Saturday 9 April 2022

అజ్ఞానం రాజ్యమేలుతున్న చోట...


2009 నుంచి తిరువనంతపురం ఎం పి గా వరుసగా ఎన్నికవుతున్న శశిథరూర్‌ను నేను ఒక ఎం పి గా కంటే ఒక విద్యాధికుడైన రచయితగానే ఎక్కువగా ఇష్టపడతాను. థరూర్ ఇంగ్లిష్‌లో మాట్లాడితే తప్పనిసరిగా కొన్ని కొత్తపదాలను వింటాం. అర్థాల కోసం డిక్షనరీలు వెతుక్కుంటాం. ఆయన ఏ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడనే విషయం ఇక్కడ అప్రస్థుతం. 

అలాంటి శశిథరూర్ ఇవ్వాళే ఒక ట్వీట్ పెట్టారు. అది నవంబర్ 2013 నాటి ఒక వీడియో. 

అందులో మాట్లాడుతున్నది ఇప్పటి మన దేశ ప్రధాని నరేంద్రమోది. ఆ వీడియోకు థరూర్ ఇంగ్లిష్‌లో పెట్టిన ఆరు పదాల కాప్షన్‌కు అర్థం ఏంటంటే "నేను ఇంతకంటే బాగా చెప్పలేను" అని! 

శశిథరూర్ లాంటివాడే చెప్పలేనంత బాగా ఏం చెప్పారు మోది అని 2013 నాటి ఆ 76 సెకన్ల వీడియోను ఆసక్తిగా చూశాను. 

"ధరలు ఈ రకంగా పెరుగుతుంటే పేదవాడు అసలు ఏం తింటాడు? ఇవ్వాళ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చారు. కాని, అధికధరలు అన్న పదంలోని "అ" అనే అక్షరం పలకడానికి కూడా సిద్ధంగా లేరు ఆయన. "చస్తే చావు, నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నంత అహంకారపూరితంగా ఉన్నారాయన.పేదవాడి ఇంట్లో పొయ్యి వెలగటం లేదు. పిల్లలు తినడానికి తిండిలేక రాత్రులంతా ఏడుస్తూ, చివరికి తల్లి కన్నీళ్లు త్రాగి నిద్రపోతున్నారు. దేశ నాయకులకు అసలు పేదవాడి గురించి పట్టింపే లేదు. మీరు ఈ నాలుగో తేదీ వోటు వెయ్యడానికి వెళ్లేటప్పుడు కాస్త మీ ఇంట్లో ఉన్న ఆ గ్యాస్ సిలిండర్‌కు దండంపెట్టుకొని వెళ్లండి. దాని ధర ఆరకంగా పెంచి దాన్ని మీ నుంచి వేరు చేశారు." 

ఆ వీడియో బిట్‌లో మోది ఉపన్యాసం సారాంశం అది! 

ఆ తర్వాత కొన్ని నెలలకే 2014లో నరేంద్రమోది మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఎనిమిది సంవత్సరాలు గడిచింది. లక్షలకోట్ల అప్పులు పెరిగాయి. బంగ్లాదేశ్ కంటే కూడా మన జిడిపి తగ్గింది. అంతర్జాతీయంగా చాలా సందర్భాల్లో మనదేశ ప్రధాని నవ్వులపాలయ్యారు. ఫలితంగా మనదేశాన్ని కూడా అలాగే చూస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇండెక్స్‌లు కిందకే దిగాయి తప్ప పైకి ఎగిసిన రంగం దాదాపు ఒక్కటి కూడా లేదు. ధరలు పెరగటం అనేది ఒక రొటీన్ వ్యవహారం అయిపోయింది. 

2013 నాటి ఆ వీడియోలో మోది మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి, మొత్తంగా వారి పనితీరుకు చక్కగా సరిపోతాయి.  

బహుశా అందుకే శశిథరూర్ తన ట్వీట్‌లో అలా "ఇంతకంటే బాగా నేను చెప్పలేను" అన్నారు.

కట్ చేస్తే - 

మొన్న మార్చి చివరి వారంలో మోది మంత్రివర్గంలోని క్యాబినెట్ స్థాయి మినిస్టర్ పీయూష్ గోయల్ "మీ పంట మేము కొనం. బియ్యం విరిగిపోయి నూకలు ఎక్కువైతాయనుకుంటే, మీ రాష్ట్రప్రజలకు నూకలు తినటం అలవాటు చెయ్యండి" అని మన రాష్ట్ర ఎంపిలకు, మంత్రులకు కనీస గౌరవం ఇవ్వకుండా అనటం ఏదైతే ఉందో, అది తన వీడియోలో మోది చెప్పిన అహంకారానికి అసలైన నిర్వచనం. ఒక కేంద్రమంత్రిగా మాట్లాడకూడని పద్ధతి. అత్యంత బాధ్యతారాహిత్యం కూడా.

