Friday 24 February 2023

కుక్కలున్నాయి జాగ్రత్త!


విషపూరితమైన ఒక పాము మన ఇంట్లోకొచ్చింది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. ఏదో నంబర్ వెతికి, ఎవరికో ఫోన్ చేసి, వాళ్ళొచ్చి దాన్ని పట్టుకొని వెళ్లేలోపు జరగరాని ఘోరం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? 

ఎక్కన్నుంచో ఒక చిరుతపులి జూబ్లీ హిల్స్‌లోని జనావాసాల్లోకి వచ్చింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. ఎవరో వచ్చి దాన్ని పట్టుకొని, సేఫ్‌గా దాన్ని జూకి తీసుకెళ్లేదాకా జరిగే ప్రమాదాల్ని ఎవరు ఆపుతారు? 

పట్టపగలే పిచ్చి కుక్కలు మనుషుల్ని వెంటపడి చంపుతుంటే ఏ చట్టాలు కాపాడతాయి? ఆ చట్టాల పునాదుల మీద అద్దాల మేడల్ని కట్టుకుని బ్రతికే సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు ఇప్పుడెక్కడున్నారు? ఎందుకు బయటికి రారు? 

"నోరు లేని జీవులకు ఎలాంటి హాని తలపెట్టొద్దు" అనే ఈ పనికిరాని చట్టాలన్నిటినీ మూటగట్టి బంగాళాఖాతంలో కలిపెయ్యాలి. 

అసలు వాటికి హాని తలపెట్టే ఆలోచన, తీరిక ఏ మనిషికుంది?   

అలాంటి ఏ చట్టమైనా అడవులవరకే పరిమితం కావాలి తప్ప జనారణ్యాల్లో మనుషులు చావడానికి కారణం కావద్దు.  

ఆఖరికి సినిమా షూటింగ్స్‌లో కూడా "మేం ఏ ప్రాణికి హాని కలిగించలేదు..." అంటూ స్క్రీన్ మీద ఒక కార్డు వేయాలి. షూటింగ్‌కు ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దానికో అబ్జర్వర్ టీమ్! 

ప్రత్యక్షంగానో పరోక్షంగానో - మన దేశంలో ఇలాంటి చెత్త చట్టాలు కొన్ని మొదలవ్వడానికో, ప్రాముఖ్యం సంతరించుకోడానికో కారణమైన ఆ మేనక ఇప్పుడెక్కడ? ఊర కుక్కలతో కరవబడి ప్రాణం వదిలిన ఆ చిన్నారిని వెనక్కి తెచ్చిస్తుందా?

హైద్రాబాద్‌లో కూడా ఉన్న సెలబ్రిటీ సోషల్ యాక్టివిస్టులు బయటికొచ్చి కనీసం ఒక వీడియో బైట్ అయినా ఇచ్చారా? 

జరిగిన సంఘటనకు ఏం సంజాయిషీ ఇస్తారు ఈ యాక్టివిస్టులంతా?         

కట్ చేస్తే - 

ఇలాంటి చట్టాలున్నాయి కాబట్టే - సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎలాంటి అగ్రెసివ్ యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నది కామన్ సెన్స్. 

ఇలాంటి ఘోరం జరగటం ఎవరికి సంతోషం?  

సిటీలోని దాదాపు ప్రతి కాలనీలో ఇలాంటి ఊర కుక్కల సమస్య ఉంది. అయినాసరే - మున్సిపాలిటీవాళ్ళు వాటిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు - "వాటిని తీసుకెళ్ళొద్దు" అని అడ్డుపడే యాక్టివిస్టులు మా కాలనీలో కూడా ఉన్నారన్నది నా కళ్ళారా చూసిన వ్యవహారం! 

అయినా సరే - తప్పనిసరి అయిన కొన్ని అరుదైన సందర్భాల్లో ఎన్‌కౌంటర్స్ జరిగినట్టే - ఇలాంటి విషయాల్లో కూడా ఒకే ఒక్క రోజు రాష్ట్రమంతా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి, వాటన్నిటినీ లిఫ్ట్ చేసి, పని ముగించాలి. 

లేదంటే - ఒకవైపు ప్రపంచం గుర్తిస్తున్న వెయ్యి మంచి పనులు రాష్ట్రంలో జరుగుతున్నా - అరుదుగా జరిగే ఇలాంటి బాధాకరమైన సంఘటనల వల్ల కొద్దిమంది ప్రజల దృష్టిలోనైనా ప్రభుత్వం పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. 

మరోవైపు - పని లేని సోషల్ మీడియా ఊరకుక్కలు కొన్ని కేటీఆర్ మీదా, మేయర్ మీదా, ప్రభుత్వం మీదా రేబిడ్ డాగ్స్‌లా అదేపనిగా మొరుగుతుంటాయి.  

1 comment:

  1. మీరు వ్రాసినది వాస్తవం. విదేశాలలో వీధి కుక్కల బెడద ఉండదు. మన దేశం లో సెలబ్రిటీ జంతు ప్రేమికుల వల్ల వారికి సహకరించే కొన్ని సంస్థల వల్ల వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది.

    ప్రస్తుతం జంతువులకు, నేరస్థులకు, రోడ్లు ఆక్రమించి ఉద్యమాలు చేసేవారికి, విపరీత ధోరణి తో జీవించే వారికి ఉన్న హక్కులు సాధారణ పౌరులకు లేవు. ప్రభుత్వ వ్యవస్థ చేతులు కట్టేసిన పరిస్థితి ఉంది.

    ReplyDelete