Friday 17 June 2022

ఒక్క కేటీఆర్, వంద నైపుణ్యాలు!


12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటి అయిన "ఎలెస్ట్" కంపెనీ తెలంగాణలో రూ. 24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్‌ప్లే ఫ్యాబ్ యూనిట్‌ను ప్రారంభించడానికి ఒప్పందంపై సంతకం చేసింది.  దీంతో - ఈ రంగంలో ప్రపంచస్థాయి దిగ్గజాలయిన జపాన్, కొరియా, తైవాన్‌ల సరసన ఇప్పుడు తెలంగాణ చేరింది.    

మే 2022: లండన్, దావోస్‌లలో 10 రోజుల పర్యటన. 45 వ్యాపార సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానల్ డిస్కషన్ సమావేశాలు, రూ. 4,200 కోట్ల పెట్టుబడులు.  

మార్చి 2022: వారం రోజుల యూయస్ ట్రిప్. 35 వ్యాపార సమావేశాలు, 4 సెక్టార్ రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 భారీ గ్రీట్ అండ్ మీట్ సమావేశాలు, రూ. 7,500 కోట్ల పెట్టుబడులు.   

ఈ డిజిటల్-సోషల్ యుగంలో - ఒక రాష్ట్ర దార్శనిక ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ఒక మంత్రి, ఆయన టీమ్ పనిచేస్తున్న శైలి ఈ స్థాయిలో ఉంటుంది. 

ఆ రాష్ట్రం తెలంగాణ.
ఆ ముఖమంత్రి కేసీఆర్.
ఆ మంత్రి పేరు కల్వకుంట్ల తారకరామారావు-ఉరఫ్-కేటీఆర్.    

కట్ చేస్తే - 

మొన్న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి మనదేశం నుంచి చాలామంది మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడ వెళ్ళారు. కాని, మన తెలంగాణ శిబిరం దగ్గర జరిగినంత యాక్టివిటీ మరే ఇతర శిబిరం దగ్గర జరగలేదు.

ఒక ప్రత్యేక వార్తాంశంగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో, మీడియాలో షేర్ చేసిన వాస్తవం ఇది!    

మన దేశం నుంచి గతంలో గాని, ఈ మధ్య గాని ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రుల టీమ్స్ ఇదే దావోస్‌కు చాలాసార్లు వెళ్ళాయి. యూయస్, యూకే, యూరప్‌ల్లో అనేక విదేశీ పర్యటనలు కూడా చేశాయి. అయితే గతంలోదంతా "ప్రపోజల్ పెట్టాం. అయితే అవుద్ది, లేకపోతే లేదు" అన్న సాంప్రదాయికశైలి. "ఎందుకు కాదు, మనమెందుకు సాధించలేం" అన్న ప్రోయాక్టివ్ దృక్పథం కేటీఆర్‌ది. 

ఇంత డైనమిజమ్, ఇంత స్పష్టత, ఇలాంటి అత్యంత వేగవంతమైన భావవ్యక్తీకరణ, సందర్భం ఏదైనా సరే - అలవోకగా ఎదుటివారిని మెస్మరైజ్ చేసే తనదైన ఇంగ్లిష్ శైలి... ఇవన్నీ ఇంతకుముందు మనదేశంలో ఏ రాష్ట్ర మంత్రిలోనైనా చూశామా అన్నది నాకు జవాబు దొరకని ప్రశ్న.   

"భారత్ వైవిధ్యమైన దేశం. ఈ దేశంలో పెట్టుబడులుపెట్టి వ్యాపారం చేయాలనుకున్నా, ఇంకే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నా సరే, మీరు ఏ రాష్ట్రం నుంచి ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారు అనేది చాలా కీలకం!" 

"తెలంగాణ రాష్ట్రం పోటీపడుతున్నది ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు. ప్రపంచంలోని ది బెస్ట్ రాష్ట్రాలతో!" 

ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్, ఆ ఆత్మవిశ్వాసం కేటీఆర్‌లో ఉన్నాయి.    

కట్ చేస్తే - 

కేటీఆర్ జీవితం ఒక్క రాజకీయాలతోనే నిండిపోలేదు. ఆయన జీవనశైలి నిజంగా విశిష్టమైంది. కొత్తతరం నాయకులు, యువతరం కచ్చితంగా అనుసరించతగ్గది.

