Monday 27 February 2023

తెలంగాణకు పట్టిన గోబెల్స్!


జొన్నకలి, జొన్న యంబలి
జొన్నన్నము, జొన్నపిసరు జొన్నలె తప్పన్ 
సన్నన్నము సున్న సుమీ 
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్ 

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు 
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు 
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు 
పలనాటి సీమ పల్లెటూళ్ళు

రసికుడు పోవడు పల్నా 
డెసగంగా రంభ యైన నేకులె  వడుకున్
వసుధేశు డైన దున్నును 
కుసుమాస్త్రుండైన జొన్న కూడె కుడుచున్ 

👆పైవన్నీ మహాకవి శ్రీనాథుని చాటు పద్యాలు. గ్రంథాల్లో ఉన్నాయి. కల్పితాలు కావు! 

శ్రీనాథుడు ఆ ప్రాంతంలో నిజంగా అన్నం దొరక్క ఎంత బాధపడివుండకపోతే ఈ విషయాన్ని పద్యాలకెక్కిస్తాడు?   

పల్నాటిసీమ వాళ్ళు నన్ను మన్నించాలి.  కోట్ చెయ్యాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సరదాగా కోట్ చేశాను తప్ప మరొక ఉద్దేశ్యం నాకు లేదు. పల్నాడు ప్రాంతం వాళ్ళు నాకు ఎందరో అత్యంత అత్మీయులైన మిత్రులు, బంధువులు ఉన్నారు. అది వేరే విషయం. 

కట్ చేస్తే - 

ఒక వీడియో బైట్‌ను కోట్ చేస్తూ - "మీరు మారరు కాక మారరు!" అని - నిన్న సాయంత్రం - తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పెట్టిన ట్వీట్ ఒకటి చూశాను. ఆయన సహజ స్వభావం లాగే చాలా మెత్తగా, డిగ్నిఫైడ్‌గా ఆ ట్వీట్‌లో తిట్టారాయన. 

బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అయితే దంచుకున్నారు.   

దిలీప్ భాయ్ కోట్ చేసిన ఆ వీడియో బైట్‌లో మాట్లాడిన వ్యక్తి మీద నాకు కోపం రాలేదు. జాలి అనిపించింది.  

తెలుగుదేశం పార్టీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే తినేవారట. తెలుగుదేశం పార్టీ వచ్చి, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రజలు మొట్టమొదటిసారిగా అన్నం వండుకుని తినడం ప్రారంభమైందట. ఆ ఘనత తెలుగుదేశం పార్టీదట... 

ఇట్లా చరిత్రలో ఓనమాలు తెలియని మూర్ఖులు రాజకీయనాయకులైతే దేశం ఇలాగే ఉంటుంది. ఇంకో 75 ఏళ్లయినా ఇలాగే శాశ్వతంగా "అభివృద్ధి చెందుతున్న దేశం" గానే మిగిలిపోతుంది. 

తెలిసి అబద్ధాలాడ్డం నీచం. మేమే గొప్ప అన్న అహంకారంతో ఇలాంటి పచ్చి అబద్ధాలాడ్డం ఇంకా నీచాతినీచం. 

రాజకీయాల్లో వంద మాట్లాడవచ్చు. కాని, మరీ ఇంత నీచ స్థాయి అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వటం అత్యంత అసహ్యకరం. జుగుప్సాకరం. 

ఈయన వయస్సుని గుర్తిస్తూ - ఈయన పట్ల నాలో మిగిలివున్న అంతో ఇంతో గౌరవం కూడా పాతాళానికి పోయింది.    

నా చిన్నతనం నుంచే మసూరి, జడసాంబలు బియ్యం నెల నెలా బస్తాల్లో - వరంగల్లో బొడ్రాయిలోని - మా తోట రామచంద్రం దుకాణం నుంచి తెచ్చుకొనేవాళ్లం. ఆ బియ్యం బస్తాలపైనే మేం పిల్లలం ఎగురుతూ దునుకుతూ ఆడుకొనేవాళ్ళం. 

అలాగని మేం ధనవంతులం కాదు. మా అమ్మ ఇంట్లో కుట్టుమిషన్ మీద పనిచేసేది. మా నాన్న మగ్గం నేసేవాడు. ఇంట్లో ఇంకో నాలుగైదు మగ్గాలుండేవి. వాళ్ళిద్దరూ చదువుకోలేదు. పెద్ద బాలశిక్ష కొనుక్కొని - ఉత్తరం రాయడం చదవటం వరకు - సొంతంగా నేర్చుకున్నారు. 

