Thursday 24 November 2022

సారీ... ఇప్పుడు నేను రైటర్ని!


"ఏం చేస్తున్నారిప్పుడు?" నా క్యాజువల్ కొశ్చన్. 

"డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గాయి. రైటర్‌గా ప్రయత్నిస్తున్నాను" చాలా సింపుల్ సమాధానం అతనిది.

సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళలో అత్యధికశాతం మంది చెప్పే సమాధానం సాధారణంగా మరోవిధంగా ఉంటుంది. ఎలాగంటే - "శర్వాకు మొన్నే కథ చెప్పా. యూరోప్ వెళ్ళాడు. రాగానే సంక్రాంతి తర్వాత కూర్చొని ఓకే చేసేద్దాం అన్నాడు. నా కథ ఆయనకి అంత బాగా నచ్చింది భయ్యా...హీరోయిన్ ఎవరనుకొంటున్నావ్..."

ఇంక దీనికి అంతుండదు. 

ఇంకో రెండు సంక్రాంతుల తర్వాత కూడా శర్వా యూరోప్ నుంచి రాడు. ఇక్కడ కథ ఓకే కాదు... అది వేరే విషయం. 


అలాక్కాకుండా - పైన అంత సింపుల్‌గా నాకు సమాధానం చెప్పిన ఆ డైరెక్టర్ కొన్నేళ్ళ క్రితం ఒక మంచి హిట్ ఇచ్చాడు. తర్వాత ఇంకో నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గటంతో, ఇప్పుడు రైటర్‌గా యమ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు. 

ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా, అబద్ధాలు చెప్పకుండా, ఉన్న నిజాన్నే అంత హానెస్ట్‌గా చెప్పగలిగిన ఆ డైరెక్టర్... గాంధీ మనోహర్.

కొన్నేళ్ళ క్రితం ఆయన తీసిన హిట్ పిక్చర్ - "సారీ... నాకు పెళ్లైంది!" 


కట్ చేస్తే -       

లైమ్‌లైట్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ గురించి ఎవరైనా రాస్తారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ చానల్స్ ఎట్సెట్రా అన్నీ బాగా కవర్ చేస్తాయి. యూట్యూబ్‌లో కూడా ఉన్నవీ లేనివీ థంబ్‌నెయిల్స్ పెడుతూ వీళ్లందరి గురించిన టిడ్‌బిట్స్ బాగానే అప్‌లోడ్ చేస్తుంటారు.    

అయితే - తెరపైకి రావాలనుకొంటున్న, లేదా, ఆల్రెడీ వచ్చి దాదాపుగా తెరమరుగైన కొందరు "అన్-సంగ్ హీరోస్" గురించి  మాత్రం ఎవ్వరూ రాయరు, రాయాలనుకోరు... ఉపయోగం ఉండదు కాబట్టి. 

కాని, నేను వీరందరి గురించి కూడా అప్పుడప్పుడూ నాకు తెలిసింది రాయాలనుకొంటున్నాను.   


ఈ క్రమంలో - నేను ముందుగా రాస్తున్నది డైరెక్టర్ గాంధీ మనోహర్ గురించి కావడం అనుకోకుండా జరిగింది. డైరెక్టర్‌గా నాకు సీనియర్... బాపు-రమణ, రాఘవేంద్రరావు, జంధ్యాల, వంశీ వంటి స్టాల్‌వార్ట్స్ దగ్గర పనిచేసిన గాంధీ నాకు ఆత్మీయ మిత్రుడు. మంచి రైటర్, ఆర్టిస్టు, కార్టూనిస్టు కూడా. 

కదిరిలో డిగ్రీవరకు చదువుకున్న గాంధీ బేసిగ్గా కార్టూనిస్టు. మయూరి, చిత్రభూమి పత్రికల్లో లే-ఔట్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నప్పుడు - అందులో పనిచేసే రాంబాబు అనే జర్నలిస్టు గాంధీని తీసుకెళ్ళి, అప్పుడే "సరసాల సోగ్గాడు" అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్న సత్యప్రసాద్ అనే ఒక  డైరెక్టర్‌కి పరిచయంచేశాడు. అలా మొదలైంది కథ. 

తర్వాత ప్రముఖ కార్టూనిస్టు బ్నిం ఆయన్ని బాపు గారికి పరిచయం చేశారు. బాపు గారి దగ్గర మిస్టర్ పెళ్ళాం, పెళ్ళికొడుకు, రాంబంటు చిత్రాలకు అసిస్టెంటుగా చేశాడు గాంధీ. తర్వాత బాపు గారి ఈటీవీ భాగవతంకు కూడా పనిచేశాడు.


