Monday 7 November 2022

మునుగోడు-టు-ఢిల్లీ... కేసీఆర్ ఎక్స్‌ప్రెస్!


మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! 

కట్ చేస్తే - 

మునుగోడు గెలిచాం, కాని ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగివుందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలుసు? 

మునుగోడు బైపోల్స్ హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఎందుకని అంతగా ట్రెండింగ్ అయింది? 

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, భీమవరం, ఏలూరు, రావులపాలెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మునుగోడు ఉప ఎన్నిక గెలుపు-ఓటములపై సుమారు 3000 కోట్ల బెట్టింగ్ నడిచిందంటే ఎంత దిమ్మతిరిగిపోవాలి? అక్టోబర్ 31 కి ముందే ఆయా ప్రాంతాలనుంచి వచ్చి, గంటగంటకి మునుగోడు తాజా ట్రెండింగ్ "ఫీల్డ్ రిపోర్ట్స్"ను ఆయా ప్రాంతాలకు అందించారంటే నమ్మగలమా? టీ-20 మ్యాచ్‌ను మించిన ఫోకస్ ఈ ఒక్క ఉప ఎన్నిక మీదనే చట్ట వ్యతిరేక ఫంటర్స్‌కు రావడానికి కారణమేంటి?    

దేశంలోని ప్రధాన మీడియా మొత్తం చూపు, దేశంలోని అన్ని రాజకీయపార్టీల చూపంతా ఈ ఒక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వైపే గత కొద్దిరోజులుగా ఏ స్థాయిలో ఉందో కూడా మనమంతా చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది? 

అసలక్కడ ఉప ఎన్నిక ఎలా వచ్చింది? 

సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించాడా? తెలంగాణ రాష్ట్ర సాధన వంటి ఒక శక్తివంతమైన కారణం కోసం ఏమైనా రాజీనామా చేశాడా? అలాంటి కారణాలతో ఉప ఎన్నిక వచ్చిందంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. కాని, మునుగోడు ఉప ఎన్నిక అలా వచ్చింది కాదు. 

ఇదొక కృత్రిమ ఉప ఎన్నిక.  

దేశప్రయోజనాలు, ప్రజాసంక్షేమం, అభివృద్ధి వంటి అంశాల్లో అఆలు తెలియనివారి పచ్చి రాజకీయ క్రీడకు ప్రతిరూపం ఈ ఉప ఎన్నిక. ప్రజల కోసం తాను అనుకున్నది సాధించడమే తప్ప మరొకటి తెలియని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఢిల్లీ నుంచి మళ్ళించడం కోసం వేసిన ఎత్తుగడ. 

కేసీఆర్ సృష్టించిన బీఆరెస్ అన్న పదం పుట్టించిన వణుకు వల్ల వచ్చిన పనికిమాలిన ప్రతిస్పందన ఈ ఉప ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆరెస్‌ను నైతికంగా దెబ్బతీయాలన్న కుటిల ప్రయత్నం. 

మునుగోడులో గెలవడం ద్వారా తెలంగాణలో ఒక హల్‌చల్ సృష్టించి - ఇక తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని భారీ బిల్డప్పులు ఇచ్చుకోవాలన్న దురాశ. వాస్తవానికి తెలంగాణలో బీజపీ శక్తి ఒక పాలపొంగువంటిది. క్షేత్రస్థాయిలో టీఆరెస్‌తో పోలిస్తే ఆ పార్టీకున్న కేడర్ దాదాపు శూన్యం. 

అయితే - ఒక్కసారి కేసేఅర్ ఫోకస్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక ఒక తాజా ఉదాహరణ. 

కౌంటింగ్ ప్రారంభంలో ఒక రెండు మూడు రౌండ్స్ వరకు కొంత టెన్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితిలా అనిపించింది. ఆ తర్వాత కూడా ఏదో ఇండియా-పాకిస్తాన్ టీ ట్వెంటీ మ్యాచ్‌లా ఉంటుందా చివరివరకూ పరిస్థితి అని కూడా అనిపించింది. 

