Sunday 1 January 2023

కొత్త సంవత్సరంలో 10 పాత రిజొల్యూషన్స్!


1. ప్రపంచంలో అందరికీ సమానంగా దొరికేది టైమ్ ఒక్కటే. ఇది ఎవ్వరికోసం ఆగదు. టైమ్‌కు ఇచ్చే విలువ మిగతా అన్నిటికంటే టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఒక్కొక్క లక్ష్యానికి ఒక్కో టైమ్ పెట్టుకొని, వాటిని సాధించుకొంటూ ముందుకెళ్తుండాలి. కొన్ని అనుకున్నట్టు కావు, సాధించలేం. అక్కడే ఆగిపోకూడదు. విశ్లేషించుకొంటూ కొత్త ఉత్సాహంతో, కొత్త లక్ష్యంతో ముందుకెళ్తూనే ఉండాలి.  

2. ఏ విషయంలోనైనా సరే ఏ ఒక్కరిమీదా ఆధారపడకూడదు. ఎవరి ప్రయారిటీలు వారివి అన్న నిజం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ ఉండితీరాలి. 

3. ఎవ్వరి విషయంలోనైనా సరే, పాజిటివ్‌గానే ఆలోచించాలి. నెగెటివిటీ వైబ్స్ అటునుంచి ఏ మాత్రం ఉన్నా తెలిసిపోతుంది. మనకి మనం దూరమవటం బెటర్. ఇంకొకరిలోని నెగెటివిటీ గురించి ఆలోచించటమంత టైమ్ వేస్ట్ ఇంకోటి ఉండదు. 

4. అవతలి నుంచి కమ్యూనికేషన్ బాగా లేదు - లేదా - అసలు కమ్యూనికేషనే లేదు అంటే - పొరపాటు వాళ్ళది కాదు, మనదేమో చూడాలి. మన తప్పు ఏం లేకపోయినా అవతలి నుంచి కమ్యూనికేషన్ లేదంటే - ఇంక - ఆ వ్యక్తిని ఇబ్బందిపెట్టకుండా దూరంగా ఉండటం చాలా మంచిది.  

5. ఒక నెల క్రితం అనుకుంటాను... ఊహించనివిధంగా కేవలం రెండు రోజుల వ్యవధిలో - నాకంటే 5 సంవత్సరాలు తక్కువ వయసున్న ఒక రచయిత-దర్శకుడు చనిపోయారు, నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్దవారైన ఒక మంచి రచయిత, రాజకీయ విశ్లేషకులు చనిపోయారు. సో... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనకున్న టైమ్‌ను చాలా హాయిగా, ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా మన ఇష్టానుసారం గడపాలి. ఏవైనా బాధ్యతలు, కమిట్‌మెంట్స్ ఉంటే మాత్రం - ఎంత తొందరగా వాటిని పూర్తిచేసుకుంటే అంత మంచిది. 

6. ఎవరో ఏదో అనుకుంటారని - మనకు ఇష్టమైన పనులు, మనం చేయగలిగిన పనులు చేయకుండా ఉండొద్దు. ఎవ్వరూ ఏం అనుకోరు. ఎవ్వరికీ అంత తీరికల్లేవు. ముఖ్యంగా మనలోని క్రియేటివిటీని పక్కనపెట్టొద్దు. లా ఆఫ్ ద లాండ్‌ను గౌరవిస్తూ, చట్టవ్యతిరేకం కాని ఏ పనైనా సరే, చేయాలనుకున్నది చేసెయ్యాలి. ఇంకో పదేళ్ళ తరువాత... "అయ్యో అప్పుడా పని చేసెయ్యాల్సింది!" అని బాధపడే రోజు  జీవితంలో లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా - మాట్లాడాలనుకున్నవాళ్ళతో మాట్లాడండి. కలవాలకున్నవాళ్లను వెంటనే కలవండి. 

7. డబ్బు చాలా ముఖ్యం. ఏ ఒక్క ఆదాయమార్గం మీద ఆధారపడొద్దు. ఎవరు ఏ పనిచేసినా, ఏం కావాలన్నా - ముందు డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏదీ సాధ్యం కాదు. చారిటీకైనా, ఎవరికైనా సహాయం చేయాలన్నా డబ్బు కావాలి. "డబ్బుదేముంది?" అనేవాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు హార్ట్ ఎటాక్ వచ్చినపుడు ఆ డైలాగ్ అన్నవాడు వచ్చి బిల్ కట్టడు. 

8. మనలోని ఏ ఏ స్కిల్స్ మనకు అదనపు ఆదాయం తెచ్చిపెడతాయో ఎప్పటికప్పుడు ఆలోచించాలి. కొత్త ఆదాయమార్గాలు, కొత్త స్కిల్స్ గురించి ఆలోచిస్తుండాలి, ఆచరణలో పెడుతుండాలి.     

9. ఆరోగ్యం చాలా ముఖ్యం. పొద్దునలేస్తే వాష్‌రూమ్‌కి వెళ్ళడం ఎలా తప్పించుకోలేమో... ప్రతిరోజూ కనీసం ఒక 30 నుంచి 45 నిమిషాల ఎక్సర్‌సైజ్ చెయ్యటం కూడా విధిగా చెయ్యాలి.

10. మన చుట్టూ వున్న సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా వీలైనంత పట్టించుకోవాలి. అవి బాగుంటేనే మనం బాగుంటాం అన్నది గుర్తించాలి. రాజకీయాలు రాజకీయాలే. కాని - పనిచేస్తున్నవాళ్ళను తప్పకుండా ప్రోత్సహించాలి. 

కట్ చేస్తే - 

ఇవన్నీ అసాధ్యమైనవేం కాదు. ఆచరించం అంతే. మన అలవాట్లు, మన ఆబ్లిగేషన్స్, మన మైండ్‌సెట్ లాంటివి అడ్డొస్తాయి. అయినా సరే - 2023లో - నేను వీటిని వందకు వంద శాతం ఆచరించాలానుకుంటున్నాను. 

ఈ లిస్టులో మీరింకేమైనా యాడ్ చేస్తారా... డిలీట్ చేస్తారా... 

మీ లిస్ట్ ఎక్కడ? 

Comment below...   

No comments:

Post a Comment