Tuesday 31 January 2023

"భయం!" (మనోహర్ చిమ్మని మైక్రో కథలు - 1)


"ఈ లోకంలో - ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఐడియాలజీ వారిది. ఎవరి లాబీ వారిది. ఎవరి తుత్తి వారిది." 

"ఆగాగు... ఇంక లిస్ట్ పెంచకు. కాంటెక్స్‌ట్ పూర్తిగా అర్థమైంది. ఎవడి లొల్లి వానిది, అంతేగా!... ఇంక సమస్యేముంది?" 

"ఎవడి డప్పు వాడు కొట్టుకుంటే ప్రాబ్లం లేదు. నువ్వు కూడా ఇలాగే డప్పు కొట్టాలి... అన్నప్పుడే సమస్య!" 

"ఇదేదో ఆలోచించాల్సిందే.." 

ఇరానీ చాయ్ హోటళ్ళు పూర్తిగా మాయమైపోయిన ఈ డిజిటల్ యుగంలో - ఎక్కడో బోయిన్‌పల్లి సందుల్లో అనుకోకుండా కనిపించిన ఓ చిన్న ఇరానీ హోటల్లో వాళ్లకెంతో ఇష్టమైన ఇరానీ చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మిత్రులు...

ఇంకో రెండు సిప్పుల తర్వాత -  

"నువ్వేమన్నా అను... ఈ మేధావుల్తో కష్టమన్నా."
 
"అందుకే నేనా కేటగిరీకి చాలా దూరం అన్నా."   

"వీళ్ళు మెచ్చుకున్న నవలనే మనం మెచ్చుకోవాలి, వీళ్ళు ఆహా ఓహో అన్న పోయిట్రీనే మన కూడా ఆహా ఓహో అనాలి. వీళ్ళు డబ్బా కొట్టిన కవికే మనం డబ్బా కొట్టాలి. ఆఖరికి వీళ్ళు పైకెత్తిన కవయిత్రినే మనం పైకెత్తాలి."  

"ఎత్తకపోతే?!"

"నిన్ను ఎత్తిపడేస్తారు!"

"అట్లెట్లా అన్నా... ఏదైనా ఒకటి మనకు నచ్చటం నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్ కదన్నా? ఇష్టమైనోళ్ళు కనెక్టవుతారు, ఇష్టం లేనోళ్లు కారు. ఎవ్వరినయినా ఏ విషయంలోనైనా ఎలా ఫోర్స్ చెయ్యగలం?"  

"నో... అలా కుదరదు! వాళ్లకు నచ్చింది మనకూ నచ్చితీరాలి. ఒకవేళ నచ్చకపోయినా, వాళ్ల గ్రూపులో గోవిందా అయిపోయి, వాళ్ళలా ఆహా ఓహో అనాలి."  

ఇద్దరూ మౌనంగా చెరొక సిప్పు తాగారు. 

"నువ్వు చెప్పింది కరెక్టేనే అన్నా... వాళ్ళ ఫేస్‌బుక్ పోస్టుకు లైక్ కొట్టకపోయినా ఇన్‌బాక్స్‌కొచ్చి సంపుతారు!"  

ఆ అనుభవం ఏదో ఇద్దరికీ బాగానే ఉన్నట్టుగా ఒక్కసారిగా ఇద్దరూ జెర్కీగా తలెత్తి, ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు.  

సైలెంట్‌గా ఇంకో సిప్పు తాగారు.   

"అందుకే నేను పక్కా మాస్... ఆవైపు వెళ్లనసలు."

"నేను ఊర మాస్... వాళ్ళెవరైనా కనిపిస్తే స్టాప్ బ్లాక్‌లో మాయమైపోతా!" 

సడెన్‌గా ఇలా మంచి ఊపులోకొచ్చి మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు మిత్రులు... ఉన్నట్టుండి అంతకంటే సడెన్‌గా విఠలాచార్య సినిమాలో "స్టాప్-బ్లాక్" ఎఫెక్ట్‌లో లాగా టింగ్‌మని అక్కడినుంచి మాయమైపోయారు. 

కట్ చేస్తే -

రెండు సెకన్ల తర్వాత - మొన్ననే బుక్ ఫెయిర్‌లో వారికి పరిచయమైన ప్రముఖ కవి ఒకరు సీరియస్‌గా సిగరెట్ పొగవదుల్తూ అదే హోటల్లోకి ఎంటరయ్యాడు.     

2 comments:

  1. కొ.కు. గారు ఎప్పుడో పోష్ట్ళకార్డ్ సైజ్ కథలు వ్రాసారు కదా. ఇప్పుడు వాటిని నానోకథలు అనాలేమో.

    మనలో మనమాట. కవులకీ భయపడే వాళ్ళుంటారా అండీ?

    ReplyDelete
    Replies
    1. కొ కు గారి విషయంలో మీరు చెప్పిన విషయం ఒప్పుకుంటాను. నిజానికి నేను కేవలం ఒక 10-12 వాక్యాల్లో చిన్నగా మైక్రో కథనే రాయాలని అనుకున్నాను. కాని, అది సాగింది. రాస్తూవుంటే అదే వచ్చేస్తుంది. ఇదొక కొత్త హాబీ లాంటి ఆలోచన. అంతే నండి.

      ఇక - కొందరు కవులకు నేను నిజంగా భయపడతానండి. అలా చాలా సందర్భాలున్నాయి. పట్టుకొని వదలరు. సో, సరదాకి సెటైర్ అన్నమాట. ఇలా మొదలైంది నా మైక్రో కథల ఆలోచన.

      థాంక్స్ ఫర్ ది కామెంట్.

      Delete