అయినా సరే, టీఆరెసే గెలుస్తుందని అందరికీ తెలుసు. 

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం వెనుక టీఆరెస్ కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల దాకా ప్రతి ఒక్కరి కృషి ఉంది. కేసీఆర్ టాస్క్ అంటూ ఒకటి ఇస్తే ఉద్యమంలా మళ్ళీ ఒక్కటై ఉరుకుతాం అన్నది కార్యరూపంలో సాధించి చూపించారు. 

ఈ విజయం వెనుక టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అందరి కృషి కూడా చాలా విలువైనది.    

టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్... ఒక వార్ ఫ్రంట్‌లో చీఫ్ వారియర్‌గా... తానుగా ముందుండి, ఎప్పటికప్పుడు అందరిలో ఉత్సాహం నింపుతూ, నడిపిస్తూ, ఉరికిస్తూ ఈ యుద్ధం గెలిచిన తీరు నిజంగా ఒక అద్భుతం.     

ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటవరకే మొత్తం డిక్లేర్ అవుతుందనుకున్నది దాదాపు సాయంత్రం వరకు కొనసాగింది. చివరికి అనుకున్నట్టే టీఆరెస్ గెలిచింది. బీజేపీ కుట్రలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలా అట్టర్ ఫ్లాప్ అవుతాయని వాళ్లకు కూడా ముందే తెలుసు కాబట్టే ముందురోజునుంచే ఆ శిబిరం నుంచి ఎలాంటి హడావుడి లేదు. నిజానికి ఇదంతా వోటింగ్‌కు ముందే బాగా తెలుసు కాబట్టే నడ్డా, అమిత్ షాల మీటింగ్స్ రద్దయ్యాయి. 

ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్‌లో బయటపడిన ఆడియోలు, వీడియోలు, డేటా రికార్డు అన్నీ అబద్దాలని మొత్తుకొన్న బీజేపీ, అదే మాటకు కట్టుబడి, ఫామ్‌హౌజ్‌లో పట్టుబడ్డ ఆ ముగ్గురి మీద కేసులు పెట్టి లోపల వేయించాలి. కాని, అసలు విచారణే వద్దంటూ పరోక్ష ప్రయత్నాలు చేస్తుండటం సిగ్గుచేటు. 

ఎక్కడో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టడం ఒక ఎత్తు. కేసీఆర్‌తో పెట్టుకోవడం ఒక ఎత్తు.    

బీజేపీకి, కేసీఆర్ ఇతర రాజకీయ ప్రత్యర్థులకు రాజకీయాలంటే ఒక గేమ్. కేసీఆర్‌కు రాజకీయాలంటే ఒక టాస్క్. 

రాజకీయాలే చేయాలనుకుంటే కేసీఆర్‌ను మించినోడు దేశంలో ఉన్నాడా? 

కట్ చేస్తే - 

గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ బయల్దేరుతున్నారు. ఢిల్లీలో బీఆరెస్ కార్యాలయం సిద్ధమయింది. డియర్ మోదీజీ, ముందుంది ముసళ్ళ పండగ...    

4 comments:

 1. వామపక్షాలు మాత్రమే మునుగోడు లో తెరాసను బ్రతికించాయి. కాంగ్రెస్ క్యాడర్ గతం కంటే గట్టిగా నిలబడడమూ తెరాసకు కలసి వచ్చింది. లేకుంటే రాజ్ గోపాల్ రెడ్డి కుటుంబంకు ఉన్న సంబంధాలకు ఆయన ఆ ఓట్లను తెచ్చుకోవడం తేలికే. తెరాస ఓటుకు 5వేలు ఇస్తే భాజపా 4వేలు ఇచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అడ్డుగోలుగా వాడింది.