డైరెక్టర్‌గా గాంధీ మనోహర్‌కు మొదటి సినిమా "సారీ... నాకు పెళ్లైంది!" కావడం ఒక రకంగా అదృష్టం, మరోరకంగా దురదృష్టం అనుకోవచ్చు. ఆ సినిమా హిట్ కావడానికి టైటిల్ బాగా ఉపయోగపడింది. కాని, నిజానికి సినిమా టైటిల్లో అందరికీ ధ్వనించే బూతేం అందులో లేదు. కాని, శ్రీరంగనీతులు చెప్పే కొందరు ఆ సినిమాను ఒక అంటరాని సినిమాగా తేల్చేశారు. దీంతో చోటామోటా హీరోలు కూడా డేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. 

దాంతో నేనూ మేధావినే అని నిరూపించుకొనే ప్రయత్నంలో "ప్లీజ్... నాకు పెళ్లైంది" టైటిల్‌తో ఒక ఎక్స్‌పరిమెంటల్ సినిమా తీశాడు గాంధీ. సినిమాలో మూడు క్లైమాక్స్‌లుంటాయి. జనం తిప్పికొట్టారు. ఆటొమెటిగ్గా కొంత గ్యాప్ వచ్చేసింది. తర్వాత శివాజీతో రెండు సినిమాలు తీశాడు. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గిపోయాయి.

"సారీ... నాకు పెళ్లైంది" సినిమా రిలీజ్ అయిన ప్రతి థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది. కానీ, తన రెండో సినిమా "ప్లీజ్... నాకు పెళ్లైంది" సినిమాకు రిలీజ్ అయిన ఫస్ట్‌డే ఫస్ట్‌షోకు పది మంది కూడా రాలేదు. అదిచూసి దాదాపు ఏడ్చేశాడు గాంధీ. ఇదీ గాంధీ సినీజీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకం. సినిమా అంటే ఏంటో చెప్పిన రియాలిటీ.  

"నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పని చేస్తున్నప్పుడు "శ్రీమతీ వెళ్ళొస్తా"  సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒకరోజు నన్ను పిలిచి "నేను సీన్ చెప్తా... దానికి స్టొరీ బోర్డ్ వేసి తీసుకురా" అని నాకు ప్రతి షాట్ చెప్పారు. నేను దానికి 23 షాట్స్ వేసుకుని వెళ్ళాను. అందులో ఒకే ఒక్క షాట్‌కు మాత్రం కరెక్షన్ చెప్పారు రాఘవేంద్రరావు గారు. ఆయన చెప్పినట్టుగా, ముఖ్యంగా ఆయనకు నచ్చేట్టు స్టోరీబోర్డ్ వేయగలిగానని చాలా హాపీగా ఫీలయ్యాను" అని తన సినీజీవితంలోని ఒక మంచి జ్ఞాపకం గురించి చెప్పాడు గాంధీ. 


కట్ చేస్తే - 

ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్‌కు చాలా డిమాండ్ ఉంది. దేశంలోనే అత్యధిక పారితోషికం సుమారు 3 నుంచి 5 కోట్లవరకు తీసుకునే సినీకథారచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.

స్వయంగా తను మంచి రచయిత కూడా కాబట్టి - రచయితగా మంచి కథలు అందించి, స్టోరీ రైటర్‌గా కొనసాగాలన్న ప్రయత్నంలో ప్రస్తుతం సీరియస్‌గా పనిచేస్తున్నాడు గాంధీ. 

ఫీల్డులోకి వస్తున్న కొత్తవారికి ఏంటి మీ సలహా అని అడిగినప్పుడు - "ఈ ఫీల్డులో సక్సెస్ రేటు చాలా తక్కువ, దయచేసి ఈ ఫీల్డుకి రాకండి అనే చచ్చు సలహా మాత్రం ఇవ్వను" అని తను చెప్పాలనుకున్నది చెప్పాడు గాంధీ.


డైరెక్టర్ గాంధీ మనోహర్ భార్య ప్రశాంతి అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. కూతురు ప్రణతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా క్యాప్‌జెమినిలో పనిచేస్తోంది. 

తను కోరుకుంటున్నట్టు డైరెక్టర్ గాంధీ మనోహర్ స్టోరీ రైటర్‌గా మంచి సక్సెస్ సాధించాలనీ, తర్వాత అవసరమైతే మళ్ళీ మెగాఫోన్ పట్టాలనీ ఒక మిత్రుడిగా నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. 

"The only safe thing is to take a chance." 
- Mike Nichols 

No comments:

Post a Comment