"ప్యాడి ప్రొక్యూర్‌మెంట్" అంటే ధాన్యం సేకరించటమే. ధాన్యంలో మాకిష్టమైనవే కొంటాం, ఇష్టం లేనివి కొనం అనటం ఎంతవరకు కరెక్టు? ఇదేం వ్యక్తిగత వ్యవహారం కాదుకదా? రాష్ట్రాలు కేంద్రానికి శత్రువులేం కాదు కదా? 

పంజాబ్‌లో పూర్తిగా ధాన్యం కొంటున్న కేంద్రం, అవసరమైతే ప్రత్యామ్నాయాలు కూడా చూపుతూ ఆ రాష్ట్రానికి అండగా నిలుస్తున్నది. తెలంగాణలో మాత్రం ధాన్యంలో కొన్నిరకాలను మాత్రమే తీసుకుంటామని భీష్మించుకు కూర్చుంటూ, పరోక్షంగా తెలంగాణపై కక్ష సాధింపుకు పాల్పడుతోంది. 

ఒకవేళ నిజంగానే ఇది కొత్తగా ఏర్పడిన సమస్య అనుకున్నా, ఆ సమస్య గురించి అధ్యయనం చేసి సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత ఆ మంత్రిత్వశాఖ, దాని యంత్రాంగానిదే. ఈమాత్రం చేయలేకుండా తప్పించుకొనే పరిస్థితుల్లో విదేశాలకు నేరుగా ఎగుమతులు చేసుకొనే స్వేచ్చను కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వగలగాలి.  

ఇలాంటి వ్యవహారశైలితో కేంద్రం ఈ దేశానికి వెన్నెముక అయిన రైతుకు ఏం సందేశం ఇవ్వదల్చుకుందో కనీసం వారికయినా ఒక అవగాహన ఉన్నట్టు లేదు. అదే ఉన్నట్టయితే, మొన్నటి రైతు వ్యతిరేక చట్టాలు వచ్చేవే కావు, వందలాదిమంది రైతుల ప్రాణాలతో ఢిల్లీ వీధుల్లో ఆడుకునేవారే కాదు. తర్వాత, అవసరరీత్యా అదే రైతులకు క్షమాపణలు చెప్తూ ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేవారే కాదు.    

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొన్న ఒక సందర్భంలో ఇటీవలే విడుదలై బాగా వసూళ్ళు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తావన తెచ్చారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో ట్రిపుల్ఆర్ సినిమా ముందుకు దూసుకెళ్తోందనీ, అలాంటి సినిమాలు దేశాభివృద్ధిలో కూడా పాత్ర పోషిస్తాయని అన్నారు. హర్షణీయమే. కాని, ఆరుగాలం కష్టపడి, ఈ దేశ రైతులు సాధిస్తున్న అధిక దిగుబడులు కూడా ఈ దేశాభివృద్ధిలో ప్రధానపాత్ర పోషిస్తాయన్న నిజాన్ని కూడా వారు గుర్తిస్తే బాగుండేది. కాని, మంత్రి పీయూష్ గోయల్ దృష్టిలో ఈదేశపు రైతు కష్టానికి కనీస స్థానం లేకపోవటం దురదృష్టకరం.   

కట్ చేస్తే - 

రాజకీయాలు వేరు... ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి వేరు. ప్రజల దైనందిన జీవితంతో ఏమాత్రం సంబంధం లేని సున్నితమైన విషయాలపైన దృష్టిపెట్టి రెచ్చగొట్టడం ద్వారా అధికారంలో కొనసాగే ప్రణాళికలు వేసుకోవడం అనేది రాజనీతిలో కూడా బహుశా అత్యంత అధమస్థాయి ఆలోచన. 

రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి ప్రజలు అందించినప్పుడు దాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎనిమిదేళ్ల సమయంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకా అభివృద్ద్ధిచెందుతున్న దేశంగానే ఉన్న మన దేశాన్ని ధనిక దేశాల లిస్టులో చేర్చవచ్చు. కాని, దురదృష్టవశాత్తు కేంద్రంలో అలా జరగటం లేదు. వారి ఆశయాలు వేరు, ఆకాంక్షలు వేరు అన్నది అతి స్పష్టంగా సామాన్యప్రజలకు కూడా అర్థమవుతోంది. దీనికి వ్యతిరేకంగా ఒక భారీ మార్పుకి పడాల్సిన మొదటి అడుగుకోసం ఈ దేశ ప్రజలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. 

అలాంటి భారీ మార్పులు అతితక్కువకాలంలో కూడా జరగడం సాధ్యమే అని చెప్పడానికి ఈ దేశంలోను, ఈ రాష్ట్రంలోనూ ఇప్పటికే కొన్ని ఉదాహరణలున్నాయి. ఈ దేశంలో ఇప్పుడున్న పొలిటీషియన్స్‌లో అత్యుత్తమస్థాయి పొలిటీషియన్, వ్యూహకర్త, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది తెలియని అంశం కాదు. 

- మనోహర్ చిమ్మని
("నమస్తే తెలంగాణ" దినపత్రికలో ఈరోజు నా వ్యాసం)

No comments:

Post a Comment