  భాజపాకు తెలంగాణలో క్షేత్రస్థాయిలో కేడర్ లేదు. కానీ 50R ( రఘునందన్, రాజేందర్, రాజగోపాలరెడ్డిలాంటి వారు) లను తమవైపు తిప్పుకుంటే తెరాస ను కూల్చగలదు.

  ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. బిజెపి ఈ స్థాయికి రావడానికి కారణం కేసీయార్ తప్పిదాలే. కాంగ్రెస్ ను జీరో చేయాలన్న దురాశ, కోవర్డు రాజకీయాలు, ఎం.ఎల్.ఏ ల కొనుగోళ్ళు, అన్నింటా మోడీకి సాగిలపడడం ఇవే ఈరోజు కేసీయార్ దుస్థితికి కారణం. కవిత కేసు కోసం మళ్ళీ మోడీతో లాలూచీ పడడని , వారు కలుపుకోరనీ గ్యారంటీ లేదు. భా.రా.స విషయం ఇపుడే తేల్చలేము. కాంగ్రెస్ లేకుండా భారాస ఏమీ చేయలేదన్నది సత్యం.

  కాంగ్రెస్ కు ఇప్పటికీ తెలంగాణలో ఛాన్స్ ఉంది. కోవర్టులను ఏరివేయగలిగితే రేవంత్ రెడ్డి హీరోయిజం, వ్యక్తిగత పోకడల మాని అందరినీ కలుపుకుని పాదయాత్ర చేయడం, తాము గెలిస్తే ఏమి చేస్తామో చెప్పగలగడం చేస్తే పోటీ తె.రా.సకు కాంగ్రెస్ కూ మధ్యనే ఉంటుంది. ( బిజెపి భారీ కొనుగోల్ మాల్ చేయకుంటే)

  ఇప్పటికైనా కేసీయార్ వెకిలి వేషాలు, చిల్లర రాజకీయాలు మానేసి ప్రజాస్వామ్యన్ని గౌరవిస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. తెలంగాణ రాజకీయం తెరాస‌-కాంగ్రెస్ మధ్య ఉంటే తెరాసకు విన్ అయ్యే చాన్స్ ఉండొచ్చు. అదే పోరు భాజపాకు తెరాసకు మధ్య అయితే తెరాస మట్టి కరవడం ఖాయం.

  ReplyDelete
  Replies
  1. ముందుగా రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న వ్యక్తులెవరైన అర్థం చేసుకోవాల్సిన ప్రాధమిక విషయాలు రెండు. 1. ప్రజలు పొత్తుల ఎత్తులతో తమ మైండ్ మార్చుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. 2. డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకున్నా, మనసుకు నచ్చిన వాళ్ళకి ఓటువేసే పరిణితి చెందిన స్థాయికి ఓటర్లు ఆల్రెడీ వచ్చేసారు.

   ఇక కమ్యూనిస్టులతో పొత్తు విషయానికి వస్తే అంతకంటే పెద్ద కామెడీ ఏమీ ఉండదు. 2014 లో సీపీఐ సీపీఎం కు కలిపి వచ్చిన ఓట్లకంటే రెబల్ గా పోటీచేసిన పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు ఎక్కువ. ఇక ఆ తర్వాత తమ ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాయ్ ఆ పార్టెలు. పోటీలో కూడా నిలవలేని స్థాయికి వచ్చేశాయి. ఖమ్మంలోనే పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి కమ్యూనిస్టులది. మోడీకి వ్యతిరేకమని చాటుకునేందుకు తప్ప ఇంకేకారణమూ లేదు వారికి trs తో వెళ్ళడానికి.