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో కేటీఆర్ ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ మళయాళ సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే - అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే - తన మార్క్ చెణుకులు ఒకటోరెండో అలా అలవోగ్గా పడాల్సిందే! 

ట్విట్టర్‌ను కేవలం రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించిన వ్యక్తి కేటీఆర్. టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా, నిత్యం తన దైనందిన రాజకీయ, ప్రభుత్వ, సాంఘిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే - ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలకు స్పందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారు కేటీఆర్.      

ఇన్ని పార్శ్వాలు, ఇన్ని నైపుణ్యాలు, ఇంత పాజిటివ్ స్పిరిట్, ఇంత ఎనర్జీ, ఇంత దూకుడు ప్రదర్శిస్తూ వడివడిగా ముందుకు సాగిపోతున్న కేటీఆర్ ఒక రాష్ట్ర మంత్రి మాత్రమే అంటే ఆయన పరిధిని తగ్గించినట్టవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో కేటీఆర్ అంటే... ఒక బ్రాండ్.    

కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. ఉండితీరాలి. ఒక లక్ష్యం లేకుండా ఎవ్వరూ ముందుకుసాగలేరు. ఏం సాధించలేరు. కాని, ఆ లక్ష్యాలు సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సివుంటుంది. ఆ కృషి సగటు మనదేశంలో ఒక "ఎక్స్" అనుకుంటే, కేటీఆర్‌లో మనం చూస్తున్న అత్యంత కనిష్ట సగటు "10 ఎక్స్". అంటే కనీసం పదింతలన్నమాట! 

తెలంగాణమీద అణువణువున మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, కృషి సాధ్యం కాదు. ఆ మమకారం కేటీఆర్‌కు అత్యంత సహజసిద్ధంగా కేసీఆర్ గారి నుంచి వచ్చిందనుకోవచ్చు. కాని, దాన్ని ఊహించని ఎత్తులకు తీసుకుపోతూ, తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ, జాతీయ అంతర్జాతీయ వేదికలమీద శ్లాఘించబడే స్థాయికి ఎదగడం అన్నది మాత్రం కేవలం కేటీఆర్ వ్యక్తిగత సామర్థ్యం, ఆయన నిరంతర కృషే. .     

దావోస్‌లో మొన్న కేటీఆర్‌ను కలిసిన తర్వాత - అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని "ఇంత భావ వ్యక్తీకరణ, ఇంత స్పష్టత ఉన్న యువరాజకీయనాయకున్ని నేను ఎప్పుడూ చూళ్ళేదు. 20 ఏళ్ళ తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి" అని ట్వీట్ చేశారు.

ఎలాంటి అతిశయోక్తి లేని ఆ ట్వీట్ సృష్టించిన సంచలనం ఇంకా తాజాగానే ఉంది. 

మరోవైపు - కేటీఆర్‌ను సిఎంగా చూడాలని కూడా తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశంలో ఉన్న ఆయన అభిమానులు, ఎన్నారై ఫ్యాన్స్ కూడా ఎందరో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నా దృష్టిలో కేటీఆర్ సిఎం కావడం పెద్ద విషయం కాదు. కేసీఆర్ గారు, టీఆరెస్ పార్టీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుతారు.

దానికీ సమయం వస్తుంది. 

సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థంలేదు. అలాగే సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు కూడా. కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడిందనుకోవచ్చు. కాని, ఆ తర్వాతదంతా కేటీఆర్ స్వయం కృషే అన్నది ఎవ్వరైనా సరే ఒప్పుకొనితీరాల్సిన నిజం.

ఇందాకే చెప్పినట్టు, కేటీఆర్ అంటే రాజకీయాల్లో ఇప్పుడొక బ్రాండ్. 
***

("కేటీఆర్ అంటే... ఇప్పుడొక బ్రాండ్!" టైటిల్‌తో, ఈ ఆర్టికిల్‌లో కొంతభాగం ఈరోజు 'నమస్తే తెలంగాణ" దినపత్రికలో ప్రచురించబడింది.) 

No comments:

Post a Comment