్నో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

నా శరీరం “పర్‌ఫెక్ట్” సౌష్టవంతో లేకపోవచ్చు. కాని, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్సర్‌సైజ్ చేస్తాను. మంచి ఆహారం తీసుకుంటాను. ఉండాల్సినంత బరువే ఉన్నాను. మానసికంగా కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాను.

నిజంగా ఒక్కసారిగా అంతా మారిపోయింది…

నా బాడీకి సంబంధించి, అంతకుముందటి నా అన్ని నెగెటివ్ ఆలోచనల్ని జస్ట్ అలా ఎడంచేత్తో పక్కకి తోసేశాను.

ఆ తర్వాత ఎప్పుడు ఏ వాటర్ ఫాల్స్ కిందకెళ్ళినా… ఏ సముద్రపు అలల్లో ఆడుకున్నా… చల్లటి ఆ నీళ్ళు నా శరీరాన్ని స్పృశించినప్పుడల్లా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను. పరవశంలో మునిగితేలుతున్నాను.

F*ck perfection! 

ఇప్పుడు నాకు క్యూరియస్‌గా ఉంది… మీ బాడీ గురించి మీరేం ఫీలవుతున్నారు?”

No comments:

Post a Comment