   ఇక భాజపా విషయానికొస్తే గత 2 3 పర్యాయాలు పెద్ద పేరున్న నాయకులను పార్టీలోకి తెచ్చుకుని గెలిచిన రికార్డున్నా ఈ సారి ఆ పనిలో కూడా సక్సెస్ కాలేకపోయింది. అర్బన్ లో తన ఉనికిని చాటుకోగలిగినా {GHMC లో మాదిరిగా) డీప్ రూరల్ లో ప్రభావం చూపడంతో పూర్తిగా విఫలమైంది. ప్రధాన పదవుల్లో ఉన్న నాయకుల మితిమీరిన తటాకుల గాండ్రింపులు తప్ప బూత్ లెవెల్లో కార్యకర్తల బలాన్ని పెంచుకోవడంలో సైతం విఫలమైంది. కొత్త నాయకులను ఈ మూడేళ్ళలో ఒక్కరిని కూడా తయారు చేసుకోలేకపోవడం అందుకు ఓ నిదర్శనం

   ఇక చివరిగా మీరు గెలుపు కోసం అశపడుతున్న/ ఆశిస్తున్న కాంగ్రెస్ విషయనికొద్దాం. ఏ పార్టీ అయిన ప్రజల నమ్మకాన్ని చోరగొనాలంటే ముందుగా పార్టీని ముందుకు నడిపే, రేపు ఆ పార్టీని అధికారంలోకి తెస్తే తమని పాలించగలిగే నాయకత్వం బలంగా ఉంది అనే అభిప్రాయాన్ని ఆ ప్రజలకు కలిగించగలగాలి. ఆ పనిలో అటు కేంద్ర నాయకత్వం ఇటు రాష్ట్ర నాయకత్వం రెండూ పాస్ మార్కులు కూడా సంపాదించలేకపోయాయ్. రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం తమ సొంత సీటును కోల్పోవడం, దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు తమ స్థానాలు తాము నిలబెట్టుకుంటే కాగ్రెస్ మాత్రం తమకున్న మూడు సీట్లూ కోల్పోవడం కేంద్రనాయకత్వం మీద ప్రజలకు నమ్మకం లేదనే విషయాన్ని సూటిగా సూచిస్తోంది. ఇక మీరు ప్రస్తావించిన సీట్ల కొనుగోలు అంశం విషయంలో డైరెక్ట్ గా కెమెరాలకు చిక్కిన ఓ ప్రతిపక్ష వలస పక్షిని అధ్యక్షుడిగా పెట్టుకుని మార్పుకు శ్రీకారం చూడతాం అంటే ప్రజలు రాష్ట్ర నాయకత్వాన్ని ఎలా నమ్ముతారు అనేది సగటు ఓటర్ సూటి ప్రశ్న. సో ఒక్కతెలంగాన బిల్ పెట్టిన పార్టీ అని చెపుకోవడం తప్ప ఇక ఏ విధంగానూ ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది.

   ఇక 2 పర్యాయాలు వరసగా పాలించిన పార్టీ మీద సాధారణంగా కొంత వ్యతిరేకత ఉండడం సహజమే. వాస్తవానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కన్నా భాజాపా ఆవేశపరుల అరుపులు వల్ల అది ఎక్కువగా కనిపిస్తోంది అంతే. రాబోయే 6 నెలల్లో ఈ విషయంపై మరింత క్లారిటీ ప్రతిఒక్కరికీ వచ్చేస్తుంది. నిజంగా పని చేసే నాయకుల చుట్టూ జనాలు ఆటోమ్యాటిక్ గా ఉంటారు. అదే 2018 సీన్ ఈసారి కూడా రిపీట్ అవ్వడం దాదాపు ఖాయమే.

   Delete
  2. రాజకీయనాయకులకన్నా ప్రజలకే‌ నిబధ్ధత కొంచెం ఎక్కువనుకుంటానండీ. డబ్బుపుచ్చుకొని నిజాయితీగా ఓటువేసే వారే ఎక్కువ. ప్రలోభాలకు గురికావటంలో మనఓటర్లను మించినవారు లేరు. కమ్యూనిష్టులు కలిసినా తొలగినా ఒకటే అన్నది నిజం. కొండలరావు గారు పొరబడ్డారు - కేసీఆర్ ఒకరే అనుకుంటున్నారు. దేశంలో అందరు రాజకీయనాయకులవీ చిల్లరవేషాలే, ఓట్లకోసం ఫీట్లే. మనోహర్ గారు అనుకుటున్నట్లు పనిచేసే నాయకుల వెంట జనం ఆటోమేటిగ్గా ఉండటం లేదు - ఎవరి వలన లబ్ధి ఉంటుందనుకుంటున్నారో వారి వెంటబడుతున్నారు. అంతే. ముందుముందు కూడా మరికొంతకాలం పెద్దగా మార్పు ఉండదు. దురాశాపరులైన నాయకులూ - అత్యాశాపరులైన ఓటర్లూ. అంతే.