ఇటుకలతో కట్టిన విశాలమైన ప్రహరీ గోడతో 14 దర్వాజాల పెంకుటిల్లు మాది. ఆ ఇంటికి - ఏ తెల్లవారుజామునో - అప్పుడప్పుడు  అన్నలొచ్చి అన్నం తినిపోయేవారు. మా ఇంటికి దగ్గరున్న సంఘం బడిలో జననాట్యమండలి కార్యక్రమాలు, సభలు జరిగినప్పుడు - పాటలు పాడటానికి, మాట్లాడ్డానికి - ఎందరో అక్కడికి వచ్చేవాళ్లు.

అలా వచ్చినవాళ్లకు భోజనం మా ఇంట్లోనే పెట్టేవాళ్లం. 

బాలగోపాల్, వరవర రావు, గద్దర్ వంటి వాళ్ళను నేను మొట్టమొదటగా చూసింది మా ఇంటి వాకిట్లో ఉన్న గద్దెలమీద కూర్చొని వాళ్ళు అన్నం తింటున్నప్పుడే.

ఇదంతా - సుమారు ఐదు దశాబ్దాల క్రితం నాకు ప్రత్యక్షంగా తెలిసిన నిజం. అంతకు యాభై ఏళ్ళ క్రితమే మా తాతలు అన్నం, పప్పుచారు తిన్నారు. వేడి వేడి అన్నంలో గోలిచ్చిన కారం-నూనె కలుపుకొని రుచిగా తిన్నారు.

ఇక హైద్రాబాద్ బిర్యానీకైతే వందల ఏళ్ల చరిత్ర ఉంది. 

మరి... తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? 

ఇదంతా పక్కన పెడితే - అసలిప్పుడు ఆరోగ్యం కోసం బాగా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటున్నది ఈ జొన్నలు, రాగులు, సజ్జలే కదా!

ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా ఇంత అహంకారం ఎందుకు?

కట్ చేస్తే -

ఈయనొక్కడే కాదు. అంతాకలిపి ఇంకో అరడజన్ మంది వున్నారు... 

ఇవే తెలివిలేని మాటలు, అహంకారపు అబద్ధాలు. 

ఇవన్నీ ఏదో ఆషామాషీగా జరుగుతున్నవి కాదు. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. వీరందరి లక్ష్యం ఒక్కటే. 

తెలంగాణలో అలజడి సృష్టించడం, తెలంగాణను అతలాకుతలం చేయడం.     

కాని, ఇక్కడున్నది కేసీఆర్. 

బ్లైండ్-ఫోల్డ్ ఆడుతున్న అనతోలి కార్పోవ్‌లా - వీళ్లందరికీ కలిపి - ఒకేసారి చెక్ పెట్టగల సమర్థుడు. 

అది కూడా మనం చూస్తాం. 

6 comments:

  1. ఆ వీడియో చూసి అసహ్యం కలిగింది. అసలు జొన్నలు, రాగులు, సజ్జలు తక్కువ స్థాయి ఆహారం అని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. ఆ కాలం లో అన్నం తో పాటు ఇతర చిరు ధాన్యాలు కూడా విరివిగా ఉపయోగించేవారు.

    నాతోనే చరిత్ర మొదలైంది అనుకునే వాళ్ళను చూస్తే జాలి వేస్తుంది.

    ReplyDelete
    Replies
    1. అక్కడ చప్పట్లుకొడుతున్నవాల్లు తెలంగాణావాల్లే.

      Delete
    2. అవును. కొందరుంటారు. ఆ కొందరివల్లే నష్టం.

      ఎక్కడైనా, ఏ విషయంలోనైనా ఇలాంటి కొందరివల్లే నష్టం జరిగేది.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. మీరే చూడండి. తెలుస్తుంది.

      అసలు పాయింట్ పక్కనపెట్టి ఇలాంటి పక్కదారి పట్టించే కామెంట్స్ వద్దు. మీ టైమ్ నా టైమ్ వేస్ట్.

      ఇకనుంచి ఇలాంటివి అసలు పట్టించుకోను. పబ్లిష్ చేయను. జస్ట్ డిలీట్. Thanks.

      Delete