   Delete
 2. కొండల రావు గారు ముందు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది..
  రాష్ట్రం ఏర్పడినప్పటినుండి ఇప్పటి వరకు కేసీఆర్ మీద ప్రజలలో వ్యతిరేకత లేదు.. almost 2015 నుండి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రాలలో అధికారం కోసం అడ్డమైన దారుల్లో పోతున్న ప్రక్రియలలో భాగమే నేటి రాష్ట్ర బిజెపి నాయకుల అల్లర్లు వెకిలి చేష్టలు వెర్రి ఆరోపణలు, పార్టీ ఫిరాయింపులు..ఏ బిజెపి నాయకుడికి రాష్ట్ర వనరులు హక్కుల మీద సరైన అవగాహన లేదు. కేవలం విద్వేషం, హిందూ-ముస్లిం కొట్లాటలు. మెజారిటీ ప్రజల ఓటు బ్యాంకు సాధించడం. ఇవి మాత్రమే అధికారంలోకి తెచ్చిపెడతాయి అనే భ్రమలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం "నీళ్లు, నిధులు, నియామకాలు" టాగ్ లైన్ తో నడిచింది.. ఇందులో మొదటిది నీళ్ల విషయంలో కేంద్రం ఒక దుర్మార్గమైన " రాష్ట్రాలు కట్టుకున్న నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం" బిల్లు తెస్తే ఒక్క రాష్ట్ర బిజెపి నాయకుడు దానిని ఎదుర్కోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు, హక్కులు, వనరులు, అభివృద్ధి... వీటిని బేస్ చేసుకొని అధికారాన్ని ఆశిస్తారు ఎవరైనా.. ఇప్పటి వరకు కూడా బిజెపి నాయకులు క్రిష్ణా నదీ జలాల వాటా తేల్చమని, ట్రిబ్యునల్ వేయమని మోడీని అడిగిన దాఖలాలు లేవు.. ఎంతసేపు కేసీఆర్ తిట్టడం కేసీఆర్ మీద మొరగడం తప్ప.. ఇక మునుగోడు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి కేంద్ర బిందువు.. 60 ఏండ్లలో మునుగోడుకు కనీసం తాగడానికి స్వచ్ఛమైన మంచినీళ్లు ఏ ప్రభుత్వమూ ఇచ్చింది లేదు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే మునుగోడులో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చింది.. చెపుతూ పోతే కేసీఆర్ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి..

  ఎమ్మెల్యేలను కొనుడు, అమ్ముడు ముచ్చట మాట్లాడాలంటే... తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కొందరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగానే వైఎస్ చీల్చి తీసుకుపోయిండు.. ఎందరు ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఒక్కడై ముందుకు నడిచిండు.. రాష్ట్రాన్ని సాధించిండు... ఇప్పుడు సంక్షేమంలో దూసుక పోతున్నాడు... అప్పుడు వామ పక్షాలు అంతగా కలిసి రాలేదు.. ప్రజాస్వామ్యం, గౌరవం అంటూ విలువలు, నీతులు చెప్పవద్దు... కేసీఆర్ అంటే ఇష్టం లేని వానికి కేసీఆర్ అభ్యుదయ భావాలు వెకిలి రాజకీయాలు చిల్లర చేష్టలు లెక్కనే కనిపిస్తాయి..

  ReplyDelete